ఖైదీకీ సమాచార హక్కు వర్తింపు | Right to information is applicable to prisoners | Sakshi
Sakshi News home page

ఖైదీకీ సమాచార హక్కు వర్తింపు

Published Fri, Jul 15 2016 1:23 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

ఖైదీకీ సమాచార హక్కు వర్తింపు

ఖైదీకీ సమాచార హక్కు వర్తింపు

ఒక వ్యక్తి తాను జైల్లో ఎందుకున్నాడో కూడా తెలియకుండా పది రోజులపాటు కారాగారంలో గడపడం కొంత వేధింపు అయితే, తర్వాత ఏడాది పాటు తన అభ్యర్థనకు సమాచారాన్ని ఇవ్వకపోవడం మరో వేధింపు. దీనికి అతడికి పరిహారం చెల్లించాల్సిందేనని కమిషన్ తీర్పు ఇచ్చింది. ఆర్టీఐ కింద ఒక ఖైదీ అడిగినా సమాచారం ఇవ్వకపోవడం మరీ అన్యాయం.
 
 ఈ దేశంలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి. ఒక యువకుడు చదువుకోలేదు. పేదవాడు. ఒక వీధి కొట్లా టలో ఇరుక్కున్నాడు. తననే అరెస్టు చేసారు, తనతో తగాదా పడిన వారిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదో తెలియదు. కేసు తనపైనే ఉందని కూడా తెలియదు. ప్రథమ సమాచార నివేదిక తనపైనే, కేసు తనపైనే చివరకు శిక్ష పడింది కూడా తనకు మాత్రమే. జైల్లో ఉండాలన్నారు. మొత్తం వేయి రూపాయలు కూడా కట్టాలన్నారు. ఎందుకో తెలియదు. చెల్లించాడు. రసీదు తీసుకున్నాడు. జైలులో పదిరోజుల శిక్ష అనుభవించాడు. అందుకు చాలా అవమానంగా ఉంది. అతని చెల్లెలికి మరీ అవమానంగా తోచింది.
 
 అసలు ఎందుకు కేసు, దేనికి శిక్ష అర్థం కాలేదు. ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. తనను ఏ సెక్షన్ కింద జైల్లో పెట్టారు తన దగ్గర వేయి రూపాయలు ఎందుకు వసూలు చేశారు? మళ్లీ  ఆ డబ్బు వాపస్ ఇస్తారా లేదా అని ఆయన ప్రశ్నలు. తీహార్ రెండో జైలు అధికారికి ఆర్టీఐ దరఖాస్తును బదిలీ చేశాడు సమాచార అధికారి. కాని జవాబు లేదు. మొదట అప్పీలు అధికారి పది రోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. కాని జైలు అధికారులు ఈ ఆదేశాన్ని పెడచెవిన పెట్టారు.
 
 రెండో అప్పీలు తప్పలేదు
 విడుదలైన ఖైదీ దరఖాస్తుదారు సంజయ్ అదృష్టం కొద్దీ జైలు అధికారులు రెండో అప్పీలు విచారణకు హాజ రైనారు. సంబంధిత ఫైళ్లు కూడా తెచ్చారు  ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 160 కింద చిల్లర తగాదా కేసులో అత నికి జైలు శిక్ష పడిందని దాంతో పాటు వేయిరూపాయల జరిమానా కూడా విధించారని, అతను చెల్లించిన సొమ్ము జరిమానాయే తప్ప, డిపాజిట్ కాదు కనుక, అతనికి ఆ డబ్బు వాపస్ ఇవ్వబోరని అధికారులు వివ రించారు. సంజయ్ చెల్లెలు చాలా కోపంగా అడిగింది, మా అన్ననే ఎందుకు ైజైలుకు పంపారు. మామీద దాడి చేసి కొట్టిన వారి మీద కేసు ఎందుకు పెట్టలేదు, జైలుకు ఎందుకు పంపలేదు. మా అన్నే దొరికాడా? అని నిల దీసింది.

 కాని జైలు అధికారులు ఈ ప్రశ్నలకు సమా ధానం చెప్పలేదు. ఆ విషయం ఆమెకు ఇప్పుడు చెప్పినా అర్థం కావడం లేదు. అన్యాయం జరిగిందనే భావనతో తలెత్తే ప్రశ్నలకు సమాచార హక్కుకింద సమాధానం దొరకడం సాధ్యం కాదు. అది సరే ఈ సమాచారం ముందే ఇవ్వవచ్చు కదా, ఎందుకింత ఆలస్యం చేసారు? ఎందుకు ఏడిపించారు? రెండో అప్పీలు దాకా ఎందుకు సాగదీసారు?. ఈ ప్రశ్నలకు అధికారుల సమాధానం ఏమంటే అడ్రస్‌లో పొరబాటు 34 అంకెకు ముందు 1 అనే నెంబర్ పడిందని, కనుక తాము పోస్ట్ చేసిన కవర్ తిరిగి వాపస్ వచ్చిందని. మళ్లీ ఎందుకు పంపలేదు అంటే జవాబు అదే. తప్పుడు అడ్రస్ కనుక మళ్లీ పంపినా ప్రయోజనం లేదని పంపలేదు.
 
 నిజానికి అరెస్టయినప్పుడే అతనికి అన్ని వివరాలు తెలియజేయడం బాధ్యత అని తెలుసుకోవడం అతని హక్కు అని రాజ్యాంగం తదితర చట్టాలు ఘోషిస్తు న్నాయి. ఎన్నో తీర్పులు కూడా ఉన్నాయి. కాని జరిగేది ఇది. తన అన్నను అన్నీ ఒప్పుకోమంటే ఒప్పుకున్నాడని కనుక శిక్ష పడిందని ఆమె వాదించింది. సంజయ్‌ని నేరం ఒప్పుకునే విధంగా సంతకాలు చేయించిన మహా నుభావుడెవరో ఎవరికీ తెలియదు. దాన్ని తెలుసుకో వడం సమాచార హక్కు ద్వారా సాధ్యం కాదు. మామూ లుగా నిందితుడి స్థాయిలో లేదా ఖైదీ స్థాయిలో కూడా తెలియవలసిన సమాచారాన్ని అతను ఆర్టీఐ ద్వారా అడిగే పరిస్థితి రావడం ఏమాత్రం న్యాయం కాదు. తన జరిమానాకు రసీదు కూడా సహజంగానే లభించాలి. మొత్తం కేసు కాగితాలు, జైలు శిక్ష వివరాలు, శిక్ష అను భవించిన పత్రాలు కూడా అతనికి ఇవ్వవలసి ఉంటుంది. ఒక ఖైదీగా అతనికి ఆ హక్కు ఉంది. సమా చార హక్కు కింద అడిగినా ఇవ్వకపోవడం మరీ అన్యాయం. ఏ మాటా చెప్పకుండా దరఖాస్తును బదిలీ చేయడం, మొదటి అప్పీలు అధికారి ఆదేశించినా పాటించకుండా సమాచారం నిరాకరించడం సమాచార హక్కు చట్టం ఉల్లంఘనే అవుతుంది.
 
 తీహార్ రెండో జైలు అధికారి వార్డ్ నెంబర్ 5కు సంబంధించిన అధికారులు మొత్తం రికార్డులను పరిశీ లించి, సంజయ్‌కు చెందిన కాగితాల ధృవీకృత ప్రతు లను తనకు  ఉచితంగా నెలరోజుల్లో ఇవ్వాలని, ఎవరికీ బదిలీ చేయడం కుదరదని కమిషన్ ఆదేశించింది. సంజయ్ సొంతంగా మళ్లీ ఫిర్యాదు చేసే అవసరం లేకుండా జైలు అధికారి శ్రద్ధ తీసుకుని అతని పత్రాలన్నీ అందే వీలు కల్పించాలని కమిషన్ ఆదేశించింది.
 
 నెలరోజుల్లోగా సమాచారం ఇవ్వాలని చట్టం నిర్దే శించినా, అసలు ఏ జవాబూ ఇవ్వనందుకు, మొదటి అప్పీలు అధికారి ఆదేశాన్ని పాటించకుండా సంజయ్‌ని రెండో అప్పీలు చేసే పరిస్థితి కల్పించినందుకు, అడ్రస్ సరిగా ఉందో లేదో పరిశీలించకుండా పంపినందుకు, ఆ తరువాతైనా తప్పు సవరించనందుకు అతనికి నామ మాత్రంగా 1500 రూపాయల నష్టపరిహారం చెల్లించా లని కూడా కమిషన్ ఆదేశించింది.

ఎందుకు జైల్లో ఉన్నాడో తెలియకుండా పది రోజులపాటు జైల్లో గడ పడం కొంత వేధింపు అయితే, తర్వాత ఏడాది పాటు తన అభ్యర్థనకు సమాచారాన్ని ఇవ్వకపోవడం మరో వేధింపు అనీ, కాబట్టి పరిహారం చెల్లించాల్సిందే అనీ కమిషన్ తీర్పు. (సంజయ్ వర్సెస్ తీహార్ జైల్  సీఐసీ నంబర్ ఎస్‌ఏఏ 2016, 001077 కేసులో 23 జూన్ 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
 - మాడభూషి శ్రీధర్
 ఈమెయిల్: professorsridhar@gmail.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement