మొత్తానికి ఉపఎన్నికల పండుగ ముగిసింది. ఉత్తరాదిన బీజేపీ పాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్ మళ్లీ పాగా వేసింది. కానీ ఆంధ్ర, తెలంగాణల్లో డిపాజిట్ కోల్పోయినందుకు కాంగ్రెస్ చాలా సంతోషంగా ఉన్నట్లుంది. వ్యూహాత్మకంగా తెరాసను ఓడించింది తానే అనే భావనతో ఉంది. అయితే బీజేపీకి తన ఓట్లను ధారాదత్తం చేయలేదని, చేయిగుర్తుకు కాకుండా కమలానికే ఓటు వేయాలని ప్రచారం చేయలేదని కాంగ్రెస్ నేతలు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. మన అవకాశవాదాలు ఆకాశానికి ఎదగడం, మన సిద్ధాంతాలు (ఉంటే గింటే) పాతాళానికి పడిపోవడం మామూలేకదా బ్రదర్.
రాజకీయాల్లో విలువలు వలువలు అని కొందరు చేసే గోల పక్కకు బెట్టి అందరూ ఓటుకు నోటు విలువ పెంచారని మనమంతా గర్వించాలి. పైగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈసారి ఓటర్లు డబ్బుల పంపిణీ విషయమై సమానత్వం కోసం పోరాడారు. అందరికీ సమానావకాశాలు ఉండాలనే సూత్రం ఈసారి ఓటర్లకు బాగా వంట బట్టింది. కొందరికి 6 వేల రూపాయల కవర్లు ఇచ్చి మమ్మల్ని కవర్ చేయకుండా వెళ్లిపోతారా అని రోడ్లెక్కి ధర్నా చేసారు మరి. పక్క ఇంట్లో ఓటుకు ఆరువేల చొప్పున నలుగురికి 24 వేలిచ్చి, తమ ఇంట్లో ఓటర్లను నోట్లతో గుర్తించకపోవడం ఎంత ఘోరమైన అన్యాయం? దాన్ని నిలదీసి అడగడమే కరెక్టు. అడక్కపోవడం రాజ్యాంగ వ్యతిరేకం.
ఓటుకు నోటు గురించి ప్రజాస్వామ్యవాదులు అంతగా గాభరాపడడం దండగ అనిపిస్తుంది. డబ్బు తీసుకుని కూడా ఓట్లేయలేదనడం, వాళ్లిచ్చే డబ్బు తీసుకోండి కాని మాకే ఓటేయండి అనడం చాలా దారుణం. రాకరాక అవకాశంవస్తే ఎందుకు తీసుకోగూడదనే తర్కం జనంది. డబ్బు తీసుకుని ద్రోహం చేస్తారని కూడా అనలేము. అందుకే ఈటెల మెజారిటీ 25 వేలు దాటలేదు.
హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థుల కాట్లాట కాదు. ప్రభుత్వాల కొట్లాట. అటు కేంద్ర ప్రభుత్వం, మంత్రులు, ఎన్నికల కమిషన్, ఆల్ పవర్ ఫుల్ బీజేపీ, తనచేతిలో అంతకు ముందు చావుదెబ్బతిన్న పార్టీలో చేరి ఆ పార్టీకి మనుగడ ఇచ్చేంత మంచితనం కలిగి, చాలా పలుకుబడి ఉన్న ఉత్తమ అభ్యర్థి ఈటెల, బీసీ కులం వెన్నుదన్ను, వాటికన్న గొప్పగా డబ్బు, దాన్ని మించిన మతం మత్తు, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోవడానికి కూడా సంసిద్ధంగా ఉండడం ఒకవైపు కలిసి వచ్చాయి కదా. ప్రత్యర్థులెవరు? రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, డబ్బు, గొప్ప వ్యూహకర్త హరీశ్ రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, డబ్బు ఇవ్వకున్నా పనిచేసిన కార్యకర్తలు, డబ్బు తీసుకుని నీతిమంతంగా ఓటేసిన ఓటర్లు కలిసి ఇటునించి ఎదురీత ఈదారు. పాపం ఈ మత్త మత్తు గజాల తొక్కిసలాటలో పార్టీలు, నేతలు, అభ్యర్థులు, ఓటర్లు నలిగిపోయారు. ఈ మహాసంకుల కులసమరంలో సామాన్యుడి మీద పడిన గ్యాస్ బండధర గురించి ఎవడికి పట్టింది? హమ్మయ్య పెట్రోల్ ధర తగ్గిం చారని అనుకుంటే డొమెస్టిక్ వర్కర్ లక్ష్మి ‘ఏం లాభమయ్యా బండ ధర బెంచెగద’ అన్నది. పెట్రోల్ ధర వంద దాటించినంత మాత్రాన 5 రూపాయలు తగ్గిస్తే మోసమంటారా? వాణిజ్య గ్యాస్ బండ ధర 266 రూపాయలు పెంచి రూ.2,130కి తీసుకుపోయినా వంట గ్యాస్ పెంచలేదని భజనపరుల తర్కం. పరోక్షంగా దీని దెబ్బ సామాన్యుల మీదే కదా. అలాగే వంట గ్యాస్ బండ ధర 2021 జనవరిలో రూ. 746లు ఉండగా, అక్టోబర్‌లో ఇది రూ. 952కు పెరిగింది.
ఇదివరకు ఎన్నికలు ఉంటే ధరలు పెంచడానికి కాస్త సిగ్గుపడే వారు. నేడు నాయకులను చూసి సిగ్గు గారు సిగ్గుపడి పారిపోతారు. నేతల భజన చేస్తూ ఓట్లు వేస్తుంటే, గ్యాస్ ధర పెంచడానికి రాజ కీయ పార్టీలు ఎందుకు సిగ్గుపడతాయి? సారా మత్తు, డబ్బు మత్తు, కులం మత్తు, వీటన్నింటికి మించి దేవుడి మత్తులో ఓటర్లు మునిగిపోతే నాయకులు ధరలు పెంచకుండా తగ్గిస్తారా?
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్
డీన్,స్కూల్ ఆఫ్ లా, మహీంద్రా యూనివర్సిటీ
ఓట్ల డబ్బు పంపిణీలో సమానత్వం
Published Tue, Nov 9 2021 3:16 AM | Last Updated on Tue, Nov 9 2021 3:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment