ప్రతీకాత్మక చిత్రం
నవాంగ్ గ్యాట్సో లాచెంపా ఒక నవ యువకుడు. ఈశాన్య రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్లి చదువుకున్న విద్యావంతుడు. చాలామంది వలె విదేశాల్లోనే స్థిరపడి అక్కడ డాలర్లు సంపాదించాలనుకునే (వి)దేశ భక్తుడు కాదు నవాంగ్. తన ప్రాంతానికి రావాలని, అక్కడ తన చదువుతో ఏమైనా చేయాలని అనుకున్న వాడు. కాని తీరా సిక్కింకు చేరుకున్న తరువాత అతనికి అవినీతి విలయతాండవం చేస్తూ కనబడింది. అక్కడా ఇక్కడా వ్యాపించిన భ్రష్టాచారాన్ని ఏ విధంగా ఆపడం? చివరకు మ్యూజియంలో కూడా అవినీతి.
కనిపించిన దారి ఆర్టీఐ. ఆర్టీఐకి దరఖాస్తు దాఖలు చేశాడు. మ్యూజియం గ్రాంట్ స్కీం పైన నిపుణుల సంఘం 29.12.2016నాడు జరిపిన 14వ సమావేశం నిర్ణయాలు (మినిట్స్) ప్రతులు ఇవ్వాలన్నాడు. ఈ సమావేశం జరిగిందని సాంస్కృతిక మంత్రిత్వశాఖ అంతర్జాల వేదికమీద రాశారని, ఈ సమావేశం సిక్కిం రాష్ట్ర మ్యూజియం ప్రాజెక్టు (అంచనా 1574 లక్షల రూపాయలు) గురించి జరిగిందని చెప్పారు. 31 డిసెంబర్ నాడు ఈ మెయిల్‌లో ప్రస్తావించిన నియమాలను పాటించకుండా రాష్ట్రం తన వంతు నిధులు ఇవ్వకపోతే ఏ చర్యలు తీసుకుంటారని కూడా అడిగారు.
సీపీఐఓ ఏ సమాధానమూ ఇవ్వలేదు. సిక్కిం రాష్ట్రానికి మ్యూజియం గ్రాంట్ స్కీంను మంజూరు చేసిన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ స్కీం అమలులో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై తగినచర్యలు తీసుకోవాలని రెండో అప్పీల్‌లో కోరారు. డిసెంబర్ 31, 2016 న కేంద్రం మంజూరు చేసిన నిధులను సిక్కిం రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల వారసత్వ శాఖ కార్యాలయంలో అధికారులు మింగారని కమిషన్‌కు విన్నవించారు. మ్యూజియం గ్రాంట్ స్కీంకు 1574 లక్షలు కేటాయించి, 500 కోట్లు విడుదల చేశారు. దీంతో సిక్కిం రాష్ట్ర మ్యూజియంను పునరుద్ధరించి ఆధునీకరించేందుకు రాష్ట్రం వంతుగా 10 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. ఎనిమిదినెలలు గడిచినా ప్రాజెక్టు మొదలు కాలేదు.
రాష్ట్రంలో వివరాలు ఇవ్వకపోవడంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి 8.4. 2018న ఫిర్యాదు చేశారు. సిక్కిం మ్యూజియం స్కీంలో నిధుల గల్లంతు జరిగిందని, ప్రాజెక్టు నిధులు లక్ష్యాల సాధనకు వినియోగించడం లేదని నవాంగ్ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. ఈ పనులపైన నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మంజూరీ లేఖ నుంచి మ్యూజియం గ్రాంట్ స్కీంపైన నిపుణుల కమిటీ 29 డిసెంబర్ 2016 నాటి 14వ మీటింగ్ నిర్ణయాల నివేదిక దాకా అన్ని పత్రాలు పరిశీలించిన తరువాత రూ. 3.44 కోట్లు మాత్రమే సిక్కిం రాష్ట్ర వాటాగా ఇచ్చిందని తేలింది.
నవాంగ్‌కు అన్ని పత్రాలు ఇవ్వడంతోపాటు ఈ ఆర్టీఐ దరఖాస్తును అప్పీలును మోసంపైన ఫిర్యాదుగా భావించి, విచారణ జరిపించాలని సమాచార కమిషన్ సూచించింది. నిజానికి నవాంగ్ అడిగిన సమాచారాన్ని నిరాకరించడానికిగానీ, వాయిదా వేయడానికిగానీ వీలు లేదు. ఇటువంటి సమస్యల మీద ఫైళ్లలో సమాచారం నమోదై ఉండకపోవచ్చు. కనుక సమాధానం ఇవ్వడానికి ఏమీ ఉండకపోవచ్చు. కానీ తమ వద్ద ఈ అంశంపై ఉన్న ఏ సమాచారమైనా సరే ఇవ్వకపోవడం తప్పవుతుంది. మ్యూజియం పునరుద్ధరణ ఫైళ్లను, సంబంధిత కాగితాలను అన్నీ దరఖాస్తు దారుడికి చూపడం ద్వారా పీఐఓ తన బాధ్యతను నిర్వర్తించవచ్చు. లేదా ఆయన అడిగిన ప్రశ్నలకు తమ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా సమాధానాలు ఇవ్వాలి. లేదా పై అధికారుల ముందు ఫైల్ ఉంచి సమస్య వివరించి అధికారులు తీసుకున్న నిర్ణయాలను వివరించాలి.
సమాచార హక్కు చట్టం నిష్క్రియపైన సవాలుచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. నెలరోజులలోగా నిర్ణయం తీసుకోలేకపోతే ఆ విషయం చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. నెలరోజులలో ఏ విషయమూ చెప్పనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని కమిషన్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. ప్రభుత్వంలో నిష్క్రియ, నిష్పాలన, నిర్లజ్జ ప్రధాన సమస్యలు. సిక్కిం మ్యూజియంలో అవినీతి జరిగిందని అనేక పర్యాయాలు ఈ యువకుడు ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడు లేడు. నిష్క్రియ నిశ్చేతనంపై సవాలు చేయడానికి ఆర్టీఐని నమ్మి ఆయన సమాచారం అడిగాడు. దానికి ఏవో కారణాలుచెప్పి కేంద్రం, రాష్ట్రం తప్పించుకోజూస్తున్నాయి. ఏవైనా చర్యలు తీసుకుంటే తప్ప ఏ చర్యలు తీసుకున్నారో చెప్పడానికి ఉండదు. చర్యలు తీసుకోరు కనుక జవాబు చెప్పకుండా కుంటిసాకులు చూపుతుంటారు. ఇందుకు సిక్కిం మ్యూజియం అవినీతి కేసు మరొక ఉదాహరణ. అంతే. (నవాంగ్ గ్యాట్సో లాచెంగ్పా కేసు CIC/MCULT/A/2017/607024 లో íసీఐసీ తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment