
చచ్చినా.. చావే..!
►ఇది రిమ్స్‌లో చనిపోయిన వారి పరిస్థితి
►మార్చురీలో ఫ్రీజర్లు పని చేయకపోవడంతో..
►మృతదేహాల నుంచి దుర్వాసన
►పట్టించుకోని అధికారులు
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ విభాగం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, హత్యాయత్నాలకు గురై, ఆత్మహత్య చేసుకుని.. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకొస్తారు. అలాగే ఎవరైనా అనాథలు మృతి చెందితే కనీసం వారం రోజుల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. వారి బంధువులు ఎవరైనా వస్తే తీసుకు వెళతారని, తద్వారా కడ చూపునకైనా నోచుకోనివ్వాలనేది దీని ఉద్దేశం. కానీ ఇక్కడ రిమ్స్ మార్చురీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కళాశాల ఏర్పాటు చేసినపుడు మార్చురీలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కళాశాల నిర్మితమై 11 ఏళ్లు కావడంతో ఇక్కడ వివిధ గదుల్లో మృతదేహాలను భద్ర పరుచుకునేందుకు ఏర్పాటు చేసిన బాడీ ఫ్రీజర్లు పాడైపోయాయి. వాటి స్థానంలో కొత్తవి తేలేదు. ఉన్న వాటికి మరమ్మతులు చేయించలేదు. ఈ బాధ్యతను రిమ్స్ అధికారులు నిర్వర్తించాల్సి ఉంది. ఈ బాడీ ఫ్రీజర్ల కొనుగోలు, మరమ్మతులు తదితరాలు రిమ్స్‌కు ఏపీఎంఎస్‌ఐడీసీ వారు చూడాల్సి ఉంది.
ప్రతిపాదనలు పంపినా.. అంతే..!
రిమ్స్ అధికారులు ప్రతిపాదనలు పంపినా.. ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన పది మృతదేహాలను భద్ర పరుచుకునే ఫ్రీజర్లకు కూడా గ్రహణం పట్టుకుంది. వాటికి సంబంధించిన విద్యుత్ సరఫరా బోర్డు కాలిపోతే కనీసం మరమ్మతు చేయించేందుకు తక్కువ ఖర్చు అయినా దాని గురించి పట్టించుకోలేదు. ఈ విషయంపై ఫోరెన్సిక్ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెండు వారాల నుంచి మృతదేహాలు వచ్చినా.. వాటిని భద్రపరిచేందుకు అవకాశం లేకపోవడంతో మరుసటి రోజు నుంచి దుర్వాసన వస్తోందని ఆయన పేర్కొన్నారు.
∙ఆదివారం రిమ్స్ మార్చురీలో ఓ వ్యక్తి మృతదేహానికి సంబంధించిన బంధువులు విజయవాడ నుంచి రావాల్సి ఉండగా.. బాడీ ఫ్రీజర్ పని చేయకపోవడంతో కుటుంబ సభ్యులు బయటి నుంచి దాతల ద్వారా ఒక బాడీ ఫ్రీజర్‌ను తెప్పించుకున్నారు. ఈ సంఘటనపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
∙బాడీ ఫ్రీజర్ల మరమ్మతులకు కేవలం రూ.25 వేలు మాత్రమే ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు దానిపై దృష్టి పెట్టకపోవడం బాధాకరం. ఏదైనా అనాథ మృతదేహం వస్తే వెంటనే మరుసటిరోజే సేవా సంస్థలకు అంత్యక్రియల కోసం అప్పగిస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహానికి సంబంధించిన బంధువులు వచ్చేంత వరకు కనీసం వారం రోజులైనా బాడీ ఫ్రీజర్లలో భద్రపరుచుకునే పరిస్థితి కొరవడింది.
ఆర్‌ఎంఓ వివరణ
ఈ వ్యవహారంపై రిమ్స్ ఆర్‌ఎంఓ డాక్టర్ జంగం వెంకటశివ మాట్లాడుతూ బాడీ ఫ్రీజర్ల మరమ్మతు విషయం తమ దృష్టికి వచ్చిందని, సూపరింటెండెంట్, డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు వారి ద్వారా ఏపీఎంఎస్‌ఐడీసీ వారికి కూడా పరిస్థితిని వివరించామన్నారు. త్వరలో వాటిని మరమ్మతులు చేయిస్తామన్నారు. – డాక్టర్ జంగం వెంకట శివ, ఆర్‌ఎంఓ, కడప రిమ్స్