బందిపోట్లను ఇంగ్లిష్‌లో ఏమంటారో తెలుసా. ఇంగ్లిష్ ప్రొఫెసర్లు కూడా చెప్పలేరు. బౌన్సర్లు అంటారు. వీరు అర్ధరాత్రి మీ ఇండ్లమీదపడి దోచుకునేంత అమానుషమైన వ్యక్తులు కాదు. చాలా అందంగా దుస్తులు వేసుకుని హాస్పిటల్స్‌లో ఉంటారు. ఏ రోగమొచ్చినా సరే హాస్పటల్ వారడిగిన డబ్బిస్తే మీతో మర్యాదగా ఉంటారు. లేకపోతే రోగులకంటే ముందు వారి బంధువులు రోగులవుతారు. ఇప్పుడు వైరస్ సోకిన వారు చనిపోదలుచుకుంటే ప్రయివేటు ఆస్పత్రులకు పోవచ్చు. రోగంతో కాదు బిల్లు ఎక్కువైందని చెప్పి గొడవ చేస్తే తన్నులు తినొచ్చు. బౌన్సర్లు గట్టిగా కొడితే ప్రాణాలు పోవచ్చు. ఎందుకంటే కండలు పెంచిన యువకులను రక్షకులన్న పేరుతో, ప్రశ్నించే వారిని తన్ని పంపించడానికి నియమించుకుం టున్నారు. ఇది ప్రయివేటు వైద్య వ్యాపారుల నిజస్వరూపం. రోగులతో వారి బంధువులతో డాక్టర్లు మాట్లాడరు. ప్రజాసంబంధ ఉద్యోగులు మాట్లాడరు. నర్సులు మాట్లాడరు. కేవలం కండలుపెంచిన వారో, కరాటే వీరులో వివరిస్తుంటారు. వాళ్లు కొట్టాల్సిన పనిలేదు. వారి సిక్స్ ప్యాక్ శరీరాలు చూసి బతికున్నవారు శవాలైపోతామేమోనని భయపడి నోరుమూసుకోవలసిందే.
ఇది మానవ హక్కులన్నింటినీ కట్టగట్టి మూసీలో పారేసే దుర్మార్గపు కార్పొరేట్ వైద్య వ్యాపార నిర్వహణ. ప్రభుత్వాలు, ఆరోగ్యశాఖలు ఉంటే సిగ్గుపడి తలదించుకోవలసిన పద్ధతులు, వ్యవస్థలు. చేసిన చికిత్స ఏమిటో చెప్పరు. మెడికల్ రికార్డులు ఇవ్వరు. వేసిన ధరల సమంజసత్వం ఏమిటో చెప్పరు. ఎందుకంత విపరీతమైన రేట్లు వేస్తున్నారో వివరించరు. రోగి చనిపోతే శవం ఇవ్వరు. లక్షల రూపాయల బాకీలు తీర్చేదాకా శవం వారి అధీనంలో ఉంటుంది. అంత్యక్రియలు చేయకపోతే నరకానికి పోతారనే భయంతో జనం అప్పోసప్పో చేసి డబ్బు కట్టి బంధువుల మృతదేహాలు తీసుకోవలసిన దుస్థితి. ఎవ్వరికీ ఫిర్యాదు చేసి న్యాయం కోరే సమయం ఉండదు. కోర్టులు తెరవరు, చాలా అరుదైన విలువైన సమయాన్ని కోర్టులు, తమను ధిక్కరించే వారిని శిక్షించే పనిలో వినియోగిస్తూ ఉంటాయి. అన్నీ రాజ్యాంగబద్ధమే. పోనీ శవాన్ని వదిలేసి పోదామా అంటే కార్పొరేట్ మీడియా టీవీలు తండ్రి శవాన్ని వదిలేసిన క్రూరుడైన తనయుడు అని పొద్దుటినుంచి సాయంత్రందాకా సుత్తి కొడుతూనే ఉంటాయి. రెండు మూడు లక్షల రూపాయల డిపాజిట్ చేసిన తరువాతనే మీ రోగం ఏమిటో పరీక్షిస్తారు. మీ రోగి జబ్బు వదులుతుందో లేదోగానీ మీ డబ్బు మాత్రం వదులుతూ ఉంటుంది. డాక్లర్లు నర్సులనబడే ఉద్యోగులు మీకందించే సేవలకు మీరు సంతుష్టులు కాకుండా హాస్పిటళ్ల డైరెక్టర్లను కలిసి నిలదీయాలనుకున్నపుడు మీ ముందు నిలబడేవారే బౌన్సర్లు.
ప్రభుత్వాలు ఏంచేస్తున్నట్టు? కరోనా వైరస్ కన్నా ఘోరంగా హాస్పిటల్ కార్పొరేట్ వైరస్ వ్యాపారులు ఇన్నాళ్లు విలయతాండవం చేసిన తరువాత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 12న ఒక ఉత్తర్వు జారీ చేసింది. గరిష్ట చిల్లర ధరకు మాత్రమే మందులు అమ్మాలని. తీసుకొన్న సొమ్ముకు బిల్లులు ఇవ్వాలని. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని. ఎంఆర్‌పీ ధరలకు అమ్మకపోతే చర్యలు తీసుకునే అధికారం వీరికి ఇంతకుముందు లేదా? ఎంఆర్పీ ధరలకు మందులు అమ్మని కార్పొరేట్ హాస్పటల్ యజమానులకు, డైరెక్టర్లకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందా? అరెస్టు చేసిందా? తీవ్రమైన హెచ్చరి కలు చేయడమేనా బాధ్యత? ఇదెట్లా ఉందంటే, బంది పోటు దొంగల్లారా దోచుకోకండి, దోచుకుంటే మిమ్మల్ని ఐపీసీ ప్రకారం శిక్షిస్తాం అని హోం మంత్రి విలేకరుల సమావేశంలో చెప్పినట్టు ఉంది.
బౌన్సర్ల వైద్యం పైన వెంటనే చర్యలు తీసుకోవాలనే జ్ఞానం లేదా? ఈ విషయమై విలేకరుల సమావేశంలో ఒక్కమాట కూడా చెప్పలేదే. ఒక్క రోగి బంధువు బౌన్సర్ బెదిరింపునకు గురైనా సరే మొత్తం హాస్పిటల్ యాజమాన్యంపైన చర్యలుతీసుకుని ఆ హాస్పిటల్ మూసేయించి, వారి అక్రమార్జనపైన వెంటనే దర్యాప్తు జరుపుతామని చెప్పాలి కదా? ప్రజల ప్రాణాలను రక్షించలేని ప్రభుత్వాలు ప్రభుత్వాలే కాదు. వాటికి పాలించే అర్హత లేదు. కోవిడ్–19 కన్నా దారుణాలు మనదేశంలో జరుగుతున్నాయి. ప్రైవేటు హాస్పిటళ్లు బందిపోటు దొంగల కన్నా దారుణంగా రోగాలను వాడుకుంటూ మధ్యతరగతి కుటుంబాలను దోచుకుంటూ ఉంటే చోద్యం చూస్తున్నాయి. మీ చావు మీరు చావండి అన్నట్టు మౌనం పాటిస్తున్నాయి. కార్పొరేట్ వాణిజ్య, ప్రయివేట్, ప్రభుత్వేతర గ్లోబల్ ప్రపంచీకృత అమానవీయ దుకాణాలు సజీవ శరీరాలతో.. తరువాత శవాలతో చేసే దోపిడీ వ్యాపారాన్ని ప్రస్తుతం వైద్యం అని పిలుస్తున్నారు. ఇది వ్యాపారులకు ప్రజల ప్రాణాల నైవేద్యమే తప్ప వైద్యం కాదు. వీరికన్నా కరోనా వైరస్ నయం. వీరిని సహించే ప్రభుత్వాలు ఈ వైరస్‌ను సృష్టించిన వారికన్న ఘోర విద్రోహులవుతారు.
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్,
కేంద్ర సమాచార మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
మాడభూషి శ్రీధర్
కొత్త బందిపోట్లు–వైద్యవ్యాపారులు, వారి బౌన్సర్లు
Published Fri, Aug 14 2020 12:35 AM | Last Updated on Fri, Aug 14 2020 12:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment