పిల్లి అలవెన్సు అడిగేవారే లేరా?
గొప్ప రికార్డులను కూడా చెదలు, ఎలుకలు తింటూ ఉంటే థాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంటారు. ఎలుకలు దస్తావేజులు తింటూ ఉంటే వాటిని పట్టుకోవడానికి పిల్లిని పెంచుకునేందుకు ప్రభుత్వం కొంత భత్యం ఇస్తుందని బాస్వాన్ చెప్పారు.
సర్కారీ దస్తావేజులను ఎలుకలు తినేస్తుంటాయని తెలుసా? వాటిని నిర్మూలించడానికి పిల్లిని పెంచుకోవచ్చని తెలుసా? అందుకోసం ప్రభుత్వం కొంత భత్యం కూడా ఇస్తుందని తెలుసా? కక్షగట్టిన తోటి అధికారులు అసూయతో వేధిస్తుంటే బాధిత ఆఫీసర్లను రక్షించేది ఆర్టీఐ. దస్తావేజులు మాయం చేసి అవినీతి కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత గొప్ప చట్టాలైనా ఎంత గొప్ప తీర్పులనైనా సరే నిర్వీర్యం చేయగలరు. ఏ నియమాలూ లేవనుకున్నా సరే మేలు చేయదలచుకుంటే చేయగలరు. అధికారులు ఉత్తములైతే దుర్మార్గపు నేతలు కూడా ఏమీ చేయలేరు. ఐఏఎస్ వారే దుర్మార్గులైతే మంచి రాజకీయ నాయకులను కూడా నాశనం చేయగలుగుతారు.
1995 నాటి కొన్ని ఫైళ్ల నంబర్లు ఇచ్చి తనపైన పెండింగ్‌లో ఉన్నాయన్న సీబీఐ కేసులేమిటి, వాటి పరిణామాలేమిటి, సంబంధిత కాగితాల నకళ్లు ఇవ్వాలని సీనియర్ అధికారి విజేంద్రసింగ్ జాఫా ఆర్టీఐ ద్వారా అడిగారు. పీఐఓలు దీంతో ఫుట్ బాల్ ఆడుకున్నారు. ఎస్ జె ఈ శాఖ, గిరిజన శాఖ, విజిలెన్సు విభాగం దానిని తంతూనే ఉన్నాయి. సాంఘిక న్యాయ మంత్రిత్వ శాఖనుంచి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖను విడిగా రూపొందించిన తరువాత పాత ఫైళ్లు తమ వద్ద లేవన్నారు. విజేంద్ర జాఫా 20 ఏళ్ల కిందట రిటైరయ్యారు. అనారోగ్యంతో రాలేకపోతే మిత్రులు భారతేంద్ర సింగ్ బాస్వాన్ అనే మరో సీనియర్ అధికారి వచ్చారు. జాఫా అవినీతిని సహించే వారు కాదు. తన పైనున్న డైరెక్టర్ అక్రమాలపైన ప్రాథమిక పరిశోధన చేసి మరింత దర్యాప్తు జరపవలసిన తీవ్ర అంశాలని నిర్ధారణ చేసుకున్న తరువాత సమగ్రమైన ఫిర్యాదు చేశారు. దానికి ప్రతీకారంగా ఆ పెద్ద అధికారి జాఫా మీద నిరాధారమైన ఆరోపణలతో ఫిర్యాదులు చేయడం వల్ల తీవ్రమైన మనోవేదనకు గురైనారు. అవి అవాస్తవాలని రుజువు కావాలన్నదే ఆయన తపన అని బాస్వాన్ వివరించారు.
ఐఏఎస్ తెలివి తేటలు దుర్మార్గంగా ఉంటే దేశానికి ప్రమాదమే. అవినీతిపరులైన అధికారులను పై వారు కింది వారు సమర్థిస్తూ ఎంతో ఐకమత్యంతో తమ అక్రమాలను కాపాడుకుంటూ ఉంటారు.వారికి డబ్బుకు కొరత ఉండదు. ఇక నీతిమంతులు కలసి ఉండే అవకాశం లేదు. నానాటికీ వారి సంఖ్య తగ్గిపోతున్నది. కలసి పోరాడడానికి భయపడతారు. డబ్బు కూడా దొరకదు. చట్టం సహకరించదు. కోర్టుల్లో కొన్ని యుగాలు పడుతుంది. మంచి అధికారి ఈ దుర్మార్గుల అవినీతికి రుజువులు సంపాదించే లోగా, అవాస్తవ ఆరోపణలు విసరడంతో మంచి పనులన్నీ ఆగిపోతాయి. జీతాల్లో కోతలు, పింఛను నిర్ధారణలో ఆలస్యాలకు ఈ అబద్ధపు కేసులు వాడుకుంటారు. వారిని వేధించి అక్రమార్కులు బయటపడతారు. కాని సక్రమాధికారులమీద మచ్చలు తుడవరు. ఫిర్యాదులు ఫైళ్లలో ఉంటాయి. ఆ ఫైళ్లు దొరకనీయరు. విచారణ పూర్తి చేయరు.
కనీసం ఆ ఫైళ్లను ఇవ్వరు. ఆర్టీఐ విభాగంలో పనిచేసే సీపీఐఓలు పై అధికారుల చేతిలో పావులు. పైవారు ఏది రాయమంటే అది రాస్తారు. జవాబివ్వకుండా గుట్టలకొద్దీ ఫైళ్లు నిర్మిస్తారు. రెండో అప్పీలులో సమాచార కమిషన్ ముందుకు ఏ సమాచారమూ లేకుండా ఒక క్లర్కును పంపిస్తారు. ఆ ఫైళ్లు లేవు ఏంచేస్తారో చేస్కోండి అని వాదించడమే వీరు సాగించే దుర్మార్గం. జాఫా గారికి కూడా అదే జవాబు. మంత్రులకు, ప్రభుత్వాలకూ ఇవి పట్టవు. పాత దస్తావేజులు తొలగించేందుకున్న విధానాన్ని పాటించరు. ఎప్పుడు ఏ రికార్డు తొలగించారో ఒక రిజిస్టర్‌లో రాయాలి. రాయరు.
ఆశ్చర్యమేమంటే గొప్ప రికార్డులను కూడా చెదలు, ఎలుకలు తింటూ ఉంటే థాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకుంటారు. ఎలుకలు దస్తావేజులు తింటూ ఉంటే వాటిని పట్టుకోవడానికి పిల్లిని పెంచుకునేందుకు ప్రభుత్వం కొంత భత్యం ఇస్తుందని బాస్వాన్ చెప్పారు. పిల్లి భత్యం ఉంటుందని చాలామందికి తెలియదు. అయినా ఫైళ్లు తిని ఎలుకలు మేలు చేస్తుంటే పిల్లిని పెంచడమెందుకు? ఆ అలవెన్సు అడిగేదెవరు?
లంచగొండుల లంచాలను, నీతిపరుల నీతిని రుజువు చేయగల సాక్ష్యాలు దస్తావేజులు. వాటినే మాయం చేయడం ఐపీసీ కింద నేరం. పబ్లిక్ రికార్డు చట్టం కింద కూడా నేరం. ఆర్టీఐలో ఫైళ్లు దొరకడం లేదు కనుక సమాచారం ఇవ్వకుండా ఉండే మినహాయింపు లేదు. బ్రిటిష్ పాలనాకాలంలో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేది. దేశాన్ని దోచుకున్న వివరాలు ఫైళ్లలో ఉండకపోయినా పాలనకు సంబంధించిన వివరాల దస్తావేజులు కాపాడేవారు. స్వతంత్రం వచ్చిన తరువాత కూడా కొన్ని శాఖల వారు కాగితాలు, పత్రాలు రక్షించే ప్రక్రియ కొనసాగించారు. కాని రాను రాను ఒక్కొక్క శాఖ దస్తావేజులను వృథా పదార్థాలుగా భావించే బాధ్యతారాహిత్య ధోరణిని అలవరుచుకున్నాయి.
అవినీతి పరులు ఇష్టారాజ్యంగా ఫైళ్లు మాయం చేయడానికి ఇందువల్ల వీలు కలిగింది. లంచగొండుల సంఖ్య పెరగడం వల్ల మంచి అధికారులకు మరణయాతన తప్పడం లేదు. కోరిన సమాచారం ఇవ్వనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో తెలపాలని, పోయినాయన్న దస్తావేజులు వెతడానికి తీసుకున్న చర్యల వివరాలు ఇవ్వాలని, వెంటనే అడిగిన పత్రాలన్నీ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. (విజేంద్ర జాఫా వర్సెస్ సాంఘిక న్యాయ శాఖ కేసుCIC/MOS-J-E-/A- /2017/181342 లో ఇచ్చిన తీర్పు ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com