కేంద్ర సమాచార కమిషనర్‌గా మాడభూషి ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషనర్‌గా ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని సీఐసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన సమాచార కమిషనర్ దీపక్ సంధు, మాడభూషితో పాటు సమాచార కమిషనర్లుగా నియమితులైన యశోవర్ధన్ ఆజాద్, శరత్ సబర్వాల్, ముంజుల పరాశర్, ఎంఏ ఖాన్ యూసఫ్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా మాడభూషి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర సమాచార కమిషన్‌లో తొలిసారి తెలుగువాడు కమిషనర్ అయిన ఘనత తనకు దక్కినందుకు సంతోషిస్తున్నానన్నారు. జర్నలిజం నేపథ్యం, న్యాయశాస్త్ర అధ్యాపకత్వం ఉన్న వ్యక్తిని ఈ పదవికి తొలిసారి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అనంతరం, ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు సీఐసీ కార్యాలయంలో మాడభూషి శ్రీధర్‌ను అభినందించారు.