అఖిల పక్షాలతో ఈసీ సమావేశం
న్యూఢిల్లీ: ఈవీఎంల వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యింది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నదంటూ ప్రతిపక్షాలు గగ్గోలు రేపుతున్న నేపథ్యంలో ఈ అంశంపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఈసీ అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఏడు జాతీయ పార్టీలతో పాటు 48 ప్రాంతీయ పార్టీల నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్ నుంచి ఎంపీ వినోద్, టీడీపీ నుంచి ఎంపీ మాల్యాద్రి పాల్గొన్నారు.
కాగా ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఢిల్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతున్నాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. యూపీ నేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు లేవనెత్తారు. ఈవీఎంలను ఎత్తివేసి తిరిగి బ్యాలెట్ పేపర్లను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే విపక్ష నేతల బృందం ఈసీని కలిసి ఓ విజ్ఞాపన కూడా అందచేసింది.
అయితే, ఈవీఎంలపై ఆరోపణలు ఖండించిన ఈ విషయంలో స్పష్టత ఇచ్చేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఈసీ ఏర్పాటు చేసింది. ఈవీఎంలలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు రానున్న ఎన్నికల్లో వోటర్ వెరీఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)ను ఉయోగించాలని భావిస్తున్నట్టు ఈసీ తెలిపింది.