నియంతల పాలనలో మగ్గిన మానవాళి 800 ఏళ్ళ కిందట తొలిసారి హక్కుల గురించి ఆలోచించింది. మొదట అడిగిన హక్కు పిటిషన్ హక్కు. (వినతి పత్రం సమర్పించే హక్కు). ఆహార హక్కూ, బతుకు హక్కూ కాదు. అదే 1215 నాటి మాగ్నా కార్టా. పిటిషన్ పెడితే రాజధిక్కారం కింద జైల్లో వేసే రోజుల్లో అది చాలా గొప్ప హక్కు. రాజస్తాన్‌లోని ఒక కుగ్రామంలో జనం ఉచితభోజనం అడగలేదు. మా ఊళ్లో ఆవాస్ యోజన కింద ఇరవై ఇళ్ళు కట్టించారట. ఎవరికి ఇచ్చారో చెప్పండి చాలు అన్నారు. ఇరవై రోజులు ధర్నా చేసేదాకా పంచాయత్ పెద్దలు కదలలేదు. ఆ తరవాత వారు చెప్పిన పేర్లు వింటూ ఉంటే ఒక్కపేరుగలవాడూ ఉళ్లో లేడని తేలింది. అంటే ఇరవై ఇళ్ల సొమ్ము భోంచేశారన్నమాట. అదే చోట ఆ జనమే అవినీతి మీద పోరాడటం ప్రారంభించారు. ఆ పోరాట ఫలి తమే సమాచార హక్కు.
పిటిషన్ హక్కు సమాచార హక్కు చేతిలో ఉంటే ఇతర హక్కులు సాధించవచ్చు. రోజూ కొన్ని వేల మంది దేశ వ్యాప్తంగా చిన్న చిన్న సమస్యలను ఆర్టీఐ ద్వారా సాధిస్తున్నారు. పదిరూపాయల ఫీజు ఇచ్చి చిన్న సైజు పిల్ వేసే అవకాశం ఆర్టీఐ కల్పించింది. ప్రతి రాష్ట్రంలో పదిమంది కమిషనర్లు కూర్చుని వచ్చిన వారికి సమాచారం ఇప్పిస్తూ పోతే పింఛను ఆలస్యాలు, రేషన్ కార్డు లంచాలు, స్కాలర్‌షిప్ వేధింపులు వంటి రకరకాల సమస్యలు తీరుతున్నాయి. అయితే ఆ పది రూపాయల పిల్ హక్కుకు ఇప్పుడు ఎసరు పెడుతున్నారు. కమిషనర్ల అధికారాలు తగ్గిస్తున్నారు. వారి స్వతంత్రతకు తూట్లు పొడిచి తాబేదార్లను చేస్తున్నారు.
కమిషనర్ల పదవీకాలం ప్రస్తుతం అయిదేళ్లు లేదా వారికి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు అని 2005 చట్టం నిర్దేశిస్తున్నది. కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్‌కు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాను, సమాచార కమిషనర్‌కు కేంద్ర ఎన్నికల కమిషనర్ హోదాను ఆర్టీఐ చట్టం నిర్దేశించింది. ఏ ఉన్నతాధికారికైనా సమాచారం ఇవ్వమని ఆదేశించేందుకు ఈ సమున్నత స్థాయి అవసరమని ఆర్టీఐ చట్ట ప్రదాతలు భావిం చారు. ఈ చట్టానికి చేస్తున్న సవరణలు పార్లమెంటు ఆమోదం పొందితే, కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత కాలానికి మాత్రమే కేంద్ర, రాష్ట్ర కమిషనర్లను నియమించుకోవచ్చు. అప్పుడు కమిషనర్లు స్వతంత్రంగా పనిచేయడానికి ధైర్యంగా సమాచారం ఇవ్వండి అనడానికి వీలుండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పదవీ కాలం ఉంటుంది అని నియమాలు చేర్చుతారట. ఇప్పుడు ఆ హోదా ప్రభుత్వం వారు నోటిఫికేషన్ ద్వారా అప్పుడప్పుడు మార్చుకొనే సవరణ కావాలంటున్నారు.
ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా దాచిన ఫైళ్లలో దాగిన సమాచారాన్ని వెలికి తీయాలని ఆదేశించే అధికారం, స్వతంత్రత సమాచార కమిషనర్‌కు ఇవ్వకపోతే ఈ హక్కు అమలు కాదనే ఉద్దేశంతో వారి పదవీకాలాన్ని, హోదాను స్థిరీకరించింది ఆర్టీఐ చట్టం. సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తే తమకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చారని భయపడే ప్రభుత్వాలు ఏదో తప్పు చేసినట్టే. ఆ తప్పులు బయటపెట్టకుండా రహస్యాలు కాపాడటానికి సమాచార కమిషనర్లు తమకు లోబడి పనిచేయాలని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. ఈ చట్టం సవరణ ద్వారా అప్పుడు ఆదేశిస్తాయి.
కమిషనర్లను నియమించాలనుకున్నప్పుడల్లా రూల్స్ మార్చుకునే సౌకర్యాన్ని కట్టబెట్టే ఆలోచన ఇది. ఇప్పుడు ఎన్నికల కమిషన్‌తో సమాచార కమిషన్‌కు సమాన హోదా ఇవ్వడం తప్పని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తక్కువజేయాలని చూస్తున్నది. ఓటు హక్కు, సమాచార హక్కు రెండూ భావప్రకటన హక్కులో భాగాలే అయినప్పడు రెండూ ఎందుకు సమానం కావంటారు?
సమాచార హక్కు ఏ విధంగా అమలు చేయాలో వివరిస్తూ కమిషనర్లను నియమించే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేయడం వల్ల రాష్ట్రాల సార్వభౌమాధికారాన్ని కాపాడిందీ చట్టం. కాని రాష్ట్ర కమిషనర్ల పదవీకాలాన్ని హోదాను జీతాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుందని సవరించడం వారి సార్వభౌమాధికారంతో జోక్యం చేసుకోవడమే. కమిషన్ల నడ్డి విరిస్తే సమాచార హక్కును నీరు కార్చినట్టే. అప్పుడు అవి నీతి అక్రమాలకు అడ్డూ అదుపూ ఉండదు. అదేనా మనకు కావలసింది? ఆర్టీఐ జ్యోతిని ఆర్పివేయకుండా ఆపాల్సింది జనమే.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment