సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం నిర్వహించి ఫలితాలను వెనువెంటనే వెల్లడించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు ఎక్కడ ఫలితాలను తారుమారు చేస్తాయేమో అన్న ఆందోళన ప్రతిపక్ష పార్టీలను పట్టుకు పీకుతోంది. ఆ పార్టీలు గత కొన్నేళ్లుగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వాటిని పాలకపక్షం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందంటూ గొడవ చేస్తూనే ఉన్నాయి. అసలు ట్యాంపరింగ్ అంటే ఏమిటీ? అందుకు నిజంగా అవకాశాలు ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటివి? వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈవీఎంలు అంటే ఏమిటీ ? అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఈవీఎంలు అంటే...
భారత పార్లమెంట్‌కు, రాష్ట్ర అసెంబ్లీలకు గతంలో బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరిగేవి. అది సుదీర్ఘమైన ప్రహసనం. ఓట్లు లెక్కించి పూర్తి ఫలితాలు ప్రకటించేందుకు రెండు రోజులు కూడా పట్టేది. మందీ మార్బలంతో పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకొని రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం కూడా ఉండేది. ఆ ఎన్నికల ప్రక్రియ స్థానంలో ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లు వచ్చాయి. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగాన్ని ‘కంట్రోల్ యునిట్’గా వ్యవహరిస్తారు. ఈ యునిట్ ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి వద్ద ఉంటుంది. ఈ యునిట్ ప్రతి ఓటును లెక్కించి తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇది కరెంట్‌ఫై ఆధారపడకుండా బ్యాటరీపైనే నడుస్తుంది. ఇక రెండో విభాగాన్ని ‘బ్యాలెటింగ్ యునిట్’ అంటారు. వీటిపై అభ్యర్థుల పేర్లు, వారి పార్టీ గుర్తులుగల బటన్లతో ఓ ప్యానెల్ ఉంటుంది. ఈసారి అభ్యర్థుల ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు.
ఈవీఎం ప్యానల్‌పైనున్న బటన్‌ను నొక్కి ఓటు వేయడం మూడవ విభాగం. ఓటరు ఏదైనా బటన్‌ను నొక్కినప్పుడు ఆ బటన్‌పైనున్న అభ్యర్థి పేరిట ఓటు పడుతుంది. ఇప్పుడు ఓటరు తానేసిన ఓటు ఎవరికి పడిందో తెలుసుకునేందుకు వీలుగా ‘వీవీపీఏటీఎం’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓటరు బటన్‌ను నొక్కగానే దానికి అనుసంధానించిన మరో యంత్రం స్క్రీన్ మీద ఆ ఓటు ఎవరికి పడిందో తెలియజేసే ఓ కాగితం ఏడు సెకడ్లపాటు కనిపిస్తుంది. ఆ తర్వాత అది యంత్రం లోపలి బాక్సులో పడిపోతుంది. ఈ మరో యంత్రాన్నే ‘వోటర్ వెరీఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషీన్ (వీవీపీఏటీఎం)’ అని వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత తనిఖీ చేసినప్పుడు ఈవీఎం మొదటి యునిట్‌లో నిక్షిప్తమైన డేటాతో వీవీపీఏటీఎంలో పడిన స్లిప్పులతో సరిపోవాలి.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చా?
ఓటింగ్ జరిగినప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైన డేటాను తారుమారు లేదా తలకిందులు చేయడాన్ని ట్యాంపరింగ్‌గా పేర్కొనవచ్చు. అంటే ఓడిపోయిన అభ్యర్థిని గెలిచినట్లుగా, గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లుగా చూపడం. ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. ఇంటర్నెట్ ద్వారా డేటాను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కనుకనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. అయినా ట్యాంపరింగ్ చేయాలంటే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి భౌతికంగా ఈవీఎంలను చేతుల్లోకి తీసుకొని అనుకూలంగా ట్యాంపర్ చేయవచ్చు. అసలు ఓటరుకు బదులు ఇతరులు బటన్ నొక్కి ఓటు వేయవచ్చు. ఎన్నికల సిబ్బంది, సీసీటీవీ కెమేరాలు, వివిధ పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో ఉంటారు కనుక అలా చేయడం అసాధ్యం. ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీల్‌చేసి గట్టి సెక్యూరిటీ మధ్య వాటిని నిల్వచేసే ‘స్ట్రాంగ్ రూమ్’లకు పంపిస్తారు.
మరి ఎలా ట్యాంపర్ చేయవచ్చు?
ఈవీఎంలను తరలించే క్రమంలోగానీ, వాటిని స్ట్రాంగ్ రూముల్లో నిల్వ చేసినప్పుడుగానీ వాటిని తస్కరించి వాటి స్థానంలో ముందుగా ట్యాంపరింగ్ చేసిన ఈవీఎంలను ఏర్పాటు చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయవచ్చు. స్ట్రాంగ్ రూమ్‌లకు తీసుకెళ్లే ఈవీఎంలకు నెంబర్లు, దానికి ఎన్నికల అధికారుల సంతకాలతో కూడిన సీలింగ్ ఉంటుంది. ఓట్లను లెక్కించే సమయంలో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. అక్రమాలకు పాల్పడాలంటే సంతకాల ఫోర్జరీ, సీల్ సరిపోవాలి. పైగా పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ వరకు గట్టి భద్రత మధ్య వాటిని తరలించడమే కాకుండా అడుగడుగున వాటిపై నిఘా ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల కమిషన్ నియమించిన ‘మైక్రో’ పరిశీలకులు సహా పలు రకాల పరిశీలకులు, వీడియో గ్రాఫర్లు తోడుగా ఉంటారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద అభ్యర్థి తాలూకు వ్యక్తి ఒకరు 24 గంటలపాటు కాపలా ఉండేందుకు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పిస్తోంది. కనుక అదంతా ఈజీ కాదు.
పాలకపక్షాలకు అవకాశం ఉంటుందా?
స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను మార్చే అవకాశం పాలకపక్షాలకు ఉంటుందనేది అన్ని ప్రతిపక్షాల ఆరోపణ. పాలకపక్షం తలచుకుంటే ముందస్తు ప్రణాళికతో ఈవీఎంల నెంబర్లను, ఎన్నికల అధికారులు సూచించే కోడ్‌లను ముందే తెలుసుకోవచ్చు. అప్పుడు భద్రతా సిబ్బందిని, పలు అభ్యర్థుల నిఘాపరులను ప్రలోభపెట్టి ఈవీఎంలను తారుమారు చేయవచ్చు. అందుకు ఎన్నికల కమిషన్, పోలింగ్ నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది, పార్టీల ఏజెంట్లు కుమ్మక్కు కావాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం. అన్నింటికన్నా ముఖ్యం ఎన్నికలను తారుమారు చేయాలనుకునే వ్యక్తుల వద్ద ఈవీఎంలు ఉండాలి. వాటిని సాధించడం కూడా అంత సులభం కాదు.
ఈవీఎంల తయారు చేసే చోటే జరగవచ్చా?
ఈవీఎంలను తయారు చేసే చోటే వాటిని ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉంది. ఒకరికి ఓటు వేసేందుకు బటన్‌ను నొక్కితే మరొకరికి వెళుతుందంటూ ప్రత్యక్షంగా ఈవీఎంలను సవాల్ చేసినవాళ్లు ఉన్నారు. దేశంలో రెండు ప్రభుత్వరంగ సంస్థలు (ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్) మాత్రమే వీటిని తయారు చేస్తున్నాయి. వాటిని తయారు చేస్తున్న ఇంజనీర్లను పట్టుకొని తయారీలోనే ట్యాంపరింగ్ చేయవచ్చు. వాళ్లు తయారు చేసిన ఈవీఎంలు దేశంలో ఏ ప్రాంతానికి వెళతాయో వారికే కాదు. కంపెనీ యజమానులకు కూడా తెలిసే అవకాశం లేదు. నామినేషన్ల గట్టం పూర్తయ్యే వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు, ఎంత మంది నిలబడతారో తెలియదు. అలాంటప్పుడు ముందుగా ట్యాంపరింగ్ చేయడం కూడా సాధ్యం కాదు.
వీడియోల్లో కనిపించే ఈవీఎంలు
స్ట్రాంగ్ రూముల్లోకి వెళ్లాల్సిన ఈవీఎంలు దారితప్పాయంటూ మనం పలు వీడియోలను సాక్షంగా చూస్తుంటాం. ఆ ఈవీఎంలు అత్యవసరం కోసం అందుబాటులో ఉంచిన అదనపు లేదా మొరాయించిన ఈవీఎంలని ఎన్నికల కమిషన్ వర్గాలే స్పష్టం చేశాయి. ఎన్నికల మార్గదర్శక సూత్రాల ప్రకారం అదనపు లేదా మొరాయించిన ఈవీఎంలను కూడా గట్టి భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లోకి తరలించాలి. ఈ విషయంలో ఈసీ వర్గాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయో అర్థం కాదు. ఈవీఎంలను మార్చడం సాధ్యం కాదు కనుక వాటిని ఎత్తుకు పోవచ్చు. యూపీ, బీహార్, పంజాబ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షల ఈవీఎంలు గల్లంతయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాటిలో నిజానిజాలను ఈసీ వర్గాలే తేల్చాలి.
వీవీపీటీఎం పద్ధతే మంచిది
ఈవీఎంలలో ఓట్లతోపాటు వీవీపీటీఎంలను లెక్కించడం ద్వారా అవకతవకలను సులభంగానే కనిపెట్టవచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ కేంద్రానికి మాత్రమే దీన్ని పరిమితం చేస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొనగా, సుప్రీం కోర్టు ఆ సంఖ్యను ఐదింటికి పెంచింది. ఈ సంఖ్యను 33 నుంచి 50 వరకు పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment