madabushi sridhar
-
ఓట్ల డబ్బు పంపిణీలో సమానత్వం
మొత్తానికి ఉపఎన్నికల పండుగ ముగిసింది. ఉత్తరాదిన బీజేపీ పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ మళ్లీ పాగా వేసింది. కానీ ఆంధ్ర, తెలంగాణల్లో డిపాజిట్ కోల్పోయినందుకు కాంగ్రెస్ చాలా సంతోషంగా ఉన్నట్లుంది. వ్యూహాత్మకంగా తెరాసను ఓడించింది తానే అనే భావనతో ఉంది. అయితే బీజేపీకి తన ఓట్లను ధారాదత్తం చేయలేదని, చేయిగుర్తుకు కాకుండా కమలానికే ఓటు వేయాలని ప్రచారం చేయలేదని కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. మన అవకాశవాదాలు ఆకాశానికి ఎదగడం, మన సిద్ధాంతాలు (ఉంటే గింటే) పాతాళానికి పడిపోవడం మామూలేకదా బ్రదర్. రాజకీయాల్లో విలువలు వలువలు అని కొందరు చేసే గోల పక్కకు బెట్టి అందరూ ఓటుకు నోటు విలువ పెంచారని మనమంతా గర్వించాలి. పైగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈసారి ఓటర్లు డబ్బుల పంపిణీ విషయమై సమానత్వం కోసం పోరాడారు. అందరికీ సమానావకాశాలు ఉండాలనే సూత్రం ఈసారి ఓటర్లకు బాగా వంట బట్టింది. కొందరికి 6 వేల రూపాయల కవర్లు ఇచ్చి మమ్మల్ని కవర్ చేయకుండా వెళ్లిపోతారా అని రోడ్లెక్కి ధర్నా చేసారు మరి. పక్క ఇంట్లో ఓటుకు ఆరువేల చొప్పున నలుగురికి 24 వేలిచ్చి, తమ ఇంట్లో ఓటర్లను నోట్లతో గుర్తించకపోవడం ఎంత ఘోరమైన అన్యాయం? దాన్ని నిలదీసి అడగడమే కరెక్టు. అడక్కపోవడం రాజ్యాంగ వ్యతిరేకం. ఓటుకు నోటు గురించి ప్రజాస్వామ్యవాదులు అంతగా గాభరాపడడం దండగ అనిపిస్తుంది. డబ్బు తీసుకుని కూడా ఓట్లేయలేదనడం, వాళ్లిచ్చే డబ్బు తీసుకోండి కాని మాకే ఓటేయండి అనడం చాలా దారుణం. రాకరాక అవకాశంవస్తే ఎందుకు తీసుకోగూడదనే తర్కం జనంది. డబ్బు తీసుకుని ద్రోహం చేస్తారని కూడా అనలేము. అందుకే ఈటెల మెజారిటీ 25 వేలు దాటలేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థుల కాట్లాట కాదు. ప్రభుత్వాల కొట్లాట. అటు కేంద్ర ప్రభుత్వం, మంత్రులు, ఎన్నికల కమిషన్, ఆల్ పవర్ ఫుల్ బీజేపీ, తనచేతిలో అంతకు ముందు చావుదెబ్బతిన్న పార్టీలో చేరి ఆ పార్టీకి మనుగడ ఇచ్చేంత మంచితనం కలిగి, చాలా పలుకుబడి ఉన్న ఉత్తమ అభ్యర్థి ఈటెల, బీసీ కులం వెన్నుదన్ను, వాటికన్న గొప్పగా డబ్బు, దాన్ని మించిన మతం మత్తు, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవడానికి కూడా సంసిద్ధంగా ఉండడం ఒకవైపు కలిసి వచ్చాయి కదా. ప్రత్యర్థులెవరు? రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, డబ్బు, గొప్ప వ్యూహకర్త హరీశ్ రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డబ్బు ఇవ్వకున్నా పనిచేసిన కార్యకర్తలు, డబ్బు తీసుకుని నీతిమంతంగా ఓటేసిన ఓటర్లు కలిసి ఇటునించి ఎదురీత ఈదారు. పాపం ఈ మత్త మత్తు గజాల తొక్కిసలాటలో పార్టీలు, నేతలు, అభ్యర్థులు, ఓటర్లు నలిగిపోయారు. ఈ మహాసంకుల కులసమరంలో సామాన్యుడి మీద పడిన గ్యాస్ బండధర గురించి ఎవడికి పట్టింది? హమ్మయ్య పెట్రోల్ ధర తగ్గిం చారని అనుకుంటే డొమెస్టిక్ వర్కర్ లక్ష్మి ‘ఏం లాభమయ్యా బండ ధర బెంచెగద’ అన్నది. పెట్రోల్ ధర వంద దాటించినంత మాత్రాన 5 రూపాయలు తగ్గిస్తే మోసమంటారా? వాణిజ్య గ్యాస్ బండ ధర 266 రూపాయలు పెంచి రూ.2,130కి తీసుకుపోయినా వంట గ్యాస్ పెంచలేదని భజనపరుల తర్కం. పరోక్షంగా దీని దెబ్బ సామాన్యుల మీదే కదా. అలాగే వంట గ్యాస్ బండ ధర 2021 జనవరిలో రూ. 746లు ఉండగా, అక్టోబర్‌లో ఇది రూ. 952కు పెరిగింది. ఇదివరకు ఎన్నికలు ఉంటే ధరలు పెంచడానికి కాస్త సిగ్గుపడే వారు. నేడు నాయకులను చూసి సిగ్గు గారు సిగ్గుపడి పారిపోతారు. నేతల భజన చేస్తూ ఓట్లు వేస్తుంటే, గ్యాస్ ధర పెంచడానికి రాజ కీయ పార్టీలు ఎందుకు సిగ్గుపడతాయి? సారా మత్తు, డబ్బు మత్తు, కులం మత్తు, వీటన్నింటికి మించి దేవుడి మత్తులో ఓటర్లు మునిగిపోతే నాయకులు ధరలు పెంచకుండా తగ్గిస్తారా? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ డీన్,స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ -
కొత్త బందిపోట్లు–వైద్యవ్యాపారులు, వారి బౌన్సర్లు
బందిపోట్లను ఇంగ్లిష్‌లో ఏమంటారో తెలుసా. ఇంగ్లిష్ ప్రొఫెసర్లు కూడా చెప్పలేరు. బౌన్సర్లు అంటారు. వీరు అర్ధరాత్రి మీ ఇండ్లమీదపడి దోచుకునేంత అమానుషమైన వ్యక్తులు కాదు. చాలా అందంగా దుస్తులు వేసుకుని హాస్పిటల్స్‌లో ఉంటారు. ఏ రోగమొచ్చినా సరే హాస్పటల్ వారడిగిన డబ్బిస్తే మీతో మర్యాదగా ఉంటారు. లేకపోతే రోగులకంటే ముందు వారి బంధువులు రోగులవుతారు. ఇప్పుడు వైరస్ సోకిన వారు చనిపోదలుచుకుంటే ప్రయివేటు ఆస్పత్రులకు పోవచ్చు. రోగంతో కాదు బిల్లు ఎక్కువైందని చెప్పి గొడవ చేస్తే తన్నులు తినొచ్చు. బౌన్సర్లు గట్టిగా కొడితే ప్రాణాలు పోవచ్చు. ఎందుకంటే కండలు పెంచిన యువకులను రక్షకులన్న పేరుతో, ప్రశ్నించే వారిని తన్ని పంపించడానికి నియమించుకుం టున్నారు. ఇది ప్రయివేటు వైద్య వ్యాపారుల నిజస్వరూపం. రోగులతో వారి బంధువులతో డాక్టర్లు మాట్లాడరు. ప్రజాసంబంధ ఉద్యోగులు మాట్లాడరు. నర్సులు మాట్లాడరు. కేవలం కండలుపెంచిన వారో, కరాటే వీరులో వివరిస్తుంటారు. వాళ్లు కొట్టాల్సిన పనిలేదు. వారి సిక్స్ ప్యాక్ శరీరాలు చూసి బతికున్నవారు శవాలైపోతామేమోనని భయపడి నోరుమూసుకోవలసిందే. ఇది మానవ హక్కులన్నింటినీ కట్టగట్టి మూసీలో పారేసే దుర్మార్గపు కార్పొరేట్ వైద్య వ్యాపార నిర్వహణ. ప్రభుత్వాలు, ఆరోగ్యశాఖలు ఉంటే సిగ్గుపడి తలదించుకోవలసిన పద్ధతులు, వ్యవస్థలు. చేసిన చికిత్స ఏమిటో చెప్పరు. మెడికల్ రికార్డులు ఇవ్వరు. వేసిన ధరల సమంజసత్వం ఏమిటో చెప్పరు. ఎందుకంత విపరీతమైన రేట్లు వేస్తున్నారో వివరించరు. రోగి చనిపోతే శవం ఇవ్వరు. లక్షల రూపాయల బాకీలు తీర్చేదాకా శవం వారి అధీనంలో ఉంటుంది. అంత్యక్రియలు చేయకపోతే నరకానికి పోతారనే భయంతో జనం అప్పోసప్పో చేసి డబ్బు కట్టి బంధువుల మృతదేహాలు తీసుకోవలసిన దుస్థితి. ఎవ్వరికీ ఫిర్యాదు చేసి న్యాయం కోరే సమయం ఉండదు. కోర్టులు తెరవరు, చాలా అరుదైన విలువైన సమయాన్ని కోర్టులు, తమను ధిక్కరించే వారిని శిక్షించే పనిలో వినియోగిస్తూ ఉంటాయి. అన్నీ రాజ్యాంగబద్ధమే. పోనీ శవాన్ని వదిలేసి పోదామా అంటే కార్పొరేట్ మీడియా టీవీలు తండ్రి శవాన్ని వదిలేసిన క్రూరుడైన తనయుడు అని పొద్దుటినుంచి సాయంత్రందాకా సుత్తి కొడుతూనే ఉంటాయి. రెండు మూడు లక్షల రూపాయల డిపాజిట్ చేసిన తరువాతనే మీ రోగం ఏమిటో పరీక్షిస్తారు. మీ రోగి జబ్బు వదులుతుందో లేదోగానీ మీ డబ్బు మాత్రం వదులుతూ ఉంటుంది. డాక్లర్లు నర్సులనబడే ఉద్యోగులు మీకందించే సేవలకు మీరు సంతుష్టులు కాకుండా హాస్పిటళ్ల డైరెక్టర్లను కలిసి నిలదీయాలనుకున్నపుడు మీ ముందు నిలబడేవారే బౌన్సర్లు. ప్రభుత్వాలు ఏంచేస్తున్నట్టు? కరోనా వైరస్ కన్నా ఘోరంగా హాస్పిటల్ కార్పొరేట్ వైరస్ వ్యాపారులు ఇన్నాళ్లు విలయతాండవం చేసిన తరువాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 12న ఒక ఉత్తర్వు జారీ చేసింది. గరిష్ట చిల్లర ధరకు మాత్రమే మందులు అమ్మాలని. తీసుకొన్న సొమ్ముకు బిల్లులు ఇవ్వాలని. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని. ఎంఆర్పీ ధరలకు అమ్మకపోతే చర్యలు తీసుకునే అధికారం వీరికి ఇంతకుముందు లేదా? ఎంఆర్పీ ధరలకు మందులు అమ్మని కార్పొరేట్ హాస్పటల్ యజమానులకు, డైరెక్టర్లకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందా? అరెస్టు చేసిందా? తీవ్రమైన హెచ్చరి కలు చేయడమేనా బాధ్యత? ఇదెట్లా ఉందంటే, బంది పోటు దొంగల్లారా దోచుకోకండి, దోచుకుంటే మిమ్మల్ని ఐపీసీ ప్రకారం శిక్షిస్తాం అని హోం మంత్రి విలేకరుల సమావేశంలో చెప్పినట్టు ఉంది. బౌన్సర్ల వైద్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలనే జ్ఞానం లేదా? ఈ విషయమై విలేకరుల సమావేశంలో ఒక్కమాట కూడా చెప్పలేదే. ఒక్క రోగి బంధువు బౌన్సర్ బెదిరింపునకు గురైనా సరే మొత్తం హాస్పిటల్ యాజమాన్యంపైన చర్యలుతీసుకుని ఆ హాస్పిటల్ మూసేయించి, వారి అక్రమార్జనపైన వెంటనే దర్యాప్తు జరుపుతామని చెప్పాలి కదా? ప్రజల ప్రాణాలను రక్షించలేని ప్రభుత్వాలు ప్రభుత్వాలే కాదు. వాటికి పాలించే అర్హత లేదు. కోవిడ్–19 కన్నా దారుణాలు మనదేశంలో జరుగుతున్నాయి. ప్రైవేటు హాస్పిటళ్లు బందిపోటు దొంగల కన్నా దారుణంగా రోగాలను వాడుకుంటూ మధ్యతరగతి కుటుంబాలను దోచుకుంటూ ఉంటే చోద్యం చూస్తున్నాయి. మీ చావు మీరు చావండి అన్నట్టు మౌనం పాటిస్తున్నాయి. కార్పొరేట్ వాణిజ్య, ప్రయివేట్, ప్రభుత్వేతర గ్లోబల్ ప్రపంచీకృత అమానవీయ దుకాణాలు సజీవ శరీరాలతో.. తరువాత శవాలతో చేసే దోపిడీ వ్యాపారాన్ని ప్రస్తుతం వైద్యం అని పిలుస్తున్నారు. ఇది వ్యాపారులకు ప్రజల ప్రాణాల నైవేద్యమే తప్ప వైద్యం కాదు. వీరికన్నా కరోనా వైరస్ నయం. వీరిని సహించే ప్రభుత్వాలు ఈ వైరస్‌ను సృష్టించిన వారికన్న ఘోర విద్రోహులవుతారు. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
కరోనా కాటేసిన పాఠాలు
కోవిడ్–19 తీవ్రఘాతం చదువులమీద పడింది. వానాకాలపు చదువులనుంచి ఆన్లైన్ చదువుల్లోకి మళ్లాం. కంప్యూటర్ అనబడే చిన్నడబ్బా ముందు కూచుని, స్మార్ట్ విద్యార్థులైతే చిట్టి మొబైల్ ముందుం చుకుని చదువు చెబుతున్నామనీ, చదువుకుంటున్నామనీ అనుకుంటున్నారు. ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ఉంటారు. విద్యార్థి వింటున్నాడో లేదో కెమెరాముందు ఉన్నాడో లేదో తెలియదు. ఉన్నంత మాత్రాన విన్నట్టూ, విన్నంత మాత్రాన అర్థం చేసుకున్నట్టూ కాదు. విద్యార్థి ముఖంలో కవళికలను చూడడం ఒక భాగ్యం. అర్థం కానట్టు ముఖం పెడితే టీచర్ మరో ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యక్తి చెప్పిన అంశం మరొక వ్యక్తి మనసుకు తగిలి, అతనిని కదలించి, ఆ కదలిక సంగతిని మొదటి వ్యక్తికి తెలియజేసినప్పుడు భావ ప్రసారం పూర్తవుతుంది. ఈ ప్రసారం ప్రతిస్పందన ప్రయాణించి తొలి ప్రకటనకర్తకు చేరితే సంపూర్ణ చక్రం. ఎన్ని సాంకేతిక సమాచార ప్రసార వ్యవస్థలు వచ్చినా గురుశిష్య బోధనా విధానం ముందు వెలవెల బోవలసిందే. ఒక వ్యక్తి నిలువెత్తు నిలబడి, ఆలోచిస్తూ, చేతులు కదిలిస్తూ, చూపుడు వేలుచూపుతూ మార్గదర్శకత్వం చేస్తుంటే ఆయన జీవకళలోంచి కొన్ని కాంతులు మనకు చేరుతుంటే, చదువు రూపుదిద్దుకున్న గురువై కళ్లెదుట కదులుతూ ఉంటే ఎంత బాగుం టుంది. అంతర్జాల మాయాజాలంలో పడి కరోనా ఇంద్రజాలంలో నలిగి చదువు బక్కచిక్కుతున్నది. సిలబస్‌ను తగ్గించడం ద్వారా పిల్లల మూపున భారం తగ్గించవచ్చని కేంద్ర విద్యా పాలనా యంత్రాంగం ఒక నిర్ణయానికి వచ్చింది. సరే. 30 శాతం సిలబస్ భారాన్ని కత్తిరించారు. చాలా గొప్ప సంస్కరణ. సులువైన సంస్కరణ. పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు. ఏ ముప్పై శాతం పోతుంది అనేది ప్రశ్న. ఎవరు కోస్తారనేది మరో కీలకసమస్య. మంత్రులు, ఐఏఎస్ అధికారులు, సీబీఎస్ఈ పాలకులు ఖడ్గాలు ఝళిపిస్తూ 30 శాతం దగ్గర వేటు వేస్తారా? ఈ సందేహం పాలనాపరమైన సమస్యకు సంబంధించినది. సీబీఎస్ఈ అధికారులు, పదకొండో తరగతి పాఠ్యాంశాలనుంచి కొన్ని కోసేశారు. కోవిడ్–19 చదువుమీద కూడా ఎంత క్రూరప్రభావం చూపిందో కోతపడిన అంశాలు చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా రాజకీయ శాస్త్రం నుంచి తొలగించిన అంశాలు కీలకమైనవి. శాస్త్రం చేస్తున్న ఆర్తనాదం ఎవరికైనా వినబడిందో లేదు. ఇందులో పూర్తిగా వేటుబడిన అంశాలివి. తొమ్మిదో తరగతి నుంచి ప్రజాస్వామిక హక్కులు, మనదేశంలో ఆహార భద్రత, పదోతరగతి నుంచి ప్రజాస్వామ్యం భిన్నత్వం, ప్రఖ్యాత ప్రజా ఉద్యమాలు, ప్రజాస్వామ్యానికి సవాళ్లు, లింగం, మతం కులం, పదకొండో తరగతినుంచి సమాఖ్య లక్షణాలు (ఫెడరలిజం), పౌరసత్వం, జాతీయతా వాదం, సెక్యులరిజం. పన్నెండో తరగతి నుంచి సామాజిక ఉద్యమాలు, నవసామాజిక ఉద్యమాలు, ప్రాంతీయ ఆశలు, దేశవిభజనపట్ల అవగాహన అనే అంశాలు అక్కరలేదట. మనకు స్థానిక ప్రభుత్వాలెందుకు అనే అంశాన్ని కూడా తొలగించారు. మనదేశంలో ఉండవలసిన కేంద్ర, రాష్ట్ర సార్వభౌమ సమానత (ఫెడరలిజం), జాతీయత, పౌరసత్వం, ప్రజాస్వామ్య హక్కులు స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయో లేవో తెలియని మాయాజాలంలో పడిపోయిన అంశాలే. రాష్ట్రాల అధికారాలు వివరించే సమాఖ్య లక్షణాలు కూడా పాఠాలనుంచి తొలగించడమా? అన్నింటికీ మించి అన్ని మతాలకు సమానగౌరవం సమాన దూరం అనే సూత్రాన్ని పాటించనవసరం మన సిద్ధాంతమన్నట్టు, సెక్యులరిజం ఏదో పాపమైనట్టు అంటరాని దైనట్టు పాఠ్యాంశాలనుంచి పనిగట్టుకుని తొలగించడం ప్రశ్నించదగిన సంగతి. కారణాలేమిటి? వీటినే ఎందుకు తొలగించారు? తొలగించి ఏం సాధిద్దామనుకున్నారు అనే ప్రశ్నలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి, రమేశ్ పోక్రియాల్ గారే ఈ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. ఈ అంశాలు కనుక విద్యార్థులకు బోధిస్తే అవి దేశంలో ఉన్నాయో లేవో తెలుసుకునే శక్తి నవతరానికి వస్తుందన్న భయమా? వాటిగురించే తెలియజెప్పకపోతే ఇక తమ విధానాలకు తిరుగే ఉండదనే నమ్మకమా? మన సంవిధానం మౌలిక లక్ష్యాలు ఇవి. రాజ్యాంగ పీఠికలో ప్రత్యేకంగా రాసుకున్న లక్ష్య లక్షణ వాక్యాలు ఇవి. ఇవి లేకుండా రాజ్యాంగం లేదు. 30 శాతంలో ముందు ఇవే పోతాయంటే అంతకన్నా రాజ్యాంగ విరోధ ఆలోచన ఏమిటి? సంవిధానం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సమాఖ్యత్వం.. మస్తకాల్లోంచి తీసేద్దామా? వెన్నెముకల గురించి మరిచిపోయాం. కనీసం పుస్తకాలు మస్తకాలైనా ఉన్నాయా? ఉంటాయా? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
రాజ ద్రోహమా? రాజ్యాంగ ద్రోహమా?
మాకు జీతాలు పెంచండి అని అడిగారు ఇద్దరు కర్ణాటక పోలీసులు. కర్నాటక రాష్ట్రంలో అఖిల కర్ణాటక పోలీసు మహాసంఘ నాయకుడు శశిధర్ గోపాల్ పైన, కోలార్ కానిస్టేబుల్ బసవరాజ్ పైన 124ఎ కింద జూన్ 4, 2016న రాజద్రోహం కేసులను నమోదు చేశారు. ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేసింది. ఇటువంటి పాలకులుంటే భారత్ ముక్కలవుతుంది అని నినాదాలు చేసినందుకు కన్హయ్యా కుమార్ మీద రాజద్రోహం కేసు పెట్టారు. క్రికెట్ మ్యాచ్ నడుస్తూ ఉంటే పాకి స్తాన్ జట్టుకు మద్దతుగా మాట్లాడినందుకు రాజద్రోహం కేసును వాడారు. పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడిని పెళ్లాడిన భారతీయ మహిళపై రాజద్రోహం కేసు పెట్టనందుకు సంతోషించాలి. 2020 ఫిబ్రవరి 6న ఉత్తరప్రదేశ్‌లోని అజం ఘర్‌లో పౌరసత్వ చట్టం సవరణ సీఏఏను విమర్శించినందుకు 135 మంది మీద రాజద్రోహం కేసులుపెట్టారు. 20 మందిని అరెస్టు చేశారు. ఫిర్యా దులో పేర్కొన్న 35 మంది మీద, ఎవరో తెలియని 100 మంది మీద ఈ క్రిమినల్ కేసులుపెట్టడం విచిత్రం. రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు అనుసరించడం, భారత రాజ్యాంగ విలువలను తిలోదకాలిచ్చే చట్టాలు చేయడం, భారత ప్రజాస్వామ్య మౌలిక లక్షణాలను భంగపరిచే చట్టాలు తేవడాన్ని విమ ర్శిస్తే రాజ్య ద్రోహమంటున్నారు. రాజ్యాంగానికి ద్రోహం చేయడం రాజ ద్రోహం అవుతుంది కాని పాలకులను విమర్శిస్తే రాజ ద్రోహమా? వేలాది మందిపై కుప్పలుతెప్పలుగా కేసులు పెట్టేస్తున్నారు. ఈ చట్టంలో లోపాలను, అన్యాయాలను ఎండగట్టే వారిని జాతి వ్యతిరేకులంటున్నారు. దేశ ద్రోహులంటున్నారు. ఆర్టికల్ 19(1)(ఎ)లో చెప్పిన వాక్ స్వాతంత్య్రం కీలకమైనది. అది దేశద్రోహమా? రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను నిరసించకపోవడమే దేశద్రోహం. అసలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలు చేసేవారే రాజ్యాంగ ద్రోహులు. అదీ రాజకీయం కోసం, ఓట్ల కోసం చేసేవారు స్వచ్ఛమైన రాజకీయాలకు కూడా ద్రోహం చేసినట్టే. జార్ఖండ్‌లో పదివేలమంది మీద ఒకసారి, మరో సారి 3వేల మందిపై రాజ ద్రోహం కేసులు పెట్టారు. ప్రభుత్వం మారడం మంచిదైంది. లేకపోతే వేలమంది ప్రజలు దేశ ద్రోహనేర నిందితులుగా కోర్టుల చుట్టూతిరుగుతూ అన్యాయమైపోయేవారు. బీదర్ పాఠశాలలో సీఏఏకు వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించారు. ఏబీవీపీ కార్యకర్త పోలీసు స్టేషన్లో రాజ ద్రోహం కేసు పెట్టారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి విచారణ మొదలుపె ట్టారు. హెడ్ మిసెస్‌ను అరెస్టు చేశారు. చిన్న పిల్ల లను గంటలకొద్దీ విచారించారు. తొమ్మిదేళ్ల అమ్మాయి తల్లిని అరెస్టు చేశారు. ఆ కూతురు పక్కింటి వారి దగ్గర తలదాచుకుంటున్నది. కోర్టు బెయిల్ ఇవ్వలేదు. పదిహేనురోజుల పైబడి వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పౌరసత్వం వివరాలు అడిగితే చెప్పు చూపండి, అని ఆ నాటకంలో ఒక డైలాగ్ ఉందట. ప్రధాని చిత్రాన్ని చెప్పుతో కొట్టారనీ ఆరోపించారు. ఒకవేళ ఆవిధంగా జరిగితే ఖండించవలసిందే. కానీ మూడేళ్ల జైలు నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించేంత ఘోరమైన రాజ ద్రోహ నేరమా? బాలలను అయిదారుగంటలపాటు పోలీసులు తమ ఖాకీ యూనిఫాంలో విచా రించడం, బాలల విషయంలో బాలల సంక్షేమ కమిటీని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం తీవ్ర మైన ఉల్లంఘనలని కర్ణాటక బాలల హక్కుల కమిషన్ విమర్శించింది. రెండు వందల ఏళ్ల కిందట దిష్టి బొమ్మను తగులబెట్టడం పెద్ద పరువునష్టంగా భావించి క్రిమినల్ కేసు పెట్టేవారు. ముర్దాబాద్ డౌన్ డౌన్ నినాదాలు చేస్తే క్రిమినల్ డిఫమేషన్ కేసులు పెట్టి జైలుకు పంపేవారు. ఆ కాలం మారింది. తీవ్రమైన అబద్ధపు విమర్శలు చేసినప్పుడే క్రిమినల్ కేసులు పెట్టాలని తరువాత తీర్పులు వివరిస్తున్నాయి. చీటికీమాటికీ వ్యతిరేకుల మీద, ఉద్యమకా రుల మీద రాజ ద్రోహం కేసులు పెట్టడం అన్యాయ మనీ, ఈ దుర్వినియోగాన్ని నిరోధించాలని ఎన్జీవో కామన్ కాజ్ పిల్ దాఖలు చేసింది. దీనిపై తీర్పు చెబుతూ ‘భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతిపదం ఇప్పటికీ చెల్లుతుంది, ఏదీ మారలేదు, మారకూడద’ని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పేర్కొన్నారు. విమర్శకులమీద రాజకీయ వ్యతిరేకుల మీద ప్రభుత్వాలు రాజ ద్రోహం కేసు పెట్టకూడదని దీపక్ మిశ్రా 2016లో తీర్పుచెప్పారు. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
రుజువులు చూపకపోతే పౌరులు కారా?
ఈ దేశవాసిని అనడానికి తగిన రుజువులు చూపలేకపోతే విదేశీయులమవుతామా? సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ సమస్య ఇది. దీన్ని హిందూముస్లిం సమస్యగా చర్చలోకి తెచ్చి, హిందూ ఓట్లను కొల్లగొడదామని అధికార పార్టీ పన్నిన వ్యూహం. ఈ దేశంలో పుట్టిన వారందరూ, వారి పిల్లలూ భారతపౌరులే అనే సార్వజనిక విశ్వజనీన నియమం ప్రకారం రాజ్యాంగం వారికి పౌరసత్వం లభిస్తుందని నిర్దేశించింది. రాజ్యాంగం, 1955 పౌరసత్వ చట్టం, దానికి చేసిన అన్ని సవరణలలో కూడా ఆ అధికారాన్ని ప్రభుత్వానికి, పార్లమెంటుకు ఇవ్వలేదు. కానీ దాన్ని చట్టంద్వారా కాకుండా, రూల్స్ ద్వారా కేంద్రం చేజిక్కించుకుని రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్లకు అప్పగించడం దారుణం. కేంద్రానికి సహజీకరణ రిజిస్ట్రేషన్ ద్వారా కొందరు విదేశీయులకు, వలసదారులకు, శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే విచక్షణాధికారం ఉంది. దాన్ని 1955 చట్టం స్పష్టంగా గుర్తించింది. ప్రపంచంలో ఏ ప్రభుత్వానికైనా బయటనుంచి వచ్చే వారి పౌరసత్వాన్ని నిర్ధారించే, నిరాకరించే అధికారం పూర్తిగా ఉంటుంది. కానీ, రాజ్యాంగాన్నే ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా సవరించిన ప్రభుత్వం నియమాలు మార్చడం ద్వారా చట్టం లక్ష్యాలను అతిక్రమించే ప్రయత్నం చేస్తున్నది. ముస్లింలను మతం ప్రాతిపదికన మినహాయించడం రాజ్యాంగ వ్యతిరేకమే. ఎన్ఆర్సీ జనపట్టిక వివరాలతో పౌరసత్వానికి ప్రమాదం వస్తుందని ఊహించలేం. ఆ ప్రమాదాన్ని చాలా జాగ్రత్తగా రూల్స్ రూపంలో ప్రవేశపెట్టారు. ఈ లంకె 2003లోనే పెట్టారు. జనపట్టిక వివరాలు సరిచూసి, దాని ప్రాతిపదికగా పౌరపట్టిక తయారవుతుందని చాలా స్పష్టంగా రూల్స్‌లో ప్రకటించి, అదేమీ లేదని, ప్రచారం చేస్తున్నారు. నిజానికి జనపట్టికలో వచ్చిన వివరాలను సరిపోల్చినపుడు అనుమానం వస్తే పౌరుడిని సందేహాస్పద పౌరుడుగా వేరు చేసి రిజిస్టర్ చేయకుండా ఆపే అధికారం కిందిస్థాయి వరకు ఇచ్చారు. అనుమానిత పౌరుడు జిల్లా మేజిస్ట్రేట్ ముందు అప్పీలు చేసుకోవాలి. అతను కూడా కింది అధికారుల నిర్ణయాన్ని ఆమోదిస్తే ఆ పౌరుడి గతి అధోగతే. ఇక్కడ కేంద్రం ఇంకో వల పన్నింది. అదేమంటే పౌరసత్వం చట్టం కింద చేసిన నియమాలలో సందేహంతో ఆపివేసి, మిగతా పరిణామాల గురించి ఫారినర్స్ ఆర్డర్ కింద రూల్స్‌లో కొత్త చేర్పులు చేసింది. దాంతో సీఏఏకు, ఎన్ఆర్సీకి కొత్త లంకె వేశారు. మామూలుగా బయటపడని ఈ లంకెను ఫారినర్స్ చట్టం 1946లో చేశారు. దీనికింద 1964లో ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆర్డర్ రూపొందించారు. అనుమానించిన ప్రతి పౌరుడిపై విదేశీయుడుగా ముద్రపడే ప్రమాద స్థలం ఈ ట్రిబ్యునల్. దీని కారణంగా ఎన్నో దశాబ్దాలనుంచి దేశంలో ఉన్న పౌరులు మతంతో పనిలేకుండా వలసవచ్చిన వారితో సమానంగా, చొరబాటుదారులుగా లేదా శరణార్థులుగా భావింపబడే ప్రమాదానికి గురి అవుతారు. దేశంలో ఎంత మంది ప్రజల దగ్గర తాము పౌరులమని రుజువు చేసుకోగల పత్రాలు ఉన్నాయి? ఉన్నా తుఫాన్ లోనో మరో కారణం వల్లో కోల్పోతే వారి గతి ఏమిటి? వీరంతా విదేశీయులైపోతారు కదా? కనుక ఇది ముస్లింలు, సెక్యులరిస్టులు, వామపక్షాలు అనుకుంటున్నట్టు కేవలం ముస్లింల వేర్పాటు సమస్య కాదు. విదేశీ ముస్లింల సమస్య కూడా కాదు. ఇది ఈ దేశంలో పుట్టి ఈ దేశంలోనే దశాబ్దాల నుంచి ఉంటున్న ప్రతి వ్యక్తి ఎదుర్కోవలసిన గడ్డు సమస్య.} మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్madabhushi.sridhar@gmail.com -
పెద్దల చదువుల మర్మమేమి?
డాక్టర్ రమేష్ పోక్రియాల్ నిషాంక్ మన విద్యా శాఖ మంత్రి, కవి, సాహితీవేత్త. హిందీలో పేరెన్నికగన్న రచయిత. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా మోదీ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కొలంబోలో ఉన్న ఒక అంతర్జాతీయ ఓపెన్ యూనివర్సిటీ ఆయనగారికి సాహిత్యంలో విశిష్టమైన సేవలందించారని ఒక డాక్టరేట్, అంతకుముందు శాస్త్రీయరంగంలో రచనలకు మరొక డాక్టరేట్ ఇచ్చింది. గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ ఒకటి, ఉత్తరాఖండ్ సంస్కృత విశ్వవిద్యాలయం మరొక గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. అయితే విచిత్రమేమంటే శ్రీలంకలో అంతర్జాతీయ ఓపెన్ యూనివర్సిటీకి అసలు యూనివర్సిటీగా గుర్తింపు లేదు. శ్రీలంకలోని యూజీసీ కూడా దాన్ని గుర్తించలేదు. ఇతరదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకు యూజీసీ గుర్తింపు లేకపోతే మన యూజీసీ కూడా అంగీకరించదు. వారిచ్చే డిగ్రీలకు విలువ ఇవ్వదు. అంతేకాదు. మన దేశంలో సిఎస్ఐఆర్ (సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ సెంటర్) 1998లో దేశంలోని అన్ని జాతీయ ప్రయోగశాలలకు ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ శ్రీలంక విశ్వవిద్యాలయం ఇచ్చే డిఎస్సీ డిగ్రీలను గానీ, మరే ఇతర డిగ్రీలను గానీ యూజీసీ గుర్తించలేదని, కనుక ఆ డిగ్రీలు చెల్లవని చాలా స్పష్టంగా పేర్కొంది. ఇటువంటి అద్భుతమైన సంస్థ ఇచ్చిన డిగ్రీలను వాడుకోవడం, పేరు ముందు డాక్టర్ అని తగిలించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోగా, ఇచ్చిన యూనివర్సిటీ వారు తాము భారతదేశంలో ఉన్న ఒక పెద్ద ముఖ్యమంత్రిగారికి గౌరవప్రదమైన డాక్టరేట్ డిగ్రీ ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడమే కాకుండా, తమ అత్యున్నత ప్రమాణాలకు దీన్ని కొలమానంగా చూపుతూ ఫోటోగ్రాఫులకు విపరీతంగా ప్రచారం ఇచ్చి, మరికొంత మంది అమాయకులను వలలోవేసుకుంటాయి. పోక్రియాల్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన పేరును డాక్టర్ రమేష్ పోక్రియాల్ అని చెప్పుకుంటూ ప్రమాణం చేశారు. డాక్టర్ రమేష్ గారి ప్రత్యర్థి అయిన మనోజ్ వర్మ డాక్టర్ అనే బిరుదును వాడుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, కనుక ఆయన మంత్రి పదవి ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి విన్నవించుకున్నారు. ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణ పత్రంలో తాను డాక్టర్‌నని చెప్పుకోవడం చెల్లదని, అందువల్ల ఆయన ఎన్నిక కూడా చెల్లదని మనోజ్ వర్మ వాదించారు. ఈ మనోజ్ వర్మ కాంగ్రెస్ నాయకుడు కాదు. కమ్యూనిస్టు అంతకన్నా కాదు. స్వయంగా ఆయన కూడా బీజేపీ నాయకుడే. ఒక ఎన్నికను రాష్ట్రపతి ఈ విధంగా రద్దు చేయడానికి ప్రకటనలు చేసే అధికా రం ఉండకపోవచ్చు. డాక్టర్ పోక్రియాల్కి ఇచ్చిన బీఏ ఎంఏ డిగ్రీలు కూడా అనుమానించతగినవే అని వాదిస్తూ రాజేశ్ మధుకాంత్ అనే పౌరుడు ఒకాయన, ఆ డిగ్రీలు, ఎప్పుడు ఇచ్చారో, ఇచ్చిన విశ్వవిద్యాలయాల ప్రమాణాలేమిటో తెలపాలని ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నారు. విశ్వవిద్యాలయం వారు ఇవ్వను పొమ్మన్నారు. మొదట జనసూచన అధికారి, ఆ తరువాత మొదటి అప్పీలు అధికారి కూడా సమాచారం ఇవ్వలేదు. విధిలేక కేంద్ర సమాచార కమిషన్ ముందుకు రెండో అప్పీల్‌కు వెళ్లవలసి వచ్చింది. విశ్వవిద్యాలయం వారు ఈ డిగ్రీల సమాచారం మూడో వ్యక్తి సమాచారం అవుతుందని కనుక దాన్ని ఇవ్వజాలమని వివరించారు. సమాచార కమిషన్ ముందుకూడా ఇది థర్డ్ పార్టీ సమాచారమని వాదించారు. సమాచార హక్కు చట్టం కింద మూడో వ్యక్తి సమాచారం అడగడానికి వీల్లేదని కొందరు వాదిస్తుంటారు. కాని చట్టంలో చెప్పేదేమంటే ఒకవేళ జనసమాచార అధికారి ఆ సమాచారం మూడో వ్యక్తి ఇచ్చినదైతే ఆ మూడో వ్యక్తిని సంప్రదించి మీరు ఇచ్చిన సమాచారం పత్రాలు కావాలని అడుగుతున్నారని దీనిపై మీ అభిప్రాయం ఏమి టని అడగవలసి ఉంటుంది. సెక్షన్ 11(1) కింద మూడో వ్యక్తిని సంప్రదించి ఆయన వద్దన్నప్పటికీ, ప్రజాశ్రేయస్సుకోసం అవసరం అనుకుంటే సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. సామాన్యుల డిగ్రీ వివరాలు అడిగిన వారికల్లా ఇచ్చే విశ్వవిద్యాలయాలు, రాజకీయ నాయకుల డిగ్రీ వివరాలు మాత్రం దాచిపెట్టడానికి ప్రయత్నిస్తాయి. దీంతో ఈ పెద్దల చదువులు నిజమైనవి కాదేమో అని అనుమానం వస్తుంది. ఏమంటారు డాక్టర్ పోక్రియాల్ గారూ? వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
పాత్రికేయులు పనికిరారా?
పత్రికా స్వేచ్ఛ అపరిమితమైందేమీ కాదు. పాత్రికేయవృత్తి ప్రమాణాలను రక్షించడానికి, మర్యాదలు కాపాడడానికి నీతి నియమావళులు ఉండాలి. పత్రికా స్వేచ్ఛను విచ్చలవిడిగా వాడుకోకూడదన్నట్టే, ప్రభుత్వాధికారులు తమ విపరీతమైన అధికారాలను కూడా విచ్చలవిడిగా వాడుకోకూడదు. మన సంవిధానమే కాదు ప్రజాస్వామ్య సంవిధానమేదైనా పాలకుల విపరీత అధికారాలను కట్టడి చేయడానికే. ప్రభువులకు అధికారాలు మత్తు కలిగిస్తాయి. ప్రజలు పన్నుల రూపంలో ఇచ్చిన కోట్లాది రూపాయలపైన పెత్తనం మొదటి మత్తు. సైనికదళాలమీద అదుపు మరొక మత్తు. జనం మెదళ్ల మీద పెంపుడు మీడియాను ప్రయోగించే బ్లాక్ మెయిల్ పాలన ఇంకొక మత్తు. జాతి భద్రత, సమైక్యత అనే అందమైన జంటపదాల చాటున అధికార దాహంతో కరాళ నృత్యం చేస్తుంటారు. స్వతంత్రమైన మాధ్యమాలు ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి. ఆ స్వతంత్రులు ఈ దుర్మార్గుల దాడులకు బలికాకుండా కాపాడుకోవడానికి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అది ప్రెస్ కౌన్సిల్. ఇది పాత్రికేయుల వృత్తి రక్షణ సంస్థగా పనిచేయాలనే లక్ష్యం నిర్దేశిస్తూ చట్టం చేశారు. ప్రభుత్వం ఒక్కోసారి అన్ని మాధ్యమాల మీద విరుచుకుపడినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ప్రజలకోసం, పత్రికల స్వేచ్ఛ కోసం నిలబడవలసి ఉంటుంది. నీతినియమావళి ద్వారా పాత్రికేయులను కొంతవరకు, మందలింపుల ద్వారా అధికారులను కొంతమేరకు పగ్గాలు వేసి ఆపవచ్చు. అదే ప్రెస్ కౌన్సిల్ బాధ్యత. జమ్మూకశ్మీర్‌లో వాక్ స్వాతంత్య్రం పైన ఆగస్టు నెల మొదటి నుంచి ప్రతిబంధకాలు మొదలైనాయి. ఇంటర్నెట్, ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదు. పత్రికా కార్యాలయాలకు, కలాలకు, నోళ్లకు, మెద ళ్లకు కూడా తాళాలు వేశారు. ఎంత మహానాయకుడైనా సరే కశ్మీర్లో అడుగుపెట్టాలంటే సుప్రీం కోర్టు అనుమతి తీసుకునే పరిస్థితి ఉంది. ఇదేమి అరాచకం అన్నవాడు పాకిస్తాన్ స్నేహితుడో లేదా ఇమ్రాన్ ఖాన్ అల్లుడో అవుతాడు. ‘కనీసం మా పత్రికా కార్యాలయాలనైనా తెరవనివ్వండి. ఏం జరుగుతున్నదో రిపోర్ట్ చేయనీయండి. అక్షరాల వెలుగులపైన ఈ కటిక చీకటి ఆంక్షలు ఇంకెన్నాళ్లో చెప్పండి. కొంచెమన్నా సడలించడానికి వీలుంటుందేమో ఆలోచించి కేంద్ర ప్రభుత్వానికి తగిన రిట్లు జారీ చేయండి’ అని ఒక పత్రికా సంపాదకురాలు సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు ముందున్న అనేకానేక అత్యంత ప్రధానమైన వివాదాల మూటలు విప్పి, ఈ వివాదం వినాలో లేదో నిర్ణయించుకునే సర్వస్వతంత్ర వ్యవస్థ మన న్యాయవ్యవస్థ. తీరిక ఉన్నపుడు ఈ వివాదాన్ని కూడా పరిశీలిస్తుందనే ఆశాభావంతో బతకడం మనమే నేర్చుకోవాలి. ఇక్కడ ప్రమాదకరమైన కొత్త విచిత్రమేమంటే, ప్రెస్ కౌన్సిల్ సంస్థాగతంగా పాత్రికేయు రాలి అభ్యర్థనను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకోవడం. ప్రెస్ కౌన్సిల్ చట్టం ప్రకారం పత్రికా స్వాతంత్య్రం పైన పరిమితుల సమంజసత్వాన్ని పరిశీలించి, పునఃసమీక్షించి, అన్యాయమైన పరిమితులను సడలించాలని, న్యాయమైన పరిమితులు పాటించాలి. కానీ ఈ ఆంక్షలను రక్షించడానికే ప్రెస్ కౌన్సిల్ పూనుకోవడం ఆశ్చర్యకరమైన పరిణామం. ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నది స్వయానా ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షమహాశయుడైన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగారే. కనీసం వారు ప్రెస్ కౌన్సిల్లో ఈ విషయం చర్చించలేదని, ఎవరినీ సంప్రదించలేదని అంటున్నారు. తనకు తానే ప్రెస్ కౌన్సిల్‌ను హోం మంత్రిత్వశాఖ అనుబంధ సంస్థగా మార్చి కలాలకు అండగా కాకుండా తుపాకులకు అండగా పత్రికా కార్యాలయాల తాళాలకు అనుకూలంగా భజన తాళం వేయాలనుకోవడం మన వ్యవస్థల పతనానికి తాజా ఉదాహరణ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన నిపుణుడూ గౌరవనీయమైన పెద్దమనిషే ఈ విధంగా చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే, ఇక రాజ్యాంగానికి దిక్కెవరు? కలాలకు మొక్కెవరు? అసలు ప్రెస్ కౌన్సిల్‌కు అధ్యక్షత వహించడానికి జర్నలిస్టులకు అర్హత లేకపోవడమేమిటనే మౌలికమైన ప్రశ్న ఉదయిస్తున్నది. మెడికల్ కౌన్సిల్‌కు డాక్టర్లు, బార్ కౌన్సిల్‌కు లాయర్లు అధ్యక్షులుగా ఉంటారు. కానీ మరొక వృత్తిపరమైన ప్రమాణ రక్షణ సంస్థకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగారు ఎందుకు అధ్యక్షు డుగా ఉండాలి? పాత్రికేయులలో సమర్థులు, పరి పక్వత కలిగినవారులేరా? ఈ ప్రశ్నలు జర్నలిస్టులు వేయకపోవడం బాధాకరమైన దుష్పరిణామం. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
భూ రికార్డులను సంస్కరించాలి
హైదరాబాద్: భూ సంస్కరణలు ఆహ్వానించదగ్గ పరిణామమే అయినా ముందుగా భూ రికార్డులను సంస్కరించకుండా సాధ్యమయ్యే పనికాదని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. సోమవారం బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో ‘రెవెన్యూ పాలనలో సంస్కరణలు, భూ రికార్డులు, హక్కులు’ అంశంపై నిర్వహించిన ఒక్క రోజు జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రోజురోజుకూ భూమి విలువ పెరుగుతుండటంతో వివాదాలు పెరుగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో ఇప్పటికే 3 కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే అందులో 66 శాతం కేసులు భూ వివాదాలకు సంబంధించినవేనన్నారు. ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూములను అమ్ముతూ రూ.వేల కోట్లు అర్జిస్తున్నాయని వీటికి సరైన ఆడిట్ లేదని వ్యాఖ్యానించారు. రెవెన్యూ యంత్రాంగానికి అనేక విధులు అప్పగించి అవినీతి చేయడానికి ఆస్కారం కల్పించారని.. ఇప్పుడు అదే రెవెన్యూ విభాగాన్ని తప్పుపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ సదస్సులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, కేసీఆర్ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జ్వాలా నరసింహారావు, వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.సీతారామారావు తదితరులు పాల్గొన్నారు. -
నలిగిపోతున్న న్యాయదేవత
తీవ్రమైన ఆరోపణల మధ్య ప్రధాన న్యాయమూర్తి కూరుకుపోవడంతో న్యాయపాలనలో సమన్యాయం ప్రమాదంలో పడింది. 64 ఏళ్ల వయసు దాటి ఏడు నెలల్లో పదవీ విరమణ చేస్తున్న న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆయన నివాసంలో పనిచేసిన కోర్టు ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం, రాబోయే వారంలో కీలకమైన అంశాలపై విచారణ చేపట్టనున్న తనను ఈ ఆరోపణల ద్వారా నిశ్చేష్టుడిని చేయాలని పెద్ద కుట్ర నడుస్తోందని గొగోయ్ తీవ్రంగా ఆరోపించడంతో గందరగోళం ఏర్పడింది. మహోన్నత రాజ్యాంగ స్థానంలో ఉన్న వ్యక్తి మీద ఇది వ్యక్తిగతమైన ఆరోపణ. ఇది న్యాయవ్యవస్థమీద ఆరోపణ ఎలా అవుతుంది? ఆమె ఫిర్యా దులో కొన్ని అంశాలు: ఆ వనిత ఆయన నివాసంలో రాత్రి దాకా పనిచేయడానికి నియమించబడిన కోర్టు ఉద్యోగిని. ఈ సంఘటనలు జరగడానికి ముందు ఆమె ప్రతిభావంతురాలు సమర్థురాలు. ప్రధాన న్యాయమూర్తికి కేసులు, పుస్తకాలు వెతికి ఇవ్వతగినంత తెలివితేటలున్నాయని ప్రశంసలు పొందిన మహిళ. ఈ సంఘటనల తరువాత ఆమె అంకిత భావంతో పనిచేయడం లేదని తొలగించి వేశారు. అంతకు ముందు ఆమె మరిదికి న్యాయవ్యవస్థలో ఉద్యోగం అడ్డదారిలో కల్పించారు. ఆ తరువాత ఆమె భర్త ఉద్యోగం పీకేశారు. కుటుంబమే కష్టాల్లో పడింది. ఉన్నతాధికారాన్ని దుర్వినియోగం చేసి వేధించడం వల్ల తన ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడిందనీ కనుక ఈ ఫిర్యాదు చేయక తప్పడంలేదని ఆమె పేర్కొన్నారు. ఒకవైపు చిరుద్యోగం కోల్పోయిన నిరుద్యోగ బాధితురాలు. మరోవైపు దేశపాలనా వ్యవస్థ న్యాయాన్యాయాలను శాసించే అత్యున్నతమైన రాజ్యాంగశక్తి. భారత ప్రధాన న్యాయమూర్తే ఆరోపణకు గురైనపుడు బలహీనురాలైన బాధితురాలికి బలమెవ్వరిస్తారు? ఇదీ ప్రశ్న. ప్రసిద్ధ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ ప్రశ్నవేస్తూ సుప్రీంకోర్టులో రోజూ పోరాడుతున్నారు. పంజాబ్ డీజీపీ కేపీఎస్ గిల్ మీద ఇటువంటి ఆరోపణ చేసిన మహిళ ఉన్నత పదవిలోఉన్న ఐఏఎస్ అధికారిణి. కింది కోర్టులో నేరం రుజువైంది. హైకోర్టులో ధృవీకరించారు. సుప్రీంకోర్టులోనూ కొన్ని సంవత్సరాల తరువాతైనా ఆమె నిలిచింది. గెలిచింది. కానీ ఇక్కడ సమస్య ఏమంటే ప్రధానన్యాయమూర్తి మీద ఆరోపణ. ఎఫ్ఐఆర్ కూడా వేయడానికి వీల్లేదు. పోలీసులు కాదు సీబీఐ కాదు సీఐడీ కాదు, కనీసం ఓ ముగ్గురు సభ్యుల కమిటీ అయినా విచారణ జరపడానికి వీల్లేదు. వీల్లేదంటే రాజ్యాంగం ఒప్పుకోదు. ప్రధాన న్యాయమూర్తి మీద దుష్ప్రవర్తన ఆరోపణను విచారించాలంటే వంద మంది లోక్‌సభ సభ్యులు లేదా యాభైమంది రాజ్యసభ సభ్యులు ఆయనను తొలగించాలంటూ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతూ నోటీసు ఇవ్వాలి. నోటీసును పార్లమెంటులో మెజా రిటీ సభ్యులు అనుమతిస్తేనే లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్పర్సన్ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించడానికి∙వీలవుతుంది. ఆ కమిటీ మాత్రమే విచారణ జరపాలి. ఎన్నికల్లో తలమునకలుగా ఉన్న పార్టీలకు ఈ విషయం పట్టించుకునే తీరికెక్కడిది? అందాకా ఏం చేయాలి? రాజ్యాంగంలో ఈ విషయంలో ఏ నియమమూ లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం ఈ తొలగింపు నియమాలను చేర్చలేదు. లేకపోతే నియంతలైన ప్రధానులు న్యాయమూర్తులను నిమిషాల్లో తొలగించి తమ అనుయాయులను నియమించుకుని యథేచ్ఛగా నేరాలు చేసే వీలుంటుంది. ఈ ఆరోపణలను నాలుగు డిజిటల్ మాధ్యమాలు మాత్రమే ప్రచురించాయి. ఆర్థికమంత్రిగారు వారిని తిట్టిపోస్తున్నారు. రంజన్ గొగోయ్‌కి బాసటగా తామున్నామని ప్రకటించారు. భారత న్యాయవాదుల మండలి కూడా ఆమె ఆరోపణలను అబద్ధాలని తీర్మానించి గొగోయ్ పక్కనున్నామని ప్రకటించింది. ఇదా న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే. ఇటువంటి మాటలు రాజకీయ నాయకులు చెప్పి బలీయుడైన నిందితుడిని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వ్యూహాన్ని సీనియర్ న్యాయ వాది అయిన ఆర్థిక మంత్రి ప్రయోగించడం, మొత్తం న్యాయవాదుల మండలి సమన్యాయాన్ని గాలికి వదిలేసి ఆరోపణలు చెల్లవని తీర్పు చెప్పడం న్యాయవిచారణలో జోక్యం చేసుకోవడం కాదా?. ఒకవైపు ముగ్గురు న్యాయమూర్తులతో లైంగిక వేధింపుల విచారణ చేయిస్తూ మరో ముగ్గురు సభ్యుల ధర్మాసనంతో కుట్ర ఆరోపణల విచారణ జరిపిస్తూ ఉంటే ఆర్థిక మంత్రి, న్యాయమండలి చైర్మన్ ఈ రెండు విచారణలను పక్కన బెట్టి వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కార నేరం కాదూ? వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com విశ్లేషణమాడభూషి శ్రీధర్ -
పోటీచేసేది నేరగాళ్లా? అక్రమార్జనపరులా?
ఎన్నికల రణరంగం మళ్లీ ఆరంభం. పోటీ చేయదలచుకున్న అభ్యర్థులందరూ తమ వివరాలు ప్రమాణ పత్రాల రూపంలో ఇవ్వక తప్పని నిజ ప్రకటనలు మొదలవుతాయి. మన ఓట్లడుక్కునే అభ్యర్థులు ఎవరో ఏమిటో వారి నేపథ్యం సరైందో కాదో తెలియకుండానే ఓటు వేయడం మంచిదా? నేరగాళ్లను పోటీ చేయకుండా ఆపే చట్టాలు మన ప్రజాస్వామ్య దేశంలో లేవు. కనీసం వారి వివరాలైనా తెలియడం మంచిదని ఒక సామాన్యుడు సాగించిన పోరాటం విజయం సాధించడం వల్లనే మనకీ హక్కు లభించింది. అహ్మదాబాద్ ఐఐఎం ఆచార్యుడు త్రిలోచన్ శాస్త్రి కొందరు మిత్రులతో కలిసి అసోసియేషన్ ఫర్ డెమొక్రసీ ఏడీఆర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎన్నికల సంస్కరణల రంగంలో కృషి చేస్తున్నారు. నేరగాళ్లను చట్టసభలకు పోటీ చేయకుండా నిరోధించకపోయినా ఫరవాలేదు కాని వారి వివరాలు వారంతట వారే తెలియజెప్పాలని ఎందుకు నియమాలు చేయరు అని ఆయన కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా అడిగారు. లా కమిషన్ కూడా ఆ మేరకు చేసిన సిఫార్సులను కోర్టు ముందుంచారు. అభ్యర్థి సమర్థుడా కాదా, అతనికి శక్తి ఉందా అని పరిశీలించేందుకు ఓటర్లకు ఆ సమాచారం అవసరమని వాదించారు. ఆశ్చర్యమేమంటే దేశంలోని ప్రతిరాజకీయ పార్టీ ఈ వాదనను ప్రతిపాదనను వ్యతిరేకించింది. కానీ అడిగిన ప్రశ్న కోర్టుకు సమంజసంగా తోచింది. భారత ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలన్నిటికీ నోటీసులు ఇచ్చింది. వారంతా కోర్టు ముందుకు వచ్చి మా అభ్యర్థులెవరూ తాముచేసిన నేరాల చిట్టా ఇవ్వరు. తమ సంపాదన సమాచారం ఇవ్వరు. ఆ సమాచారం కోరే అధికారం ఓటర్లకు లేదని వాదించారు. వివాదాస్పదమైన అంశంపైన ఏ చట్టాలూ లేకపోతే స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు నిర్వహించవలసిన బాధ్యత కలిగిన ఎన్నికల కమిషన్ ఆ ఖాళీని పూరించి తగిన చర్యలు తీసుకునే అధికారం ఉంటుం దని కోర్టు నిర్ధారించింది. ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు తగిన అధికారాలన్నీ కమిషన్‌కు ఉన్నాయి. కనుక పోటీ చేసే అభ్యర్థి తన వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ నియమాలు జారీ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఓటు వేయడం అంటే తన అభిప్రాయం ప్రకారం పాలించే అర్హత ఎవరికి ఉందో నిర్ణయించే అధికారం. ఆ అధికారం ఇచ్చే ముందు వారిగురించి తెలుసుకునే అధికారం హక్కు పౌరులకు ఉంది. ఇదికూడా ఆర్టికిల్ 19(1) (ఎ)లో అంతర్భాగమే అని న్యాయస్థానం మే 2, 2002న తేల్చింది. ఈ తీర్పులోనే ప్రజలకు తెలుసుకునే హక్కు సమాచార హక్కు ఉందని సుప్రీంకోర్టు నిర్ద్వంద్వంగా నిర్ధారించింది. పోటీ చేసే అభ్యర్థుల సమాచారం విషయంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. సమాచారం లేని పౌరుల వల్ల ప్రజాస్వామ్యం పరిహాసాస్పదం అవుతుందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యానికి ఒక విజయాన్ని అందించింది. కాని ప్రభుత్వం, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ విజయాన్ని నీరుగార్చాయి. మంచి నాయకుడు, రాజకీయ తత్వవేత్తగా పేరున్న వాజ్‌పేయి నాయకత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు బీజేపీకి పూర్తి ఆధిక్యత లేదు. మైనారిటీలో ఉంది. కనుక ఇతర మిత్రపార్టీల పైన ఆధారపడి జీవిస్తున్నది. కానీ మిత్ర ప్రతిపక్ష పార్టీలన్నీ సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాయి. దీంతో కేంద్రం ఈ తీర్పును వమ్ముచేస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించింది. రెండేళ్లు లేదా అంతకన్న ఎక్కువ జైలు శిక్ష విధించతగిన నేరాలలో శిక్ష పొందారో లేదో అభ్యర్థులు చెప్పాలని మాత్రం (సెక్షన్ 33ఎ) నియమం రూపొందిం చారు. సుప్రీంకోర్టు తీర్పులో ఏమి చెప్పినప్పటికీ అభ్యర్థులెవరూ అదనపు సమాచారం ఏదీ ఇవ్వనవసరం లేదని 33 బి నియమాన్ని చేర్చారు. మళ్లీ ఏడీఆఆర్ పీయూసీఎల్ సుప్రీంకోర్టుకు వెళ్లాయి ఏడీఆర్ పీయూసీఎల్ పక్షాన మన తెలుగుతేజం పద్మభూషణ్ పవని పరమేశ్వరరావు (పీపీ రావుగా సుప్రసిద్ధులు) రాజిందర్ సచార్‌తో కలిసి వాదించి గెలి చారు. జస్టిస్ బి వెంకట్రాం రెడ్డి న్యాయమూర్తులు ఎంబిషా, డీఎం ధర్మాధికారి, ధర్మాసనం నుంచి అత్యంత ప్రథానమైన ఈ సమాచార హక్కును ఓట ర్లకు ప్రసాదించారు. ప్రతిపోలింగ్ బూత్‌లో ఓటరు ఓటు వేయడానికి వెళ్లేముందు ఈ అఫిడవిట్ల ప్రతులు పెద్ద సైజు అక్షరాలలో ముద్రించి ఓటరు పరిశీలనకు అందుబాటులో ఉంచాలి. చదువు ఉంటే ఫరవాలేదు కాని నేర చరిత్రను బట్టి అభ్యర్థి సంపాదన తీరును బట్టి అతను అక్రమమార్గాలు అనుసరించిన వాడో కాదో తెలుసుకోవచ్చు. నిజాలు అవగాహన చేసుకుని నా ఓటు పొందడానికి అర్హుడేనా అని ఆలోచించి, ఆ తరువాతే ఓ నిర్ణయానికి రావాలి. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
జనం సమస్యలకు ప్రచారమేదీ?
లోక్‌సభ ఎన్నికల శంఖారావం మోగిందో లేదో, డబ్బు సంచుల రవాణా మొదలైంది. ఎన్నికలు ఏడు చరణాల్లో జరుగుతాయి. ఒక మిత్రుడు ఎన్నికల తత్వబోధ: ‘‘పోలింగ్‌కు ముందు నేతలు జనం చరణాల చెంత చేరతారు. తరువాత అయిదేళ్ల దాకా జనం నేతల చరణాల పొంతన పడి ఉండాల్సి ఉంటుంది’’. జూన్ 3 లోగా 17వ లోక్‌సభను నిర్మించే రాజ్యాంగ బాధ్యత. విస్తృతమైన ఏర్పాట్ల విశేష ఘట్టం ఇది. డిల్లీలో రంజాన్, (మే 12) నాడే పోలింగ్ నిర్ధారించారు. సప్తచరణాల్లో ఎన్నికలు మాపై కుట్ర అని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి విమర్శిస్తే ఏప్రిల్ 11నాడే రాష్ట్రమంతా పోలింగ్ నిర్ణయించి నాకు అతి తక్కువ సమయం ఇచ్చారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయిదుస్థానాల్లో లోక్‌సభ ఎన్నికలకు అడ్డురాని భద్రతా సమస్యలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రశాసనసభ ఎన్నికలను నిరోధిస్తాయా అని నేషనల్ కాన్ఫ రెన్స్ íపీడీపీ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఈ రాష్ట్రంలో విడివిడిగా జరిగితేనే మంచిది, విడివిడిగా వ్యూహాలు రచించుకోవచ్చు తీరిగ్గా ఉంటుందని కొందరు అనుకుంటున్నారు. దానికి ఉదాహరణ తెలంగాణే, నవంబర్లోనే ఎన్నికలు జరిపించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి మళ్లీ అధికారం చేబట్టి ఇప్పుడు దాదాపు అన్ని లోకసభ స్థానాలను గెలుచుకోవడానికి తీరిగ్గా వ్యూహాలు పన్నుతున్నది. ఇటు దిగువ దక్షిణ దేశాన కేరళలో శబరిమలై ఉత్తరాన యూపీలో అయోధ్య రాముడు ఇప్పుడు ఎన్నికల కథానాయకులు. మధ్యలో మసూద్ అజర్ ప్రతినాయకుడు. ఇవి రాజకీయ, న్యాయ, మత, సంక్లిష్టసమస్యలు. సోమవారం నుంచి తెరిచే అయ్యప్ప ఆలయం 45 రోజుల పాటు భక్త జనసందోహమవుతుంది. ఎన్నికల అవసరాలను బట్టి ఇక్కడ అగ్గి రాజేసుకోవడానికి పార్టీలు పెట్రోలు తెచ్చుకుంటున్నాయి. కేంద్రంలో మోదీ సర్కార్ ఫిబ్రవరి నెలలోనే ‘ఎంతో ఆకర్షణీయమైన’ బడ్జెట్ తెచ్చినా సుబ్రమణ్యంస్వామి చెప్పిందేమంటే ‘మేము ఈ ఆర్థిక కార్యక్రమాలతో ఎన్నికలు గెలవం. ఈ పథకాలతో మాకు పనిలేదు. రామమందిరం దిశగా అడుగులు వేస్తాం. మోదీ మరోసారి ప్రధాని అవుతారు’అని. ‘ఈ జనానికి తిండి లేకపోయినా ఫరవాలేదు. మతం మత్తు జల్లితే చాలు మాకే ఓట్లేస్తారన్న’దే ఆయన ధీమా. అయ్యప్ప కేరళలో, రామయ్య అయోధ్యలో ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తారని కొందరంటే, మరికొందరు ఆలోచనాపరులు ‘‘భారత్ పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో విజృంభించే ఉద్రిక్తతలు మాకు చాలు ఓట్లు వచ్చిరాలడానికి’’ అంటున్నారు. రాహుల్ గాంధీ అజర్‌ను జీ అని సంబోధించాడని పెద్ద అల్లరి చేస్తున్నారు. బీజేపీ ప్రతినిధి కూడా జీ అని ఆ రాక్షసుడిని సంబోధించిన వీడియో ముందుకు తెచ్చారు. టెర్రరిజంతో అల్లకల్లోలం సృష్టించిన జైషే మహ్మద్ సంస్థ ముఖ్యుడు మసూద్ అజర్‌కు నిన్న కొండంత అండగా చైనా నిలబడింది. ఫ్రాన్స్, అమెరికా, ఇంగ్లండ్లను మన వాదానికి అనుకూలంగా మార్చగలిగామే కాని పొరుగున ఉన్న చైనాను పాకిస్తాన్‌కు అండగా నిలబడకుండా ఆపలేకపోయాం. పాకిస్తాన్ మాటలకు లొంగుతుందా? మసూద్ అజర్ కార్యక్రమాలను నిలిపివేసే చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు గట్టిగా చెప్పగలిగినా చైనా ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నది? ఈసారైనా భారత్ వాదాన్ని అర్థం చేసుకుని ఉంటే ఎన్నికల వేళ అది భాజపా ప్రభుత్వానికి అద్భుతమైన విజయావకాశంగా మారిపోయి ఉండేదే కదా అరెరే అని బాధపడే వారూ ఉన్నారు. పాకిస్తాన్ సేనానుల అండతో ప్రధానమంత్రుల సహకారంతో తీవ్రహింసాత్మక ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రార్థనాస్థలాల్లో హత్యాప్రబోధాలు చేస్తూ ఇంకా బుద్దిరాని కౌమారవయస్కుల మెదళ్లలో మత విషం చిమ్మి, హింసపిచ్చి రగిలించి ఆత్మాహుతి దళాలుగా మార్చి, పుల్వామా వంటి దాడులు చేసి చచ్చేందుకు సిద్ధపడేట్టు చేస్తున్న మసూద్ అజర్ వంటి దుర్మార్గులను చైనా రక్షించడం దారుణం. వాడవాడల్లో చైనా వస్తువులను కొని మనవాళ్లు చైనా ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తూ ఉంటే పాకిస్తాన్ భూభాగం నుంచి మనదేశంలో చిచ్చుపెట్టే రాక్షసుడికి చైనా చేయూతనివ్వడం అత్యంత ఘోరం. చైనాను మనం దౌత్య, ఆర్థిక లావాదేవీల ద్వారా మనవైపు మళ్లించలేకపోవడం మన అత్యంత దారుణ ఘోర వైఫల్యం. కాందహార్‌లో మన విమానం హైజాక్ చేస్తే టెర్రరిస్టులకు లొంగిపోయి, మసూద్ అజర్‌ను క్షేమంగా అఫ్గానిస్తాన్‌లో దిగబెట్టి వచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే అని కాంగ్రెస్ విమర్శిస్తున్నది. ఇప్పుడివన్నీ ఎన్నికల ముఖ్యాంశాలా? నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, జనంలో ద్వేషజ్వాలలు, అవినీతి వ్యతిరేక చట్టాలను నీరుగార్చడం ఇవన్నీ సమస్యలు కావా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
రఫేల్ ‘దొంగ’ రహస్యం!
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు సంగతులు దర్యాప్తు చేయాలా, వద్దా అనే అంశంలో సుప్రీంకోర్టు కీలకమైన విచారణ మళ్లీ జరపవలసి వచ్చింది. రఫేల్ డీల్ అమలు, విమానాల కొనుగోలు, ధరల విషయంలో ఏ మార్పు లేకుండా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తొలుత భావించింది. కానీ ఆ నిర్ణయానికి రావడానికి ఆధారమైన పత్రాలలో అనుమానాలు ఉండడం వల్ల సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తీవ్రవాదనలు ప్రతి వాదనలువిన్నారు. పునఃసమీక్షా పిటిషన్ కొట్టి వేయాలని అటార్నీ జనరల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రార్థించింది. హిందూ తదితర పత్రికల్లో వచ్చిన కీలక పత్రాలను పిటిషనర్లు ఉటంకిస్తూ ఈ కేసును తిరగతోడవలసిందేనని కోరారు. భారత అటార్నీ జనరల్ కె.కె. వేణుగోపాల్ చేసిన వాదనల ప్రభావం ఏవిధంగా ఉంటుందో అనే చర్చ సాగుతున్నది. రెండు పత్రికలలో ప్రచురించిన పత్రాలను ఆధారం చేసుకుని ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా వాదిస్తున్నారనీ, ఆ పత్రాలను ప్రస్తుత లేదా మాజీ పబ్లిక్ సర్వెంట్లు దొంగిలించి వారికి ఇచ్చి ఉంటారని, ఇవి రఫేల్ డీల్‌కు చెందిన రహస్య పత్రాలనీ ఏజీ వేణుగోపాల్ అన్నారు. ఈ రహస్యపత్రాలు దొంగిలించిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టుకు వివరించారు. అంటే హిందూ ఎడిటర్ ఎన్ రాం మీద, ప్రశాంత్ భూషణ్ మీద అధికార రహస్యాల చట్టం కింద క్రిమినల్ కేసులు ఉంటాయా? ముందు ఆ పత్రాలు దొంగిలించిన వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పినా ఆ తరువాత కాసేపటికి జర్నలిస్టుల మీద, లాయర్లమీద చర్యలు ఉండబోవని అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. అంటే రక్షణ శాఖ నుంచి బయటకి ఈ రహస్యాలు పొక్కడానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకుంటారేమో? ఏ దేశంలోనూ రక్షణ ఒప్పందాలమీద కోర్టుల్లో కేసులు వేయరని, కోర్టులు విచారించవని కూడా ఆయన అన్నారు. అయితే బోఫోర్స్ కేసుల సంగతేమిటని సుప్రీంకోర్టు అడిగింది. డిఫెన్స్ డీల్‌లో సంప్రదింపులు బేరసారాలు సాగిస్తున్న ఏడుగురు సభ్యుల బృందంలో ముగ్గురి అసమ్మతి పత్రం పత్రికలలో దర్శనమిచ్చింది. ఆ అసమ్మతి అవాస్తవమని ప్రభుత్వం వాదించడం లేదు. అది దొంగ పత్రం అనడం లేదు. అది దొంగి లించిన పత్రం కనుక ముట్టుకోవద్దంటున్నది ప్రభుత్వం. అవి దొంగ పత్రాలు కావనీ, అంటే అవి నిజాలనీ, ప్రమాదకరమైన నిజాలనీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అధికార రహస్యాలన్న పదమే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ప్రభుత్వం అధికారికంగా చేసిన అంశాలు రహస్యాలు ఎందుకవుతాయి? సమాచార హక్కు చట్టం వచ్చినపుడు అధికార రహస్యాల చట్టం పోయిందనుకుని ఎంపీ రాం జెఠ్మలానీ ఆ కఠిన చట్టం తీసివేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఈ చట్టాన్ని కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రభుత్వాలు, బీజేపీతో కూడిన ఎన్డీయే ప్రభుత్వాలు కూడా వాడుకుంటున్నాయి. సమాచార హక్కు చట్టంతో అధికార రహస్యాల చట్టం విభేదిస్తే ఆ మేరకు సమాచార హక్కు చట్టం అమలవుతుందే కానీ అధికార రహస్య చట్టం పనిచేయదని సమాచార హక్కు చట్టంలో చాలా స్పష్టంగా వివరించారు. జాతీయ భద్రత కోసం రహస్యాలు కాపాడవచ్చునని, జాతీయ భద్రతతో సంబంధం లేని భాగాలను సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడించాలని కూడా ఎన్నో సందర్భాలలో నిర్ధారిం చారు. ఒకే పత్రంలో భద్రతా రహస్యాలు, భద్రతకు సంబంధంలేని అంశాలు ఉంటే, రక్షించవలసిన అంశాలు తొలగించి, మిగిలిన సమాచారం ఇవ్వాలని కూడా చట్టంలో స్పష్టంగా ఉంది. రక్షణ రంగం సమాచార హక్కు చట్టం పరిధిలోనే ఉంది. రఫేల్ డీల్‌లో భారతదేశ భద్రతకు సంబంధిం చిన అంశాలేమయినా ఉంటే ప్రశాంత్ భూషణ్‌కు, అరుణ్ శౌరీకి, యశ్వంత్ సిన్హాకే కాదు ఎవరికీ ఇవ్వకూడదు. కానీ బేరసారాల విషయంలో వచ్చిన తేఢాలు, భిన్నాభిప్రాయాలు జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు అవుతాయా? పెంచిన ధరలు, చెల్లించిన డబ్బు కూడా రహస్యాలేనా? విపరీతంగా పెంచిన ధరలు, విమానాల సంఖ్యను 126 నుంచి 36కు తగ్గించడం వెనుక కారణాలు కూడా రహస్యాలేనా? బేరసారాల బృందంలోనే ముగ్గురి తీవ్ర అసమ్మతి కూడా రహస్యమేనా? నేరం జరిగిందని ఆరోపణ రాగానే సాక్ష్యాలేవీ అంటారు. సాక్ష్యం చూపగానే నీకెలా వచ్చిందంటారు. దొంగతనం చేశావంటారు. మా ప్రైవసీని భంగపరిచి సాక్ష్యాలను సేకరిస్తావా? ముందు నీవు జైలుకు వెళ్లు అంటారు. రహస్యాలు, ప్రైవసీ తెరల చాటున నేరాలు, లంచాలు వర్థిల్లడమేనా రాజ్యాంగ పాలన? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
ఈవీఎంల హ్యాకింగ్‌పై సాక్ష్యాల్లేని ఆరోపణలు
ఎన్నికలలో రిగ్గింగ్ చేయ డంవల్లనే కొన్నిపార్టీలకు సుడిగాలి విజయాలు సాధ్యమవుతున్నాయని ఏదో ఒక మూల అనుమానం చాలామందికి వస్తూనే ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) వచ్చిన తరువాత ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేకుండా పోతున్నారు. ఎంపీ సుబ్రమణ్యస్వామితో కలిసి హైదరాబాద్‌కు చెందిన వి.వి.రావు ఈవీఎం లోపాలపై ఉద్యమం నిర్మించే కార్యక్రమం చేపట్టారు. వీరి కృషి వల్లే వీవీప్యాట్ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) ప్రవేశ పెట్టారనీ అంటారు.ఎన్నికల మోసాలను పేపర్ ఆడిట్ ట్రయల్ ద్వారా అరికట్టవచ్చుననీ అంటున్నారు. కాగితం లేని ఈవీఎంల కన్నా పరీక్షించే ఆస్కారం ఉన్న వీవీప్యాట్ ఈవీఎంలు చాలావరకు నయం. ఇదివరకు ఓట్ల సంఖ్యలో తేడా వస్తే మళ్లీ ఓట్లను లెక్కించే వీలుండేది. కానీ సైబర్ డబ్బాలలో ‘స్టోర్డ్ ఓట్లు’ అంటే పడి ఉన్న ఓట్లను ఎన్నిసారు లెక్కించినా ప్రయోజనం లేదు. కనుక ఈవీఎంను సైబర్ మాయల పేటిక అని అనుకోవచ్చు. మీట నొక్కితే ఏం జరుగుతుందో ఎవరికీ కనిపించదు. వీవీప్యాట్ ఉంటే మామూలుగా ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించినట్టే వీటిని కూడా లెక్కించవచ్చు అన్నారు గానీ, ఇటీవలి తెలంగాణ ఎన్ని కల్లో మళ్లీ లెక్కించమని అడిగితే ఎన్నికల సంఘం కుదరదని చెప్పేసింది. ఎవరో కావాలని కుట్ర చేయకపోయినా, చెడిపోయినందుకు కూడా యంత్రం సరిగ్గా పనిచేయకపోవచ్చు. అందువల్ల కొందరు గెలవచ్చు మరికొందరు ఘోరంగా ఓడిపోనూవచ్చు. ఈ అనుమానాస్పదమైన వాతావరణంలో లండన్‌లో ఒకాయన తాను సయ్యద్ షుజా, సైబర్ నిపుణుడినని చెప్పుకుంటూ ఈవీఎంల లోగుట్టు విప్పి చూపిస్తానని సవాలు విసిరి జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ప్రత్యేకంగా లండన్ వెళ్లి విలేకరులకు వీడియో ప్రదర్శన నిర్వహించే వేదిక మీద కూర్చున్నారు. షుజా లండన్ రాలేదు. కాలిఫోర్నియా నుంచి వీడియో సమావేశంలో పాల్గొన్నాడు. సగం ముఖం దాచుకుని అంతగా వెలుగు లేని మసకమసక గదిలో కూచుని షుజా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ తన ప్రదర్శనలో విఫలమైనాడని పత్రికలు వెల్లడించాయి. షుజా ఆరోపణల తీవ్రత ఎంత గాఢంగా ఉందంటే దేన్ని నమ్మాలో తెలియక జనం గందరగోళంలో పడతారు. షుజా లేవనెత్తిన సంచలన భయానక ఆరోపణలు కొన్ని: 1. బీజేపీ ప్రభంజనం వీచిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగింది. 2. ఈవీఎం టాంపరింగ్ వల్ల కాంగ్రెస్ 201 సీట్లను కోల్పోయింది. 3. మోదీ కేబినెట్లో చేరిన గోపీనాథ్ ముండేకు 2014 రిగ్గింగ్ ఏ విధంగా జరిగిందో తెలుసు. అందుకే మంత్రి అయిన కొద్దిరోజులకే చని పోయాడు. ఈ రహస్యం తెలుసుకనుకనే ఆయన్ను చంపేశారు. 4. ముండే మరణ ఘటనపైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ప్రయత్నించినందుకే ఎన్ఐఏ ఆఫీసర్ తాంజిల్ అహ్మద్‌ను చంపేశారు. 5. కాంగ్రెస్ లీడర్ కపిల్ సిబల్ 2014 ఎన్నికలలో బీజేపీని గెలిపించేందుకు రిగ్గింగ్ చేయమని అడిగారు. 6. 2015 లో ఢిల్లీ ఎన్నికలలో ఈవీఎం రిగ్గింగ్‌ను షుజా అనుచరులు నిరోధించడం వల్లనే ఆప్ పార్టీ 70లో 67 స్థానాలను గెలిచింది. 7. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఛత్తీస్‌గఢ్ ఎన్నికలలో బీజేపీ రిగ్గింగ్ ప్రయత్నాలను షుజా నిరోధించడం వల్లనే ఆ రాష్ట్రాలలో బీజేపీ గెలవలేకపోయింది. 8. బీజేపీ ఈవీఎం హాక్ చేయడానికి రిలయన్స్ కమ్యూనికేషన్ వారు సహకరించారు. 9. గౌరీ లంకేశ్ ఈ రిగ్గింగ్ కథనాన్ని ప్రచురించడానికి సిద్ధపడ్డారు. ఈ విషయమై ఆర్టీఐ కూడా వేశారు. అందుకే హత్యకు గురయ్యారు. ఇందులో ఏ ఆరోపణలకు కూడా షుజా సాక్ష్యాలు చూపలేదు. షుజా మిగిలిన ఆరోపణలకు రుజువులు ఇచ్చినా ఇవ్వలేకపోయినా, కనీసం హాకింగ్ సాధ్యమని రుజువు చేస్తారనుకున్నారు. అక్కడా షుజా విఫలమైపోయారు. తాను పనిచేశానని ఆయన చెప్పుకున్న సంస్థలలో ఏ సంస్థా దాన్ని ధ్రువీకరించలేదు. ఎన్నికల సంఘం వెంటనే ఈ ఆరోపణలు ఖండించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించింది. ఎన్నికల సంఘం చేతులు కలపడం వల్లనే రిగ్గింగ్ సాధ్యమైందని ఆరోపణ చేసినందున వారు అధికారికంగా ఖండించడం సమంజసమే అనిపించినా, అసలు రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందా లేదా అని ప్రజలకు విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ ఆరోపణల్లో లవలేశమైనా నిజం ఉండొచ్చునని అనుమానించే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ఈవీఎం ద్వారా ఎన్నికల ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కలిగించే బాధ్యత ఎన్నికల సంఘం మీదే ఉంది. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ఓట్ల కోసం ‘కోటా’లో పాగా!
కోటా రాజకీయాల చరిత్రలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టిన రాజకీయ వేత్త పి.వి. నరసింహారావు. రిజర్వేషన్ల ఫలాలు అందుకొని బాగుపడిన పైతరగతిని కోటానుంచి తప్పించాలనే క్రీమీలేయర్ విధానం మొదటిది. అన్ని వర్గాల్లో (కులాలు మతాలతో సహా) పదిశాతం ఆర్థికంగా వెనుకబడిన వారికి కోటాను వర్తింపజేయడం రెండోది. కొన్ని వర్గాలు ప్రతిఘటించినా క్రీమీలేయర్ మార్పు నిలబడింది. రెండోదీ విలువైనదే అని ఈరోజు పరిణామాలు సూచిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం అన్ని సాంకేతిక లోపాల్ని సవరించి రాజ్యాంగాన్ని రెండురోజుల్లో మార్చేసింది. ప్రభుత్వ సర్వీసులలో (ప్రయివేటు సర్వీసులలో కాదు), అన్ని విద్యా సంస్థల (ప్రయివేటు సంస్థలతో సహా, మైనారిటీ కాకుండా) ప్రవేశాలలోఇదివరకు రిజర్వేషన్ పొందని వర్గాలలో పది శాతం ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇచ్చే వీలు కల్పిస్తూ భారత సంవిధానం ఆర్టికల్స్ 15, 16 లను సవరించే 124వ రాజ్యాంగ సవరణ జరిగిపోయింది. కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు ఇదేమిటో పూర్తిగా అర్థం చేసుకునే లోగానే సవరణ బిల్లు పాస్ అయిపోయి బైట పడింది. రిజర్వేషన్ వ్యతిరేకులు కూడా వ్యతిరేకించడానికి వీల్లేకుండా పాలసీని హఠాత్తుగా ప్రకటించారు. కులాధార రిజర్వేషన్లను ఇవ్వడానికి వీల్లే దని కూడా అనేక ధర్మాసనాలు వివరించాయి. ఫలానా కులంలో పుట్టిన వారు ఆర్థికంగా విద్యా సామాజిక పరంగా కూడా వెనుకబడి ఉంటే ఆ కులాన్ని వెనుకబడిన కులంగా పరిగణించడంలో తప్పులేదని, కులాన్ని అప్పుడు ఒక వర్గంగా గుర్తించవచ్చని న్యాయస్థానాలు వివరించాయి. ఓట్ల కోసం కోటాను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయనే విమర్శలు, నిందలు ఎన్ని ఉన్నా, సంవిధాన రూపకల్పనా సమయంలో షెడ్యూల్డు కులాలు, తెగలకు ప్రాతినిధ్యం కల్పించాలని ప్రతి పాదించిన వారికి అధికార కాంక్షతోకూడిన రాజకీయ స్వార్థాన్ని అంటకట్టడం న్యాయం కాదు. ఈ సందర్భంలో మిత్రుడు అరుణ్ పెండ్యాల కోటా విధానాలు ఏ విధంగా పుట్టాయి, అవి ఏరూపం తీసుకున్నాయి, చివరకు ఏ విధంగా పరిణమించాయి. పోనీ, ఆశించినట్టు ఏమైనా ఓట్లు తెచ్చి గెలిపించాయా? అని ఆలోచించారు. ఆ పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నకాలంలో ఆయనపైన సోషలిస్టు వర్గాలు కోటా కోసం ఒత్తిడి తెచ్చాయి. మొరార్జీ 1979 జనవరి ఒకటో తేదీన ఇతర వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల గురించి మండల్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ 1980 జనవరిలో అంటే కమిషన్ ఏర్పాటయిన ఏడాది తరువాత అంతర్గత విభేదాలతో ఆ ప్రభుత్వం కూలిపోయింది. మండల్ కమిషన్ 1980 డిసెంబర్ 31న నివేదిక ఇచ్చింది. ఓ దశాబ్దం తరువాత ఈ నివేదికకు ప్రాణం పోసిన ఘనుడు వి.పి. సింగ్. 1990 దశకం మొదట్లో చాలా బలహీనమైన సంకీర్ణప్రభుత్వానికి ఆయన అధినేతగా ఉన్నారు. రాజకీయంగా బలపడడానికి ఉపయోగపడుతుందన్న పేరాశతో మండల్ కమిషన్ నివేదికను ఆమోదించారు. రాజ్యాంగ సవరణ చట్టాలు తేలేదు కాని, పరిపాలనాపరమైన ఉత్తర్వులతో కోటాను అమలుచేయాలని, అప్పటికి ఉన్న ఓటు కోటలను బద్దలు కొట్టాలని అనుకున్నారు. కానీ జనం వీధినపడ్డారు. యువకులు ప్రాణాలు బలితీసుకున్నారు. మండల్ మంటల ఆందోళనలతో దేశం దద్దరిల్లింది. కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైనాయి. సరిగ్గా ఆ దశలోనే మండల్‌కు పోటీగా బీజేపీ మత కమండలంతో రంగంలో ప్రవేశించింది. బాబ్రీ మసీదు స్థానంలో భవ్యమైన శ్రీరామ మందిర నిర్మాణమే తక్షణ కర్తవ్యమంటూ రథయాత్రకు బయలుదేరారు లాల్‌కృష్ణ అడ్వాణీ మహాశయుడు. మండలానికి కమండలానికి జరిగిన పోటీలో కమండలం బయటపడి మండలం మరుగున పడింది. మండల్ ప్రయత్నాలన్నీ హిందువులను చీల్చడానికి వాడుకుంటున్నవేనని సమస్తిపూర్ సభలో 23.10. 1990న అడ్వాణీ ప్రకటించారు. ‘మీరు శ్రీరామ మందిరం ఉద్యమం పేరుతో రథం వేసుకుని బిహార్‌లో ప్రవేశిస్తే మేం రానివ్వం, అరెస్టుచేస్తాం’ అని నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అదేవిధంగా అడ్వాణీ అరెస్టయ్యారు. వెంటనే వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించడం, ఆయన పదకొండు నెలల పాలన అంతటితో అంతరించడం తెలిసిందే. తరువాత మరో మైనారిటీ సంకీర్ణాన్ని సమర్థవంతంగా అయిదేళ్లు నడిపి సంకీర్ణంలోనూ స్థిరత్వం, సుపాలన సాధ్యమే అని నిరూపించిన పీవీ నరసింహారావు మరొక పాలనా ఉత్తర్వు ద్వారా అగ్రవర్ణాల పేదలకు ఇచ్చిన పదిశాతం కోటా ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాని క్రీమీలేయర్ సంస్కరణను ఆమోదించడం విశేషం. కోటా సాయంతో మళ్లీ అధికారానికి రావాలని ప్రవేశపెట్టిన ఈ పదిశాతం రిజర్వేషన్ల యత్నం ఎంత వరకు ఫలిస్తుందనేది ప్రశ్న. కేవలం ఆర్థిక ప్రాతిపదిక ఆధారంగా కోటాను సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా? వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com -
అఫిడవిట్ రూపంలో వాగ్దానాలు
ఎన్నికల హోరు ముగి సింది. పోటీలో వాగ్దానాల జడివాన గుర్తులు కూడా ఇక కనిపించవు. ఆ వాగ్దానాలు గెలిచిన పార్టీ చేసినవే అయినా, ఓడిన పార్టీ చేసినవయినా, లేక గెలిచిన అభ్యర్థి లేదా ఓడిన అభ్యర్థి చేసిన వాగ్దానాలయినా సరే వాటికి విలువ ఉండాలి కదా. రాజకీయ పార్టీలు కొన్ని వాగ్దానాలు చేస్తాయి. అభ్యర్థులు కూడా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. తమను ఎన్నుకున్న ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీలోకి జంప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎంత అవినీతికరమైన పనో చెప్పలేం. కనీసం ఫిరాయింపు నిషేధ చట్టం ప్రయోగించడానికి కూడా రాజకీయ నాయకులు ముందుకు రావడం లేదు. పదవుల ఆశ చూపి ఫిరాయింపులు చేయడం ఎందుకు అవినీతికరమైన నేరం కాదో ఆ నాయకులు చెప్పాలి. పదవికోసం తనను నిలబెట్టిన పార్టీకి, ఎన్నుకున్న ప్రజలకు ఏ విధంగా ద్రోహం చేశారో వారే వివరణ ఇచ్చుకోవాలి. ఫిరాయించినా, ఫిరాయించకపోయినా ప్రజాప్రతినిధులకు తమను ఎన్నుకున్న ఓటర్ల పట్ల బాధ్యత ఉంటుందని మరవడానికినీ వీల్లేదు. నిజానికి వాగ్దానాలు చేసి ఓడిన అభ్యర్థి కూడా మళ్లీ రాజకీయాల్లో ఉండదలచుకుంటే, మరోసారి బరిలో నిలబడదలచుకుంటే అయిదేళ్లపాటు నియోజకవర్గంలో ఉండి సేవలు చేసి ప్రజాభిమానం చూరగొనాలి. అంతేకాదు. తను ఏ సేవలు చేస్తానని వాగ్దానం చేశాడో, ఆ సేవలు వారికి అందించడానికి ఒక నాగరికుడిగా, నాయకుడిగా కృషి చేయాలి. ఈ ఎన్నికల పోరాటంలో మూడింట రెండువంతుల స్థానాలు గెలిచిన తెలంగాణ రాష్ట్రసమితి కొత్త తెలంగాణ రాష్ట్రానికి రెండో ప్రభుత్వాన్ని ఇవ్వబోతున్నది. చేసిన వాగ్దానాలన్నింటినీ అమలుచేసి తీరతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతిపక్ష స్థానాలకు పరిమితమైన కూటమి కూడా తమ వాగ్దానాలలో అధికార పార్టీ చేసిన వాగ్దానాలతో సమానమైనవి ఏవైనా ఉంటే వాటి అమలుకు కృషి చేయవలసి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థుల పూర్తి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. శాసనసభకు పోటీచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి సమాచారం దేశం మొత్తానికి తెలియజేయాలి. శాసనసభ ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు. మొత్తం రాష్ట్రానికి చెందినది. కనుక అందులో సభ్యులుగా ఉండదలచుకున్న వారి నేర చరిత్ర, ఆర్థిక స్థాయి, చదువు సంధ్యల గురించి ప్రతి ఓటరుకు, ప్రతి పౌరుడికీ తెలియవలసిందే అని 2002లో సుప్రీంకోర్టు నిర్దేశిం చింది. ప్రతి అభ్యర్థితో ఈ సమాచారం ఇప్పించేం దుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయాలని సూచించింది. కానీ అందరూ కలిసి అప్పటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం ద్వారా సవరణ చట్టం తెచ్చి, సుప్రీంకోర్టు ఏమి చెప్పినా సరే ఆ సమాచారం ఇవ్వనవసరం లేదన్నారు. మళ్లీ సుప్రీంకోర్టు ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని కొట్టి వేసింది. అప్పటినుంచి పౌరులందరికీ ఈ సమాచారం ఒక హక్కుగా లభిస్తున్నది. కానీ పౌరుల బాధ్యత ఏమిటి? పార్టీల బాధ్యత ఏమిటి? పార్టీలయితే నేరగాళ్లను ఎన్నికలలో నిలబెట్టకూడదు. ఒకవేళ నిలబెట్టినా జనం వారికి ఓట్లేయకూడదు. ఈ నేరగాళ్లు చేసిన వాగ్దానాలను ఓటర్లు నమ్మాలా? లేక ఈ నేరగాళ్లను నిలబెట్టిన పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మాలా? వారికే ఓటు వేయాలా? ఇదే జనం ముందున్న సంది గ్ధత. పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ నేరచరితులే అయితే, వారిమీద కేసులు ఇంకా నడుస్తూ ఉండి ఉంటే వారికే ఓటు వేయడం న్యాయమా? నోటా మీట నొక్కవలసిందేనా? అప్పుడు నోటానే గెలిస్తే ఏమవుతుంది? మళ్లీ ఎన్నికలు జరుగుతాయా? జరిగితే మళ్లీ వీళ్లే పోటీ చేస్తే ఏం చేయాలి? చేసిన వాగ్దానాలను నెరవేర్చారా లేదా? అనే సమాచారం కూడా ఈ నేతలు ఇవ్వాలి. సొంతంగా తామే ఇవ్వాలి. అదీ అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి. నేను లేదా నా పార్టీ గతసారి ఎన్నికల్లో ఈ వాగ్దానాలు చేశాం అని ఒక కాలంలో రాసి, దాని పక్క కాలంలో అమలు చేశాను లేదా చేయలేదు అని కూడా రాయాలి. ఒకవేళ వాగ్దానాలు అమలు చేయకపోతే ఆ విషయం కూడా జనానికి తెలియజేయాలి. ఎన్నికల కమిషన్ అధికారులు దీన్ని పరిశీలించి అమలు చేసిన, చేయని హామీల వివరాలు జనానికి తెలియజేయాలి. ఈ మార్పు వల్ల వాగ్దానాల అమలు ప్రాతిపదిక మీద ఓటర్లకు ఓటు వేసే అవకాశం, అధికారం ఏర్పడుతుంది. అభ్యర్థులు కూడా వాగ్దానాలు అమలు చేతగాక పోతే. మళ్లీ పోటీ చేయడానికి సిగ్గు పడే స్థితి వస్తుంది. పార్టీ వాగ్దానాలను లెక్క గట్టి అమలుకానివి ఎత్తి చూపి, ఇదీ వీరి స్థితి అని నిలదీసి ఓడించే అవకాశం వస్తుంది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ ఈ-మెయిల్: professorsridhar@gmail.com -
సిక్కిం మ్యూజియం అవినీతి
నవాంగ్ గ్యాట్సో లాచెంపా ఒక నవ యువకుడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లి చదువుకున్న విద్యావంతుడు. చాలామంది వలె విదేశాల్లోనే స్థిరపడి అక్కడ డాలర్లు సంపాదించాలనుకునే (వి)దేశ భక్తుడు కాదు నవాంగ్. తన ప్రాంతానికి రావాలని, అక్కడ తన చదువుతో ఏమైనా చేయాలని అనుకున్న వాడు. కాని తీరా సిక్కింకు చేరుకున్న తరువాత అతనికి అవినీతి విలయతాండవం చేస్తూ కనబడింది. అక్కడా ఇక్కడా వ్యాపించిన భ్రష్టాచారాన్ని ఏ విధంగా ఆపడం? చివరకు మ్యూజియంలో కూడా అవినీతి. కనిపించిన దారి ఆర్టీఐ. ఆర్టీఐకి దరఖాస్తు దాఖలు చేశాడు. మ్యూజియం గ్రాంట్ స్కీం పైన నిపుణుల సంఘం 29.12.2016నాడు జరిపిన 14వ సమావేశం నిర్ణయాలు (మినిట్స్) ప్రతులు ఇవ్వాలన్నాడు. ఈ సమావేశం జరిగిందని సాంస్కృతిక మంత్రిత్వశాఖ అంతర్జాల వేదికమీద రాశారని, ఈ సమావేశం సిక్కిం రాష్ట్ర మ్యూజియం ప్రాజెక్టు (అంచనా 1574 లక్షల రూపాయలు) గురించి జరిగిందని చెప్పారు. 31 డిసెంబర్ నాడు ఈ మెయిల్లో ప్రస్తావించిన నియమాలను పాటించకుండా రాష్ట్రం తన వంతు నిధులు ఇవ్వకపోతే ఏ చర్యలు తీసుకుంటారని కూడా అడిగారు. సీపీఐఓ ఏ సమాధానమూ ఇవ్వలేదు. సిక్కిం రాష్ట్రానికి మ్యూజియం గ్రాంట్ స్కీంను మంజూరు చేసిన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ స్కీం అమలులో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై తగినచర్యలు తీసుకోవాలని రెండో అప్పీల్లో కోరారు. డిసెంబర్ 31, 2016 న కేంద్రం మంజూరు చేసిన నిధులను సిక్కిం రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల వారసత్వ శాఖ కార్యాలయంలో అధికారులు మింగారని కమిషన్‌కు విన్నవించారు. మ్యూజియం గ్రాంట్ స్కీంకు 1574 లక్షలు కేటాయించి, 500 కోట్లు విడుదల చేశారు. దీంతో సిక్కిం రాష్ట్ర మ్యూజియంను పునరుద్ధరించి ఆధునీకరించేందుకు రాష్ట్రం వంతుగా 10 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఎనిమిదినెలలు గడిచినా ప్రాజెక్టు మొదలు కాలేదు. రాష్ట్రంలో వివరాలు ఇవ్వకపోవడంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి 8.4. 2018న ఫిర్యాదు చేశారు. సిక్కిం మ్యూజియం స్కీంలో నిధుల గల్లంతు జరిగిందని, ప్రాజెక్టు నిధులు లక్ష్యాల సాధనకు వినియోగించడం లేదని నవాంగ్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ పనులపైన నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మంజూరీ లేఖ నుంచి మ్యూజియం గ్రాంట్ స్కీంపైన నిపుణుల కమిటీ 29 డిసెంబర్ 2016 నాటి 14వ మీటింగ్ నిర్ణయాల నివేదిక దాకా అన్ని పత్రాలు పరిశీలించిన తరువాత రూ. 3.44 కోట్లు మాత్రమే సిక్కిం రాష్ట్ర వాటాగా ఇచ్చిందని తేలింది. నవాంగ్కు అన్ని పత్రాలు ఇవ్వడంతోపాటు ఈ ఆర్టీఐ దరఖాస్తును అప్పీలును మోసంపైన ఫిర్యాదుగా భావించి, విచారణ జరిపించాలని సమాచార కమిషన్ సూచించింది. నిజానికి నవాంగ్ అడిగిన సమాచారాన్ని నిరాకరించడానికిగానీ, వాయిదా వేయడానికిగానీ వీలు లేదు. ఇటువంటి సమస్యల మీద ఫైళ్లలో సమాచారం నమోదై ఉండకపోవచ్చు. కనుక సమాధానం ఇవ్వడానికి ఏమీ ఉండకపోవచ్చు. కానీ తమ వద్ద ఈ అంశంపై ఉన్న ఏ సమాచారమైనా సరే ఇవ్వకపోవడం తప్పవుతుంది. మ్యూజియం పునరుద్ధరణ ఫైళ్లను, సంబంధిత కాగితాలను అన్నీ దరఖాస్తు దారుడికి చూపడం ద్వారా పీఐఓ తన బాధ్యతను నిర్వర్తించవచ్చు. లేదా ఆయన అడిగిన ప్రశ్నలకు తమ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా సమాధానాలు ఇవ్వాలి. లేదా పై అధికారుల ముందు ఫైల్ ఉంచి సమస్య వివరించి అధికారులు తీసుకున్న నిర్ణయాలను వివరించాలి. సమాచార హక్కు చట్టం నిష్క్రియపైన సవాలుచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. నెలరోజులలోగా నిర్ణయం తీసుకోలేకపోతే ఆ విషయం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. నెలరోజులలో ఏ విషయమూ చెప్పనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని కమిషన్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ప్రభుత్వంలో నిష్క్రియ, నిష్పాలన, నిర్లజ్జ ప్రధాన సమస్యలు. సిక్కిం మ్యూజియంలో అవినీతి జరిగిందని అనేక పర్యాయాలు ఈ యువకుడు ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడు లేడు. నిష్క్రియ నిశ్చేతనంపై సవాలు చేయడానికి ఆర్టీఐని నమ్మి ఆయన సమాచారం అడిగాడు. దానికి ఏవో కారణాలుచెప్పి కేంద్రం, రాష్ట్రం తప్పించుకోజూస్తున్నాయి. ఏవైనా చర్యలు తీసుకుంటే తప్ప ఏ చర్యలు తీసుకున్నారో చెప్పడానికి ఉండదు. చర్యలు తీసుకోరు కనుక జవాబు చెప్పకుండా కుంటిసాకులు చూపుతుంటారు. ఇందుకు సిక్కిం మ్యూజియం అవినీతి కేసు మరొక ఉదాహరణ. అంతే. (నవాంగ్ గ్యాట్సో లాచెంగ్పా కేసు CIC/MCULT/A/2017/607024 లో íసీఐసీ తీర్పు ఆధారంగా) వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
బ్యాంకుల లూటీకి తుపాకులెందుకు?
ఆ మధ్య ఓ కథ స్మార్ట్ ఫోన్లలో చక్కర్లు కొట్టింది. హాంగ్‌కాంగ్‌లో బ్యాంకును దోచుకోవడానికి దొంగలు వచ్చినప్పుడు యువ ఉద్యో గులు కొందరు హీరోల్లా లేచారట. ‘‘కదిల్తే కాల్చే స్తాం. ఈ సొమ్ము మీది కాదు. కాని ప్రాణాలు మీవి, జాగ్రత్త’’ అని దొంగలు అరిచారు. అంతే, అంతా భయపడ్డారు. దొంగలు తోచినంత దోచుకుపో యారు. ఎంబీఏ పాసైన చిన్నదొంగ, ఆరోతరగతి ఫెయిలయిన పెద్దదొంగతో ‘ఎంత దోచామో లెక్క పెడదామా’ అన్నాడట. ‘ఎందుకు రా, టైం వేస్ట్, సాయంత్రానికి టీవీ చానెళ్లు చెప్పవూ!’’ అని అన్నాడు పెద్ద దొంగ. అన్నగారి అనుభవానికి ముచ్చట పడ్డాడు చిన్నోడు. అక్కడ బ్యాంకు మేనేజరు, దొంగలు వెళ్లిపోగానే 100 ఫోన్ కలుపుతు న్నాడు. అనుభవజ్ఞుడైన సూపర్ వైజర్ ఆపి ‘‘సార్ తొందర పడతారెందుకు. 20 మిలియన్ల డాలర్లు వాళ్లు దోచుకున్నారు. ఇప్పటికే ఓ 70 మిలియన్లు మాయమయ్యాయని మనం బాధపడుతున్నామా, అది వీరి ఖాతాలో వేద్దాం. మరో పది మిలియన్లు ఇప్పటి ఖర్చులకు తీసుకుందాం, అంతా వారు దోచుకున్నట్టే కదా’’. సూపర్ వైజర్ తెలివితేటలకు మేనేజరు ఎంతో ముచ్చట పడ్డాడు. ‘‘బ్రదర్ నెలకో సారి దోపిడీ జరిగితే ఎంతబాగుండు’’ అనే మాటలు అతని నోటివెంట అనుకోకుండా వెలువడ్డాయి. సాయంత్రం టీవీ చానెళ్లలో వంద మిలియన్ డాలర్ల దోపిడీ జరిగిందని ప్రకటించారు. దాని మీద ముగ్గురు నిపుణులు బిగ్ డిబేట్లో కొట్టుకోవడం చూసి పెద్దదొంగ డబ్బు ఎన్ని సార్లు లెక్కించినా 20 మిలియన్లు దాటడం లేదని చెప్పాడు. ఇద్దరూ నోరెళ్లబెట్టారు. ‘‘మనం ప్రాణాలకు లెక్కచేయ కుండా కష్టపడితే దక్కింది ఇది. వాళ్లు చూడు, ఒక్క పెన్ను దెబ్బతో 80 మిలియన్లు దొబ్బారు. పద వుల్లోఉన్న దొంగల ముందు మనమెంతరా? ఎంబీఏ కాదు, పొలిటికల్ సైన్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ చదవాలి సార్’’ అన్నాడు చిన్నదొంగ. ఇక మన దేశం విషయానికి వస్తే, అప్పు లక్షయినా, రెండు లక్షలయినా రైతులు తీర్చలేరు. నమ్మిన పొలం పండలేదు. కొన్న మందులు పురు గుల మీద పనిచేయలేదు. రుణదొంగలంటే భరించలేక ఆ మందు తాగారు. పనిచేసింది. 1998 నుంచి 2018 దాకా మూడు లక్షల మంది రైతులు ఇలా ప్రాణాలు తీసుకున్నారు. మరో వైపు పారిశ్రామిక వేత్తలు దాదాపు ఏడు వేల మంది వేల కోట్ల రూపా యలు అప్పు చేసి, సూట్ కేసులతో దేశం వదిలిపెట్టి పారిపోయారు. రైతుల అప్పులు మాఫీ చేస్తామని రాజకీయపార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చి వారి ఓట్లు దండుకుంటాయి. రుణ మాఫీ పూర్తిగా చేయ కుండా కొంత తగ్గించి మాఫీ చేసినట్టు ప్రకటించు కుంటారు. సులభంగా వ్యాపారం చేయడం సుపరి పాలనగా చెప్పుకుంటూ ప్రభుత్వాలు పోటీ పడతాయి. ఢిల్లీలో ర్యాంకులిచ్చి అవార్డులు ప్రకటిస్తారు. సులభ వ్యాపార పాలనా ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు తేలికగా పర్మిషన్లతో పాటు పారిశ్రామిక వేత్తలకు అప్పులు కూడా ఇస్తాయి. రాయిటర్ అనే వార్తాసంస్థ బోలెడు ఆర్టీఐ దర ఖాస్తులు వేసి, రిజర్వ్‌బ్యాంక్ అందించిన సమా చారం ప్రకారం దేశంలో మొండి బాకీలు రూ. 9.5 లక్షల కోట్లు అని తేల్చింది. ఇది జూన్ 2017 నాటి లెక్క. కావాలని రుణం ఎగ్గొట్టే పెద్దలు రూ.110 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టారని ఓ పత్రిక వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 11,300 కోట్ల కుంభకోణం జరిగింది. మూడు లక్షల మంది సభ్యులున్న అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘాల సమాఖ్య ఈ స్కాం చూసి చలించిపోయింది. అయ్యా, ఈ దొంగల పేర్లు బయట పెట్టండి అని ఈ సమాఖ్య సభ్యులు వినతి పత్రం సమర్పిం చారు. ఈ అప్పులు ఎగ్గొట్టిన కంపెనీల డైరెక్టర్లకు వీసాలు రాకుండా పాస్ పోర్టులు ఆపండి బాబో అని హోం మంత్రి దగ్గర మొత్తుకున్నారు. వాళ్ల పిచ్చిగాని వినే వారెవరు? వీరికి విరివిగా రుణాలు ఇవ్వడానికి పోటీపడి ముందుకొచ్చిన బ్యాంకు డైరెక్టర్లను ఏం చేస్తారు? విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి రుణ చోర వీరుల పేర్లయినా ఎందుకు బయటపెట్టరు? అని ఈ సమాఖ్య రిజర్వ్బ్యాంక్ను అడిగింది. అప్పులు తీర్చాలనే ఉద్దేశంలేని ఇలాంటి వారికి రుణాలు మాఫీ చేయడం ఎందుకని ఈ సమాఖ్య బ్యాంకులను కూడా ప్రశ్నించింది. ఏడు వేల మంది మిలియనీర్లు వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని దేశం వదిలి పారిపోయారు. అంతేకాదు, పౌరసత్వం మార్చుకుని వారు దర్జాగా విదేశాల్లో స్థిరపడ్డారన్న వార్తలు చదివిన వారికి బ్యాంకు అధికారుల సమాఖ్య ప్రశ్నలు గుర్తొస్తాయి. కంచికి వెళ్లని ఈ కథలో నీతి: బ్యాంకులిచ్చే అప్పు కాగితాల మీద సంతకాలు చేసి డబ్బు లాగేసే సౌక ర్యం ఉన్నప్పుడు తుపాకులతో బ్యాంకు దోపిడీల అవసరం ఏముంటుంది? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
టీటీడీ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: రూ.వేల కోట్లు ఖర్చు పెడుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు స్పష్టం చేశారు. ప్రజా సంస్థగా ఉన్న టీటీడీ.. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దంలో టీటీడీకి సమర్పించిన అత్యంత విలువైన ఆభరణాలు ఎక్కడున్నాయో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు టీటీడీకి కేంద్ర సమాచార కమిషనర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాడభూషి శ్రీధర్ సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. టీటీడీలో నెలకొన్న వివాదం కేవలం శ్రీవారి నగల సమస్యో లేదా శ్రీవారి ప్రాచీన కట్టడాల సమస్యో కాదన్నారు. శాసనాల్లో ఉన్న నగలకు.. ప్రస్తుతం టీటీడీలో ఉన్న నగలకు అసలు పోలికే లేదని పురావస్తు శాఖకు చెందిన ఒక డైరెక్టర్ తనకు చెప్పినట్లు వివరించారు. ఈ వ్యవహారంపై ప్రజలు ప్రశ్నిస్తే టీటీడీ సమాధానం చెప్పాల్సిందేనన్నారు. ఈ నెల 28న శ్రీవారి నగల వ్యవహారంపై విచారణ చేపడతామని తెలిపారు. జవాబుదారీగా ఉండేందుకు ప్రభుత్వానికి గానీ టీటీడీకి గానీ ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పవచ్చన్నారు. -
అడిగిన పత్రాల ధ్వంసం నేరమే
తనకు పోస్ట్ చేసిన 37 ఉత్తరాలు ఎక్కడినుంచి వచ్చాయి, ఎవరు బట్వాడా చేశారు, అవి ఏరోజు గమ్యస్థానం చేరాయి, చేరిన రుజు వులు ఏవి అని ఒక పౌరుడు పోస్టాఫీసు అధికారులను అడిగాడు. ఒకటి నుంచి 21 వరకు రికార్డు లేదని, గడువు తీరిందని తొలగించామని చెప్పారు, మిగిలిన చీటీలు ఇచ్చారు. ఆర్టీఐ దరఖాస్తు చేసినప్పుడు మొదటి అప్పీలు నాటికి ఉన్నా వాటిని తొలగించడం కోసం వేరు చేసి కుప్పలో పడేశారని వివరించారు. కాగితాలు ఉన్నప్పటికీ వాటిని ధ్వంసం చేసి పౌరుడికి ఇవ్వకపోవడం ఆర్టీఐ చట్టం సెక్షన్ 20 కింద జరి మానా విధించదగిన నేరమే అవుతుందని కమిషన్ నోటీసు జారీ చేసింది. ఆర్టీఐ దరఖాస్తు దాఖలయ్యేనాటికి దస్తావేజులు ఉండి ఉంటే, ఆనాటికే నిలిపే గడువు దాటిపోయినా వాటిని తొలగించకుండా అడిగిన పౌరుడికి ఇవ్వాలనే విధానం ప్రవేశపెట్టాలి. ఊరికే ధ్వంసం చేసే బదులు, అడిగిన వారికి లేదా వాటి సొంతదారులకు ఎందుకు ఇవ్వరో అర్థం కాదు. ఆ సమాచారం కోసం ఒకవైపు చట్టం ప్రకారం అడుగుతూ ఉంటే, మరోవైపు వాటిని ధ్వంసం చేసి రికార్డులు లేవు పొమ్మనడం సమంజసం కాదు. దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించి కమిషన్ తమిళనాడు ఈరోడ్ డివిజన్ తపాలాశాఖ ప్రజాసమాచార అధికారికి గరిష్ఠ జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలపాలనే లేఖ జారీచేసింది. దానికి అధికారి జవాబిస్తూ 37 తపాలా లేఖల డెలివరీ చిట్టీలు ఇవ్వాలన్న ఆర్టీఐ దరఖాస్తు తమకు 22.8.2017న చేరిందని, 22నుంచి 37 వరకు చిట్టీలు ఇవ్వడానికి 54 రూపాయలు పంపాలని 11.9. 2017న అడిగామని, అతను ఆ సొమ్ము చెల్లించగానే ప్రతులు 3.10.2017న ఇచ్చామని తెలిపారు. 1 నుంచి 21కి సంబంధించిన చిట్టీలు తొలగించామని చెప్పారు. మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా పాత దస్తావేజుల తొలగింపునకు సంబంధించిన రుజువు ఇవ్వాలని కోరారు. వాటిని వేరు చేసి ఆ తరువాత విధి విధానాల ప్రకారం తొలగించామని మాత్రం అధికారి జవాబు చెప్పారు. మీరు ఎక్కడ ఆ దస్తావేజు లను కుప్పపోశారో చూపితే తానే తన కాగితాలను వెతుక్కుంటానని కూడా ఆయన మరొక దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ అందుకు అంగీకరించలేదు. తపాలాశాఖ నియమాల ప్రకారం దేశీయ ఉత్తరాల పంపిణీ పత్రాలను 18 నెలలు, స్పీడ్ పోస్టు ఉత్తరాల పత్రాలు ఆరు నెలలు దాస్తామని 11.9.2017న ఆర్టీఐ దరఖాస్తు వేసే నాటికే ఆ రికార్డులను పాత కాగితాలలో కుమ్మరించామన్నారు. అప్పీలు నాటికి పాత కాగితాలు నిజంగా నిర్మూలించకపోయినా కట్టలుకట్టి కుమ్మరించామని, బయటకుతీసే అవకాశం లేదని చెప్పారు. ఆర్టీఐ చట్టంలో కుమ్మరించిన కాగితాల కుప్పనుంచి వెలికి తీయాలనే నియమం లేదని, కనుక తాము ఇవ్వలేదని, తన నిర్ణయాన్ని మొదటి అప్పీలు అధికారి కూడా అంగీకరించారని, తాము కేవలం డిపార్ట్మెంట్ నియమాలను అనుసరించి మాత్రమే వ్యవహరించామని, కనుక తమపై జరిమానా విధిం చకూడదని పీఐఓ వాదించారు. మొదటి అప్పీలు అధికారి పారేసిన కుప్పనుంచి దరఖాస్తుదారు కోరిన కాగితాలు వెతకాలని ఆదేశించలేదని, కనుక తాము ఆ ప్రయత్నం చేయలేదని కూడా వివరించారు. ఆ కుప్పను మార్చి 2018 నాటికి పూర్తిగా తొలగించామని చెప్పారు. ఆర్టీఐ చట్టం రికార్డు దాచే నియమాలను నిర్ధారించలేదని అన్నారు. ఈ దరఖాస్తుదారు ఏడు సార్లు కాగితాల ప్రతులు కోరితే తాము ఇచ్చామని 6.6.2018న జరిగిన అప్పీలు విచారణలో అతను హాజరు కాలేదని అంటే ఆయన దీనికి తగిన ప్రాధాన్యం ఇవ్వనట్టేనని వాదించారు. ఈ కారణాల వల్ల సీఐసీ ఆదేశాన్ని పాటించలేక పోయామని, అడిగిన ప్రతులు ఇవ్వలేకపోయామని వివరించారు. 2017 ఆగస్టు నుంచి దరఖాస్తుదారు తన పత్రాల గురించి పోరాడుతూ ఉంటే తపాలా కార్యాలయం వారు 2018 మార్చిలో రికార్డులను తొలగించారని తేలింది. సెక్షన్ 2(ఎఫ్) 2(జె)లో నిర్వచనాల ప్రకారం సమాచారం అంటే తమ వద్ద ఉన్న కాగితాలు అని స్పష్టంగా ఉంది. ఆర్టీఐ దరఖాస్తు చేసిన నాటికి ఉన్న పత్రాలను అప్పీలు విచారణ దశలో ధ్వంసంచేయడం, సెక్షన్ 20లో చెప్పినట్టు తెలిసి తొలగించడం కిందికి వస్తుందని, దురుద్దేశం లేకపోయినా తెలిసి తొలగించడం నిరాకరణే అవుతుంది. అయినా పీఐఓ వివరణను పరిగణించి గరిష్ఠ జరిమానా 25 వేలు కాకుండా 25 వందల రూపాయల జరిమానా విధించాలని కమిషన్ నిర్ణయిం చింది. ఊరికే ధ్వంసం చేసే బదులు ఆ పత్రాలు మిన హాయింపుల కిందికి రాకపోతే సంబంధిత వ్యక్తులకు ఇవ్వడం గురించి తపాలా శాఖ ఆలోచించాలని కమిషన్ సూచించింది. (CIC/POSTS/ A/2018/1194 69 టీఎస్ శివకుమార్ వర్సెస్ పీఐఓ తపాలాశాఖ కేసులో 6.8.2018న సీఐíసీ తీర్పు ఆధారంగా). వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆర్టీఐ జ్యోతిని ఆర్పివేయవద్దు
నియంతల పాలనలో మగ్గిన మానవాళి 800 ఏళ్ళ కిందట తొలిసారి హక్కుల గురించి ఆలోచించింది. మొదట అడిగిన హక్కు పిటిషన్ హక్కు. (వినతి పత్రం సమర్పించే హక్కు). ఆహార హక్కూ, బతుకు హక్కూ కాదు. అదే 1215 నాటి మాగ్నా కార్టా. పిటిషన్ పెడితే రాజధిక్కారం కింద జైల్లో వేసే రోజుల్లో అది చాలా గొప్ప హక్కు. రాజస్తాన్‌లోని ఒక కుగ్రామంలో జనం ఉచితభోజనం అడగలేదు. మా ఊళ్లో ఆవాస్ యోజన కింద ఇరవై ఇళ్ళు కట్టించారట. ఎవరికి ఇచ్చారో చెప్పండి చాలు అన్నారు. ఇరవై రోజులు ధర్నా చేసేదాకా పంచాయత్ పెద్దలు కదలలేదు. ఆ తరవాత వారు చెప్పిన పేర్లు వింటూ ఉంటే ఒక్కపేరుగలవాడూ ఉళ్లో లేడని తేలింది. అంటే ఇరవై ఇళ్ల సొమ్ము భోంచేశారన్నమాట. అదే చోట ఆ జనమే అవినీతి మీద పోరాడటం ప్రారంభించారు. ఆ పోరాట ఫలి తమే సమాచార హక్కు. పిటిషన్ హక్కు సమాచార హక్కు చేతిలో ఉంటే ఇతర హక్కులు సాధించవచ్చు. రోజూ కొన్ని వేల మంది దేశ వ్యాప్తంగా చిన్న చిన్న సమస్యలను ఆర్టీఐ ద్వారా సాధిస్తున్నారు. పదిరూపాయల ఫీజు ఇచ్చి చిన్న సైజు పిల్ వేసే అవకాశం ఆర్టీఐ కల్పించింది. ప్రతి రాష్ట్రంలో పదిమంది కమిషనర్లు కూర్చుని వచ్చిన వారికి సమాచారం ఇప్పిస్తూ పోతే పింఛను ఆలస్యాలు, రేషన్ కార్డు లంచాలు, స్కాలర్షిప్ వేధింపులు వంటి రకరకాల సమస్యలు తీరుతున్నాయి. అయితే ఆ పది రూపాయల పిల్ హక్కుకు ఇప్పుడు ఎసరు పెడుతున్నారు. కమిషనర్ల అధికారాలు తగ్గిస్తున్నారు. వారి స్వతంత్రతకు తూట్లు పొడిచి తాబేదార్లను చేస్తున్నారు. కమిషనర్ల పదవీకాలం ప్రస్తుతం అయిదేళ్లు లేదా వారికి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు అని 2005 చట్టం నిర్దేశిస్తున్నది. కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్‌కు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాను, సమాచార కమిషనర్‌కు కేంద్ర ఎన్నికల కమిషనర్ హోదాను ఆర్టీఐ చట్టం నిర్దేశించింది. ఏ ఉన్నతాధికారికైనా సమాచారం ఇవ్వమని ఆదేశించేందుకు ఈ సమున్నత స్థాయి అవసరమని ఆర్టీఐ చట్ట ప్రదాతలు భావిం చారు. ఈ చట్టానికి చేస్తున్న సవరణలు పార్లమెంటు ఆమోదం పొందితే, కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత కాలానికి మాత్రమే కేంద్ర, రాష్ట్ర కమిషనర్లను నియమించుకోవచ్చు. అప్పుడు కమిషనర్లు స్వతంత్రంగా పనిచేయడానికి ధైర్యంగా సమాచారం ఇవ్వండి అనడానికి వీలుండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పదవీ కాలం ఉంటుంది అని నియమాలు చేర్చుతారట. ఇప్పుడు ఆ హోదా ప్రభుత్వం వారు నోటిఫికేషన్ ద్వారా అప్పుడప్పుడు మార్చుకొనే సవరణ కావాలంటున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా దాచిన ఫైళ్లలో దాగిన సమాచారాన్ని వెలికి తీయాలని ఆదేశించే అధికారం, స్వతంత్రత సమాచార కమిషనర్‌కు ఇవ్వకపోతే ఈ హక్కు అమలు కాదనే ఉద్దేశంతో వారి పదవీకాలాన్ని, హోదాను స్థిరీకరించింది ఆర్టీఐ చట్టం. సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తే తమకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చారని భయపడే ప్రభుత్వాలు ఏదో తప్పు చేసినట్టే. ఆ తప్పులు బయటపెట్టకుండా రహస్యాలు కాపాడటానికి సమాచార కమిషనర్లు తమకు లోబడి పనిచేయాలని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. ఈ చట్టం సవరణ ద్వారా అప్పుడు ఆదేశిస్తాయి. కమిషనర్లను నియమించాలనుకున్నప్పుడల్లా రూల్స్ మార్చుకునే సౌకర్యాన్ని కట్టబెట్టే ఆలోచన ఇది. ఇప్పుడు ఎన్నికల కమిషన్‌తో సమాచార కమిషన్‌కు సమాన హోదా ఇవ్వడం తప్పని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తక్కువజేయాలని చూస్తున్నది. ఓటు హక్కు, సమాచార హక్కు రెండూ భావప్రకటన హక్కులో భాగాలే అయినప్పడు రెండూ ఎందుకు సమానం కావంటారు? సమాచార హక్కు ఏ విధంగా అమలు చేయాలో వివరిస్తూ కమిషనర్లను నియమించే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేయడం వల్ల రాష్ట్రాల సార్వభౌమాధికారాన్ని కాపాడిందీ చట్టం. కాని రాష్ట్ర కమిషనర్ల పదవీకాలాన్ని హోదాను జీతాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుందని సవరించడం వారి సార్వభౌమాధికారంతో జోక్యం చేసుకోవడమే. కమిషన్ల నడ్డి విరిస్తే సమాచార హక్కును నీరు కార్చినట్టే. అప్పుడు అవి నీతి అక్రమాలకు అడ్డూ అదుపూ ఉండదు. అదేనా మనకు కావలసింది? ఆర్టీఐ జ్యోతిని ఆర్పివేయకుండా ఆపాల్సింది జనమే. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
పీఎఫ్ సమాచారం వ్యక్తిగతమా?
సందర్భం కార్మికుల జీతంనుంచి కోత విధించి దాన్ని వారి పీఎఫ్ ఖాతాలో వేయకపోవడం పెద్ద అవినీతి. అలాంటి యాజమాన్యాలపైన చర్యతీసుకోకుండా కార్మికులకు నష్టం కలిగించే అధికారులపైన చట్టపరమైన చర్య తీసుకోవలసి ఉంటుంది. ప్రయివేటు రంగంలో, కాంట్రాక్టు లేదా ఔట్ సోర్సింగ్ వర్కర్లకు ఒకే ఒక సంక్షేమ ప్రయోజనం భవిష్యనిధి. వేతనంలో 12శాతం భవిష్యనిధికి కార్మికుడి వాటాను చెల్లింపు సమయంలోనే తీసి, భవిష్యనిధి ఖాతాకు జమచేయాలి. యాజమాన్యం వారి వాటాను కూడా కలిపి కార్మికుడి ఖాతాలో వేయాలి. భవిష్యత్తులో కార్మికుడి ఆరోగ్య సంక్షేమాలకు ఆ డబ్బునుంచి సాయం లభిస్తుంది. చాలామంది కార్మికులు పీఎఫ్ వాటాను చెల్లించినా యాజమాన్యాలు వారి ఖాతాలో వాటిని జమచేయడం లేదు. వారిపైన చర్యతీసుకోవలసిన పీఎఫ్ శాఖ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తారు. వారికి జవాబుదారీ ఎవరు? సమాచార హక్కు చట్టం వల్ల కార్మికులకి, వారి నాయకులకు, సంఘాలకు మరొక చేయూత దొరికింది. మా వాటా డబ్బు చెల్లించారా? యాజమాన్యం వాటా కలిపారా? చెల్లించని యాజమాన్యంపై ఏ చర్యతీసుకున్నారు? ఏ చర్యా తీసుకోని అధికారుల బాధ్యత ఏమిటి అని ఆర్టీఐ కింద అడుగుతున్నారు. కానీ ఇవ్వడం కుదరదని ప్రజాసమాచార అధికారులు నిరాకరిస్తున్నారు. వేతనం నుంచి పీఎఫ్ వాటాను తీసి అతని ఖాతాలో జమచేశారా లేదా, యాజమాన్యం వాటా చెల్లించారా అని జనార్దన్ పాటిల్ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కోరారు. ఈ సమాచారం ఇస్తే ఏం నష్టం? ఇవ్వకపోతే తమకు వచ్చే లాభం ఏమిటి? అని ఎవరూ ఆలోచించడం లేదు అధికారులు. మూడో వ్యక్తి సమాచారం అనీ వ్యక్తిగత సమాచారం అనీ నిరాకరించారు. మొదటి అప్పీలు అధికారి కూడా ఆ నిరాకరణను సమర్థించారు. ఈ సమాచారం ఇవ్వవలసిందే అని ఈపీఎఫ్ఓను కమిషన్ ఆదేశించింది. సమాచారం ఇవ్వనందుకు గరిష్ట జరిమానా ఎందుకు విధించకూడదో తెలియజేయాలని ప్రజాసమాచార అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆర్టీఐ దరఖాస్తు వేసినప్పుడు తాను సీపీఐఓను కాదని, ప్రస్తుత సీపీఐఓ ఏసీ పగారే వివరణ ఇచ్చారు. అప్పటి అధికారితోపాటు, సమాచారం ఇవ్వని ఇప్పటి సీపీఐఓ కూడా అందుకు బాధ్యత వహించాలని ఇద్దరికీ కమిషన్ జరిమానా నోటీసులు జారీ చేసింది. సీఐసీ ఆదేశించిన తరువాత సమాచారం ఇచ్చామని, కనుక తనపై జరిమానా విధించరాదని ప్రస్తుత అధికారి పగారే వివరణ ఇచ్చారు. 2016 ఫిబ్రవరి 2న వచ్చిన దరఖాస్తును వెంటనే ఫిబ్రవరి 23న సంబంధిత శాఖకు పంపానని, దానికి సమాధానం ఆ అధికారే ఇవ్వాల్సి ఉందని ఆ నిర్ణయం సరైనదే అని మొదటి అప్పీలు అధికారి కూడా ఒప్పుకున్నారని, తనకు సమాచారం ఇవ్వకూడదనే దురుద్దేశం లేనేలేదని అప్పటి సీపీఐఓ జగదీష్ టాంబే వివరణ ఇచ్చారు. కార్మికుడి భవిష్యనిధి అతడి వ్యక్తిగత సమాచారం కనుక ఇవ్వరాదని ఆయన వివరించారు. రికార్డులు పరిశీలిస్తే తేలిందేమంటే మొత్తం 15 నెలల తరువాత కార్మికుడికి చెందిన పీఎఫ్ సమాచారం ఇచ్చారు. అందాకా సమాచారం ఇవ్వకుండా వేధించారు. ఆ తరువాత కూడా రెండు అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదని దరఖాస్తుదారుడు వివరించారు. ఇవ్వకుండా వదిలేసిన సమాచారాన్ని కూడా ఇవ్వాలని కమిషన్ మళ్లీ ఆదేశించింది. కార్మికుల వేతన సమాచారం వ్యక్తిగత సమాచారం కాదు. ఎందుకంటే అందరు కార్మికులకు ఒక లెక్క ప్రకారం, వేతన బోర్డు నిర్ణయం ప్రకారం ఒక స్కేలు పద్ధతిన వేతనం ఇస్తారు. అది అందరికీ తెలిసిన సమాచారమే. అందులో 12 శాతం భాగాన్ని భవిష్యనిధికి కార్మికుడి వాటాగా కేటాయించాలని. అంతే సొమ్మును యాజమాన్యం వాటాగా చెల్లించాలని చట్టం ఆదేశించింది. వేతనం వలెనే వేతనంలో భాగమైన పీఎఫ్ సొమ్ము వ్యక్తిగత రహస్యం అయ్యే అవకాశమే లేదు. పీఎఫ్ ఖాతాలో కార్మికుడి వాటా, యాజమాన్యం వాటా తప్ప మరేదీ ఉండదు. అందులో కార్మికుడు ఎక్కువ సొమ్ము జమచేయడం, మరో విధంగా ఖర్చుచేయడం జరగదు. అలాంటప్పుడు పీఎఫ్ ఖాతాను బ్యాంకు ఖాతాతోనూ, ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలతోనూ పోల్చి సమాచారాన్ని నిరాకరించడం సమంజసం కాదు. పీఎఫ్ వాటా చెల్లింపులు చేసినా అతని ఖాతాలో ఆ డబ్బును తన వాటాతో కలిపి యాజమాన్యం జమ చేయకపోతే, అది చట్టవిరుద్ధమైన పని అవుతుంది. దానివెనుక మోసం ఉంటుంది. కార్మికుడికి ద్రోహం జరుగుతుంది. అతని జీతంనుంచి కోత విధించి అతని ఖాతాలో వేయకపోవడం పెద్ద అవినీతి కూడా అవుతుంది. ఈ పనిచేసిన యాజమాన్యాలపైన చర్యతీసుకునే అధికారం పీఎఫ్ అధికారులకు ఉంది. ఆ అధికారాన్ని వినియోగించకుండా కార్మికులకు నష్టం కలిగించే అధికారులపైన చట్టపరమైన చర్యతీసుకోవలసి ఉంటుంది. ఇవన్నీ తప్పించుకోవడానికి అధికారులు పీఎఫ్ సమాచారాన్ని వ్యక్తిగత సమాచారం అంటూ ఇవ్వకుండా దాస్తున్నారు. ఇందుకు సమాచార అధికారిపై కమిషన్ 25 వేల రూపాయల జరిమానా విధించింది. (నాగరాజ్ జనార్దన్ వర్సెస్ ఈపీఎఫ్ఓ నంబరు EPFOG/ A/2016/294053, కేసులో 20.2.2018 నాడు కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
పిల్లి అలవెన్సు అడిగేవారే లేరా?
గొప్ప రికార్డులను కూడా చెదలు, ఎలుకలు తింటూ ఉంటే థాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంటారు. ఎలుకలు దస్తావేజులు తింటూ ఉంటే వాటిని పట్టుకోవడానికి పిల్లిని పెంచుకునేందుకు ప్రభుత్వం కొంత భత్యం ఇస్తుందని బాస్వాన్ చెప్పారు. సర్కారీ దస్తావేజులను ఎలుకలు తినేస్తుంటాయని తెలుసా? వాటిని నిర్మూలించడానికి పిల్లిని పెంచుకోవచ్చని తెలుసా? అందుకోసం ప్రభుత్వం కొంత భత్యం కూడా ఇస్తుందని తెలుసా? కక్షగట్టిన తోటి అధికారులు అసూయతో వేధిస్తుంటే బాధిత ఆఫీసర్లను రక్షించేది ఆర్టీఐ. దస్తావేజులు మాయం చేసి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత గొప్ప చట్టాలైనా ఎంత గొప్ప తీర్పులనైనా సరే నిర్వీర్యం చేయగలరు. ఏ నియమాలూ లేవనుకున్నా సరే మేలు చేయదలచుకుంటే చేయగలరు. అధికారులు ఉత్తములైతే దుర్మార్గపు నేతలు కూడా ఏమీ చేయలేరు. ఐఏఎస్ వారే దుర్మార్గులైతే మంచి రాజకీయ నాయకులను కూడా నాశనం చేయగలుగుతారు. 1995 నాటి కొన్ని ఫైళ్ల నంబర్లు ఇచ్చి తనపైన పెండింగ్‌లో ఉన్నాయన్న సీబీఐ కేసులేమిటి, వాటి పరిణామాలేమిటి, సంబంధిత కాగితాల నకళ్లు ఇవ్వాలని సీనియర్ అధికారి విజేంద్రసింగ్ జాఫా ఆర్టీఐ ద్వారా అడిగారు. పీఐఓలు దీంతో ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఎస్ జె ఈ శాఖ, గిరిజన శాఖ, విజిలెన్సు విభాగం దానిని తంతూనే ఉన్నాయి. సాంఘిక న్యాయ మంత్రిత్వ శాఖనుంచి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను విడిగా రూపొందించిన తరువాత పాత ఫైళ్లు తమ వద్ద లేవన్నారు. విజేంద్ర జాఫా 20 ఏళ్ల కిందట రిటైరయ్యారు. అనారోగ్యంతో రాలేకపోతే మిత్రులు భారతేంద్ర సింగ్ బాస్వాన్ అనే మరో సీనియర్ అధికారి వచ్చారు. జాఫా అవినీతిని సహించే వారు కాదు. తన పైనున్న డైరెక్టర్ అక్రమాలపైన ప్రాథమిక పరిశోధన చేసి మరింత దర్యాప్తు జరపవలసిన తీవ్ర అంశాలని నిర్ధారణ చేసుకున్న తరువాత సమగ్రమైన ఫిర్యాదు చేశారు. దానికి ప్రతీకారంగా ఆ పెద్ద అధికారి జాఫా మీద నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదులు చేయడం వల్ల తీవ్రమైన మనోవేదనకు గురైనారు. అవి అవాస్తవాలని రుజువు కావాలన్నదే ఆయన తపన అని బాస్వాన్ వివరించారు. ఐఏఎస్ తెలివి తేటలు దుర్మార్గంగా ఉంటే దేశానికి ప్రమాదమే. అవినీతిపరులైన అధికారులను పై వారు కింది వారు సమర్థిస్తూ ఎంతో ఐకమత్యంతో తమ అక్రమాలను కాపాడుకుంటూ ఉంటారు.వారికి డబ్బుకు కొరత ఉండదు. ఇక నీతిమంతులు కలసి ఉండే అవకాశం లేదు. నానాటికీ వారి సంఖ్య తగ్గిపోతున్నది. కలసి పోరాడడానికి భయపడతారు. డబ్బు కూడా దొరకదు. చట్టం సహకరించదు. కోర్టుల్లో కొన్ని యుగాలు పడుతుంది. మంచి అధికారి ఈ దుర్మార్గుల అవినీతికి రుజువులు సంపాదించే లోగా, అవాస్తవ ఆరోపణలు విసరడంతో మంచి పనులన్నీ ఆగిపోతాయి. జీతాల్లో కోతలు, పింఛను నిర్ధారణలో ఆలస్యాలకు ఈ అబద్ధపు కేసులు వాడుకుంటారు. వారిని వేధించి అక్రమార్కులు బయటపడతారు. కాని సక్రమాధికారులమీద మచ్చలు తుడవరు. ఫిర్యాదులు ఫైళ్లలో ఉంటాయి. ఆ ఫైళ్లు దొరకనీయరు. విచారణ పూర్తి చేయరు. కనీసం ఆ ఫైళ్లను ఇవ్వరు. ఆర్టీఐ విభాగంలో పనిచేసే సీపీఐఓలు పై అధికారుల చేతిలో పావులు. పైవారు ఏది రాయమంటే అది రాస్తారు. జవాబివ్వకుండా గుట్టలకొద్దీ ఫైళ్లు నిర్మిస్తారు. రెండో అప్పీలులో సమాచార కమిషన్ ముందుకు ఏ సమాచారమూ లేకుండా ఒక క్లర్కును పంపిస్తారు. ఆ ఫైళ్లు లేవు ఏంచేస్తారో చేస్కోండి అని వాదించడమే వీరు సాగించే దుర్మార్గం. జాఫా గారికి కూడా అదే జవాబు. మంత్రులకు, ప్రభుత్వాలకూ ఇవి పట్టవు. పాత దస్తావేజులు తొలగించేందుకున్న విధానాన్ని పాటించరు. ఎప్పుడు ఏ రికార్డు తొలగించారో ఒక రిజిస్టర్లో రాయాలి. రాయరు. ఆశ్చర్యమేమంటే గొప్ప రికార్డులను కూడా చెదలు, ఎలుకలు తింటూ ఉంటే థాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంటారు. ఎలుకలు దస్తావేజులు తింటూ ఉంటే వాటిని పట్టుకోవడానికి పిల్లిని పెంచుకునేందుకు ప్రభుత్వం కొంత భత్యం ఇస్తుందని బాస్వాన్ చెప్పారు. పిల్లి భత్యం ఉంటుందని చాలామందికి తెలియదు. అయినా ఫైళ్లు తిని ఎలుకలు మేలు చేస్తుంటే పిల్లిని పెంచడమెందుకు? ఆ అలవెన్సు అడిగేదెవరు? లంచగొండుల లంచాలను, నీతిపరుల నీతిని రుజువు చేయగల సాక్ష్యాలు దస్తావేజులు. వాటినే మాయం చేయడం ఐపీసీ కింద నేరం. పబ్లిక్ రికార్డు చట్టం కింద కూడా నేరం. ఆర్టీఐలో ఫైళ్లు దొరకడం లేదు కనుక సమాచారం ఇవ్వకుండా ఉండే మినహాయింపు లేదు. బ్రిటిష్ పాలనాకాలంలో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేది. దేశాన్ని దోచుకున్న వివరాలు ఫైళ్లలో ఉండకపోయినా పాలనకు సంబంధించిన వివరాల దస్తావేజులు కాపాడేవారు. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా కొన్ని శాఖల వారు కాగితాలు, పత్రాలు రక్షించే ప్రక్రియ కొనసాగించారు. కాని రాను రాను ఒక్కొక్క శాఖ దస్తావేజులను వృథా పదార్థాలుగా భావించే బాధ్యతారాహిత్య ధోరణిని అలవరుచుకున్నాయి. అవినీతి పరులు ఇష్టారాజ్యంగా ఫైళ్లు మాయం చేయడానికి ఇందువల్ల వీలు కలిగింది. లంచగొండుల సంఖ్య పెరగడం వల్ల మంచి అధికారులకు మరణయాతన తప్పడం లేదు. కోరిన సమాచారం ఇవ్వనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలని, పోయినాయన్న దస్తావేజులు వెతడానికి తీసుకున్న చర్యల వివరాలు ఇవ్వాలని, వెంటనే అడిగిన పత్రాలన్నీ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. (విజేంద్ర జాఫా వర్సెస్ సాంఘిక న్యాయ శాఖ కేసుCIC/MOS-J-E-/A- /2017/181342 లో ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
బాధ్యత లేని పార్టీలకు నిధులా?
విశ్లేషణ రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చిన కంపెనీకి పూర్తి మినహాయింపు ఉంటుంది. అంటే విరాళాలు ఇచ్చిన కంపెనీకి తీసుకున్న రాజకీయ పార్టీకి ఆదాయపు పన్ను బాధ ఉండదు. ఇంత అద్భుతమైన సౌకర్యం మరే వ్యవస్థకూ లేదు. పేరుకుపోతున్న డబ్బు ఎంతో లెక్కలు చెప్పకుండా, అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా రాజ కీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వం నిధులిస్తే ఏ ప్రయోజనమూ లేకపోగా ప్రజాధనం వృ«థా అయ్యే ప్రమాదం తప్పదు. ఇప్పటికే అనేక పన్ను రాయితీలతో ప్రజాధనాన్ని పరోక్షంగా పొందుతున్న పార్టీలకు మళ్లీ ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం సమంజసమా? రాజకీయ పార్టీలను జవాబుదారీగా చేసే వ్యవస్థే మనదేశంలో లేదు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వైయక్తిక సామ్రాజ్యం, వారికి కుటుంబసభ్యులే నాయకులు, వారసులు. విభేదించిన వారు మరొక పార్టీ పెట్టుకోవలసిందే తప్ప మరో మార్గం లేదు. మనదేశంలో పుట్టి నమోదు చేసుకున్న పార్టీల సంఖ్య 1900 దాటిందని లెక్కలు వివరిస్తున్నాయి. ఒక్కసారి రిజిస్టర్ అయితే చాలు, పార్టీకి నూరు శాతం ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. 20 వేలరూపాయలు మించిన విరాళాలు మాత్రమే ప్రకటించాలి. 20 వేల రూపాయల లోపు విరాళాల వివరాలు చెప్పనవసరం లేదని ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 29 సి వీలు కల్పించింది. కొన్నిసంవత్సరాలపాటు ఎన్నికల్లో ఒక్క అభ్యర్థినీ నిలబెట్టకపోయినా అధ్యక్షుల వారు కూడా పోటీ చేయకపోయినా పార్టీకి ఈ సౌకర్యాలన్ని సమకూరుతాయి. రిజిస్టర్ చేసిన పార్టీని డీరిజిస్టర్ చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు. లోకంలోకి వచ్చిన ప్రతి పదార్థమూ నశిస్తుందనీ, ప్రతి ప్రాణి మరణిస్తుందని మన భగవద్గీత ప్రబోధిస్తుంది. కాని రాజకీయ పార్టీకి మాత్రం మన రాజ్యాం గంలో మరణం లేదు. అది చిరంజీవి. రాజకీయ పార్టీ అనేది ఒక కంపెనీ కాదు. సొసైటీ కాదు. సంస్థకాదు. సంఘమూ కాదు. ఇవేవీ కాని సొంత వ్యవస్థ అది. రాజకీయ పార్టీలు తమ నివేదికలలో అవాస్తవాలు చెబితే పరిణామాలు ఏమిటో తెలియదు. ఉండవు కూడా. కనీసం పన్ను రాయితీలలో కోత విధిస్తామనే హెచ్చరిక కూడా ఉండదు. పోనీ పార్టీ నాయకత్వానికి ఎన్నికలు జరుగుతాయా అంటే అదీ లేదు. ప్రతినిధి పదవికి పోటీ చేసే అభ్యర్థిని ఏ విధంగా ఎంపిక చేస్తారో ఎవరికీ తెలియదు. ఎవరూ చెప్పరు. ఏ లెక్కా పత్రం లేకుండా రహస్యంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. గెలిచిన ఆ అభ్యర్థిని పార్టీకి కట్టి పడేసేది అధికారమే. లేదా ఎవరైనా డబ్బు, అధికారం చూపితే ఫిరాయించే అవకాశాలు సుస్పష్టం. వారిని ఏమీ చేయలేమని ఇటీవల పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి 70 లక్షల రూపాయలు మించి ఖర్చుచేయరాదు. ఎమ్మెల్యే అభ్యర్థి పరిమితి 28 లక్షలు. కాని వారి పేరుమీద మిత్రులు ఎంతైనా ఖర్చు చేయవచ్చని చట్టమే వివరిస్తున్నది. పార్టీ వారికోసం వారి నియోజకవర్గంలో చేసే ఖర్చుపై పరిమితుల్లేవు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 జిజిబి ప్రకారం రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చిన కంపెనీకి పూర్తి మినహాయింపు ఉంటుంది. ఇచ్చిన విరాళం సొమ్మును ఆదాయంలోంచి పూర్తిగా మినహాయించవచ్చు. అంటే విరాళాలు ఇచ్చిన కంపెనీకి తీసుకున్న రాజకీయ పార్టీకి ఆదాయపు పన్ను బాధ ఉండదు. ఇంత అద్భుతమైన సౌకర్యం మరే వ్యవస్థకూ లేదు, ఏ సంఘానికీ ఇవ్వలేదు. అంటే ఆదాయం వచ్చే మార్గం సుగమం చేశారు. పన్ను కట్టే అవసరం లేదు. కనీసం చెప్పే పని లేదు. ఎంతైనా వసూలు చేసుకోవచ్చు. ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు. ఒక పార్టీకి వంద కోట్ల రూపాయల ఆదాయం ఉందనుకుందాం. వేరే కంపెనీయో వ్యక్తో అయితే ముప్పై మూడు కోట్ల రూపాయల పన్ను చెల్లించాల్సిందే. రాజకీయ పార్టీ అయితే చెల్లించనవసరం లేదు. అంటే ప్రభుత్వం తనకు రావలసిన 33 కోట్ల ఆదాయాన్ని పార్టీకోసం వదులుకుందన్నమాట. ఇది ప్రజ లకు రావలసిన డబ్బు. అంటే అంత డబ్బు ఆ పార్టీకి జనం ఇచ్చినట్టే కదా. రాజకీయ పార్టీల ఆదాయం వందకోట్లు కాదు వందలు వేలు లక్షల కోట్లలో ఉంటుంది. లక్ష కోట్ల పార్టీకి జనం 33 వేల కోట్లు ఏటేటా ఇస్తూనే ఉన్నారు. ఇంకా వారి అభ్యర్థుల ప్రచారానికి ప్రజల డబ్బు ఇవ్వడం అవసరమా? ఎందుకివ్వాలి? వారు రాజ్యాంగ మౌలిక స్వరూపమైన ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నందుకా? తమ పార్టీ నిర్వహణలో అభ్యర్థుల ఎంపికలో ఆదాయ వ్యయాల నివేదికల్లో సత్యప్రమాణాలు పాటిస్తున్నందుకా లేక పారదర్శకంగా ఉన్నందుకా? నేరగాళ్లను పక్కన బెట్టినందుకా? (కొత్త ఢిల్లీలో డిసెంబర్ 8న ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన అవినీతిపై సమష్టి పోరాటం అనే అంశంపై జాతీయ సదస్సులో రచయిత ప్రసంగ సారాంశం) (వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com ) -
అది యూజీసీ బాధ్యతే!
విశ్లేషణ ‘జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తయే’ తమకు స్ఫూర్తి అనే యూజీసీ జ్ఞానాన్ని కాకపోరుునా, కనీసం సమాచారమైనా ఇవ్వాలి. చట్టబద్ధ సంస్థ యూజీసీ తాను గుర్తించిన కోర్సుల విలువ, నాణ్యతల సమాచారాన్ని ఇవ్వాల్సిందే. కెరీర్ అడ్వాన్ ్సమెంట్ స్కీంలో పదోన్నతికి యోగ్యతనిచ్చే కోర్సుల వివరాలను ఒక అధ్యా పకుడు ఆర్టీఐ కింద యూజీసీని, ఇగ్నో (ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం) ను అడిగాడు. ఇగ్నో ఆ దరఖాస్తును యూజీసీకి బదిలీ చేసింది. వివరణలు ఇవ్వవలసిన బాధ్యత ఆర్టీఐ కింద తమకు లేదని యూజీసీ తిరస్కరించింది. అండర్ సెక్రటరీ స్థారుు అధికారి (పీఐఓ) వివరణలిచ్చే బాధ్యత లేదనడం సమంజసమా? జాయింట్ సెక్రటరీ (మొదటి అప్పిలేట్ అధి కారి) డాక్టర్ రేను బాత్రా కూడా ఈ అవసరాన్ని గుర్తిం చలేదు. యూజీసీ చట్టం సెక్షన్ 12 ప్రకారం అది దేశ, విదేశ విశ్వవిద్యాలయాల నుంచి అవసరమైన సమాచా రాన్ని సేకరించి ఇక్కడి విశ్వవిద్యాలయాలకు ఇవ్వాలి. అక్రమ వసూళ్లు ఆపే అధికారం 1984లో యూజీసీ చట్టాన్ని సవరించి ఫీజు రెగ్యులేషన్, డొనేషన్ల నిషేధ అధికారాలను ఇచ్చారు. రెగ్యులేషన్‌లో పేర్కొన్న పరిధులు దాటి విద్యాసంస్థలు అధికంగా ఫీజులు, చార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. కోర్సులో ప్రవేశానికి, కొనసాగించడానికి పరోక్షంగా చెల్లింపులు, విరాళాలు, బహుమతుల కోసం ఒత్తిడులు చేయడానికి వీల్లేదు. డిగ్రీలు ప్రదానం చేయకుండా విద్యాసంస్థలను నిషేధించేందుకు, ప్రభుత్వ అంగీకారంతో ఉత్తర్వులు జారీ చేసే అధికారం యూజీసీకి ఉంది. కమిషన్ సిఫా ర్సులను నిరాకరించినా, రెగ్యులేషన్లను, సెక్షన్ 12 ఏ నియమాలను ఉల్లంఘించినా ఆ విశ్వవిద్యాలయానికి ప్రతిపాదిత గ్రాంట్లను నిలిపివేసే అధికారం కూడా యూజీసీకి ఉంది. కోర్సుల ఫీజులను, ప్రమాణాలను క్రమబద్ధీకరించాలి. ఆ అంశాలపై యూజీసీ కనుక అభ్యంతరం తెలిపితే ఆ కళాశాల గానీ యూనివర్సిటీ గానీ ఆ కోర్సుకు సంబంధించిన డిగ్రీలు ప్రదానం చేయడానికి వీల్లేదు. సమాచారాన్ని సేకరించి ఇచ్చే బాధ్యత, విద్యా ప్రమాణాలను, సమంజసమైన ఫీజులను క్రమబద్ధీ కరించే బాధ్యత కలిగి ఉన్న యూజీసీ ఆ కోర్సుల వివ రణలు ఇవ్వవలసిన అవసరం లేదని నిరాకరించడం సమంజసం కాదు. ‘జ్ఞాన్ విజ్ఞాన్ విముక్తయే’ (విముక్తి కలిగించేది జ్ఞానమూ, విజ్ఞానమే) అని స్ఫూర్తిగా పెట్టు కున్న యూజీసీ ఆ లక్ష్య సాధన కోసం జ్ఞానం కాక పోరుునా, కనీసం సమాచారమైనా ఇవ్వవలసి ఉంటుంది. చట్టబద్ధ సంస్థ యూజీసీ తాను గుర్తించిన కోర్సుల విలువ. నాణ్యతల సమాచారాన్ని ఇవ్వాల్సిందే. ఆ వివరణలు యూజీసీ తప్ప మరెవరూ ఇవ్వలేనపుడు, ఇంకెవరిని అడిగే వీలుంటుంది? విధాన లోపం ఇలా వివరణలు ఇవ్వబోను అని యూజీసీ నిర్ణరుుంచు కోవడం విధాన లోపం అనిపిస్తున్నది. ఈ సంగతి ఈ ఆర్టీఐ అర్జీ ద్వారా తేలింది. ఆర్టీఐ చట్టాన్ని యూజీసీ చట్టంతో కలిపి చదివితే, సెక్షన్ 4(1)(సీ)(డీ) కింద విద్యావిధానానికి సంబంధించిన అంశాలను తమంత తామే వెల్లడించాల్సిన బాధ్యత యూజీసీకి ఉందని తేలుతుంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు అడిగిన సందేహాలను గుర్తించి, అర్థం చేసుకుని, తీర్చవలసి ఉంటుంది. అందుకు తరచు అడిగే ప్రశ్నలకు సమా ధానాలు తయారుచేసే బృందాన్ని అధికారికంగా నియమించాలి. వారు ఆర్టీఐ దరఖాస్తులలో వెల్లడైన సందే హాలను పరిశీలించి ఊఅఖ సమాధానాలు తయారు చేయాలి. సెక్షన్ 2(ఎఫ్) కింద వివరణలు, అభిప్రా యాలు ఇవ్వడం ిపీఐఓకు సాధ్యం కాదనడానికి వీలున్న మాట నిజమే. కానీ యూజీసీ వంటి విద్యావిధాన రూప కల్పనా సంస్థ, కోర్సుల నాణ్యత వివరించి, ఏయే సంద ర్భాలలో వాటిని యోగ్యతా పత్రాలుగా స్వీకరించాలో నిర్ణరుుంచి, ఆ వివరాలు ఇవ్వడం మౌలిక బాధ్యత. అది విధానపరమైన బాధ్యత. కనుక ఆర్టీఐ కింద వివరణ ఇవ్వడమే యూజీసీ బాధ్యత. ఆర్టీఐ చట్టం సెక్షన్ 19(8)(ఏ) నాలుగో భాగం ప్రకారం పబ్లిక్ అథారిటీ కొన్ని కొత్త ప్రక్రియలను, పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా సమాచారాన్ని వెల్లడి చేయాలని సూచించే అధికారం సీఐసీకి ఉంది. కనుక ఊఅఖ రూపకల్పన ద్వారా ఇటువంటి వివరణలు ఇవ్వా లని, తమంత తామే వీటిని వెబ్సైట్లో ఉంచాలని కమిషన్ ఆదేశించింది. సెక్షన్ 4ను అమలుచేసే అధి కారం కమిషన్‌కు లేదు. కాని ఆ సెక్షన్ కింద వెల్లడి చేయాల్సిన సమాచారం ఇవ్వనపుడు, ఆర్టీఐ కింద అడి గిన సందర్భంలోనైనా ఇవ్వాలి. ఆ దశలో సెక్షన్ 4ను సెక్షన్లు 3, 6, 20 ద్వారా అమలు చేసే అధికారం కమి షన్‌కు ఉంటుంది. ఇవ్వవలసిన సమాచారం ఇవ్వనం దుకు యూజీసీ ిపీఐఓకి జరిమానా ఎందుకు విధించ కూడదో తెలియజేయాలని కమిషన్ కారణ వివరణ నోటీసు జారీ చేసింది. (రామకిషన్ శర్మ వర్సెస్ యూజీసీ కేసు నంబర్ cic/cc/A//2014/001770 కమి షన్ 27.09.2016 తీర్పు ఆధారంగా). వ్యాసకర్త మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
గాడితప్పిన దేశ పాలన:మాడభూషి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్ల దేశంలో పరిపాలన నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొందని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పనిలేదని, జడ్జీలను కూడా నియమించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఇంద్రసేన కంచర్ల రాసిన ‘ఛేంజింగ్ పొలిటికల్ ట్రెండ్స్ ఇన్ ఇండియా అండ్ ది వరల్డ్’ పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాడభూషి మాట్లాడుతూ.. ఈ దేశంలో గవర్నెన్స్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇప్పుడు దేశంలో ఉన్నది నిరుద్యోగ సమస్య కాదు. నిరుద్యోగ ఖాళీలను భర్తీ చేయలేని సమస్య. సమాచార కమిషనరేట్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయం సహా దేశంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లోను సరిపడా ఉద్యోగులు లేరు. పోస్టులున్నా, జీతాలకు డబ్బులున్నా ఉద్యోగాలను భర్తీ చేసే దిక్కు లేదు. జడ్జీలను నియమించక పోవడంపై చీఫ్ జస్టిస్ కన్నీరు పెట్టుకోవడానికి గల కారణాలను విశ్లేషించాలి’ అని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థలో 30 శాతం ఖాళీలు ఉన్నాయంటే 30 శాతం మంది ముద్దాయిలకు శిక్షలు పడనట్టేనని, వ్యవస్థ ఉండగానే సరిపోదని, దానికి పనిచేసే శక్తినివ్వాలని పేర్కొన్నారు. ఆర్జించిన ఆదాయానికి మించిన కేసులో ఓ ముఖ్యమంత్రి జైలుకు వెళ్లి నిర్దోషిగా బయటకు వచ్చారంటే ‘ఆర్జించిన ఆదాయాని’కి డెఫినేషన్ తెలియకపోవడమేనన్నారు. ఢిల్లీ రాజ్యంగ స్వరూపంలో 70 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చిన వారు కూడా కేంద్రం పరిధిలో లేకపోతే విలువ లేదని, అక్కడ లెఫ్ట్‌నెంట్ గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రి పరిపాలనను శాసిస్తారే తప్ప ముఖ్యమంత్రి కాదని ఆయన పేర్కొన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే తీరు దేశంలో తీవ్రంగా ఉందన్నారు. విమర్శలు చేస్తే క్రిమినల్ డిఫర్మేషన్ కేసులు పెట్టే విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. అన్ని పర్యావరణ, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడాన్ని ఆయన తప్పుపట్టారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై విస్తృతస్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక అంశాలు మొదలుకొని కశ్మీర్ వంటి సమస్యల దాకా మేధావులు, రచయితలు, కవులు తమ అభిప్రాయాలను వెలుబుచ్చేందుకు వేదిక ఉండాలన్నారు. ఢిల్లీలోని ఇండియా ఇన్ఫర్మేషన్ సెంటర్ తరహాలో హైదరాబాద్‌లో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వేదిక కోసం గతంలో ప్రయత్నం జరిగినా, వెనక్కు పోయిందని, ఇకనైనా 2 లేదా 3 ఎకరాల్లో ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. మానవత్వం గల ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టాలు స్వేచ్ఛగా అమలు కావాలని ఆశించే సిన్సియర్ సిటిజన్ కంచర్ల ఇంద్రసేన అని కొనియాడారు. బాధ్యత గల మేధావిగా ఆయన రాసిన వ్యాసాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో భావప్రకటన స్వేచ్ఛ మరుగున పడడం ప్రమాదకర సంకేతమన్నారు. దేశంలో గతంలో ఎన్నడూ చూడని విచ్ఛిన్నకర రాజకీయాలు ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య, గొడ్డు మాంసం తిన్నారని చంపేసే తీరు దేశంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయన్నారు. రచయిత ఇంద్రసేన కంచర్ల రాసిన పుస్తకాన్ని ప్రొఫెసర్ గోపాలరావు పరిచయం చేయగా, రాజ్యసభ మాజీ సభ్యుడు ఎస్. రామచంద్రారెడ్డి, కొండలరావు ప్రసంగించారు.