ఆ మధ్య ఓ కథ స్మార్ట్ ఫోన్లలో చక్కర్లు కొట్టింది. హాంగ్‌కాంగ్‌లో బ్యాంకును దోచుకోవడానికి దొంగలు వచ్చినప్పుడు యువ ఉద్యో గులు కొందరు హీరోల్లా లేచారట. ‘‘కదిల్తే కాల్చే స్తాం. ఈ సొమ్ము మీది కాదు. కాని ప్రాణాలు మీవి, జాగ్రత్త’’ అని దొంగలు అరిచారు. అంతే, అంతా భయపడ్డారు. దొంగలు తోచినంత దోచుకుపో యారు. ఎంబీఏ పాసైన చిన్నదొంగ, ఆరోతరగతి ఫెయిలయిన పెద్దదొంగతో ‘ఎంత దోచామో లెక్క పెడదామా’ అన్నాడట. ‘ఎందుకు రా, టైం వేస్ట్, సాయంత్రానికి టీవీ చానెళ్లు చెప్పవూ!’’ అని అన్నాడు పెద్ద దొంగ. అన్నగారి అనుభవానికి ముచ్చట పడ్డాడు చిన్నోడు.
అక్కడ బ్యాంకు మేనేజరు, దొంగలు వెళ్లిపోగానే 100 ఫోన్ కలుపుతు న్నాడు. అనుభవజ్ఞుడైన సూపర్ వైజర్ ఆపి ‘‘సార్ తొందర పడతారెందుకు. 20 మిలియన్ల డాలర్లు వాళ్లు దోచుకున్నారు. ఇప్పటికే ఓ 70 మిలియన్లు మాయమయ్యాయని మనం బాధపడుతున్నామా, అది వీరి ఖాతాలో వేద్దాం. మరో పది మిలియన్లు ఇప్పటి ఖర్చులకు తీసుకుందాం, అంతా వారు దోచుకున్నట్టే కదా’’. సూపర్ వైజర్ తెలివితేటలకు మేనేజరు ఎంతో ముచ్చట పడ్డాడు. ‘‘బ్రదర్ నెలకో సారి దోపిడీ జరిగితే ఎంతబాగుండు’’ అనే మాటలు అతని నోటివెంట అనుకోకుండా వెలువడ్డాయి. సాయంత్రం టీవీ చానెళ్లలో వంద మిలియన్ డాలర్ల దోపిడీ జరిగిందని ప్రకటించారు. దాని మీద ముగ్గురు నిపుణులు బిగ్ డిబేట్‌లో కొట్టుకోవడం చూసి పెద్దదొంగ డబ్బు ఎన్ని సార్లు లెక్కించినా 20 మిలియన్లు దాటడం లేదని చెప్పాడు. ఇద్దరూ నోరెళ్లబెట్టారు. ‘‘మనం ప్రాణాలకు లెక్కచేయ కుండా కష్టపడితే దక్కింది ఇది. వాళ్లు చూడు, ఒక్క పెన్ను దెబ్బతో 80 మిలియన్లు దొబ్బారు. పద వుల్లోఉన్న దొంగల ముందు మనమెంతరా? ఎంబీఏ కాదు, పొలిటికల్ సైన్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ చదవాలి సార్’’ అన్నాడు చిన్నదొంగ.
ఇక మన దేశం విషయానికి వస్తే, అప్పు లక్షయినా, రెండు లక్షలయినా రైతులు తీర్చలేరు. నమ్మిన పొలం పండలేదు. కొన్న మందులు పురు గుల మీద పనిచేయలేదు. రుణదొంగలంటే భరించలేక ఆ మందు తాగారు. పనిచేసింది. 1998 నుంచి 2018 దాకా మూడు లక్షల మంది రైతులు ఇలా ప్రాణాలు తీసుకున్నారు. మరో వైపు పారిశ్రామిక వేత్తలు దాదాపు ఏడు వేల మంది వేల కోట్ల రూపా యలు అప్పు చేసి, సూట్ కేసులతో దేశం వదిలిపెట్టి పారిపోయారు. రైతుల అప్పులు మాఫీ చేస్తామని రాజకీయపార్టీలు ఎన్నికల ముందు హామీ ఇచ్చి వారి ఓట్లు దండుకుంటాయి. రుణ మాఫీ పూర్తిగా చేయ కుండా కొంత తగ్గించి మాఫీ చేసినట్టు ప్రకటించు కుంటారు. సులభంగా వ్యాపారం చేయడం సుపరి పాలనగా చెప్పుకుంటూ ప్రభుత్వాలు పోటీ పడతాయి. ఢిల్లీలో ర్యాంకులిచ్చి అవార్డులు ప్రకటిస్తారు. సులభ వ్యాపార పాలనా ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు తేలికగా పర్మిషన్లతో పాటు పారిశ్రామిక వేత్తలకు అప్పులు కూడా ఇస్తాయి.
రాయిటర్ అనే వార్తాసంస్థ బోలెడు ఆర్టీఐ దర ఖాస్తులు వేసి, రిజర్వ్‌బ్యాంక్ అందించిన సమా చారం ప్రకారం దేశంలో మొండి బాకీలు రూ. 9.5 లక్షల కోట్లు అని తేల్చింది. ఇది జూన్ 2017 నాటి లెక్క. కావాలని రుణం ఎగ్గొట్టే పెద్దలు రూ.110 లక్షల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టారని ఓ పత్రిక వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో రూ. 11,300 కోట్ల కుంభకోణం జరిగింది. మూడు లక్షల మంది సభ్యులున్న అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘాల సమాఖ్య ఈ స్కాం చూసి చలించిపోయింది.
అయ్యా, ఈ దొంగల పేర్లు బయట పెట్టండి అని ఈ సమాఖ్య సభ్యులు వినతి పత్రం సమర్పిం చారు.
ఈ అప్పులు ఎగ్గొట్టిన కంపెనీల డైరెక్టర్లకు వీసాలు రాకుండా పాస్ పోర్టులు ఆపండి బాబో అని హోం మంత్రి దగ్గర మొత్తుకున్నారు. వాళ్ల పిచ్చిగాని వినే వారెవరు? వీరికి విరివిగా రుణాలు ఇవ్వడానికి పోటీపడి ముందుకొచ్చిన బ్యాంకు డైరెక్టర్లను ఏం చేస్తారు? విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి రుణ చోర వీరుల పేర్లయినా ఎందుకు బయటపెట్టరు? అని ఈ సమాఖ్య రిజర్వ్‌బ్యాంక్‌ను అడిగింది. అప్పులు తీర్చాలనే ఉద్దేశంలేని ఇలాంటి వారికి రుణాలు మాఫీ చేయడం ఎందుకని ఈ సమాఖ్య బ్యాంకులను కూడా ప్రశ్నించింది. ఏడు వేల మంది మిలియనీర్లు వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకుని దేశం వదిలి పారిపోయారు. అంతేకాదు, పౌరసత్వం మార్చుకుని వారు దర్జాగా విదేశాల్లో స్థిరపడ్డారన్న వార్తలు చదివిన వారికి బ్యాంకు అధికారుల సమాఖ్య ప్రశ్నలు గుర్తొస్తాయి. కంచికి వెళ్లని ఈ కథలో నీతి: బ్యాంకులిచ్చే అప్పు కాగితాల మీద సంతకాలు చేసి డబ్బు లాగేసే సౌక ర్యం ఉన్నప్పుడు తుపాకులతో బ్యాంకు దోపిడీల అవసరం ఏముంటుంది?
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment