సహచట్టంతో పౌరుడికి సాధికారికత
విశ్లేషణ
రహస్యాలు కాపాడుకుంటాం, ఇతరుల రహస్యాలు సాధించి బ్లాక్‌మెయిల్ చేస్తాం అనే దుర్మార్గపు ధోరణిని ప్రభుత్వంలో, ప్రభుత్వం బయట కూడా సాగించే వారు దుర్మార్గులు. అటువంటి వారిపైన పోరాటానికి సమాచార హక్కు చట్టం ఒక అస్త్రం.
సమాచార హక్కు చట్టం 12 అక్టోబర్ 2005న ప్రభుత్వం అమలులోకి తెచ్చిన రోజు భారతదేశానికి మరో స్వాతం త్య్ర దినోత్సవం అని పండుగ చేసుకున్నారు. స్వాతంత్య్రం అయితే 1947లో వచ్చింది కాని, మన కార్యాలయాల్లో ఏం జరుగుతున్నదో, ఫైళ్లలో దాగిన విషయాలేమిటో తెలుసుకునే అవకాశం 2005 దాకా రాకపోవడం చాలా దురదృష్టకరమైన ఆలస్యం. 1766లో స్వీడెన్ ఇటువంటి పారదర్శకతా చట్టాన్ని తెచ్చుకున్నది. మనం స్వతంత్రం సాధించుకున్న తర వాత సమాచారంపైన హక్కు సంపాదించడానికి ఉద్య మాలు చేయవలసి వచ్చింది. 58 సంవత్సరాల తరవాత వచ్చిన ఈ హక్కు వయసు ప్రస్తుతం పదేళ్లు.
ఈ హక్కును అమలు చేసుకోవడంలో విజయం సాధించామా లేక వెనుకబడి ఉన్నామా అన్నది దశాబ్ద కాలపు సమీక్షా విషయం. గొప్పగా విజయాలు సాధిం చామని చెప్పలేము గానీ పూర్తిగా పరాజయం చెందిం దని చెప్పడం అన్యాయమే అవుతుంది. ప్రజాస్వా మ్యంలో ఓటర్లకు తగిన ప్రభుత్వం వస్త్తుందంటారు. అదే విధంగా సహ చట్టం కూడా ప్రజల చైతన్యంపైన ఆధారపడి ఉంటుంది. అడిగినంత వారికి అడిగినంత సమాచారం లభిస్తుంది. దొరికిన సమాచారాన్ని ఏ విధంగా వాడుకుంటారనేది కూడా వారి అవసరాలు, ప్రజావసరాలు, సందర్భం, న్యాయాన్యాయాలపైన ఆధారపడి ఉంటుంది. ఏపీ న్యాయ విద్యాసంస్థ, జ్యుడీ షియల్ అకాడమీలో ప్రసంగిస్త్తున్నప్పుడు విరామంలో ఒక న్యాయాధికార మిత్రుడు సమాచార హక్కు చట్టం కింద లభించిన సమాచారం సాక్ష్యంగా పనికి వస్తుందా అని నన్నడిగారు. అవును అని నేనంటే ఆయన కాదన్నట్టు ఒక నవ్వు నవ్వారు.
ఒకానొక అంశంపైన అధీకృత పత్రాన్ని పొందే అవకాశం సహ చట్టం కల్పిస్తున్నది. ఇది సమాచారం. సందర్భాన్ని బట్టి సాక్ష్య చట్టం నియమాలను బట్టి, కేసు అంశాలను బట్టి దాన్ని అనుమతిస్తే అది సాక్ష్యమవు తుంది. జడ్జిగారు సాక్ష్యాన్ని అనుమతించడం అనుమ తించకపోవడం, దానికి ఎంత విలువ ఇవ్వాలో నిర్ణయిం చడమనేది ఆయన వివేకానికి, విచక్షణకు వదిలేస్తారు. పౌరులు తమ హక్కులను కాపాడుకోవడానికి అవసర మైన సమాచారాన్ని కోరవచ్చు. ఆ సమాచారాన్ని అవ సరమైన రీతిలో సమంజసంగా వాడుకోవచ్చు. జీవన భృతి కోసం పోరాడుతున్న భార్య ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త వేతనం ఎంతో ఈ చట్టం కింద తెలుసు కోవచ్చు. ప్రభుత్వ అధికార సంస్థ ధృవీకృతరూపంలో ఇచ్చిన ఆ సమాచారాన్ని కోర్టులో సాక్ష్యంగా ప్రవేశ పెడు తుంది. దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత కోర్టులదే.
తన కుటుంబాన్ని పోషించడం, పిల్లల్ని పెంచడం అనేది ప్రతి వాడి ధర్మం.పెళ్లి చేసుకోకపోయినా తల్లిదం డ్రులను పోషించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభు త్వోద్యోగికి సంబంధించినంత వరకు ఇది క్రమశిక్షణా పరమైన బాధ్యత. రెండు పెళ్లిళ్లు చేసుకున్నా, వరకట్నం కోసం బాధించినా శాఖాపరమైన చర్యలు తీసుకొనడం ప్రజాప్రయోజనకరమైన అంశం. ప్రభుత్వానికి ప్రాతి నిధ్యం వహించే వ్యక్తి ఎటువంటి నేరమూ చేయడానికి వీల్లేదు. సచ్ఛీలుడై ఉండాలని సర్వీసు నియమావళి వివరిస్తున్నది. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన సమాచారానికి పరిశీలనా యోగ్యత ఉండడం న్యాయ మని అందరూ అర్థం చేసుకోవలసి ఉంది. ప్రయివేటు రంగంలో పనిచేసే భర్తల జీతం సమాచారం తెలుసుకో వచ్చా అని అడుగుతూ ఉంటారు. దానికి జవాబు ఢిల్లీ హైకోర్టు 2015 జనవరిలో ఇచ్చింది. కుటుంబ తగాదాల విషయంలో కోర్టుకు వచ్చే భార్యాభర్తలు తమ తమ ఆదాయ వ్యయ వివరాలు తామే ప్రమాణ పత్రం రూపంలో ఇవ్వాల్సి ఉంటుందని, అప్పుడే న్యాయంగా సత్వరంగా నిర్ణయించడం సాధ్యం అవుతుందని హైకోర్టు వివరించింది.
రహస్యాలు కాపాడుకుంటాం, ఇతరుల రహ స్యాలు సాధించి బ్లాక్ మెయిల్ చేస్తాం అనే దుర్మార్గపు ధోరణిని ప్రభుత్వంలో, ప్రభుత్వం బయట కూడా సాగించే వారు దుర్మార్గులు. అటువంటి వారిపైన పోరా టానికి సమాచార హక్కు చట్టం ఒక అస్త్రం. ఈ చట్టం అమలు చేయడంలో ఇబ్బందులు ఉన్నాయి. పరిమి తులూ ఉన్నాయి. కాని పౌరులు ఎంత జాగ్రత్తగా దీన్ని ఉపయోగించగలరు? దీని గరిష్టశక్తి ఏమిటి? అని ఇంకా పరీక్షించలేదేమో అనిపిస్తుంది. ఇంకా ప్రభుత్వం కూడా దీన్ని అర్థం చేసుకోవడం లేదు. తలనొప్పి చట్టం అని తలపోస్తున్నది. జిల్లా స్థాయి తాలూకా గ్రామస్థాయి కార్యాలయాల్లో సమాచారాన్ని అడగడం ద్వారా అవి నీతిని కనిపెట్టడానికి నిరోధించడానికి చాలా అవకాశా లున్నాయి. పెద్ద పెద్ద స్థాయిలో వేల, లక్షల కోట్ల రూపా యల అవినీతిని సమాచార హక్కు చట్టం అంతగా వెల్లడించకపోవచ్చు. కాని మీడియా భారీ అవినీతి గురించే పట్టించుకుంటుంది. చిన్న అవినీతి వారి కంటికి ఆనదు. సీబీఐ కూడా పట్టించుకోదు. పోలీసులు దర్యాప్తు చేయతగినదే అయినా ఇంత చిన్న లంచగొండి తనాన్ని పరిశోధించే సమయం వారికి ఉండదు. పౌరులు సమాచార హక్కు ద్వారా వెలికి తీసి స్వయంగా పోరాడవలసి ఉంటుంది. కొన్ని లక్షల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని ప్రశ్నించే సాధనం ఈ చట్టం. ఎన్ని పరిమితులున్నా, ఎంత ఆలస్యాలు జరిగినా, జాగ్రత్తగా వాడుకుంటే సహ చట్టం కార్యాలయాల పనితీరును మార్చేస్తుంది. ప్రజాస్వా మ్యాన్ని బతికిస్తుంది. ప్రభుత్వాలు, పార్టీలు కూడా ఈ చట్టాన్ని అమలు చేయవలసి ఉంది. ప్రజలు ఈ విలువైన హక్కును కాపాడుకోవడం చాలా అవసరం.
మాడభూషి శ్రీధర్(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com