విజయవాడ(చిట్టినగర్) : భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి వివాదంతో మనస్తాపానికి గురై భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఘటనపై కొత్తపేట పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కధనం ప్రకారం జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోని బ్లాక్ నంబరు 191లోని ఎస్‌ఎఫ్-1లో వేముల వీరాస్వామి(30), వసంత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడేళ్ల కిందట వివాహం కాగా ఇద్దరు సంతానం. వీరాస్వామి కృష్ణలంక స్వర్గపురిలో కాపరిగా ఉద్యోగం చేస్తుంటాడు. శనివారం సాయంత్రం స్వర్గపురి నుంచి ఇంటికి వచ్చిన భర్త భార్య కోసం వెతకగా అమె అదే కాలనీలోని 101 బ్లాక్‌లో ఉంటున్న తల్లి ఇంటికి వెళ్లింది.
అయితే అత్తగారింటికి వెళ్లిన వీరాస్వామి వసంతను తనతో రావాలని పట్టుబట్టాడు. మద్యం మత్తులో ఉన్న భర్త వీరాస్వామి తనను ఎక్కడ కొడతాడననే భయంతో వసంత నీతో రానని తేల్చి చెప్పేసింది. అయితే ఆవేశంలో ఉన్న వీరాస్వామి ఎలా ఇంటికి రావో చూస్తానంటూ భార్య వద్ద తాళం తీసుకుని ఇంటికి వెళ్లి తలుపు గడియ వేసుకున్నాడు. అయితే ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన వసంత భర్త లోపల నుంచి తలుపు గడియ వేసుకోవడంతో కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్ హుక్‌కు చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. చిన్న మాటకే భర్త ఆత్మహత్యకు పాల్పడటాన్ని చూసి వసంత, పిల్లలు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఇంటి తలుపు విరగొట్టి పోలీసులకు సమాచారం అందించారు. కొత్తపేట సీఐ దుర్గారావు, ఎస్.ఐ సత్యనారాయణలు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. వీరాస్వామి కాలి నుంచి తీవ్ర రక్తగాయాలు ఉండటంతో భార్య కాపురానికి రాలేదని ఆవేశంలో గోడలకు కాలితో తన్ని ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వివాహిత ఆత్మహత్య
విజయవాడ(కృష్ణలంక) : వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానిక మెట్లబజార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మెట్లబజార్‌లో నివాసం ఉంటున్న దీపాల రాంకోటేశ్వరరావు, సామ్రాజ్యం(38) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రాంకోటేశ్వరరావు టైలర్ పని చేస్తుంటాడు. పెద్ద కుమార్తె హారికకు వివాహం జరుగగా, రెండో కుమార్తె ప్రసన్న ఒక దుకాణంలో పని చేస్తుంటోంది. పెద్ద కుమార్తె కుటుంబం కృష్ణలంకలోనే నివాసం ఉంటుండటంతో అంతకుముందు మంగళగిరిలో నివాసం ఉండే రాంకోటేశ్వరరావు మెట్లబజార్‌లోకి అద్దెకు వచ్చారు. ఆదివారం ఉదయం భర్త రాంకోటేశ్వరరావు రేషన్ సరుకులు తీసుకురావడానికి మంగళగిరికి వెళ్లగా ఇద్దరు కుమార్తెలు ఇంట్లోనే ఉన్నారు. సామ్రాజ్యం స్నానం కోసమని బాత్‌రూంకు వెళ్లింది. అయితే 20 నిమిషాలు గడుస్తున్నా నీళ్ల శబ్దం రాకపోవడం గమనించిన హారిక బాత్‌రూం తలుపులు బలంగా నెట్టింది. అప్పటికే పైన ఉన్న కొక్కెంకు వేలాడుతూ కనిపించింది. దీంతో స్థానికుల సహకారంతో క్రిందకు దింపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఎస్.ఐ రమేష్ జరిగిన సంఘటనను పరిశీలించి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
యువకుడు అనుమానాస్పద మృతి
Published Mon, Feb 8 2016 12:38 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement