నానాటికీ నేరాలు అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతున్నాయన్నది నిజం. అందుకు ఇతర కారణాల మాటెలా ఉన్నా నేర న్యాయ వ్యవస్థ చురుగ్గా పనిచేయకపోవడం ప్రధానమైన కారణమని న్యాయనిపుణులు చెబుతారు. నేరం చేస్తే వెనువెంటనే చర్యలు మొదలవుతాయన్న భయం ఉంటే అవి చాలామటుకు అదుపుచేయ వచ్చంటారు. ఈ విషయంలో సాక్షాత్తూ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హితబోధ చేసినా చెప్పుకోదగ్గ కదలికలేదు.
నాలుగు దశాబ్దాల క్రితం బాంబు పేలుడు ఉదంతంలో కన్నుమూసిన ఆనాటి రైల్వే మంత్రి ఎల్. ఎన్. మిశ్రా కేసులో నలు గురు నిందితులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పు ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. 1975 జనవరి 2న బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఆ ఘటన చుట్టూ ఎన్నో వివాదాలూ, ఊహాగానాలూ అలుముకున్నాయి. తన ను అంతం చేసేందుకు కుట్ర జరుగుతున్నదని స్వయంగా మిశ్రాయే చెప్పారని ఒక సీనియర్ పాత్రికేయుడు అప్పట్లో వెల్లడించారు.
అనంతర కాలంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించడానికి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఏకరువు పెట్టిన పలు కారణాల్లో ఈ హత్యోదంతం ఒకటి. ఆనంద్ మార్గ్ సంస్థ కార్యకర్తలే ఈ హత్యకు కుట్ర పన్నారన్నది ప్రాసిక్యూషన్ అభియోగం. ఆనంద్‌మార్గ్ దీన్ని అప్పట్లోనే ఖండించగా మిశ్రా కుటుంబ సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి కుట్రలకు ఆయన బలైపోయారన్నది కుటుంబసభ్యుల అభియోగం. నిజమైన నిందితులను మరుగు పర్చి సంబంధం లేనివారిని దోషులుగా తేల్చారన్నది వారి ఆరోపణ.
ఒక కేసు దర్యాప్తు ఎలా ఉండకూడదో తెలుసుకోవడానికి సీబీఐ ఫైళ్లలో చాలా ఉదాహరణలు ఉండొచ్చు. అలాంటి అన్ని కేసులన్నిటిలో మిశ్రా కేసు విలక్షణ మైనది. ఇందులోని నిందితులంతా బాంబు పేలుడు ఉదంతం జరిగేనాటికి 20 నుంచి 35 ఏళ్లలోపువారు. వారిలో కొందరు మరణించారు. సాక్ష్యంగా నిలిచి నవారిలోనూ పలువురు కాలం చాలించారు. నిందితుల్లో చాలామంది అవసాన దశకు చేరుకున్నారు. ఇందులో ఒకాయన వయసు 79 అయితే మరో ఇద్దరు 75, 73 ఏళ్ల ప్రాయానికి చేరుకున్నారు.
మరణించిన వ్యక్తి అత్యంత ప్రముఖుడు కనుక, ఇందులో పెద్ద కుట్ర ఉండొచ్చు గనుక దీన్ని సీబీఐకి అప్పగించడమే సరైనదని ఆనాటి ప్రభుత్వం నిర్ణయించింది. తీరా అది నడిచిన తీరు సీబీఐ ప్రతిష్టను ఏమీ పెంచలేదు. అడుగడుగునా కేసు విచారణకు అవరోధాలు ఏర్పడుతుండటంతో 1979లో దీన్ని ఢిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. 1981లో నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. అయినా కేసుది నత్తనడకే! చివరికిది ఏ స్థాయికి చేరుకున్నదంటే...విచారణ సుదీర్ఘకాలం నడించింది కనుక దీన్ని కొట్టేయాలని రెండేళ్లక్రితం నిందితులంతా సుప్రీంకోర్టుకెక్కారు.
వారి వాదన విని ధర్మాసనం కూడా ఏంచేయాలన్న విచికిత్సలో పడింది. దీనిపై వాదనలు వినిపించమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. కేసు దర్యాప్తు, విచార ణలకు ఇంత సుదీర్ఘ సమయం పట్టింది కనుక నిందితుల వాదనలో సహేతుకత ఉన్నట్టు కనిపిస్తున్నా ఈ ఒరవడి ప్రమాదకర పర్యవసానాలకు నాంది పలకగలదని చివరకు ధర్మాసనం భావించింది. కేసును రోజువారీ విని పూర్తిచేయాలని నిర్దేశించింది. అలా చెప్పినా తీర్పు వెలువడటానికి ఇన్నేళ్ల సమయం పట్టింది. అయితే, ఈ కేసు వ్యవహారం ఇంతటితో ముగిసిపోయినట్టు కాదు. తమకు విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకునేందుకు నిందితులకు అవకాశం ఉంది.
మన న్యాయస్థానాల్లో ప్రస్తుతం 3 కోట్ల 13 లక్షలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టులో 63,843 కేసులు, వివిధ హైకోర్టుల్లో 44 లక్షల కేసులు వాయిదాల్లో నడుస్తున్నాయి. జిల్లా కోర్టులు, అంతకంటే కింది స్థాయిలో వీటి సంఖ్య 2 కోట్ల 68 లక్షలు. ఈ పెండింగ్ కేసుల్లో 25 శాతం అయిదేళ్లు అంత కన్నా పైబడినవి. 70 శాతం కేసులు అయిదేళ్లలోపులోనివి. పోలీసులు జరిపే అరెస్టుల్లో 60 శాతం అసందర్భమైనవేనని జాతీయ పోలీస్ కమిషన్ నివేదిక చెప్పిన నేపథ్యాన్ని గమనిస్తే ఈ పెండింగ్ కేసుల్లో ఎన్ని నిలబడతాయో సందేహమే.
ఏ నేరపూరిత చర్యనైనా మొత్తం సమాజానికి వ్యతిరేకంగా చేసిన నేరంగా చట్టం పరిగణిస్తుంది. ఇలాంటి కేసుల్లో కూడా అలవిమాలిన జాప్యం జరుగుతున్నదంటే సమాజ క్షేమం విషయంలో మనం ఉపేక్షవహిస్తున్నామని అర్థం. ఇందువల్ల సమాజంలో అభద్రతాభావం పెరుగుతుంది. కనీసం తీవ్రమైన నేరాలకు సంబం ధించిన కేసులనైనా వేగిరం తేల్చాలన్న ఉద్దేశం ఏ స్థాయిలోనూ ఉన్నట్టు కనబడదు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులవద్ద జరిగే జాప్యం మొదలు కొని న్యాయమూర్తుల పదవులను భర్తీ చేయడంలో, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాల్లో ప్రభుత్వాలు చూపుతున్న అలసత్వం వరకూ ఇందుకు ఎన్నో కారణాలున్నాయని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో లా కమిషన్ వివరించింది. పోలీసుశాఖలో పేరుకుపోయిన అవినీతి, అలసత్వం... పలుకుబడి ఉన్నవారి జోలికి వెళ్లలేని నిస్సహాయత, దర్యాప్తులో లోపిస్తున్న ప్రమా ణాలు, న్యాయవాదులు తరచు వాయిదాలు కోరడం, సాక్షులకు రక్షణ కల్పించక పోవడం, న్యాయస్థానాలకు మౌలిక సదుపాయాల లేమి వంటివెన్నో క్రిమినల్ కేసులు ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉండటానికి ప్రధాన కారణమని ఆ నివేదిక విశ్లేషించింది. ఇరవై నాలుగు నెలలు గడిచినా క్షేత్ర స్థాయిలో వీటిల్లో ఏ ఒక్కటీ మెరుగుపడలేదన్న సంగతి సులభంగానే అర్థమవుతుంది. కనుకనే ఎల్ ఎన్ మిశ్రా హత్య కేసు వంటివి సైతం ఏళ్ల తరబడి అతీగతీ లేకుండా పెండింగ్‌లో పడుతు న్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేనట్టయితే మన నేర న్యాయవ్యవస్థ మొత్తం నవ్వులపాలవుతుంది.
సా...గుతున్న న్యాయం!
Published Mon, Dec 22 2014 1:15 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement