తొలి మహిళా ప్రధాన సమాచార కమిషనర్గా దీపక్ సంధు
గత నాలుగేళ్లలో తొలిసారిగా ప్రధాన సమాచార కమిషనర్ స్థానానికి ఒక మహిళ ఎంపికయ్యారు. 1971 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారిణి అయిన దీపక్ సంధు ఈ గౌరవాన్ని పొందారు. రాష్ట్రపతి భవన్లో వేడుకగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెతో ప్రమాణం చేయించగా, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు హాజరయ్యారు. గతంలో ఆమె ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్గాను, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్గాను, ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్గాను సేవలందించారు. 2009లో సమాచార కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.
గతంలో కేన్స్, బెర్లిన్, వెనిస్, టోక్యో నగరాల్లో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివళ్లలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. అలాగే పలు అంశాలపై వివిధ దేశాల్లో నిర్వహించిన పలు అంతర్జాతీయ సదస్సులలో కూడా ఆమె దేశం తరఫున పాల్గొన్నారు. 2005 నుంచే తాను సమాచార హక్కు కోసం పోరాడానని, అప్పట్లో ఈ అంశంపై పలువురితో చర్చించానని ఆమె తెలిపారు. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడమే తన తొలి ప్రాధాన్యమని ఆమె చెప్పారు. అయితే, ఇప్పటికే ఆమె వయసు 64 సంవత్సరాలు కావడంతో మరో మూడునెలలు మాత్రమే ఆమెకు పదవీ కాలం ఉంది. కొత్త కమిషనర్లు నియమితులైతే పని త్వరగా జరుగుతుందని ఆమె చెప్పారు.