వెబ్‌డెస్క్ :ఇండియన్ జేమ్స్‌బాండ్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ తరహాలో ఇటీవల ఫ్యామిలీమ్యాన్ వెబ్‌సిరీస్ పేరు తెచ్చుకుంది. అందులో హీరో సామాన్యుడిలా కనిపిస్తూనే చిన్న చిన్న క్లూల సాయంతో ఉగ్రవాదుల కుట్రలను ఎప్పటికప్పుడు కనిపెడుతూ దేశ భద్రతకు భరోసాగా ఉంటాడు. అచ్చంగా ఫ్యామిలీమ్యాన్ తరమాలోనే కోట్ల రూపాయల స్కామ్‌ని వెలుగులోకి తెచ్చాడు పంజాబ్‌కి ఓ సామాన్య ఎల్‌ఐసీ ఏజెంట్. ఎక్కడో పంజాబ్‌లో ఉంటూ ఇంకెక్కడో ఉన్న హరిద్వార్‌లో జరిగిన ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కాంని చాకచక్యంగా వెలికి తీశాడు. కేవలం ఒక ఫోన్ మేసేజ్ ఆధారంగా కోట్ల రూపాయల కుంభకోణం గుట్టురట్టు చేశారు.
ఎస్సెమ్మెస్‌తో
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న హరిద్వార్ కుంభమేళా ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కామ్‌ను బయటపెట్టింది ఓ సాధారణ ఎల్‌ఐసీ ఏజెంట్. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో విపన్ మిట్టల్ ఓ సాధారణ ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. 2021 ఏప్రిల్ 22న అతని ఫోన్‌కి ఓ మేసేజ్ వచ్చింది. అందులో ‘ మీ కరోనా నిర్థారణ పరీక్షా ఫలితాలు నెగటివ్‌గా వచ్చాయి’ అంటూ సందేశం ఉంది. అయితే కరోనా పరీక్షలకు శాంపిల్స్ ఇవ్వకుండానే ఫలితాలు రావడమేంటని ఆశ్యర్యపోయాడు విపన్ మిట్టల్.
వెళ్లవయ్యా.. వెళ్లూ...
ఎక్కడో, ఏదో జరుగుతోందని అనుమానించిన విపన్ వెంటనే కలెక్టర్ కార్యాలయం చేరుకుని తనకు జరిగిన అనుభవం చెప్పాడు. అయితే కలెక్టరేట్ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా విపన్‌ని కసిరారు. విషయాన్ని అక్కడితో వదిలేయకుండా తన ఫోన్‌కి మేసేజ్ రావడం, తాను టెస్ట్ చేయించుకోకపోవడం తదితర విషయాలన్నీ పూస గుచ్చినట్టు వివరిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐపీఎంఆర్)కి ఈ మెయిల చేశాడు. తగు చర్యలు తీసుకుంటామంటూ అక్కడి నుంచి రిప్లై వచ్చినా... వాస్తవంలో ఏం జరగలేదు.
పట్టువదలక
తనకు కావాల్సిన సమాచారం ఎంతకీ రాకపోవడంతో పట్టువదలని విక్రమార్కుడిలా ఆర్టీఐ చట్టం కింద విపన్ మిట్టల్ దరఖాస్తు చేశాడు . అందులో హరిద్వార్‌లో విపన్‌కి కరోనా నిర్థారణ పరీక్షలు జరిపినట్టు తేలింది. ఫరీద్‌కోట్‌లో ఉన్న వ్యక్తికి హరిద్వార్‌లో కరోనా టెస్ట్ నిర్వహించినట్టు రిజల్ట్ రావడం ఏంటీ ? .. అసలేం జరిగిందనే ప్రశ్నలు ప్రభుత్వ అధికారులకు తలెత్తాయి...... చివరకు ఫేక్ కరోనా టెస్ట్ స్కాం వెలుగు చూసింది. హరిద్వార్ ఆరోగ్యశాఖ అధికారులు కుంభమేళ సందర్భంగా నాలుగు లక్షల టెస్టులు చేయగా... అందులో లక్ష వరకు ఫేక్ అని తేలుతోంది. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది. ఈ అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఫ్యామిలీమ్యాన్ ఎక్కడ?
ఇండియాలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న ఫేక్ కోవిడ్ టెస్ట్ స్కాం ని వెలికి తీసిన విపన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనేది తెలియనివ్వడం లేదు అధికారులు. విపన్ భద్రత దృష్ట్యా అతని వివరాలు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment