సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను హ్యాకింగ్/ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ను డీ–కోడ్ చేయడం కష్టతరమని, వీటిలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్‌ను ఇన్‌స్టాల్ చేయలేరని సందీప్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో ఈవీఎంల సెక్యూరిటీని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ముఖ్యమైన వ్యక్తులు.. అభద్రతాభావంతో ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేనో ఎంబేడెడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా క్రిప్టాలజీ, ఎన్‌క్రిప్టింగ్ మీద 15ఏళ్లుగా పనిచేస్తున్నాను. నా అనుభవం ద్వారా తెలుసుకున్న వాస్తవాలను యావదాంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఓ ఈవీఎంను ట్యాంపర్ చేయాలంటే దానికి హార్డ్‌వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్‌వేర్ కీలకం. ఒకవేళ ఈవీఎంని నెట్‌వర్క్ వీడియోస్‌తో అనుసంధానం చేయాలంటే చాలా ఖరీదైన పని.
ఈవీఎంలలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్ ఇన్‌స్టాల్ చేయలేరు. ఒకసారి ఫర్మ్‌వేర్ కంపైల్ చేసిన తర్వాత ఈవీఎంపైన ఫ్లాష్‌చేస్తే.. రెండోసారి రీ–ఫ్లాష్‌చేసే అవకాశం ఉండదు. అదే విధంగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ యూనిట్ మధ్య జరిగే కమ్యూనికేషన్ ప్రొపరేటరీ సెక్యూర్ ప్రొటోకాల్ ద్వారానే జరుగుతుంది. ఏజెంట్ సమక్షంలో సమక్షంలో బ్యాటరీ స్విచాఫ్ చేస్తారు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అయిపోతుంది. దీంతో అటోమెటిక్‌గా ఈవీఎంలో మెమరీ అలాగే ఉన్నప్పటికీ.. బయటి వారు యాక్సెస్ చేసేందుకు వీలుండదు. ఈవీఎంలను హ్యాక్ చేయాలని ప్రయత్నించి చాలా మంది విఫలమయ్యారు’అని సందీప్ రెడ్డి వెల్లడించారు. మన ఈవీఎంలను చాలా దేశాల్లో వినియోగిస్తున్నారని.. కానీ కావాలనే కొందరు మన దేశంలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఓ హ్యాకర్ ఈవీఎంలను హ్యాక్ చేస్తానంటూ సవాల్ విసిరి భంగపడ్డారని సందీప్ తెలిపారు.
ఈ ఏడాది కూడా సయ్యద్ షుజా అనే వ్యక్తి యూకే నుంచి ఈవీఎంలను హాక్ చేస్తానని, గతంలో తాను ఈసీఐఎల్‌లో పనిచేస్తున్న సమయంలో హ్యాకింగ్ చేశానని చెప్పుకున్నారు. దీంతో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్, మరికొందరు మీడియా, రాజకీయ ప్రముఖులు లండన్ వెళ్లొచ్చారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అవాస్తవమని వారు తెలుసుకున్న విషయాన్ని కూడా సందీప్ రెడ్డి గుర్తుచేశారు. వీవీప్యాట్‌కు, బ్యాలెట్ యూనిట్‌కు మధ్య మార్పు జరిగే సమయంలో ట్యాంపర్ (మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్) జరుగుతుందంటూ కొందరు చేస్తున్న వాదన అర్థరహితం అన్నారు. ఏపీ ఎన్నికల సమయంలో 36 చోట్ల ఈవీఎంలు మోరాయించాయని.. అది కూడా ఆపరేటర్ అసమర్థత ద్వారానే జరిగిందన్నారు. ఇందులో ఈవీఎంల తప్పిదమేమీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment