Laurel Hospital
-
తుపాకులకూ ప్రింట్స్
‘ఫైరింగ్ కేసుల’ నిర్ధారణలో ఇవే కీలకం వీటిని విశ్లేషించేది ఫోరెన్సిక్ బాలిస్టిక్ నిపుణులు న్యాయస్థానానికి చేరనున్న సాంకేతిక నిర్ధారణలు డాక్టర్ల త్రయం కేసు: లారెల్ ఆస్పత్రి వివాదం నేపథ్యంలో డాక్టర్ శశికుమార్ తన లెసైన్డ్స్ రివాల్వర్‌తో మరో వైద్యుడు ఉదయ్‌కుమార్‌పై హత్యాయత్నం చేసి, ఆత్మహత్య చేసుకున్నాడు.ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కేసు: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గన్‌మెన్ రవీందర్ నిర్లక్ష్యం కారణంగా అతడి చేతిలోనే సర్వీస్ పిస్టల్ పేలడంతో డ్రైవర్ అక్బర్ అక్కడికక్కడే మరణించారు. ఈ రెండు ఘటనల్లోనూ తుపాకులు ఎవరివి? ఎవరి చేతిలో పేలాయి? అనే అంశాలను దర్యాప్తులో భాగంగా పోలీసులు నిర్ధారించారు. అయితే న్యాయస్థానంలో సమర్పించాల్సిన సాంకేతిక నిర్ధారణ దగ్గరకు వచ్చేసరికి ఇంకో విషయమూ కీలకంగా మారనుంది. ఘటనాస్థలం, హతుడి శరీరం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న తూటాలు ఆయా నేరాల్లో వాడిన తుపాకుల నుంచే పేలాయని నిర్ధారించడం తప్పనిసరి. ఈ పని రైఫ్లింగ్ మార్క్స్ ఆధారంగా ఫోరెన్సిక్ బాలిస్టిక్ నిపుణు లు తేలుస్తారు. మనుషులకు వేలిముద్రలు ఉన్నట్లే... తుపాకులకు ఉండే ‘ప్రింట్స్’నే రైఫ్లింగ్ మార్క్స్ అంటారు. ఏ రెంటికీ సరిపోలవు... ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల వేలిముద్రలు, తల వెంట్రుకలు, డీఎన్ఏ ఒకే విధంగా ఉండవు. అలాగే తుపాకుల్లోనూ రైఫ్లింగ్ మార్క్స్ విషయంలో ఇలాంటి సారూప్యతే ఉంది. ప్రొహిబిటెడ్ బోర్‌గా పరిగణించే .9 ఎంఎం తుపాకుల నుంచి సాయుధ బలగాలు వినియోగిం చే ఏకే-47, సాధారణ ప్రజలకు లెసైన్స్ ఆధారంగా మం జూరు చేసే .32 తదితర తుపాకులకు రైఫ్లింగ్ మార్క్స్ ఉంటా యి. ఇవి ఏ రెండు తుపాకులకూ ఒకే విధంగా ఉండవు. గొట్టం లోపల చుట్లు... ట్రిగ్గర్ నొక్కినప్పుడు హ్యామర్ ప్రభావంతో తుపాకీ ఛాంబర్/సిలిండర్ల్లో ఉన్న బుల్లెట్ పేలి... దాని ముందు భాగం వేగంగా బయటకు దూసుకువస్తుంది. ఈ వేగం ఎంత ఎక్కువగా ఉంటే.. అంత దూరంలో ఉన్న టార్గెట్‌కు తగులుతుంది. తుపాకీ గొట్టం (బ్యారెల్) పైకి చూడటానికి నునుపుగానే ఉంటుంది. అయితే బుల్లెట్ వేగాన్ని పెంచేందుకు ఆ గొట్టం లోపలి భాగంలో స్క్రూ తరహా చుట్లు ఉంటాయి. ఇవి బుల్లెట్ తన చుట్టూ తాను అమిత వేగంతో తిరగడానికి ఉపకరిస్తాయి. ఈ కారణంగానే గాల్లో దూసుకుపోయే తూటా తన చుట్టూ తాను వలయాకారంలో తిరుగుతూ వేగాన్ని పుంజుకుంటుంటుంది. తూటాలపై మార్కింగ్స్... పేలిన తూటా అలా చుట్లలో తిరుగుతూ గొట్టం దాటి బయటకు వచ్చేలోపు దానిపై కొన్ని నిర్దిష్టమైన గీతలు పడతాయి. ఈ గీతల్నే సాంకేతికంగా రైఫ్లింగ్ మార్క్స్ అంటా రు. ఇవి ప్రతి తూటా పైనా దాన్ని పేల్చిన ఆయుధానికి సంబంధించినవే పడతాయి. ఈ మార్క్స్‌ను కాల్చిన బుల్లెట్ ఆధారంగానే కాకుండా తుపాకీ లోపలి భాగాన్ని సాంకేతికంగా అధ్యయనం చేయడం ద్వారా ఫలానా తూటా, ఫలానా తుపాకీ నుంచే వెలువడింది అనే అంశా న్ని నిర్ధారిస్తారు. పేల్చి పోల్చే నిపుణులు... నేరం జరిగిన తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న తుపాకీతో పాటు దాని నుంచి వెలువడి కింద పడిన, మృతుడు/క్షతగాత్రుడు శరీరం నుంచి వెలికి తీసిన తూటాలనూ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ లాబ్‌కు పంపిస్తారు. అక్కడ ఉండే బాలిస్టిక్ నిపుణులు టెస్ట్ ఫైరింగ్ ఎక్యూప్మెంట్ వినియోగిస్తారు. సదరు తుపాకీలో మరో తూటా పెట్టి పేలుస్తారు. దానిపై పడే రైఫ్లింగ్ మార్క్స్‌ను, పోలీసు లు స్వాధీనం చేసుకున్న దానిపై ఉన్న మార్క్స్‌తో పోలుస్తారు. ఇది పాజిటివ్ వస్తే స్వాధీనం చేసుకున్న తూటా ఇదే తుపాకీ నుంచి పేలినట్లు నిర్ధారించి నివేదిక తయారు చేస్తారు. డేటాబేస్కు కేంద్రం యోచన... రాష్ట్రాల వారీగా దేశ వ్యాప్తంగా ఉన్న లెసైన్డ్స్ ఆయుధాల నుంచి రైఫ్లింగ్ మార్క్స్ సేకరించి ఓ డేటాబేస్‌లో నిక్షిప్తం చేయాలని కేంద్రం ఆధీనంలోని ఎంహెచ్ఏ భావిస్తోంది. ఇందులో సదరు తుపాకీ యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు, చిరునామా కూడా ఉంటాయి. దీనికోసం లెసైన్డ్స్ ఆయుధాలను స్థానిక పోలీసులు పూర్తిస్థాయిలో స్క్రూట్నీ చేయాల్సి ఉండటంతో రెన్యువల్ కానివి, నిబంధనల విరుద్ధంగా వినియోగిస్తున్న వాటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఈ రైఫ్లింగ్ మార్క్స్ డేటాబేస్ ద్వారా లెసైన్డ్స్ ఆయుధాలను వినియోగించి ఓ వ్యక్తి ఏ రాష్ట్రంలో నేరం చేసినా... డేటాబేస్ ఆధారంగా కేసును తక్షణం కొలిక్కి తీసుకురావడంతో పాటు నిందితుల్నీ పట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నది వారి అభిప్రాయం. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తుపాకుల్ని వినియోగించి చేస్తున్న నేరాల్లో అత్యధికం దేశవాళీ ఆయుధాలతోనే జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన రైఫ్లింగ్ మార్క్స్ సేకరణ ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకున్న ఎంహెచ్ఏ దీనికి పరిష్కారం కోసం అన్వేషిస్తోంది. - సాక్షి, సిటీబ్యూరో -
అంతు చిక్కని లెక్కలు
పొంతన కుదరని వాంగ్మూలాలు తలలు పట్టుకుంటున్న పోలీసులు ఉదయ్ నోరు విప్పితేనే ఫలితం సిటీబ్యూరో: ‘డాక్టర్ల త్రయం’ కేసుల్లో చిక్కుముడులు వీడుతున్నా... ఆర్థిక లావాదేవీలపై మాత్రం పోలీసులకు స్పష్టత రావడం లేదు. ఈ కేసులకు సంబంధించి బాధితులు చెబుతున్న వివరాల మధ్య పొంతన కుదరడం లేదు. దీంతో ప్రస్తుతం దర్యాప్తు అధికారుల దృష్టి పార్టనర్ షిప్ డీడ్‌పై పడింది. ఉదయ్ కుమార్ పూర్తిగా కోలుకుని... నోరు విప్పితేనే ఫలితం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ వివాదం మొత్తం మాదాపూర్‌లోని లారెల్ ఆస్పత్రి కేంద్రంగా సాగిందే. దాదాపు రూ.30 కోట్లతో రూపొందుతున్నట్లు భావిస్తున్న దీని ఔట్ పేషెంట్ విభాగాన్ని గత నెలలో ప్రారంభించారు. ఈ ఆస్పత్రికి ఉదయ్ కుమార్, సాయి కుమార్, శశికుమార్‌లతో పాటు ఉదయ్, సాయిల భార్యలూ డెరైక్టర్లుగా ఉన్నారు. ఉదయ్ ఎమ్‌డీగా, సాయి సీఈఓగా కొనసాగుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో అమెరికాలో ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడైన రోబోటిక్ సర్జన్‌కు ఇందులో 22 శాతం వాటా ఇచ్చారని ప్రాథమికంగా నిర్థారించారు. పెట్టుబడి ఎంత? ఈ ఆస్పత్రిలో శశికుమార్ పెట్టుబడి ఎంతన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. శశి ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చిన రోజు ఆయన భార్య మీడియాతో మాట్లాడుతూ... తన భర్త లారెల్ ఆస్పత్రిలో రూ.2.5 కోట్లు పెట్టుబడి పెట్టారని చెప్పారు. హత్యాయత్నం జరిగిన రోజు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన సాయి, ఉదయ్‌లు ఈ మొత్తం కేవలం రూ.కోటి మాత్రమేనని చెప్పారు. శశికుమార్ తన వాటా పెట్టుబడిగా రూ.75 లక్షలు పెట్టారని, మరో రూ.25 లక్షలను వర్కింగ్ కేపిటల్‌గా నెలకు రూ.2 వడ్డీకి తీసుకున్నామని వివరించారు. శశికుమార్ ఆస్పత్రి డెరైక్టర్‌గా నెలకు రూ.1.5 లక్షల జీతం, సర్జరీ విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లో మరో రూ.2 లక్షల జీతం డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఆస్పత్రిలో శశికుమార్ పెట్టుబడి ఎంత అనేది తేల్చడానికి పోలీసులు పార్టనర్ షిప్ డీడ్‌పై దృష్టి పెడుతున్నారు. భాగస్వాములంతా దీన్ని రాసుకుంటే కచ్చితంగా రిజిస్టర్ చేయించాల్సి ఉంటుందని... ఆ వివరాలను ఆరా తీస్తున్నామని ఓ అధికారి చెప్పారు. ఉదయ్ కుమార్ పూర్తిగా కోలుకుంటే మరోసారి డిటైల్డ్ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉందని చెబుతున్నారు. బకాయిలపై స్పష్టత కరువు లారెల్ ఆస్పత్రి వివాదం ఇలా ఉండగా... శశికుమార్ మూడు నెలల క్రితం లీజుకు తీసుకున్న దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా ఆస్పత్రిది మరో వివాదంగా పోలీసులు అనుమానిస్తున్నారు. శశికుమార్ తన సూసైడ్ నోట్లో రాసిన పేర్లలో సాయి, ఉదయ్ మినహా మిగిలిన నాలుగింటిలో మూడు పేర్లు ఈ ఆస్పత్రికి చెందిన వారివే. కేకే రెడ్డి నుంచిఆస్పత్రిని శశి లీజుకు తీసుకోగా... తనకే భారీ మొత్తం రావాల్సి ఉందని ఆయన చెబుతున్నారు. ‘సిగ్మా’కు సీఈఓగా వ్యవహరించిన రామారావు, ఆస్పత్రి ఉన్న భవనం యజమాని చిన్నారెడ్డిలతోనూ శశికుమార్‌కు ఆర్థిక వివాదాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. శశికుమార్ కుటుంబీకులు తమకే నగదు రావాలని చెబుతుండగా... వారు మాత్రం శశి తమకే బాకీ ఉన్నాడని అంటున్నారు. ఈ ఆర్థిక లావాదేవీలను కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. -
చైతన్యపురిలో విషాదఛాయలు
చైతన్యపురి, మాదాపూర్: మాదాపూర్‌లోని లారెల్ఆస్పత్రి వివాదం నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్న డా.శశికుమార్ ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు, స్నేహితులు, ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు శశికుమార్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన మరణంతో భార్య, కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యారు. కొడుకు చనిపోయాడని తెలుసుకున్న ఆయన తండ్రి పట్కార్ బాలముకుందరావు కుప్పకూలిపోయాడు. శశికుమార్‌కు భార్య కాంతి, కూతురు నిహారిక, కుమారుడు నిఖిత్‌లు ఉన్నారు. నిహారిక దక్కన్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం... నిఖిత్ ఆస్మాన్గడ్లోని సెయింట్ థామస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నారు. తండ్రి బాలముకుందరావు రాష్ట్ర ఎకై ్సజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసి రిటైరై... న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. న్యూ మారుతీ నగర్ జైన్‌మందిర్ సమీపంలో శశికుమార్ ల్యాప్రోస్కోపిక్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా ఆస్పత్రిని లీజుకు తీసుకున్నారు. అనస్తీషియా వైద్యుడైన సాయి కుమార్‌తో 15 ఏళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ మంచి స్నేహంగా ఉండేవారని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. శశికుమార్ సున్నిత మనస్కుడని.. అందరితో కలివిడిగా ఉండేవాడని స్నేహితులు తెలిపారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. సాయికుమార్ ఇంటికి తాళం హిమాయత్ నగర్ కాల్పుల నేపథ్యంలో డాక్టర్ సాయి కుమార్ ఇంటికి తాళం వేసి ఉంది. మాదాపూర్ జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని వైష్ణవీస్ ప్రెమిడీస్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 304లో భార్య దేవితో కలిసి సాయి కుమార్ ఉంటున్నాడు. ఆ ఫ్లాట్‌కు తాళం వేసి ఉంది. కాల్పుల ఘటన విషయం తమకు తెలియదని అపార్టమెంట్ వాసులు పేర్కొన్నారు. రాత్రి నుంచి ఇంటికి ఎవరూ రాలేదని వారు చెప్పారు. లారెల్ హాస్పిటల్‌లోని ఓపీ విభాగం మంగళవారం పని చేయలేదు. ఒక్క డాక్టర్ కూడా రాలేదు. ఈ ఆస్పత్రినిమార్చి నెలలో భారీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. జనవరి 1న మొదటి అంతస్తులో అవుట్ పేషెంట్ క్లీనిక్ ప్రారంభించారు. మిగతా అంతస్తులలో నిర్మాణ పనులు సాగుతున్నాయి. అన్ని చికిత్సలను పూర్తి స్థాయిలో అందించేందుకు అవసరమైన మిషనరీస్‌ను త్వరలోనే అమర్చే యోచనలో ముగ్గురు డాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఇంతలోనే విషాద సంఘటన చోటుచేసుకుంది.