బెజవాడలో చిరు వ్యాపారి నిండు ప్రాణం బలి
అతివేగంతో బడ్డీ కొట్లు, తోపుడు బండ్లపైకి దూసుకువెళ్లిన వాహనం
నిందితుడు జి.కొండూరుకు చెందిన టీడీపీ నేతగా గుర్తింపు
నిందితుల్ని రక్షించేందుకు రంగంలోకి ఎమ్మెల్యే వసంత అనుచరులు
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరుడు.. మైలవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొడుకు.. టీడీపీ నేత ఉయ్యూరు వెంకటరమణ శనివారం బెజవాడలో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో కారును నడిపి రోడ్డు వెంబడి ఉన్న దుకాణాలు.. తోపుడు బండ్లపైకి దూసుకెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ నందమూరినగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వివరాలివీ..
మద్యం మత్తులో.. మహిళతో కారు నడిపిస్తూ?
మైలవరం నియోజకవర్గం జి.కొండూరు ప్రాంతానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్ ఉయ్యూరు నరసింహారావు కొడుకు వెంకటరమణ తన ఏపీ 16 ఈఎఫ్ 4979 కారులో విజయవాడ నుంచి తన ఇంటికి శనివారం మధ్యాహ్నం బయల్దేరాడు. సింగ్‌నగర్ ఫ్‌లైఓవర్ దిగి నందమూరినగర్ సాయిబాబా గుడి దాటిన తరువాత కారు వేగాన్ని పెంచి వెళ్తుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి రోడ్డు వెంబడి ఉన్న బడ్డీకొట్టును ఢీకొని ఆ పక్కనే ఉన్న తోపుడు బండ్ల వైపు దూసుకువెళ్లి 20 అడుగుల ఎత్తుకు ఎగిరి చివరకు స్తంభాన్ని ఢీకొని ఆగింది.
ఈ ఘటనలో అక్కడే తోపుడు బండిపై శనక్కాయలు అమ్ముకుంటున్న నందమూరినగర్ తోటవారి వీధికి చెందిన పీకా కోటేశ్వరరావు (49) అనే చిరువ్యాపారి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కారును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కారు నడిపింది ఓ మహిళ అని, పోలీసులు వచ్చేసరికి ఆమెను తప్పించి వెంకటరమణను చూపుతున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నిందితులను చూస్తుంటే వారు మద్యం సేవించినట్లుగా ఉన్నారని.. అతివేగంతో ఆ మహిళ కారును నడపడంవల్లే ఈ ఘటన జరిగిందని వారు చెబుతున్నారు. ఇక నిందితులకు కూడా స్వల్ప గాయాలయ్యాయని.. చికిత్స నిమిత్తం వారినీ ప్రభుత్వాస్పత్రికి పంపామని సింగ్‌నగర్ సీఐ బీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితులు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదని, కారు నడిపింది మహిళ కాదు తానే అని నిందితుడు వెంకటరమణ చెబుతున్నాడని ఆయన చెప్పారు.
అయితే కారు ఎవరు నడిపారు.. ప్రమాదం ఎలా జరిగిందనే అంశాలకు సంబంధించి సంఘటనా స్థలంలో సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నామని.. అవి వచ్చాక పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. నిందితుడిపై సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. మరోవైపు.. నిందితుడు వెంకటరమణను తప్పించేందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment