చైతన్యపురిలో విషాదఛాయలు
చైతన్యపురి, మాదాపూర్: మాదాపూర్‌లోని లారెల్‌ఆస్పత్రి వివాదం నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్న డా.శశికుమార్ ఇంటి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు, స్నేహితులు, ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు శశికుమార్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆయన మరణంతో భార్య, కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యారు. కొడుకు చనిపోయాడని తెలుసుకున్న ఆయన తండ్రి పట్కార్ బాలముకుందరావు కుప్పకూలిపోయాడు. శశికుమార్‌కు భార్య కాంతి, కూతురు నిహారిక, కుమారుడు నిఖిత్‌లు ఉన్నారు. నిహారిక దక్కన్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం... నిఖిత్ ఆస్మాన్‌గడ్‌లోని సెయింట్ థామస్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నారు.
తండ్రి బాలముకుందరావు రాష్ట్ర ఎకై ్సజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసి రిటైరై... న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. న్యూ మారుతీ నగర్ జైన్‌మందిర్ సమీపంలో శశికుమార్ ల్యాప్రోస్కోపిక్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా ఆస్పత్రిని లీజుకు తీసుకున్నారు. అనస్తీషియా వైద్యుడైన సాయి కుమార్‌తో 15 ఏళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ మంచి స్నేహంగా ఉండేవారని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. శశికుమార్ సున్నిత మనస్కుడని.. అందరితో కలివిడిగా ఉండేవాడని స్నేహితులు తెలిపారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నామని అన్నారు.
సాయికుమార్ ఇంటికి తాళం
హిమాయత్ నగర్ కాల్పుల నేపథ్యంలో డాక్టర్ సాయి కుమార్ ఇంటికి తాళం వేసి ఉంది. మాదాపూర్ జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని వైష్ణవీస్ ప్రెమిడీస్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నెంబర్ 304లో భార్య దేవితో కలిసి సాయి కుమార్ ఉంటున్నాడు. ఆ ఫ్లాట్‌కు తాళం వేసి ఉంది. కాల్పుల ఘటన విషయం తమకు తెలియదని అపార్టమెంట్ వాసులు పేర్కొన్నారు. రాత్రి నుంచి ఇంటికి ఎవరూ రాలేదని వారు చెప్పారు. లారెల్ హాస్పిటల్‌లోని ఓపీ విభాగం మంగళవారం పని చేయలేదు. ఒక్క డాక్టర్ కూడా రాలేదు. ఈ ఆస్పత్రినిమార్చి నెలలో భారీగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. జనవరి 1న మొదటి అంతస్తులో అవుట్ పేషెంట్ క్లీనిక్ ప్రారంభించారు. మిగతా అంతస్తులలో నిర్మాణ పనులు సాగుతున్నాయి. అన్ని చికిత్సలను పూర్తి స్థాయిలో అందించేందుకు అవసరమైన మిషనరీస్‌ను త్వరలోనే అమర్చే యోచనలో ముగ్గురు డాక్టర్లు ఉన్నట్లు సమాచారం. ఇంతలోనే విషాద సంఘటన చోటుచేసుకుంది.