
ప్రమాదమే దేవి ప్రాణాలు తీసింది!
► ఫోరెన్సిక్ విచారణలోనూ దొరకని హత్య ఆనవాళ్లు
► 1500 మంది టవర్ లోకేషన్స్ విశ్లేషించిన పోలీసులు
► ప్రమాద సమయంలో..వేర్వేరు ప్రాంతాల్లో ఆ నలుగురు
సాక్షి,హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి మరణం... ప్రమాదం వల్లే జరిగిందని మలి విచారణలోనూ తేలింది. దేవి మరణంపై మిస్టరీ నెలకొన్న నేపథ్యంలో ఆమెను హత్య చేశారంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు ఫోరెన్సిక్, మోటారు వాహనాల నిపుణులతో కలిసి చేసిన రెండవ విచారణలోనూ దేవిది హత్య అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. దేవి ప్రయాణించిన కారు ధ్వంసమైన తీరు, కారు ఎయిర్ బెలూన్ తెరుచుకున్నాక కూడా తలకు బలమైన గాయాలు కావటం తదితర అంశాలపై వివిధ రంగాల నిపుణులతో విచారించారు. దేవి తల్లిదండ్రులు లేవనెత్తిన సందేహాలను ఓ ప్రశ్నావళి రూపంలో పోలీస్‌లు ఫోరెన్సిక్ బృందానికి అందజేయగా, వారు ప్రమా దం వల్లే అలాంటి గాయాలవుతాయని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
వారందరి లొకేషన్స్ పరిశీలన: ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్‌సింహారెడ్డి ఫోన్ కాల్ డాటా ఆధారంగా ఆయనతో గతేడాది కాలంగా 1500 మంది వివిధ సందర్భాల్లో టచ్‌లో ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రమాదానికి ముందు, తర్వాత ఆ 1500 మంది సెల్‌ఫోన్ టవర్ లొకేషన్స్‌ను పోలీస్‌లు పరిశీలించగా వారెవరూ ఆ పరిసర ప్రాంతాల్లో లేరు. దేవికి సంబంధించిన కాల్ డాటా, వాట్సాప్ ఫొటోలు, మెసేజ్‌లను సైతం పోలీస్‌లు మొత్తం విశ్లేషించారు. ఫేస్‌బుక్ ద్వారా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయంతో గత ఎనిమిది నెలలుగా భరత్-దేవీలు టచ్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. ఇక గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పబ్ నుంచి తెల్లవారుజామున 3.33 గంటలకు బయలుదేరిన భరత్‌సింహారెడ్డి, దేవీల స్నేహితులు వెంకట్, పృధ్వీ, విశ్వనాథ్‌లతో పాటు సోనాలి అనే అమ్మాయి సెల్‌ఫోన్ టవర్ లోకేషన్స్ సైతం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు.
11 నిమిషాల్లో దూసుకొచ్చిన కారు:
పబ్ నుంచి భరత్‌సింహారెడ్డి, దేవితో కలిసి కారులో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బీపీఎం పబ్ నుంచి తెల్లవారుజామున 3.33 గంటలకు బయల్దేరినట్లు టవర్ సిగ్నల్ బహిర్గతం చేసింది. అక్కడి నుంచి కేవలం 11 నిమిషాల్లోనే భరత్ తన కారును దూసుకుపోనిచ్చి జర్నలిస్టు కాలనీకి చేరుకున్నారు. ఇక్కడ ఒక పత్రికా కార్యాలయం సీసీ ఫుటేజీలో వీరి కారు 3.44 గంటలకు దూసుకుపోతున్నట్టు కనిపించింది. తండ్రితో ఫోన్ మాట్లాడేందుకు కొద్దిదూరంలోనే ఐదు నిమిషాలపాటు కారు నిలిపి ఉన్నట్లు కూడా టవర్ సిగ్నల్ ద్వారా తేలింది. అప్పటికే ఇంటి నుంచి ఫోన్లు వస్తుండటంతో..భరత్ కారు వేగాన్ని మరింత పెంచే యత్నంలో కంట్రోల్ తప్పి చెట్టుకు ఢీకొట్టారన్న నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు సమాచారం .