పొంతన కుదరని వాంగ్మూలాలు
తలలు పట్టుకుంటున్న పోలీసులు
ఉదయ్ నోరు విప్పితేనే ఫలితం
సిటీబ్యూరో: ‘డాక్టర్ల త్రయం’ కేసుల్లో చిక్కుముడులు వీడుతున్నా... ఆర్థిక లావాదేవీలపై మాత్రం పోలీసులకు స్పష్టత రావడం లేదు. ఈ కేసులకు సంబంధించి బాధితులు చెబుతున్న వివరాల మధ్య పొంతన కుదరడం లేదు. దీంతో ప్రస్తుతం దర్యాప్తు అధికారుల దృష్టి పార్టనర్ షిప్ డీడ్‌పై పడింది. ఉదయ్ కుమార్ పూర్తిగా కోలుకుని... నోరు విప్పితేనే ఫలితం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ వివాదం మొత్తం మాదాపూర్‌లోని లారెల్ ఆస్పత్రి కేంద్రంగా సాగిందే. దాదాపు రూ.30 కోట్లతో రూపొందుతున్నట్లు భావిస్తున్న దీని ఔట్ పేషెంట్ విభాగాన్ని గత నెలలో ప్రారంభించారు. ఈ ఆస్పత్రికి ఉదయ్ కుమార్, సాయి కుమార్, శశికుమార్‌లతో పాటు ఉదయ్, సాయిల భార్యలూ డెరైక్టర్లుగా ఉన్నారు. ఉదయ్ ఎమ్‌డీగా, సాయి సీఈఓగా కొనసాగుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో అమెరికాలో ఉంటున్న ఓ ప్రవాస భారతీయుడైన రోబోటిక్ సర్జన్‌కు ఇందులో 22 శాతం వాటా ఇచ్చారని ప్రాథమికంగా నిర్థారించారు.
పెట్టుబడి ఎంత?
ఈ ఆస్పత్రిలో శశికుమార్ పెట్టుబడి ఎంతన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. శశి ఆత్మహత్య ఘటన వెలుగులోకి వచ్చిన రోజు ఆయన భార్య మీడియాతో మాట్లాడుతూ... తన భర్త లారెల్ ఆస్పత్రిలో రూ.2.5 కోట్లు పెట్టుబడి పెట్టారని చెప్పారు. హత్యాయత్నం జరిగిన రోజు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన సాయి, ఉదయ్‌లు ఈ మొత్తం కేవలం రూ.కోటి మాత్రమేనని చెప్పారు. శశికుమార్ తన వాటా పెట్టుబడిగా రూ.75 లక్షలు పెట్టారని, మరో రూ.25 లక్షలను వర్కింగ్ కేపిటల్‌గా నెలకు రూ.2 వడ్డీకి తీసుకున్నామని వివరించారు. శశికుమార్ ఆస్పత్రి డెరైక్టర్‌గా నెలకు రూ.1.5 లక్షల జీతం, సర్జరీ విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‌లో మరో రూ.2 లక్షల జీతం డిమాండ్ చేశారని పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఆస్పత్రిలో శశికుమార్ పెట్టుబడి ఎంత అనేది తేల్చడానికి పోలీసులు పార్టనర్ షిప్ డీడ్‌పై దృష్టి పెడుతున్నారు. భాగస్వాములంతా దీన్ని రాసుకుంటే కచ్చితంగా రిజిస్టర్ చేయించాల్సి ఉంటుందని... ఆ వివరాలను ఆరా తీస్తున్నామని ఓ అధికారి చెప్పారు. ఉదయ్ కుమార్ పూర్తిగా కోలుకుంటే మరోసారి డిటైల్డ్ స్టేట్‌మెంట్ రికార్డు చేయాల్సి ఉందని చెబుతున్నారు.
బకాయిలపై స్పష్టత కరువు
లారెల్ ఆస్పత్రి వివాదం ఇలా ఉండగా... శశికుమార్ మూడు నెలల క్రితం లీజుకు తీసుకున్న దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా ఆస్పత్రిది మరో వివాదంగా పోలీసులు అనుమానిస్తున్నారు. శశికుమార్ తన సూసైడ్ నోట్‌లో రాసిన పేర్లలో సాయి, ఉదయ్ మినహా మిగిలిన నాలుగింటిలో మూడు పేర్లు ఈ ఆస్పత్రికి చెందిన వారివే. కేకే రెడ్డి నుంచిఆస్పత్రిని శశి లీజుకు తీసుకోగా... తనకే భారీ మొత్తం రావాల్సి ఉందని ఆయన చెబుతున్నారు. ‘సిగ్మా’కు సీఈఓగా వ్యవహరించిన రామారావు, ఆస్పత్రి ఉన్న భవనం యజమాని చిన్నారెడ్డిలతోనూ శశికుమార్‌కు ఆర్థిక వివాదాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. శశికుమార్ కుటుంబీకులు తమకే నగదు రావాలని చెబుతుండగా... వారు మాత్రం శశి తమకే బాకీ ఉన్నాడని అంటున్నారు. ఈ ఆర్థిక లావాదేవీలను కొలిక్కి తీసుకురావడానికి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
అంతు చిక్కని లెక్కలు
Published Fri, Feb 12 2016 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM
Advertisement
Advertisement