సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన ఎన్నికలను 2014లో కంటే సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ తప్పుడు ప్రచారం కొనసాగుతుండటం వెనుక ఉన్న శక్తులపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇందుకు ప్రధాన కారణమని ప్రాథమికంగా వెల్లడైంది. ప్రధానంగా మూడు జిల్లాల అధికారులు ఉద్దేశ పూర్వకంగా విధుల నిర్వహణలో అలసత్వం వహించినట్లు తేలింది. ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే సరి చేయడం కోసం బెంగళూరు నుంచి 600 మంది సాంకేతిక నిపుణులను రప్పించి, ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున కేటాయించినా వారిని ఉపయోగించుకోనట్లు తేలింది. కనీసం వీరికి రూట్ మ్యాప్‌లు కూడా ఇవ్వలేదన్న విషయంలో తెలియడంతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందువల్లే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందని భావిస్తున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 37, ప్రకాశంలో 25, గుంటూరు జిల్లాలో 21 చోట్ల రాత్రి తొమ్మిది దాటాక కూడా పోలింగ్ జరిగినట్లు గుర్తించారు.
ఈవీఎంల మొరాయింపుపై అనుమానం
అన్ని జిల్లాలో సక్రమంగా పనిచేసిన ఈవీఎంలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే మాటిమాటికి మొరాయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల ఆరేడు సార్లు ఈవీఎంలు మార్చడం వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఏమైనా దాగి ఉందా అనే విషయంపై ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారిస్తోంది. ఉదాహరణకు కృష్ణా జిల్లా తీసుకుంటే మైలవరం నియోజకవర్గంలో అర్ధరాత్రి దాటినా పోలింగ్ జరగడం, నూజివీడు నియోజకవర్గంలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా వినియోగించని ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి మార్చడం, పెనమలూరు నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత ఈవీఎంలను చాలా ఆలస్యంగా స్ట్రాంగ్ రూమ్‌లకు చేర్చడం.. ఇలా ఒకే జిల్లా నుంచి పలు ఫిర్యాదులు వస్తుండటంపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా తప్పులు చేసిన అధికారులపై ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయడానికి కూడా వెనుకాడమని ద్వివేది హెచ్చరించారు. సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ జరగడానికి గల కారణాలు రాత పూర్వకంగా ఇవ్వాలని 13 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని చోట్ల ఏర్పాట్లు సరిగా చేయకపోవడానికి గల కారణాలను కూడా తెలియజేయాలన్నారు. రాజంలో మైనర్లు ఓటు వేసిన ఘటనల్లో వెంటనే నివేదికలు పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పోలింగ్ మరుసటి రోజు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈవీఎంలను ఆర్వో అప్పగించలేదన్న విషయమై కలెక్టర్‌ను నివేదిక కోరామని, అయితే అలాంటిదేమీ లేదని కలెక్టర్ నివేదిక ఇచ్చారని ద్వివేది చెప్పారు.
చర్యలు మొదలు పెట్టిన ఈసీ
ఈవీఎంల భద్రత విషయంలో కొంత మంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఎన్నికల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై ఎలక్షన్ కమిషన్ చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసినట్లు దివ్వేది తెలిపారు. ఇప్పటికే నూజివీడు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తహసీల్దారు పి.తేజేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. కృష్ణా యూనివర్సిటీ భవనంలో భద్రపరిచిన నూజివీడు నియోజకవర్గ రిజర్వు ఈవీఎంల తరలింపుపై అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తున్న నూజివీడు తహసీల్దార్ తేజేశ్వరరావుకు ఎన్నికల అధికారులు కొద్ది రోజుల క్రితమే షోకాజ్ నోటీసు జారీ చేశారు. స్ట్రాంగ్ రూంలలో ఉన్న ఈవీఎంలను కదలించకూడదని ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ వీటిని ఎందుకు తరలించారనే విషయమై ఉన్నతాధికారులు విస్తృత విచారణ చేపట్టారు. అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు వివాదం, ఈవీఎం స్ట్రాంగ్ రూంలో అనధికారిక వ్యక్తుల ప్రవేశంపై మరో ఇద్దరు అధికారులపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది.
ఐదు చోట్ల రీపోలింగ్‌కు అవకాశం
గూంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 94వ పోలింగ్ కేంద్రం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువులో ఉన్న 244వ పోలింగ్ కేంద్రం, నెల్లూరు అసెంబ్లీ పరిధిలోని ఇసుకపల్లిలో గల 41వ పోలింగ్ కేంద్రం, సూళ్లూరుపేట నియోజకవర్గం అటకానితిప్పలోని 197వ కేంద్రం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని 247వ పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని సీఈసీకి సిఫారసు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం వెలువరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment