ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) సేఫా..? వాటిలో పడిన ఓటు భద్రమేనాా..? ఈవీఎంలను హ్యక్ చేసి మెజారిటీ ప్రజలిచ్చిన తీర్పును మార్చొచ్చా..? ప్రస్తుతం ఈ ప్రశ్నలపైనే మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిపుణుల నుంచి సామాన్యుల దాకా ఈవీఎంల వాడకంపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు. ఇటీవల కొందరు పాపులర్ టెక్నాలజీ నిపుణులే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో ఈవీఎంలపై అనుమానాలకు శాస్త్రీయ నివృత్తి అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధినేత ఈలాన్ మస్క్ అయితే ఈవీఎంల వాడకానికి పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టాలని ట్వీట్ చేసి సంచలనానికి తెర తీశారు. మస్క్ ఈ తరహా అభిప్రాయం వెలిబుచ్చిన సమయానికే మహారాష్ట్రలోని ముంబై నార్త్‌వెస్ట్ నియోజకవర్గంలో ఓటీపీ ద్వారా ఈవీఎంను తెరిచారన్న వివాదం వెలుగులోకివచ్చింది. దీంతో ఈవీఎంల భద్రతపై చర్చ జోరందుకుంది.
భారత్‌కు చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేధావి శ్యామ్ పిట్రోడా కూడా ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమేమీ కాదన్నారు. వీరే కాక తాజాగా సైబర్ లా నిపుణుడు, ప్రముఖ న్యాయవాది పవన్ దుగ్గల్ కూడా ఇంచు మించు ఇదే చెప్పారు. ఈవీఎంలను హ్యాక్ చేసేందుకు ఛాన్సు లేకపోలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చా..? అనే సమాధానం లేని ప్రశ్న మళ్లీ అందరి మెదళ్లను తొలుస్తోంది.
అసలు మస్క్ ఏమన్నారు.. సందర్భమేంటి..?
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను తొలగించడంతో హ్యాకింగ్‌ను నివారించొచ్చని టెస్లా అధినేత మస్క్ ఇటీవల సూచించారు. అమెరికా నియంత్రణలో ఉన్న ప్యూర్టో రికోలో ఇటీవల నిర్వహించిన అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకొన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది’అని మస్క్ ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు.
మస్క్‌కు మాజీ ఐటీ మంత్రి కౌంటర్‌లో వాస్తవమెంత..?
మస్క్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన వెంటనే ఎక్స్‌లో మాజీ కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. భారత్‌లో వాడే ఈవీఎంలు అమెరికాలో వాడే తరహావి కావు. ఇక్కడి ఈవీఎంలు కంప్యూటర్ ప్లాట్‌ఫాం మీద తయారు చేయలేదు. వాటికి బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానించే అవకాశమే లేదు. రీ ప్రోగ్రామింగ్ కూడా వీలు లేదు. ఇలాంటి పరికరాలను హహ్యాక్ చేయడం కుదరదు. కావాలంటే ప్రపంచ దేశాలు భారత ఈవీఎంలను వారి ఎన్నికల్లో వాడుకోవచ్చు’అని సూచించారు.
రాజీవ్ చంద్రశేఖర్ లాజిక్ కరక్టేనా.. సైబర్ లా నిపుణుడు పవన్ దుగ్గల్ ఏమన్నారు..
‘ఒక కంప్యూటర్‌కు బయటి నుంచి ఎలాంటి నెట్‌వర్క్‌తో అనుసంధానం లేనపుడు హ్యాక్ చేయడం కష్టమే కావచ్చు. అయితే ఎలాంటి వ్యవస్థనైనా ఏమార్చి దానిలో జోక్యం చేసుకునే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నా. నిజానికి భారత్‌లో వాడుతున్న ఈవీఎంలకు సైబర్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి రక్షణ ఉందనేది మనకెవరికీ తెలియదు. భారత్‌లో అసలు సైబర్ భద్రతకు సంబంధించి పక్కా చట్టమే ఇప్పటివరకు లేదు.
‘ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు సంబంధించి ఈవీఎంలు ISO 27001 ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది నిపుణులు తేల్చాలి. ఈవీఎంల భద్రతకు ఎలాంటి సైబర్ సెక్యూరిటీ పప్రోటోకాల్‌ను వాడుతున్నారనేది ఇప్పటివరకు బహిర్గతమవలేదు. ఎవరికీ తెలియదు’అని సైబర్ లా నిపుణులు, ప్రముఖ న్యాయవాది పవన్‌దుగ్గల్ వ్యాఖ్యానించారు.
శ్యామ్ పిట్రోడా అనుమానాలేంటి..?
ఈవీఎంలపై టెక్నాలజీ నిపుణుడు శ్యామ్ పిట్రోడా కుండ బద్దలు కొట్టారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమేనని తేల్చి చెప్పారు. ‘ఎలక్ట్రానిక్స్, ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల మీద సమారు అరవై ఏళ్ల పాటు నేను పనిచేశాను. ఈవీఎం యంత్రాల వ్యవస్థనూ క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమే.
దీని వల్ల ఫలితాలు తామరుమారవుతాయి. ఈవీఎంల కంటే పాత బ్యాలెట్ పేపర్ విధానమే చాలా ఉత్తమమైంది. ఇందులో అయితే ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగవు. బ్యాలెట్ విధానాన్నే ఎన్నికల్లో అనుసరించాలి.
కొంత మంది చెబుతున్నట్లు ఈవీఎంలు కేవలం స్టాండలోన్ పరికాలే కాదు. వాటికి వీవీప్యాట్ వ్యవస్థ అమర్చి ఉంటుంది. ఇంతేగాక వీటిని తయారు చేసే క్రమంలో, రవాణా చేసే సందర్భాల్లో ఏమైనా జరిగేందుకు అవకాశం ఉంటుంది’అన్నారు.
బ్యాలెట్ పేపరే పరిష్కారమా..?
ఈవీఎంలపై ఇంతమంది ఇన్ని అభిప్రాయాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నపుడు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వాడితేనే బెటరని సామాన్యులతో పాటు పార్టీల అధినేతలు సూచిస్తున్నారు. ఈవీఎంలు వాడకంలో అయ్యే ఖర్చుతో పోలిస్తే బ్యాలెట్ విధానంలో ఖర్చు కొద్దిగా పెరిగినప్పటికీ, ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ ఓటర్లకు ప్రజాస్వామ్యంపై పూర్తి నమ్మకం కలగాలంటే బ్యాలెట్ పేపరే బెస్ట్ అన్న వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment