Deepak sandhu
-
కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్‌గా సుష్మా సింగ్
కేంద్ర సమాచార చీఫ్ కమిషనర్ (సీఐసీ)గా సీనియర్ అధికారిణి సుష్మా సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న దీపక్ సంధు స్థానంలో నియమితులయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్‌తో కూడిన ప్యానెల్ సుష్మా సింగ్ నియామకంపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. సంధు తర్వాత సీఐసీగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళ సుష్మానే. ఐఏఎస్ అధికారిణిగా రిటైరయ్యాక 2009లో సమాచార కమిషనర్‌గా ఆమె నియమితురాలయ్యారు. కేంద్ర సమాచార కమిషన్‌లో అందరికంటే ఆమే సీనియర్. -
కేంద్ర సమాచార కమిషనర్‌గా మాడభూషి ప్రమాణం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషనర్‌గా ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని సీఐసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన సమాచార కమిషనర్ దీపక్ సంధు, మాడభూషితో పాటు సమాచార కమిషనర్లుగా నియమితులైన యశోవర్ధన్ ఆజాద్, శరత్ సబర్వాల్, ముంజుల పరాశర్, ఎంఏ ఖాన్ యూసఫ్‌లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాడభూషి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర సమాచార కమిషన్‌లో తొలిసారి తెలుగువాడు కమిషనర్ అయిన ఘనత తనకు దక్కినందుకు సంతోషిస్తున్నానన్నారు. జర్నలిజం నేపథ్యం, న్యాయశాస్త్ర అధ్యాపకత్వం ఉన్న వ్యక్తిని ఈ పదవికి తొలిసారి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. అనంతరం, ఎంపీ రాపోలు ఆనంద్‌భాస్కర్, కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు సీఐసీ కార్యాలయంలో మాడభూషి శ్రీధర్‌ను అభినందించారు. -
సీఐసీగా దీపక్ సంధూ బాధ్యతల స్వీకారం
న్యూఢిల్లీ: భారత ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా దీపక్ సంధూ బాధ్యతలు చేపట్టారు. ఒక మహిళ ఈ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి. గురువారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. సంధూతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు హాజరయ్యారు. 64 ఏళ్ల సంధూ 1971 బ్యాచ్‌కు చెందిన ఐఐఎస్ అధికారి. ఆమె గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వ సమాచార కమిషనర్‌గా పని చేస్తున్నారు. -
తొలి మహిళా ప్రధాన సమాచార కమిషనర్‌గా దీపక్ సంధు
గత నాలుగేళ్లలో తొలిసారిగా ప్రధాన సమాచార కమిషనర్ స్థానానికి ఒక మహిళ ఎంపికయ్యారు. 1971 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిణి అయిన దీపక్ సంధు ఈ గౌరవాన్ని పొందారు. రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెతో ప్రమాణం చేయించగా, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు హాజరయ్యారు. గతంలో ఆమె ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గాను, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్‌గాను, ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్‌గాను సేవలందించారు. 2009లో సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో కేన్స్, బెర్లిన్, వెనిస్, టోక్యో నగరాల్లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివళ్లలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అలాగే పలు అంశాలపై వివిధ దేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ సదస్సులలో కూడా ఆమె దేశం తరఫున పాల్గొన్నారు. 2005 నుంచే తాను సమాచార హక్కు కోసం పోరాడానని, అప్పట్లో ఈ అంశంపై పలువురితో చర్చించానని ఆమె తెలిపారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడమే తన తొలి ప్రాధాన్యమని ఆమె చెప్పారు. అయితే, ఇప్పటికే ఆమె వయసు 64 సంవత్సరాలు కావడంతో మరో మూడునెలలు మాత్రమే ఆమెకు పదవీ కాలం ఉంది. కొత్త కమిషనర్లు నియమితులైతే పని త్వరగా జరుగుతుందని ఆమె చెప్పారు.