న్యూఢిల్లీ: ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)లను ట్యాంపర్ చేస్తున్నారంటూ పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) రాజకీయ పార్టీలు, నిపుణులకు బహిరంగ సవాల్ విసిరింది. ఎవరైనా ఈవీఎంలను ట్యాంపర్ చేసి నిరూపించాలంది.
ఇందుకోసం మే తొలివారంలో అవకాశం కల్పిస్తామనీ, అనుమానాలు ఉన్నవారు హ్యాకింగ్ చేసి నిరూపించవచ్చంది. 2009లోనూ హ్యాకింగ్‌ను నిరూపించేందుకు అవకాశమిచ్చినా, ఏ ఒక్కరూ రుజువు చేయలేకపోయారని ఈసీ గుర్తుచేసింది. హ్యాకింగ్ పరీక్ష పెట్టే తేదీలను మరో రెండ్రోజుల్లో ప్రకటిస్తామంది. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వల్లే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచిందని బీఎస్‌పీ ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఆ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను కూడా పరీక్షలో పెట్టాలని నిర్ణయించింది.