
ఎన్నికలలో రిగ్గింగ్ చేయ డంవల్లనే కొన్నిపార్టీలకు సుడిగాలి విజయాలు సాధ్యమవుతున్నాయని ఏదో ఒక మూల అనుమానం చాలామందికి వస్తూనే ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం) వచ్చిన తరువాత ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేకుండా పోతున్నారు. ఎంపీ సుబ్రమణ్యస్వామితో కలిసి హైదరాబాద్‌కు చెందిన వి.వి.రావు ఈవీఎం లోపాలపై ఉద్యమం నిర్మించే కార్యక్రమం చేపట్టారు. వీరి కృషి వల్లే వీవీప్యాట్ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) ప్రవేశ పెట్టారనీ అంటారు.ఎన్నికల మోసాలను పేపర్ ఆడిట్ ట్రయల్ ద్వారా అరికట్టవచ్చుననీ అంటున్నారు. కాగితం లేని ఈవీఎంల కన్నా పరీక్షించే ఆస్కారం ఉన్న వీవీప్యాట్ ఈవీఎంలు చాలావరకు నయం. ఇదివరకు ఓట్ల సంఖ్యలో తేడా వస్తే మళ్లీ ఓట్లను లెక్కించే వీలుండేది. కానీ సైబర్ డబ్బాలలో ‘స్టోర్డ్ ఓట్లు’ అంటే పడి ఉన్న ఓట్లను ఎన్నిసారు లెక్కించినా ప్రయోజనం లేదు. కనుక ఈవీఎంను సైబర్ మాయల పేటిక అని అనుకోవచ్చు. మీట నొక్కితే ఏం జరుగుతుందో ఎవరికీ కనిపించదు. వీవీప్యాట్ ఉంటే మామూలుగా ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించినట్టే వీటిని కూడా లెక్కించవచ్చు అన్నారు గానీ, ఇటీవలి తెలంగాణ ఎన్ని కల్లో మళ్లీ లెక్కించమని అడిగితే ఎన్నికల సంఘం కుదరదని చెప్పేసింది.
ఎవరో కావాలని కుట్ర చేయకపోయినా, చెడిపోయినందుకు కూడా యంత్రం సరిగ్గా పనిచేయకపోవచ్చు. అందువల్ల కొందరు గెలవచ్చు మరికొందరు ఘోరంగా ఓడిపోనూవచ్చు. ఈ అనుమానాస్పదమైన వాతావరణంలో లండన్‌లో ఒకాయన తాను సయ్యద్ షుజా, సైబర్ నిపుణుడినని చెప్పుకుంటూ ఈవీఎంల లోగుట్టు విప్పి చూపిస్తానని సవాలు విసిరి జర్నలిస్టుల సమావేశం ఏర్పాటు చేశాడు. కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ప్రత్యేకంగా లండన్ వెళ్లి విలేకరులకు వీడియో ప్రదర్శన నిర్వహించే వేదిక మీద కూర్చున్నారు. షుజా లండన్ రాలేదు. కాలిఫోర్నియా నుంచి వీడియో సమావేశంలో పాల్గొన్నాడు. సగం ముఖం దాచుకుని అంతగా వెలుగు లేని మసకమసక గదిలో కూచుని షుజా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ తన ప్రదర్శనలో విఫలమైనాడని పత్రికలు వెల్లడించాయి. షుజా ఆరోపణల తీవ్రత ఎంత గాఢంగా ఉందంటే దేన్ని నమ్మాలో తెలియక జనం గందరగోళంలో పడతారు. షుజా లేవనెత్తిన సంచలన భయానక ఆరోపణలు కొన్ని:
1. బీజేపీ ప్రభంజనం వీచిన 2014 లోక్‌సభ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగింది. 2. ఈవీఎం టాంపరింగ్ వల్ల కాంగ్రెస్ 201 సీట్లను కోల్పోయింది. 3. మోదీ కేబినెట్‌లో చేరిన గోపీనాథ్ ముండేకు 2014 రిగ్గింగ్ ఏ విధంగా జరిగిందో తెలుసు. అందుకే మంత్రి అయిన కొద్దిరోజులకే చని పోయాడు. ఈ రహస్యం తెలుసుకనుకనే ఆయన్ను చంపేశారు. 4. ముండే మరణ ఘటనపైన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి ప్రయత్నించినందుకే ఎన్‌ఐఏ ఆఫీసర్ తాంజిల్ అహ్మద్‌ను చంపేశారు. 5. కాంగ్రెస్ లీడర్ కపిల్ సిబల్ 2014 ఎన్నికలలో బీజేపీని గెలిపించేందుకు రిగ్గింగ్ చేయమని అడిగారు. 6. 2015 లో ఢిల్లీ ఎన్నికలలో ఈవీఎం రిగ్గింగ్‌ను షుజా అనుచరులు నిరోధించడం వల్లనే ఆప్ పార్టీ 70లో 67 స్థానాలను గెలిచింది. 7. మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఛత్తీస్‌గఢ్ ఎన్నికలలో బీజేపీ రిగ్గింగ్ ప్రయత్నాలను షుజా నిరోధించడం వల్లనే ఆ రాష్ట్రాలలో బీజేపీ గెలవలేకపోయింది. 8. బీజేపీ ఈవీఎం హాక్ చేయడానికి రిలయన్స్ కమ్యూనికేషన్ వారు సహకరించారు. 9. గౌరీ లంకేశ్ ఈ రిగ్గింగ్ కథనాన్ని ప్రచురించడానికి సిద్ధపడ్డారు. ఈ విషయమై ఆర్టీఐ కూడా వేశారు. అందుకే హత్యకు గురయ్యారు.
ఇందులో ఏ ఆరోపణలకు కూడా షుజా సాక్ష్యాలు చూపలేదు. షుజా మిగిలిన ఆరోపణలకు రుజువులు ఇచ్చినా ఇవ్వలేకపోయినా, కనీసం హాకింగ్ సాధ్యమని రుజువు చేస్తారనుకున్నారు. అక్కడా షుజా విఫలమైపోయారు. తాను పనిచేశానని ఆయన చెప్పుకున్న సంస్థలలో ఏ సంస్థా దాన్ని ధ్రువీకరించలేదు. ఎన్నికల సంఘం వెంటనే ఈ ఆరోపణలు ఖండించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించింది. ఎన్నికల సంఘం చేతులు కలపడం వల్లనే రిగ్గింగ్ సాధ్యమైందని ఆరోపణ చేసినందున వారు అధికారికంగా ఖండించడం సమంజసమే అనిపించినా, అసలు రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందా లేదా అని ప్రజలకు విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఈ ఆరోపణల్లో లవలేశమైనా నిజం ఉండొచ్చునని అనుమానించే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ఈవీఎం ద్వారా ఎన్నికల ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కలిగించే బాధ్యత ఎన్నికల సంఘం మీదే ఉంది.
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
మాడభూషి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment