‘చట్టం, న్యాయం ముసుగులో అన్యాయం రాజ్యమేలడం కంటే మించిన నిరంకుశత్వం మరొకటి లే’దని ఫ్రెంచ్ రాజకీయ తత్వవేత్త మాంటెస్క్యూ అంటాడు. దురదృష్టవశాత్తూ మన నేర న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులు చడీచప్పుడూ లేకుండా ఇలాంటి నిరంకుశత్వానికి బాటలు పరుస్తున్నాయి. ఈ పోకడలను సర్వోన్నత న్యాయస్థానం గుర్తించి నిందితులకు బెయిల్ మంజూరు చేసే ప్రక్రియకు సంబంధించి ఒక ప్రత్యేక చట్టం అవసరమని సూచించడం హర్షించదగ్గ విషయం. సీబీఐ అరెస్టు చేసిన సతీందర్ కుమార్ కేసులో నిరుడు జూలైలో ఇచ్చిన తీర్పుపై వివరణనిస్తూ సుప్రీంకోర్టు తాజా సూచన చేసింది. కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే నిందితులను జైలుకు పంపాలనీ, ఎక్కువ సందర్భాల్లో బెయిల్ మంజూరు చేయొచ్చనీ, బెయిల్ పొందడం నిందితులకుండే హక్కనీ అనేకానేకసార్లు సుప్రీంకోర్టు తెలిపింది. వలస పాలనను వదుల్చుకుని 75 ఏళ్లవుతున్నా మన అధికార వ్యవస్థలను మాత్రం ఆ జాడ్యం వదలడం లేదు. దర్యాప్తు సంస్థలు జరిపే అరెస్టుల్లో కనీసం 60 శాతం అనవసరమైనవేనని జాతీయ పోలీసు కమిషన్ నివేదిక గతంలో ఒకసారి చెప్పింది. అయినా యధేచ్ఛగా అరెస్టులు సాగుతూనే ఉన్నాయి. కింది కోర్టులు సైతం నిందితులను రిమాండ్‌కు పంపి చేతులు దులుపుకొంటున్నాయి.
దేశవ్యాప్తంగా సామాజిక కార్యకర్తలనూ, రాజకీయ నాయకులనూ, పాత్రికేయులనూ అరెస్టు చేయడం, వారు బెయిల్ దొరక్క నెలల తరబడి జైళ్లలో మగ్గడం ఈమధ్యకాలంలో మితిమీరింది. ఇక స్వప్రయోజనాల కోసమో, పెత్తందార్ల ప్రయోజనాలు నెరవేర్చే ఉద్దేశంతోనో అమాయకులను అరెస్టు చేయడం గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటివారు ఏళ్లతరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇందువల్ల పౌర హక్కులకు భంగం కలగడం మాత్రమే కాదు... విచారణలో ఉన్న ఖైదీలతో జైళ్లు కిటకిటలాడుతున్నాయి. అక్కడ సౌకర్యాల లేమితో పరిస్థితి అధ్వాన్నంగా ఉంటున్నది. ఖైదీల్లో మూడింట రెండువంతులమంది విచారణలో ఉన్నవారేననీ, ఇది దారుణమనీ జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం చెప్పవలసి వచ్చిందంటే దేశంలో నేర న్యాయవ్యవస్థ ఎలా ఉందో అర్థమవుతుంది.
మన శిక్షాస్మృతి(సీఆర్‌పీసీ) వలస పాలకుల హయాంలో 1882లో రూపొందించింది. స్వాతంత్య్రానంతరం అలాంటి చట్టాలను పూర్తిగా రద్దు చేసి, మెరుగైన చట్టాలను రూపొందించుకోవాలని పాలకులు ఎన్నడూ అనుకోలేదు. కాలానుగుణంగా సీఆర్‌పీసీకి సవరణలు చేస్తూ పోవడమే పరిష్కార మార్గంగా ఎంచుకున్నారు. 2009లో సీఆర్‌పీసీలోని సెక్షన్ 41ను సవరించారు. అరెస్టు చేసేందుకు పోలీసులకుండే అధికారాలను అది రెండు తరగతులుగా వర్గీకరించింది. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్షపడే అవకాశమున్న నేరాలను 41(బీ) కిందా, అంతకన్నా ఎక్కువ శిక్షపడే అవకాశమున్న నేరాలను 41(బీఏ) కింద విభజించింది. మొదటి కేటగిరీ పరిధిలోకి వచ్చేవారిని అరెస్టు చేయాలంటే అందుకు తగిన కారణాలను రికార్డు చేయాలి. ఆ కారణాలు సహేతుకమైనవో కాదో మేజిస్ట్రేట్‌లు పరిశీలించాలి. వారు సంతృప్తి పడితేనే నిందితుడి రిమాండ్‌కు ఆదేశాలివ్వాలి. 2014లో అర్నేష్‌కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఈ విషయంలో మరింత స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. ఒక నిందితుణ్ణి అరెస్టు చేసేముందు ఆ చర్య అవసరమో కాదో పోలీసు అధికారి పరిశీలించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మాత్రమే కాదు, హైకోర్టులు సైతం వివిధ సందర్భాల్లో సూచనలు చేస్తూనే ఉన్నాయి. కానీ పట్టేదెవరికి? ఫలితంగా విచక్షణారహిత అరెస్టులూ, నిందితులు నెలల తరబడి జైలు గోడల వెనక మగ్గడం రివాజుగా మారింది.
క్రిమినల్ కేసుల్లో శిక్షలు పడటం అంతంతమాత్రమవుతున్న ధోరణివల్ల కింది కోర్టులు బెయిల్ నిరాకరిస్తున్నాయన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. దర్యాప్తు సంస్థలు తమ సామర్థ్యం మెరుగుపరుచుకోవడం, పకడ్బందీ సాక్ష్యాలను సేకరించడం ఈ సమస్యకు పరిష్కారం తప్ప చట్ట నిబంధనలకు విరుద్ధంగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు భిన్నంగా వ్యవహరించడం కాదు. కనుకనే ధర్మాసనం మరోసారి దీనిపై దృష్టి సారించాల్సి వచ్చింది. నిందితుడు మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశముందని, సాక్ష్యాలను తారుమారు చేయొచ్చని, పరారయ్యే అవకాశముందని సహేతుకంగా భావించినప్పుడు మాత్రమే అరెస్టు చేయాలనీ... ఈ అంశాలన్నింటిలో పోలీసులు సక్రమంగానే వ్యవహరించారని న్యాయస్థానాలు సంతృప్తి పడితేనే నిందితుణ్ణి జైలుకు పంపాలనీ తాజాగా ధర్మాసనం చేసిన సూచనలు ఈ పరిస్థితిని చక్కదిద్దగలిగితే మంచిదే. జీవించే హక్కుకూ, స్వేచ్ఛకూ పూచీ పడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ పదే పదే ఉల్లంఘనకు గురవుతుంటే మౌనంగా ఉండటం రాజ్యాంగానికి అపచారం చేసినట్టే.
అసలు బెయిల్‌కి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం అవసరమని సుప్రీంకోర్టు చేసిన సూచన కూడా శిరోధార్యమైనది. బ్రిటన్‌లో 1976లో ఈ మాదిరి చట్టం వచ్చింది. జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించడానికి ఈ చట్టం తీసుకొస్తున్నట్టు అప్పట్లో బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్నవారికి న్యాయసహాయం అందించే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ చట్టం అమలు మెరుగైన ఫలితాలనిచ్చిందని అక్కడి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందుకే సుప్రీంకోర్టు చేసిన సూచనను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయంలో తగిన ఆలోచన చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment