Right to Information
-
సమాచారహక్కుకు మరో గండం
ప్రాథమిక హక్కుల పరిధి విస్తృతమవుతున్నకొద్దీ ప్రజాస్వామ్య దేశంలో పౌరుల శక్తి పెరుగు తుంది. దేన్నయినా బహిరంగంగా నిలదీయగలిగే ధైర్యం వారికొస్తుంది. ఏ అంశాన్నయినా ప్రశ్నించి సంపూర్ణ సమాచారం రాబట్టే హక్కు, అధికారం వారికి లభిస్తాయి. సరిగ్గా ఈ కారణాలే 2005లో అమల్లోకొచ్చిన సమాచార హక్కు చట్టానికి తరచు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఈ చట్టం పరిధిలోకి మేం రామంటే... మేం రామని ఎవరికి వారు మొరాయిస్తున్న ధోరణులు, తప్పిం చుకుందామని చూసే తత్వం కనబడుతున్నాయి. పాలకుల నుంచి రాజకీయ పార్టీలు, వివిధ ప్రభుత్వ విభాగాల వరకూ అందరిదీ ఇదే వరస. ఇక క్షేత్ర స్థాయిలో సమాచారం రాబట్టడానికి ప్రయత్నించేవారి వివరాలు తెలుసుకుని బెదిరించడం, దాడులు చేయడం, కొన్ని సందర్భాల్లో హత మార్చడం వంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు సమాచార హక్కు కమిషనర్లపై వచ్చే ఫిర్యాదుల్ని పరిశీలించేందుకు, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఉన్నతాధికారు లతో కూడిన రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తలపెడుతోంది. ఇందులో ఒక కమిటీ సమాచార ప్రధాన కమిషనర్(సీఐసీ)పైన వచ్చే ఫిర్యాదుల్ని, మరో కమిటీ సమాచార కమిషనర్లపై వచ్చే ఫిర్యాదుల్ని పరిశీలిస్తాయని ఆ ప్రతిపాదన సారాంశం. దాని ప్రకారం సీఐసీపై ఫిర్యాదుల్ని పరిశీలించే కమిటీలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి, సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం కార్యదర్శి, ఒక రిటైర్డ్ సీఐసీ ఉంటారు. కమిషనర్లపై వచ్చే ఫిర్యాదుల్ని కేబినెట్ సెక్రటేరియట్‌లోని కార్యదర్శి, సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ విభాగం కార్యదర్శి, ఒక రిటైర్డ్ సమాచార కమిషనర్ ఉంటారు. ఆరోపణలకూ లేదా ఫిర్యాదులకూ ఎవరూ అతీతం కాదు. అవి నిజమని తేలితే అందుకు కారకులైనవారిని బాధ్యతల నుంచి తప్పించడం కూడా సబబే. కానీ అటువంటి ఏర్పాటు సమాచార హక్కు చట్టంలో ఇప్పటికే ఉంది. ఏవైనా ఫిర్యాదులున్న పక్షంలో రాష్ట్రపతి వాటిని సుప్రీంకోర్టుకు నివేదించాలని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 14(1) చెబుతోంది. ఆ ఫిర్యాదులపై విచా రణ జరిపి అవి నిజమని సుప్రీంకోర్టు నిర్ధారిస్తే సీఐసీని లేదా కమిషనర్లను రాష్ట్రపతి తొలగించ వచ్చు. సమాచార కమిషన్ ప్రధాన బాధ్యతే ప్రభుత్వ యంత్రాంగంలోని వివిధ శాఖల, విభాగా లపై వచ్చే ఫిర్యాదుల్ని పరిశీలించి తగిన ఆదేశాలివ్వడం గనుక సీఐసీ, కమిషనర్ల ఫిర్యాదుల్ని పరిశీలించే అధికారం ప్రభుత్వానికి అప్పగించరాదని ఆర్టీఐ చట్టం చేసినప్పుడు నిర్ణయించారు. ఇప్పుడు దీన్ని మార్చవలసిన అవసరం ఎందుకొచ్చిందో, ఇప్పుడున్న ఏర్పాటు వల్ల ప్రభుత్వాని కొచ్చిన ఇబ్బందేమిటో తెలియదు. అసలు ఈ ప్రతిపాదన కోసం చట్టాన్ని సవరించదల్చుకున్నారా లేక మరే మార్గంలోనైనా అమలు చేయాలని సంకల్పించారా అన్నది వెల్లడించలేదు. కేంద్రం తాజా ప్రతిపాదన చట్టంగా మారితే వచ్చే అనర్థాలు అన్నీ ఇన్నీ కాదు. సమాచార కమిషనర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేయడానికి ఇది ఆటంకంగా మారుతుంది. పౌరులు కోరే సమాచారాన్ని అందించాల్సిందేనని ఏ ప్రభుత్వ విభాగాన్నయినా సమాచార కమిషన్ ఆదేశిస్తే ఆ ఆదేశాలిచ్చినవారికి తిప్పలు మొదలవుతాయి. వారిపై వెల్లువలా ఫిర్యాదులు పుట్టుకొస్తాయి. ఉన్నతాధికారులతో కూడిన కమిటీ ఆ ఫిర్యాదులపై విచారిస్తుంటే ఏ కమిషనర్ అయినా ప్రభుత్వ విభాగాలపై తన ముందుకొచ్చే అర్జీల విషయంలో నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఆదేశాలివ్వడం సాధ్యమవుతుందా? సారాంశంలో దానివల్ల అంతిమంగా నష్టపోయేది పౌరులే. ఇప్పటికే సమా చార హక్కు చట్టం తీసుకొచ్చిన ఉద్దేశం దెబ్బతినేలా వివిధ శాఖలు వ్యవహరిస్తున్నాయి. పౌరుల నుంచి ఫలానా సమాచారం కావాలని అడిగినప్పుడు ఎడతెగని జాప్యం చేస్తున్నాయి. ఇక్కడ కాదు... అక్కడ అంటూ తిప్పుతున్నాయి. చివరకు ఆ సమాచారం తాము ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. ఆ శాఖలపై వచ్చే ఫిర్యాదుల గురించి సమాచార కమిషన్ నిలదీసినప్పుడు సైతం ఇదే తరహాలో ఆలస్యంగా జవాబిస్తున్నాయి. చివరకు ఆ సమాచారం ఇవ్వాల్సిందేనని ఆదేశాలొచ్చాక తప్పనిసరి పరిస్థితుల్లో అందజేస్తున్నాయి. అసలు ఆ చట్టం అమల్లోకి తెచ్చినప్పుడే దేశ భద్రత పేరు చెప్పి 22 సంస్థలను దాని పరిధి నుంచి తప్పించారు. ఆ తర్వాత కాలంలో ఆ జాబితాలో అనేకం వచ్చి చేరాయి. మరికొన్ని శాఖలు తమనూ చేర్చాలని అడుగుతున్నాయి. ఇక రాజకీయ పార్టీల సంగతి చెప్పనవసరమే లేదు. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పార్టీలు తాము దీని పరిధిలోకి ఎలా వస్తామని ప్రశ్నిస్తున్నాయి. న్యాయవ్యవస్థ కూడా ఈ చట్టం తమకు వర్తించ బోదన్న సమాధానమే ఇస్తోంది. సమాచార హక్కు చట్టం తీసుకురావడంలోని ఉద్దేశమే పార దర్శకత. కానీ ఆ పారదర్శకత మాదగ్గర సాధ్యం కాదని చెప్పేవారే పెరుగుతున్నారు!నిరుడు సమాచార ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల జీతభత్యాలు, హోదాలు, పదవీకాలం వగైరా నిబంధనల్లో మార్పులు తీసుకొస్తూ ఆర్టీఐ చట్టానికి కేంద్రం సవరణలు ప్రతిపాదించింది. రాజ్యసభలో ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టడానికి ప్రయత్నించింది. కానీ విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఆర్టీఐ చట్టం సీఐసీకి ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదా, సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల హోదాను ఇచ్చింది. అలాగే రాష్ట్రాలోని సమాచార ప్రధాన కమిషనర్లకు కేంద్ర ఎన్నికల కమిషనర్ల హోదా, అక్కడి సమాచార కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా ఇచ్చారు. జీతభత్యాలు కూడా ఆ హోదాలకు తగినట్టు నిర్ణయించారు. దీన్నంతటినీ మారిస్తే సమాచార హక్కు చట్టం ఉద్దేశమే దెబ్బతింటుందని, ఇది అంతిమంగా పౌరుల ప్రాథమిక హక్కును దెబ్బ తీస్తుందని అనేకులు విమర్శించారు. కారణమేదైనా ఆ సవరణ బిల్లు ప్రతిపాదన ఆగింది. మళ్లీ ఇప్పుడు తాజా ప్రతిపాదన ముందుకొచ్చింది. ప్రజాస్వామ్యానికి పారదర్శకతే ప్రాణప్రదం. దాన్ని నీరుగార్చాలని చూడటం సబబు కాదు. తాజా ప్రతిపాదనను కేంద్రం ఉపసంహ రించుకోవాలి. -
ఆర్టీఐ జ్యోతిని ఆర్పివేయవద్దు
నియంతల పాలనలో మగ్గిన మానవాళి 800 ఏళ్ళ కిందట తొలిసారి హక్కుల గురించి ఆలోచించింది. మొదట అడిగిన హక్కు పిటిషన్ హక్కు. (వినతి పత్రం సమర్పించే హక్కు). ఆహార హక్కూ, బతుకు హక్కూ కాదు. అదే 1215 నాటి మాగ్నా కార్టా. పిటిషన్ పెడితే రాజధిక్కారం కింద జైల్లో వేసే రోజుల్లో అది చాలా గొప్ప హక్కు. రాజస్తాన్‌లోని ఒక కుగ్రామంలో జనం ఉచితభోజనం అడగలేదు. మా ఊళ్లో ఆవాస్ యోజన కింద ఇరవై ఇళ్ళు కట్టించారట. ఎవరికి ఇచ్చారో చెప్పండి చాలు అన్నారు. ఇరవై రోజులు ధర్నా చేసేదాకా పంచాయత్ పెద్దలు కదలలేదు. ఆ తరవాత వారు చెప్పిన పేర్లు వింటూ ఉంటే ఒక్కపేరుగలవాడూ ఉళ్లో లేడని తేలింది. అంటే ఇరవై ఇళ్ల సొమ్ము భోంచేశారన్నమాట. అదే చోట ఆ జనమే అవినీతి మీద పోరాడటం ప్రారంభించారు. ఆ పోరాట ఫలి తమే సమాచార హక్కు. పిటిషన్ హక్కు సమాచార హక్కు చేతిలో ఉంటే ఇతర హక్కులు సాధించవచ్చు. రోజూ కొన్ని వేల మంది దేశ వ్యాప్తంగా చిన్న చిన్న సమస్యలను ఆర్టీఐ ద్వారా సాధిస్తున్నారు. పదిరూపాయల ఫీజు ఇచ్చి చిన్న సైజు పిల్ వేసే అవకాశం ఆర్టీఐ కల్పించింది. ప్రతి రాష్ట్రంలో పదిమంది కమిషనర్లు కూర్చుని వచ్చిన వారికి సమాచారం ఇప్పిస్తూ పోతే పింఛను ఆలస్యాలు, రేషన్ కార్డు లంచాలు, స్కాలర్షిప్ వేధింపులు వంటి రకరకాల సమస్యలు తీరుతున్నాయి. అయితే ఆ పది రూపాయల పిల్ హక్కుకు ఇప్పుడు ఎసరు పెడుతున్నారు. కమిషనర్ల అధికారాలు తగ్గిస్తున్నారు. వారి స్వతంత్రతకు తూట్లు పొడిచి తాబేదార్లను చేస్తున్నారు. కమిషనర్ల పదవీకాలం ప్రస్తుతం అయిదేళ్లు లేదా వారికి 65 ఏళ్ల వయసు వచ్చే వరకు అని 2005 చట్టం నిర్దేశిస్తున్నది. కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్‌కు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ హోదాను, సమాచార కమిషనర్‌కు కేంద్ర ఎన్నికల కమిషనర్ హోదాను ఆర్టీఐ చట్టం నిర్దేశించింది. ఏ ఉన్నతాధికారికైనా సమాచారం ఇవ్వమని ఆదేశించేందుకు ఈ సమున్నత స్థాయి అవసరమని ఆర్టీఐ చట్ట ప్రదాతలు భావిం చారు. ఈ చట్టానికి చేస్తున్న సవరణలు పార్లమెంటు ఆమోదం పొందితే, కేంద్ర ప్రభుత్వం అనుకున్నంత కాలానికి మాత్రమే కేంద్ర, రాష్ట్ర కమిషనర్లను నియమించుకోవచ్చు. అప్పుడు కమిషనర్లు స్వతంత్రంగా పనిచేయడానికి ధైర్యంగా సమాచారం ఇవ్వండి అనడానికి వీలుండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు పదవీ కాలం ఉంటుంది అని నియమాలు చేర్చుతారట. ఇప్పుడు ఆ హోదా ప్రభుత్వం వారు నోటిఫికేషన్ ద్వారా అప్పుడప్పుడు మార్చుకొనే సవరణ కావాలంటున్నారు. ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా దాచిన ఫైళ్లలో దాగిన సమాచారాన్ని వెలికి తీయాలని ఆదేశించే అధికారం, స్వతంత్రత సమాచార కమిషనర్‌కు ఇవ్వకపోతే ఈ హక్కు అమలు కాదనే ఉద్దేశంతో వారి పదవీకాలాన్ని, హోదాను స్థిరీకరించింది ఆర్టీఐ చట్టం. సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తే తమకు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇచ్చారని భయపడే ప్రభుత్వాలు ఏదో తప్పు చేసినట్టే. ఆ తప్పులు బయటపెట్టకుండా రహస్యాలు కాపాడటానికి సమాచార కమిషనర్లు తమకు లోబడి పనిచేయాలని ప్రభుత్వాలు ఆశిస్తున్నాయి. ఈ చట్టం సవరణ ద్వారా అప్పుడు ఆదేశిస్తాయి. కమిషనర్లను నియమించాలనుకున్నప్పుడల్లా రూల్స్ మార్చుకునే సౌకర్యాన్ని కట్టబెట్టే ఆలోచన ఇది. ఇప్పుడు ఎన్నికల కమిషన్‌తో సమాచార కమిషన్‌కు సమాన హోదా ఇవ్వడం తప్పని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. తక్కువజేయాలని చూస్తున్నది. ఓటు హక్కు, సమాచార హక్కు రెండూ భావప్రకటన హక్కులో భాగాలే అయినప్పడు రెండూ ఎందుకు సమానం కావంటారు? సమాచార హక్కు ఏ విధంగా అమలు చేయాలో వివరిస్తూ కమిషనర్లను నియమించే అధికారాన్ని రాష్ట్రాలకే వదిలేయడం వల్ల రాష్ట్రాల సార్వభౌమాధికారాన్ని కాపాడిందీ చట్టం. కాని రాష్ట్ర కమిషనర్ల పదవీకాలాన్ని హోదాను జీతాన్ని కూడా కేంద్రమే నిర్ణయిస్తుందని సవరించడం వారి సార్వభౌమాధికారంతో జోక్యం చేసుకోవడమే. కమిషన్ల నడ్డి విరిస్తే సమాచార హక్కును నీరు కార్చినట్టే. అప్పుడు అవి నీతి అక్రమాలకు అడ్డూ అదుపూ ఉండదు. అదేనా మనకు కావలసింది? ఆర్టీఐ జ్యోతిని ఆర్పివేయకుండా ఆపాల్సింది జనమే. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
తెలుగు తేజం తీర్పే నెగ్గింది
విశ్లేషణ నిరంతర నిఘాల వల్ల మాట్లాడలేని, తిరగలేని, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేని ఒత్తిడి, ఒక రకమైన నిర్బంధం ఏర్పడతాయని, ఇవి కచ్చితంగా వ్యక్తి స్వేచ్ఛలకు భంగకరమని జస్టిస్ సుబ్బారావు 1963లోనే మైనారిటీ తీర్పు చెప్పారు. అదే నేడు వ్యక్తి గోప్యత హక్కు శాసనమైంది. గోప్యత హక్కు, మన సంవిధానం మూడో భాగంలోని అధికరణాలలో అంతర్గతంగా ఉన్న ప్రాథమిక హక్కు అని 1963లో తెలుగుతేజం చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు తీర్పు ఇస్తే చెల్లలేదు. ఎందుకంటే మిగతా ఐదుగురు జడ్జీలు విభేదించారు. అప్పుడు అది ఆయన అసమ్మతి స్వరం. కానీ ఇప్పుడది శాసనం. ఎందుకంటే 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుబ్బారావు సూత్రాన్ని ఆగస్టు 24, 2017న అంగీకరించారు. నా బతుకు నా ఇష్టం, నా తీరు నా సొంతం, ఇంటి గుట్టు, వివాహ, కుటుంబ విషయాలు, పిల్లలను కనడం, పెంచడం, సొంత ఉత్తర ప్రత్యుత్తరాలు, వంటి అంశాలు గోప్యత పరిధిలో ఉంటాయన్నది అవగాహన. ఖరక్ సింగ్ అనే వ్యక్తి ఒక రిట్ పిటిషన్లో ‘‘నా ఇంటికి అర్ధరాత్రి చౌకీదారు వస్తుంటాడు. చాలా సార్లు పోలీసు కానిస్టేబుళ్లు వచ్చి తలుపు తట్టి నిద్రలేపుతారు. తలుపు దగ్గర నిలబడి అరుస్తారు. ఒక్కోసారి ఇంట్లోకి దూసుకొస్తారు. నిద్రలేపి పోలీసుస్టేషన్‌కు రమ్మం టారు. ఊరొదిలి వెళ్లే ముందు చౌకీదార్‌కు ఎప్పుడొస్తావో చెప్పి వెళ్లాలంటారు. వెళ్లినచోట పోలీసు స్టేషన్‌కు సమాచారం పంపిస్తారు. అక్కడ కూడా నాపైన ఇదే విధమైన నిఘా ఉంటుంది. చౌకీదార్ క్రైం రికార్డ్‌లో నేను సంతకాలు చేస్తుండాలి. ఆ రికార్డులో నాకు తెలి యకుండా ఏమేమో రాసుకుంటారు. ఏం రాస్తున్నారో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా రికార్డు చూపడం లేదు. ఇదేం వేధింపు? ఇంత అన్యాయమా?’’ అని సవాలు చేశారు. అతను హిస్టరీ షీటర్ అనీ, అతనిపైన నిఘా వేశామే గాని అధికార దుర్వినియోగం చేయలేదని పోలీసులు వాదించారు. యూపీ పోలీసు రెగ్యులేషన్ 236 కింద తమకు ఈ అధికారం ఉందన్నారు. రహస్యంగా అనుమానితుడి ఇంటి ముందు నిఘా వేయవచ్చు, రాత్రి కూడా ఇంటికి వెళ్లవచ్చు. అతని వృత్తి అలవాట్లు, ఎవరితో తిరుగుతాడు, ఆదాయం ఎంత, ఖర్చుల వివరాలు అడుగవచ్చు. ఇంటి నుంచి వెళ్లడం, రాకపోవడం, రావడం పరిశీలించవచ్చు. 237 ప్రకారం హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తులు.. క్లాస్ ఎ, స్టార్డ్, అన్ స్టార్డ్ అని రకరకాలుగా ఉంటారు. వారు చేసిన నేరాలను బట్టి నిఘా స్థాయి ఉంటుందని వివరించారు. ఈ నిఘాల వల్ల నాకు సొంత బతుకు లేకుండా పోయింది. స్వేచ్ఛగా నేనేమీ చేయలేను, మాట్లాడలేను, తిరగలేను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద ఎ (మాట్లాడే హక్కు), డి (దేశమంతా స్వేచ్ఛగా తిరిగే హక్కు) ఉంది. ఆర్టికల్ 21 కింద జీవిత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయంటారు, నిజంగా ఉన్నాయా? అని ఖరక్ సింగ్ అడిగాడు. సామాజిక బాధ్యతలు కొన్ని ఉంటాయి. సంఘంలో శాంతి ముఖ్యం. నేరాలు చేసే అలవాటున్న వారిపై నిఘా వేసి పరిశీలించకపోతే నేరాలు ఎలా ఆగుతాయి? పోలీసు అధికారాలు లేకపోతే నేరాలను నిరోధించడం సాధ్యమా? (చట్టం నిర్ణయించిన పద్ధతి ప్రకారం ఉందా లేదా అని పరిశీలించాలి... ఏకే గోపాలన్, ఏఐఆర్ 1950, సుప్రీంకోర్టు 27) జీవిత హక్కు (21)లో స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా ఉంది. 19లో కూడా దానిని మరింత స్పష్టంగా వివరించారు. ఈ నిఘాల వల్ల మాట్లాడలేని, తిరగలేని, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేని ఒత్తిడి, ఒకరకమైన నిర్బంధం ఉన్నాయి. వోల్ఫ్ వర్సెస్ కొలరాడో (338 అమెరికా 1949, 25) కేసులో జస్టిస్ ఫ్రాంక్ ఫర్టర్ పోలీసులకు తమ ఇష్టం వచ్చినపుడు పౌరుడి ఇంట్లో చొరబడే అధికారం ఉంటే ఇక స్వేచ్ఛ ఏమిటి? అని అడిగారు. ఆ పౌరుడు ఇంట్లో ఆనందంగా ప్రశాంతంగా ఉండగలడా? ఖచ్చితంగా 236 రెగ్యులేషన్ పోలీసు అధికారాల ద్వారా ఆర్టికల్ 21లో ఉన్న వ్యక్తిగత జీవన స్వేచ్ఛా హక్కు, ఆర్టికల్ 19(1)(డి)లోని తిరిగే స్వేచ్ఛ, (ఎ)లో మాట్లాడే స్వేచ్ఛా హక్కులను పూర్తిగా భంగపరుస్తున్నాయని జస్టిస్ సుబ్బారావు తీర్పు చెప్పారు. పోలీసులు నిఘా వేస్తే మాత్రమేమిటి? ఎక్కడైనా తిరగడానికి అడ్డంకి లేదు కాబట్టి 19(1)(డి) భంగపడినట్టు భావించలేమనీ, ఆయన స్వేచ్ఛకు 21 కింద హాని ఉన్నట్టు కూడా భావించలేమని మిగతా ఐదుగురు న్యాయమూర్తులు.. ఎన్ రాజగోపాల అయ్యంగార్, పీ భువనేశ్వర్ సిన్హా, సయ్యద్ జాఫర్ ఇమాం, జేసీ షా, జేఆర్ ముధోల్కర్ భావించారు. ప్రతి కదలికను అధికారికంగా పోలీసులు పరి శీలిస్తున్నప్పుడు, నీడలా ఎవరో వెంటాడుతూ ఉంటే ఎవరయినా ఏ విధంగా స్వేచ్ఛగా తిరగడానికి వీలవుతుంది? నిఘా ఉన్నపుడు దేశం మొత్తం జైలే అవుతుందని జస్టిస్ సుబ్బారావు ఒక్కరే ఆలోచించారు. ధర్మాసనం మీద ఉన్న మిగతా న్యాయమూర్తులు విభేదించారు. మూడో అధ్యాయంలో విడివిడిగా ఒక్కో ఆర్టికల్ కింద ఫలానా ప్రా«థమిక హక్కు వస్తుందా, రాదా అని చూడటం సరి కాదని, మొత్తం ప్రాథమిక హక్కుల అధ్యాయం కింద, విభిన్న ఆర్టికల్స్ మధ్య అంతర్గతంగా ఉన్న మూలార్థంకింద ప్రాథమిక హక్కు ఉందా లేదా అని పరిశీలిస్తే ఆ హక్కు భంగపడిందని అర్థమవుతుందని సుబ్బారావు వివరించారు. తిరిగే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, పోలీసుల నిఘాలో మానసిక ఒత్తిడులకు లోనవుతాయన్నారు. ఉదాహరణకు జైల్లో ఖైదీని భార్య పిల్లలు మిత్రులు కలవడానికి వస్తే వారు పోలీసు పర్యవేక్షణలోనే మాట్లాడాలంటారు. ఖైదీ గొంతు విప్పి మాట్లాడగలుగుతాడు. కాని ఏం మాట్లాడితే ఏం సమస్యో అని మనస్ఫూర్తిగా మాట్లాడలేడు. అతనికి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నట్టేనా అని జస్టిస్ సుబ్బారావు అడిగారు. ఆర్టికల్ 19ని ఆర్టికల్ 21తో అనుసంధానించాలన్నారు. ఐదుగురి తీర్పే ఖరక్ సింగ్ కేసులో శాసనమైంది (ఖరక్ సింగ్ వర్సెస్ యూపీ ఏఐఆర్ 1963 సుప్రీంకోర్టు 1295). కానీ సుబ్బారావుగారి నాటి అసమ్మతి ఈనాటికి శాసనమైంది. రాజమండ్రిలో పుట్టిన జస్టిస్ కోకా సుబ్బారావు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు కార్యాలయంలో జూనియర్‌గా ప్రాక్టీసు చేశారు. బాపట్ల జిల్లా మున్సిఫ్‌గా కొన్నాళ్లు పనిచేశారు. 1948లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి పదవి స్వీకరించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1954లో గుంటూరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆ తరువాత 1966లో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైనారు. గోలక్‌నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని చరిత్రాత్మక తీర్పు చెప్పారు. ఖరక్ సింగ్ కేసులో ఆయన చెప్పిన అసమ్మతి తీర్పులో పేర్కొన్న సూత్రాలను తొమ్మిది మంది పక్షాన ఆరుగురు ఇచ్చిన తీర్పుల్లో ఆమోదించడం విశేషం. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ ఈ-మెయిల్: professorsridhar@gmail.com -
అది హత్యే!
శాంతిభద్రతల విభాగానికి వీరభద్రం కేసు బదలాయింపు నెల్లూరు (క్రైమ్) : సమాచార హక్కు రక్షణ సమాఖ్య జిల్లా కన్వీనర్ పుత్తా వీరభద్రయ్య (46)ది హత్యేనని రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీంతో మరో రెండు, మూడు రోజుల్లో ఈ కేసును విచారణ నిమిత్తం రైల్వే పోలీసులు శాంతిభద్రతల విభాగానికి బదిలీ చేయనున్నట్లు సమాచారం. నెల్లూరు ఉస్మాన్‌సాబ్‌పేటకు చెందిన పుత్తా వీరభద్రయ్య జనవరి ఆఖరిలో ఆంధ్ర సమాచార హక్కు రక్షణ సమాఖ్య జిల్లా కన్వీనర్‌గా నియమితులయ్యారు. అప్పటి నుంచి పలుశాఖల్లో అవినీతి, అక్రమాలను బయట పెట్టేందుకు చర్యలు చేపట్టారు. రెడ్‌క్రాస్ రక్తనిధితో పాటు క్యాన్సర్ ఆస్పత్రుల్లో జరిగిన అవినీతిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. దానిపై కలెక్టర్ విచారణ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ తెల్లవారు జామున నెల్లూరు మాగుంట లేఅవుట్ సమీపంలోని రైలు పట్టాలపై అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. తొలుత ప్రమాదంగా అందరూ భావించినప్పటికీ మృతుడి గొంతును కోసి ఉండటం, తలకు తీవ్రగాయాలై ఉండటాన్ని గమనించి ఇది హత్యగా అనుమానించారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు దుండగులు యత్నించారని అక్కడి పరిస్థితులను బట్టి భావించారు. అయితే పోస్టుమార్టం నిర్వహించిన వైద్య సిబ్బంది సైతం అది హత్యేనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. భద్రయ్య హత్యపై రాష్ట్రస్థాయి పోలీసు ఉన్నతాధికారులు సైతం స్వయంగా ఆరా తీశారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రైల్వేపోలీసులు ఈ కేసును గుంతకల్ రైల్వే ఎస్పీ కార్యాలయానికి పంపారు. రైల్వే ఎస్పీ సుబ్బారావు కేసు పరిశీలన అనంతరం నెల్లూరు శాంతిభద్రతల విభాగానికి కేసు బదిలీ చేసే అవకాశం ఉంది. -
విద్యా హక్కుకు ఆర్టీఐ అస్త్రం
విశ్లేషణ అందరికీ విద్య ప్రాథమిక హక్కుతో సమానమని అటు రాజ్యాంగం, ఇటు సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అందరు పిల్లలను బడికి పంపడం సర్కారు వారికి ఏ మాత్రం ఇష్టం లేదు. చదువులేకుంటే సమాజం సాగదు. విద్యలేక వికాసం లేదు. విద్య ఇప్పుడు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. కొందరికే అరుునా, కొంత వరకే అరుునా ఆరేళ్ల వయసు వచ్చిన ప్రతి బాలుడూ, బాలిక బడిలో చేర్చే ఏర్పాటు, ఆ తరువాత 14 ఏళ్లు వచ్చే వరకు చదివించే బాధ్యత ప్రభుత్వానిదే. ఇది ఉచిత నిర్బంధ విద్య. పిల్లలు కాదనడానికి వీల్లేదు తల్లిదండ్రులు బడికి పంపకుండా పిల్లలను ఆపడానికి వీల్లేదు. రాజ్యాంగం వచ్చిన పదేళ్లలోగా పిల్లలందరికీ చదువు అందే ఏర్పాటు చేయాలని ఆదేశిక సూత్రం నిర్దేశిం చింది. కాని కేంద్రంలో రాష్ట్రాలలో ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా ప్రభువులు ఆ విషయం పూర్తిగా మరిచి పోయారు. కొత్త తరానికి తీరని అన్యాయం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలితరం విద్యార్థినీ విద్యార్థులను చదివించే పవిత్ర బాధ్యతను స్వాతం త్య్రం కోసం పోరాడి సాధించి అధికారంలోకి వచ్చిన నేతలే వదిలేయడం చరిత్ర మరవని విషాదం. మొదటి తరాన్నే కాదు, తర్వాత ఆరు తరాలను ప్రజా ప్రభువులు వదిలేసారు. బ్రిటిష్‌వారు చెప్పింది గుమాస్తాలను తయారు చేసే చదువు అని విమర్శించిన జాతీయోద్యమ నాయ కులు కనీసం గుమాస్తా చదువులు కూడా అందరికీ అందించలేకపోవడం ఘోరవైఫల్యం. ఆ అపజయం క్రీనీడలనుంచి మన విద్యారంగం ఇంకా విముక్తం కాలేదు. రాజ్యంగంలో ఆదేశిక సూత్రం రూపంలో ఉన్నా, అందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కుతో సమానమని సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వాలు పట్టిం చుకోలేదు. ప్రాథమిక విద్య అందరికీ అందుబాటులోకి తేవాలని ఉద్యమాలు నడపవలసి వచ్చింది. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధించడం రాజకీయ పార్టీ లకు ఇష్టం లేదు. అందరు పిల్లలను బడికి పంపడం సర్కారు వారికి అంతకన్నా ఇష్టం లేదు. ఇవీ తొలినాటి ప్రజాస్వామ్య ప్రభుత్వాల తీరు. వేలకోట్ల రూపాయలు ఉన్నత విద్యమీద ఖర్చుచేస్తూ ప్రాథమిక విద్యను గాలికి వదిలేశారు. సర్కారీ బడులు పెంచలేదు. ఉపా ధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి ఉండవలసినంత లేదు. సర్కారీ బడిలో మరుగుదొడ్లు ఉన్నాయో లేదో చూసు కునే వారు లేరు. ఆ కారణంగా ఆడపిల్లలు బడికి రాలేక పోవడం, ఆడవారిలో విద్యావంతుల సంఖ్య బాగా పడిపోవడం మన ప్రభువులు సాధించిన గొప్ప విజ యాలు. కుటుంబాలను చదివించగలిగే మహిళలకు చదువు చెప్పలేకపోరుున పథకాలు ఎవరికోసం? అనేకానేక పోరాటాల ఫలితంగా పరిమిత రూపంలో విద్యాహక్కును రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారు. ఒక చట్టం ద్వారా చదువులు నేర్పే విధానం ప్రకటిస్తామన్నారు. కాని ఆ శాసనం తేవడానికి మరి కొన్నేళ్లు కాలయాపన చేశారు. చివరకు 2009లో చట్టం రావడం, మరి కొన్నాళ్లకు దాన్ని అమలు చేయడం సాధ్యమరుుంది. చదువు చెప్పే బాధ్యతలను తనమీద మోపుకున్న ప్రభుత్వం ఆ బాధ్యతలను సరిగ్గా నిర్వ హించకపోతే అడగవలసిన బాధ్యత పౌర సమా జానిది. పిల్లలున్న సమీప ప్రాంతంలో బడులు నెల కొల్పకపోతే ఎందుకని నిలదీయాలి. ఆ బడిలో పంతుళ్లు లేకపోతే, ఎప్పుడు నియమిస్తున్నారని అడ గాలి. పిల్లలను హింసించడం నేరం కాబట్టి దానికి పాల్పడిన వారిమీద ఏ చర్యలు తీసుకున్నారని అడ గాలి, మళ్లీ ఆ నేరం జరగకుండా ఏంచేశారని అడగాలి. బడుల కోసం ఎన్ని నిధులు ఇవ్వాలి? ఎంత ఇచ్చారు? ఎంత ఖర్చు చేశారు? ఆ ఖర్చుల వివరాలేమిటి అని పౌర సమాజం ప్రశ్నించాలి. చర్యలు తీసుకునే దాకా వెంటబడాలి. లేకపోతే మరికొన్ని తరాలు చదువులేని తరాలుగానే గడిచిపోతారుు. ప్రభుత్వ బాధ్యతల నిర్వహణ సమాచారం తెలు సుకోవడానికి విద్యా హక్కు చట్టంలో కూడా నియ మాలున్నారుు. కాని ఆ బాధ్యతలు నెరవేర్చని ప్రభు త్వాలను, ప్రాథమిక విద్యా శాఖలను అడగడానికి ఫ్రజలు తమ చైతన్యాన్ని ఉపయోగించాలి. ఆ చైత న్యానికి కొత్త పరికరం ఒకటి తోడరుుంది. అదే సమా చార హక్కు. 2009 నాటి చట్టం ఇచ్చిన చదువు హక్కును పదును పెట్టడానికి 2005లో వచ్చిన సమా చార హక్కు కొత్త అవకాశాలను కల్పించింది. ఏ కార ణంగానైనా ప్రభుత్వం పాఠశాలలు పెట్టలేని పక్షంలో ఆ ప్రాంతంలో ఉన్న ప్రరుువేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను వెనుకబడిన వర్గాల వారికి కేటారుుంచాలని విద్యా హక్కు చట్టంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ 25 శాతం సీట్ల భర్తీ, ప్రవేశాలు సక్రమంగా ఇస్తున్నారా లేదా అనే కార్యక్రమాన్ని ప్రతి ప్రరుువేటు పాఠశాల స్పష్టంగా అందరికీ తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 25 శాతం పిల్లలకు చదువు చెప్పడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నది. కనుక ప్రరుు వేటు పాఠశాలే అరుునా, మిగతా విషయాల్లో ఆర్టీఐ చట్టం పరిధిలోకి పూర్తిగా రాకపోరుునా, ఈ 25 శాతం ప్రవేశాల విషయంలో వారు ప్రభుత్వానికి, ప్రజలకు సమాచారం చెప్పవలసిందే. కనుక విద్యాశాఖ ప్రతి ప్రరుువేటు పాఠశాలలో ఏటేటా జరిగే ప్రవేశాలను పూర్తి వివరాలతో సహా ప్రజల ముందుకు ఉంచడానికి ఏర్పాటు చేయవలసిందే. లేకపోతే అది సమాచార హక్కు చట్టం ఉల్లంఘన అవుతుంది. మాడభూషి శ్రీధర్ (కేంద్ర సమాచార కమిషనర్) ఈమెయిల్: professorsridhar@gmail.com -
విద్యా హక్కుకు స.హ.చట్టం దోహదం
తల్లిదండ్రుల సదస్సులో కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ సాక్షి, హైదరాబాద్: విద్యాహక్కు చట్టం సక్రమ అమలుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు విద్యాసంస్థలు కూడా సమాచార హక్కుకు లోబడే ఉండాలన్న విషయం చట్టంలోని సెక్షన్- 2ఎఫ్ స్పష్టం చేస్తోందన్నారు. శనివారం ఇక్కడ నిర్వహించిన తెలంగాణ తల్లిదండ్రుల సదస్సులో ఆయన మాట్లాడారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకే సమాచార హక్కు చట్టం పనిచేస్తోందని, ఎవరూ దీని నుంచి తప్పిం చుకోలేరన్నారు. ప్రైవేటు పాఠశాల దోపిడీని, అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించకపోవడం వల్లే అక్కడ ఏ నిబంధనా అమలు కావడం లేదన్నారు. సర్కారు బడులు బాగుపడాలంటే ఎవర్ని నిలదీయాలో ముందు తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. జాతీయ బాలల హక్కుల కమిషన్ మాజీ చైర్పర్సన్ శాంతాసిన్హా మాట్లాడుతూ పంచాయతీ, మండల, జిల్లా స్థాయిల్లో విద్యాపరమైన విషయాలపై బహిరంగ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఒకేరకమైన విద్యావిధానంను అమలు చేయాలని సూచించా రు. తెలంగాణ స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయడం ద్వారానే విద్యావకాశాల్లో అంతరాలు తగ్గుతాయన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అశోక్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రజల ఆర్థిక పరిస్థితులు క్షీణిం చడం వల్లే బాలకార్మిక వ్యవస్థ బలోపేతం అవుతోందన్నా రు. తల్లిదండ్రుల సంఘాల సలహాదారుడు ఎం.వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధన అనంతరం బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన విధాన నిర్ణయాల్లో తామెక్కడున్నామని తల్లిదండ్రులు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందన్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ క్లాసులు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ విద్యాలయాల్లో కేజీ టు పీజీ వరకు అన్ని రకాల వసతులు కల్పించాలని సదస్సు తీర్మానించింది. ఈ సదస్సులో తెలంగాణ స్టేట్ పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించారు. -
ఖైదీకీ సమాచార హక్కు వర్తింపు
ఒక వ్యక్తి తాను జైల్లో ఎందుకున్నాడో కూడా తెలియకుండా పది రోజులపాటు కారాగారంలో గడపడం కొంత వేధింపు అయితే, తర్వాత ఏడాది పాటు తన అభ్యర్థనకు సమాచారాన్ని ఇవ్వకపోవడం మరో వేధింపు. దీనికి అతడికి పరిహారం చెల్లించాల్సిందేనని కమిషన్ తీర్పు ఇచ్చింది. ఆర్టీఐ కింద ఒక ఖైదీ అడిగినా సమాచారం ఇవ్వకపోవడం మరీ అన్యాయం. ఈ దేశంలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి. ఒక యువకుడు చదువుకోలేదు. పేదవాడు. ఒక వీధి కొట్లా టలో ఇరుక్కున్నాడు. తననే అరెస్టు చేసారు, తనతో తగాదా పడిన వారిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదో తెలియదు. కేసు తనపైనే ఉందని కూడా తెలియదు. ప్రథమ సమాచార నివేదిక తనపైనే, కేసు తనపైనే చివరకు శిక్ష పడింది కూడా తనకు మాత్రమే. జైల్లో ఉండాలన్నారు. మొత్తం వేయి రూపాయలు కూడా కట్టాలన్నారు. ఎందుకో తెలియదు. చెల్లించాడు. రసీదు తీసుకున్నాడు. జైలులో పదిరోజుల శిక్ష అనుభవించాడు. అందుకు చాలా అవమానంగా ఉంది. అతని చెల్లెలికి మరీ అవమానంగా తోచింది. అసలు ఎందుకు కేసు, దేనికి శిక్ష అర్థం కాలేదు. ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. తనను ఏ సెక్షన్ కింద జైల్లో పెట్టారు తన దగ్గర వేయి రూపాయలు ఎందుకు వసూలు చేశారు? మళ్లీ ఆ డబ్బు వాపస్ ఇస్తారా లేదా అని ఆయన ప్రశ్నలు. తీహార్ రెండో జైలు అధికారికి ఆర్టీఐ దరఖాస్తును బదిలీ చేశాడు సమాచార అధికారి. కాని జవాబు లేదు. మొదట అప్పీలు అధికారి పది రోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కాని జైలు అధికారులు ఈ ఆదేశాన్ని పెడచెవిన పెట్టారు. రెండో అప్పీలు తప్పలేదు విడుదలైన ఖైదీ దరఖాస్తుదారు సంజయ్ అదృష్టం కొద్దీ జైలు అధికారులు రెండో అప్పీలు విచారణకు హాజ రైనారు. సంబంధిత ఫైళ్లు కూడా తెచ్చారు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 160 కింద చిల్లర తగాదా కేసులో అత నికి జైలు శిక్ష పడిందని దాంతో పాటు వేయిరూపాయల జరిమానా కూడా విధించారని, అతను చెల్లించిన సొమ్ము జరిమానాయే తప్ప, డిపాజిట్ కాదు కనుక, అతనికి ఆ డబ్బు వాపస్ ఇవ్వబోరని అధికారులు వివ రించారు. సంజయ్ చెల్లెలు చాలా కోపంగా అడిగింది, మా అన్ననే ఎందుకు ైజైలుకు పంపారు. మామీద దాడి చేసి కొట్టిన వారి మీద కేసు ఎందుకు పెట్టలేదు, జైలుకు ఎందుకు పంపలేదు. మా అన్నే దొరికాడా? అని నిల దీసింది. కాని జైలు అధికారులు ఈ ప్రశ్నలకు సమా ధానం చెప్పలేదు. ఆ విషయం ఆమెకు ఇప్పుడు చెప్పినా అర్థం కావడం లేదు. అన్యాయం జరిగిందనే భావనతో తలెత్తే ప్రశ్నలకు సమాచార హక్కుకింద సమాధానం దొరకడం సాధ్యం కాదు. అది సరే ఈ సమాచారం ముందే ఇవ్వవచ్చు కదా, ఎందుకింత ఆలస్యం చేసారు? ఎందుకు ఏడిపించారు? రెండో అప్పీలు దాకా ఎందుకు సాగదీసారు?. ఈ ప్రశ్నలకు అధికారుల సమాధానం ఏమంటే అడ్రస్‌లో పొరబాటు 34 అంకెకు ముందు 1 అనే నెంబర్ పడిందని, కనుక తాము పోస్ట్ చేసిన కవర్ తిరిగి వాపస్ వచ్చిందని. మళ్లీ ఎందుకు పంపలేదు అంటే జవాబు అదే. తప్పుడు అడ్రస్ కనుక మళ్లీ పంపినా ప్రయోజనం లేదని పంపలేదు. నిజానికి అరెస్టయినప్పుడే అతనికి అన్ని వివరాలు తెలియజేయడం బాధ్యత అని తెలుసుకోవడం అతని హక్కు అని రాజ్యాంగం తదితర చట్టాలు ఘోషిస్తు న్నాయి. ఎన్నో తీర్పులు కూడా ఉన్నాయి. కాని జరిగేది ఇది. తన అన్నను అన్నీ ఒప్పుకోమంటే ఒప్పుకున్నాడని కనుక శిక్ష పడిందని ఆమె వాదించింది. సంజయ్‌ని నేరం ఒప్పుకునే విధంగా సంతకాలు చేయించిన మహా నుభావుడెవరో ఎవరికీ తెలియదు. దాన్ని తెలుసుకో వడం సమాచార హక్కు ద్వారా సాధ్యం కాదు. మామూ లుగా నిందితుడి స్థాయిలో లేదా ఖైదీ స్థాయిలో కూడా తెలియవలసిన సమాచారాన్ని అతను ఆర్టీఐ ద్వారా అడిగే పరిస్థితి రావడం ఏమాత్రం న్యాయం కాదు. తన జరిమానాకు రసీదు కూడా సహజంగానే లభించాలి. మొత్తం కేసు కాగితాలు, జైలు శిక్ష వివరాలు, శిక్ష అను భవించిన పత్రాలు కూడా అతనికి ఇవ్వవలసి ఉంటుంది. ఒక ఖైదీగా అతనికి ఆ హక్కు ఉంది. సమా చార హక్కు కింద అడిగినా ఇవ్వకపోవడం మరీ అన్యాయం. ఏ మాటా చెప్పకుండా దరఖాస్తును బదిలీ చేయడం, మొదటి అప్పీలు అధికారి ఆదేశించినా పాటించకుండా సమాచారం నిరాకరించడం సమాచార హక్కు చట్టం ఉల్లంఘనే అవుతుంది. తీహార్ రెండో జైలు అధికారి వార్డ్ నెంబర్ 5కు సంబంధించిన అధికారులు మొత్తం రికార్డులను పరిశీ లించి, సంజయ్‌కు చెందిన కాగితాల ధృవీకృత ప్రతు లను తనకు ఉచితంగా నెలరోజుల్లో ఇవ్వాలని, ఎవరికీ బదిలీ చేయడం కుదరదని కమిషన్ ఆదేశించింది. సంజయ్ సొంతంగా మళ్లీ ఫిర్యాదు చేసే అవసరం లేకుండా జైలు అధికారి శ్రద్ధ తీసుకుని అతని పత్రాలన్నీ అందే వీలు కల్పించాలని కమిషన్ ఆదేశించింది. నెలరోజుల్లోగా సమాచారం ఇవ్వాలని చట్టం నిర్దే శించినా, అసలు ఏ జవాబూ ఇవ్వనందుకు, మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించకుండా సంజయ్‌ని రెండో అప్పీలు చేసే పరిస్థితి కల్పించినందుకు, అడ్రస్ సరిగా ఉందో లేదో పరిశీలించకుండా పంపినందుకు, ఆ తరువాతైనా తప్పు సవరించనందుకు అతనికి నామ మాత్రంగా 1500 రూపాయల నష్టపరిహారం చెల్లించా లని కూడా కమిషన్ ఆదేశించింది. ఎందుకు జైల్లో ఉన్నాడో తెలియకుండా పది రోజులపాటు జైల్లో గడ పడం కొంత వేధింపు అయితే, తర్వాత ఏడాది పాటు తన అభ్యర్థనకు సమాచారాన్ని ఇవ్వకపోవడం మరో వేధింపు అనీ, కాబట్టి పరిహారం చెల్లించాల్సిందే అనీ కమిషన్ తీర్పు. (సంజయ్ వర్సెస్ తీహార్ జైల్ సీఐసీ నంబర్ ఎస్ఏఏ 2016, 001077 కేసులో 23 జూన్ 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ - మాడభూషి శ్రీధర్ ఈమెయిల్: professorsridhar@gmail.com -
బాలికా ఎంత పనిచేశావ్
► సమాచారం కోసం కార్పొరేషన్ ► అధికారులకు 14 ఏళ్ల బాలిక అర్జీ ► నిర్ణీత సమయంలో స్పందించని అధికారులు ► సమాచార కోర్టుకు హాజరుకావాలని కమిషనర్‌కు నోటీసులు ఏం జరిగినా పెద్దగా పట్టించుకోరని నగర పాలక సంస్థ అధికారులకు పేరుంది. అక్కడ ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే చుక్కలు కనిపిస్తాయి. అలాంటి అధికారులకు 9వ తరగతి చదువుతున్న బాలిక షాక్ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగింది. అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పుడు నోటీసులు వచ్చాయి. దీంతో వారు బాలికా ఎంత పనిచేశావ్ అని నిట్టూరుస్తున్నారు. నెల్లూరు, సిటీ : ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలిక పేరు రావూరి హ్రుల్లేకా. ఈ అమ్మాయి తల్లిదండ్రులు రమేష్‌బాబు, హరిత నగరంలోని పొగతోటలో నివసిస్తున్నా రు. ఆక్స్‌ఫోర్డ్ పాఠశాలలో హ్రుల్లేకా 9వ తరగతి చదువుతుంది. డెంగీ వ్యాధి కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గమనించిన హ్రుల్లేకా చలించిపోయింది. నగర పరిధిలో చెత్తాచెదారం శుభ్రం చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్‌దని, వారు సక్రమంగా పనిచేయలేదని భావించి ఏదో ఒకటి చేయాలని ఆలోచించింది. అసలు కార్పొరేషన్‌కు స్వచ్ఛభారత్ కింద ఎంత నిధులు విడుదలయ్యాయి? వాటిలో ఎంత, ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారు? వివరాలు ఇవ్వాలని నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలోని అధికారులను సమాచార హక్కు చట్టం ద్వారా కోరింది. గతేడాది అక్టోబర్‌లో అర్జీ ఇవ్వగా నగర పాలక సంస్థ అధికారులు ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదు. సమయానికి సమాచారం ఇవ్వకపోవడంతో సమాచార హక్కు చట్టం కింద కేసు నమోదైంది. (నంబరు-4623-2016). ఈ నెల 15వ తేదీన సమాచార హక్కు కోర్టులో హాజరుకావాలని కమిషనర్ వెంకటేశ్వర్లుకు నోటీసులు వచ్చాయి. ఈ క్రమంలో ఇంజీనిరింగ్ విభాగం నుంచి ఓ అధికారి హైదరాబాద్‌లోని సమాచార కోర్టులో హాజరుకానున్నారు. -
'మొబైల్స్, అశ్లీల వస్త్రధారణ అత్యాచారాలకు కారణం'
లక్నో: మొబైల్ ఫోన్ల వాడకం, పాశ్చాత్య సంస్కృతి, అశ్లీల వస్త్రధారణ అంశాలే అత్యాచారాలకు కారణమని సమాచార హక్కు కింద దాఖలైన ఓ పిటిషన్ సమాధానమిస్తూ ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఓ నివేదికలో వెల్లడించారు. జిల్లాల వారిగా అత్యాచార సంఘటనలు, వాటిని నివారించడానికి అధికారులు తీసుకున్న చర్యలు, ఈ ఘటనలో చేసిన అరెస్టులపై వివరణ ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి దాఖలు పిటిషన్ దాఖలు చేశారు. సామాజిక కట్టుబాట్లలో మార్పుల కారణంగా అత్యాచార సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని నివేదికలో పోలీసులు వెల్లడించారు, అంతేకాకుండా అత్యాచార సంఘటనలు ఓ సామాజిక సమస్య అని వెల్లడించినట్టు సమాచారం. -
చిటారు కొమ్మన సమాచార హక్కు
పారదర్శకతను ప్రదర్శించడంలో, స.హ. చ ట్టం అమలులో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి చూపుతుందనుకోవడం పొరపాటు. అలా చేయదు కనుకే స్వతంత్ర ప్రతిపత్తిగల కమిషన్లు, న్యాయస్థానాలున్నాయి. సమాచార నిరాకరణ, జాప్యాల గురించి కమిషన్‌కు వచ్చే ఫిర్యాదులు నూటికి నూరింటిలోనూ ప్రభుత్వమే ముద్దాయి. తనను బోనెక్కించే సమాచార కమిషన్‌ను ఏ ప్రభుత్వమైనా బలహీనపరచాలని చూస్తుందే తప్ప, బలోపేతం చేయాలని ఎందుకనుకుంటుంది? సమాచార హక్కుకు రాజ్యాంగమే సర్వరక్ష. పౌరుల చేతిలో కమిషన్ ప్రభుత్వ మదగజాన్ని నియంత్రించే అంకుశంగా పనిచేయాలి. సమకాలీనం అది 2006 ఆగస్టు నెల. సమాచారహక్కు చట్టంపై హైదరాబాద్‌లో ఒక సదస్సుకు హాజరైన పౌర హక్కుల పోరాట యోధుడు కన్నబీరన్ ఓ మాటన్నారు. ‘‘ఈ చట్టం లేకముందు మేం న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేసైనా సమాచారం తెచ్చుకునే వాళ్లం. మీరంతా వచ్చారు. మధ్యలో ఇంకొన్ని పొరలుపెంచి సంక్లిష్టం చేశారు. మేలు జరగాల్సింది కీడు జరుగు తోంది’’ అని నాతో నిష్టూరమాడారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ మాటలే నిజమౌతున్నాయా? అనే అనుమానాన్ని బలపర్చే ఆనవాళ్లు కళ్లముందు కదులుతున్నాయి. 2005, అక్టోబర్ 12 నుండి దేశంలో స.హ చట్టం అమల్లోకి వచ్చింది. అంటే, తొమ్మిదేళ్లవుతోంది. ఇది తక్కువ సమయమేం కాదు. కానీ, ఇప్పటివరకు ఈ చట్టం ద్వారా ఆశించింది కొండంతయితే లాభించింది గోరంతే! చట్టం అమలుకు భాగస్వాముల నుంచి అందుతున్న సహకారం క్రమంగా తగ్గుతున్న తీరు బాధాకరం. దీన్ని ఉపేక్షిస్తే, అన్ని మంచి చట్టాలకు పట్టిన దుర్గతే ఈ చట్టానికీ తప్పదేమోనన్న ఆందోళన కలుగుతోంది. ఈ చట్టం అమలు ఇష్టం లేని వాళ్లు, సమాచార గోప్యతతో అనుచిత లబ్ధిని పొందేవాళ్లు, పాలనలో పారదర్శకత చేతగాని వాళ్లు... దుర్వినియోగమౌతుందనే సాకుతో దీన్ని యథాశక్తి నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలయిన పలు వ్యవస్థలు ఒక్కొక్కటి ఒక్కో పంథాలో ఈ చట్టం అమలును అభాసుపాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు అలవిమాలిన అలసత్వం వహిస్తున్నాయి. రాజకీయపక్షాలు చట్టం స్ఫూర్తినే నీరుగారుస్తున్నాయి. అధికారగణం అడుగడుగునా చట్టం ఆచరణకు గండికొడుతోంది. అనుచిత అన్వయాలతో, స్ఫూర్తి విరుద్ధమైన తీర్పులతో న్యాయవ్యవస్థ కీలక సమయాల్లో తప్పుడు సంకేతాలిస్తోంది. ప్రసారమాధ్యమాలు నెమ్మదిగా ప్రాధాన్యత తగ్గిస్తున్నాయి. చివరకు సమాచార కమిషన్లు కూడా ‘ప్రభుత్వాలు సహకరించడం లేదు, మేం నిస్సహాయులం’ అని చేతులెత్తేయడం ఆందోళనకరం. గత శనివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో స్థూలంగా జరిగిందిదే! ఎవరికి చేతనైనంత వారు...! ఒకటిన్నర దశాబ్దాల పోరు ఫలితంగా అన్ని వర్గాలలో కోటి ఆశలు కల్పిస్తూ స.హ. చట్టం అమల్లోకొచ్చింది. చట్టం వేళ్లూనుకుంటున్న క్రమంలోనే రకరకాల అరిష్టాలు మొదలయ్యాయి. ఎనిమిదేళ్ల కిందటే, అంటే ఏడాదిలోనే చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే యత్నం మొదలయింది. మూడుసార్లు ఈ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) విఫల యత్నం చేశాయి. మబ్బు వెనుక మారీచుడిలా కేంద్ర ప్రభుత్వమూ దీని వెనుక ఉంది. నోట్ ఫైల్స్‌ను ఈ చట్టం పరిధి నుంచి తప్పించాలని, నిరర్థకమైనవనే సాకుతో దరఖాస్తుల్ని కుదించాలని, దరఖాస్తుదారుల్ని కట్టడి చేయాలని, కమిషన్ అధికారాల్ని కత్తిరించాలని పలు కుతంత్రాలు జరిగాయి. ఓసారి అన్నా హజారే, మరోమారు సమాచార కమిషనర్ల జాతీయ సదస్సు, ఇంకోమారు కార్యకర్తలు, పౌరసంఘాలు ఈ యత్నాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. దీంతో గుడ్డిలో మెల్లలా ఇప్పటికీ చట్ట సవరణ జరగలేదు. చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకమేం గొప్పగా లేదు. కమిషన్లకు సిబ్బందిని, వసతులను కల్పించకపోవడం, ఉత్తర్వుల అమలులో సహాయనిరాకరణ, తరచుగా జీవోలు, మెమోలతో చట్టం స్ఫూర్తిని దెబ్బతీయడం వంటివి రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి. కమిషన్ విచారణకు పిలిచినా ప్రథమ అప్పీలుకు అధికారి రానవసరం లేదనే వెసులుబాటును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అది సెక్షన్ 18 కింద సమాచార కమిషన్‌కు ఉన్న సివిల్ కోర్టు అధికారాలకు విరుద్ధమని ఎవరు చెప్పినా లెక్కచేయలేదు. ఇక రాజకీయ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పారదర్శకత మేలని ఉపన్యాసాలు దంచే రాజకీయపక్షాలు ‘తమదాకా వస్తే గానీ...’ అన్న తరహాలో అడ్డం తిరిగాయి. పారదర్శకతను పాటించాల్సి రాగానే ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఒక్కటై ముఖం చాటేశాయి. ప్రజాక్షేత్రంలో ఉంటూ, తమ ప్రతి చర్యా ప్రజల కోసమేనని చెబుతూ, ప్రజాధనం నుంచి లబ్ధి పొందుతూ.... అదే ప్రజలకు సమాచారం ఇచ్చేది లేదంటే ఎలా? అని కేంద్ర సమాచార కమిషన్ ప్రశ్నించింది. సమాచారం ఇచ్చి తీరాల్సిందేనని ఆదేశించింది. ‘మావి పౌర కార్యాలయాలే కావు, మేమసలు ఈ చట్టం పరిధిలోకే రామ’ని అవి తప్పించుకోజూశాయి. కానీ, కర్రు కాల్చి వాతపెట్టినట్టు సర్వోన్నత న్యాయస్థానం పార్టీల వాదనను ఖండించింది. ‘మీది కచ్చితంగా పౌర కార్యాలయమే, సమాచారం ఇచ్చి తీరాల్సిందే, ఫలానా సమయంలోగా చట్టాన్ని పాటించండి’అని ఇచ్చిన సుప్రీం తీర్పునకు నేటికీ అతీగతీ లేదు. సమాచార హక్కు పౌరుల చేతిలో గొప్ప ఉపకరణం, వ్యవస్థల్ని చక్కదిద్దుకోవ డంలో ఉపయోగకరం అని భావించే వారిని దిగ్భ్రాంతిపరుస్తూ ఇటీవల మద్రాసు హైకోర్టు ఓ తీర్పిచ్చింది. సమాచారం పొందగోరే వారు, అదెందు కోసమో తెలపాలంటూ చిత్రమైన ఆదేశాలిచ్చింది. సమాచారం ఎందుకో దరఖాస్తుదారు తెలపాల్సిన అవసరం లేదనే చట్టంలోని సెక్షన్-6కు పూర్తి విరుద్ధమైన తీర్పిది. పైకోర్టులో సవాలు చేస్తే నిలవదు, అది వేరే విషయం. ఇది చట్టస్ఫూర్తికి భంగకరమైనది. కమిషన్ కూర్పు, కమిషనర్ల నియామకాలపై లోగడ సుప్రీంకోర్టు ఓ అసంబద్ధమైన తీర్పిచ్చింది. పౌర సంఘాలు సవాలు చేయగా ఏడాది తర్వాత, ఇది ‘న్యాయతప్పిదం’ అని తీర్పు చెప్పి సుప్రీమే దాన్ని రద్దుపరచి విజ్ఞత ప్రదర్శించింది. రాజ్యాంగ సంస్థగా నా కార్యాలయం సమాచార చట్టపరిధిలోకే రాదని లోగడ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఒకరు బెట్టుచేశారు. ఇది సరైన అన్వయం కాదని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం చట్టం పరిధిలోకే వస్తుందని, కింది స్థాయిలోని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తితో పాఠాలు చెప్పించుకున్న తర్వాత గాని ఆయన దారికి రాలేదు. దిద్దుబాటు జరిగే వరకు ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చట్టం అమలుకు భంగం కలిగించే తప్పుడు సంకేతాలే! అప్రమత్తతే సమాచార హక్కుకు రక్ష ప్రజాస్వామ్యంలో, సదా అప్రమత్తంగా ఉండటం పౌరులు చెల్లించాల్సిన మూ ల్యం అంటారు విజ్ఞులు. స.హ. చట్టాన్ని పౌరులు, పౌర సంఘాలే కాపాడుకో వాలి. సమాచార కమిషన్ వంటి స్వతంత్ర సంస్థలు అందుకు సహకరించాలి. అంతే తప్ప, ‘ప్రభుత్వం మాకు సహకరించడం లేదు, మా ఆదేశాలు పాటించే చిత్తశుద్ధి లేనందున మేం అశక్తులం, రేపు మమ్మల్నేమనొద్దు’అంటూ కూనిరా గాలు తీయకూడదు. పాలనలో పారదర్శకతను చూపడంలో, స.హ. చ ట్టాన్ని సమర్థవంతంగా అమలుచేయడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి చూపుతుందను కోవడం పొరపాటు. అలా పనిచేయదు కనుకే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమి షన్లు, న్యాయస్థానాలున్నాయి. అధికారులు సమాచారం నిరాకరిస్తున్నారని, జాప్యం చేస్తున్నారని పౌరులు కమిషన్‌కు చేసే ఫిర్యాదులు నూటికి నూరింటి లోనూ ప్రభుత్వమే ముద్దాయి. తనను బోనెక్కించే సమాచార కమిషన్‌ను ఏ ప్రభుత్వ మైనా ఏదో రకంగా బలహీనపర్చే యత్నం చేస్తుందే తప్ప, బలోపేతం చేయాలని ఎందుకనుకుంటుంది? శివసాగర్ అన్నట్టు, ‘‘ఏ పులి మేకను సంరక్షి స్తుంది? ఇది చరిత్ర చెప్పిన సత్యం.’’ అందుకని కమిషన్ స్వతంత్రంగానే, కాస్త కటువుగానే వ్యవహరించాలి. రాజ్యమెప్పుడూ బలిష్టమైనదే. తన బహు ముఖ మైన, బహుళ పార్శ్వాలు కలిగిన బలంతో అది తన అధికారానికి అడ్డనుకునే ప్రజా హక్కుల్ని నలిపేస్తుంది. పౌరుల చేతిలో కమిషన్ ప్రభుత్వ మదగజాన్ని నియంత్రించే అంకుశమవ్వాలి. దానికి మన రాజ్యాంగమే సర్వరక్ష. ఆ నీడలో, పార్లమెంటు రూపొందిన స.హ. చట్ట నిబంధనల ఆధారంగానే ప్రభుత్వాల్ని కమిషన్లు దారిలోకి తెచ్చుకోవాలి. అవసరమైతే అవి సమాచారం కోసం ప్రజా సంఘాలు నడిపే పోరాటాల్లో, న్యాయపోరాటాల్లో సైతం తలదూర్చి సమాచార హక్కును పరిరక్షించాలి. కన్నబీరన్ ప్రస్తావించిన ‘పొరలు’ అవరోధం కాకుండా చట్ట స్ఫూర్తికి కమిషన్ జీవం పోయాలి. కడకు దానినిరాజ్యాంగమే దేవుడై కాపాడాలి. ఈ సందర్భంగా తిలక్ ‘ప్రార్థన’ గుర్తొస్తోంది. ‘‘దేవుడా! రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి లక్షలాది దేవతల నుండి వారి పూజారుల నుండి వారి వారి ప్రతినిధుల నుండి’’ (వ్యాసకర్త సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్) దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు -
రాళ్లబండి కవితాప్రసాద్‌కు 25వేలు జరిమానా
హైదరాబాద్ : రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్‌కు సమాచార హక్కు కమిషన్ రూ.25వేలు జరిమానా విధించింది. తెలుగు మహాసభల ఖర్చుకు సంబంధించి ఇంతవరకూ ఆయన వివరాలు సమర్పించలేదని సమాచారం. అంతే కాకుండా ఆడిట్ విషయంలో అడిగిన సమాచారం సకాలంలో అందించకపోవటంతో పాటు, తప్పుడు సమాచారాం ఇచ్చారంటూ సమాచార హక్కు కమిషనర్ విజయబాబు జరిమానా విధించారు. కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని సమాచార హక్కు కమిషన్.... ప్రభుత్వాన్ని కోరింది. ఇదిలా ఉండగా, ఎటువంటి విచారణకైనా తాను సిద్దమేనని రాళ్లబండి కవితాప్రసాద్ చెప్పారు. రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ తెలుగు మహాసభలు, రవీంద్ర భారతి హాలు కేటాయింపునకు సంబంధించి అడిగిన వివరాలను సమర్పించినట్లు ఆయన తెలిపారు. -
చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఉదయాధిత్య భవన్లో పౌర సమాచార అధికారులు, అప్పిలేట్ అథారిటీలు, అధికారులు, సామాజిక కార్యకర్తలతో సమావేశమై జిల్లాలో చట్టం అమలు తీరు తెన్నులపై సమీక్షిం చారు. పారదర్శకత, జావాబుదారీ త నం పెంపొందించేందుకు రూపొందిం చిందే సమాచార హక్కు చట్టం అని పేర్కొన్నారు. సమాచారం కోసం దరఖాస్తు చేసిన వ్యక్తులకు సదరు సమాచారం కోర్టు పరిధిలో ఉన్నా దాపరికం లేకుండా ఇవ్వాలన్నారు. ప్రశ్నించేతత్వం ప్రజల్లో పెంపొందిన నాడే ఈ చట్టానికి సార్థకత చేకూరుతుందన్నారు. డివిజన్‌స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్‌ను కోరారు. చట్టంలోని 4(1) బి సెక్షను ప్రకారం పూర్తిస్థాయి సమాచారాన్ని పొందుపర్చాలన్నారు.కలెక్టర్ చిరంజీ వులు మాట్లాడుతూ ఆదేశ సూత్రాలన్నీ ప్రస్తుతం చట్ట రూపంలో వస్తున్నట్లు వివరించారు. జిల్లాలో అధికారులంద రూ సమాచార హక్కు చట్టం అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అన్ని శాఖలు తమ శాఖాపరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పొందుపర్చాలని ఆదేశించారు. ఎస్పీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ పోలీస్‌శాఖలో మానవ హక్కుల కమీషన్, సమాచార హక్కు చట్టంపై వచ్చే అర్జీలపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశం లో జేసీ హరిజవహర్‌లాల్,ఏఎస్పీ రమారాజేశ్వరి, డీఆర్ఓ అంజయ్య, ఆర్డీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
‘వన్-బీ’ని పటిష్టంగా అమలు చేయాలి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమాచార హక్కు చట్టం వన్-బీని పటిష్టంగా అమలు చేయాలని ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ వి.వెంకటేశ్వర్లు జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి అధికారులతో శనివారం నిర్వహించిన సమావేశంలో సమాచారహక్కు చట్టం అమలుతీరును ఆయన సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వన్-బీ వివరాల ఏర్పాటుతోపాటు సమాచార చట్టం ద్వారా అడిగిన అధికారి హోదా, పేరు తదితర వివరాలను తెలుగులో అందించాలన్నారు. మెరుగైన సమాజం కోసం రూపొందించిన సమాచారహక్కు చట్టం ఉద్దేశాన్ని అర్థం చేసుకుని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రజా సమాచార అధికారులుగా పనిచేస్తున్న వారికి ఆర్టీఐ చట్టం గురించి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ద్వారా అవగాహన తరగతులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో ప్రజా సమాచార అధికారుల ఇబ్బందులను సానుకూల దృక్పథంతో చూస్తున్నట్లు చెప్పారు. ఈ చట్టాన్ని పారదర్శక పాలన కోసం ప్రభుత్వం రూపొందిం చిందని వివరించారు. గ్రామస్థాయి వివరాలను కూడా అందించేందుకు శాఖల వారీగా డేటాబేస్‌ను రూపొందిస్తామని కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేష్ తెలిపారు. ప్రధానమైన 31 శాఖలకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద వచ్చిన 1,611 దరఖాస్తులలో 1,131 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. పోలీస్‌శాఖకు 54 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్ చెప్పారు. వీటిలో 39 సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. మిగిలిన వాటికి కూడా సకాలంలో సమాచారం కూలీ డబ్బు కూడా అందకపోవడంతో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పస్తులతో అలమటిస్తున్నామని కూలీలు అధికారులతో మొర పెట్టుకుంటున్నా మేము చేసేదేమీ లేదని వారు చేతులెత్తేశారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 5,77,053 వేల మంది శ్రామికులు జాబ్ కార్డు కలిగి ఉన్నారు. పనుల కల్పనకు ప్రభుత్వం శ్రమశక్తి గ్రూపుల ఏర్పాటు తప్పనిసరి చేయడంతో వీరంతా 29,250 గ్రూపులుగా ఏర్పడి పనులు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో గత నెల నుంచి కూలీ డబ్బు చెల్లింపు నిలిచిపోయింది. గత నెల, ఈ నెల 23 వరకు కలిపి సుమారు 40 వేల మంది కూలీలకు 10 కోట్ల రూపాయలు వేతనంగా చెల్లించాలి. దీంతో పాటు ఆన్లైన్ ఎన్రోల్మెంట్ సమస్యవల్ల దీర్ఘకాలికంగా చెల్లించని వేతనాలు కలిపితే ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు కార్యాలయం జిల్లాలో మొత్తం కూలీలకు చెల్లించాల్సిన బకాయిల వివరాల సేకరణలో పడింది. కొన్ని మండలాల నుంచి ఇప్పటికే వివరాలు అందగా మరికొన్ని మండలాల నుంచి అందాల్సి ఉంది. నిర్వీర్యమవుతున్న పంపిణీ వ్యవస్థలు.. ఉపాధి నిధులు సక్రమంగా ఖర్చు చేయడానికి, కూలీలకు డబ్బు చెల్లింపునకు ప్రభుత్వం పలు రకాలుగా పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఇన్ని చేసినా సకాలంలో కూలీలకు డబ్బు అందడం లేదు. సాధారణ రోజుల్లో సైతం కూలీలకు వారానికోసారి వేతనం చెల్లింపు జరగడం లేదు. జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో తపాలాశాఖ, మరికొన్ని పంచాయతీల్లో బ్యాంకులు, ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా కూలీలకు వేతన పంపిణీ ఏర్పాట్లు జరిగాయి. వేతనాలు నేరుగా పంపిణీ చేసేందుకు బయోమెట్రిక్ పరిజ్ఞానంతో పనిచేసే స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. కూలీలకు వారానికోసారి వేతనాలు పంపిణీ చేయడానికి బ్యాంకులు జీరోమాస్‌లాంటి సంస్థలను సర్వీస్ ప్రొవైడర్లుగా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇలా అంచెలంచెలుగా వ్యవస్థలు ఏర్పడినా కూలీలకు మాత్రం ఠంఛన్‌గా వేతనాలు అందించే లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. ప్రధానంగా భద్రాచలం, పాల్వంచ, ఇల్లెందులోని ఏజెన్సీ ప్రాంతాల్లో చేసిన పనికి సక్రమంగా వేతనం అందడం లేదని కూలీలు ఆందోళన చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. చేసిన పనికి సంబంధించి అధికారులు, కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండడంతో వాటి విచారణలకే ఉన్నతస్థాయి అధికారులు పరిమితమయ్యారు.. తప్ప కూలీల ఇబ్బందులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఈనెలలో కూడా వేతనం రాకుంటే తాము ఎలా బతకాలని మరోవైపు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.