చిటారు కొమ్మన సమాచార హక్కు
పారదర్శకతను ప్రదర్శించడంలో, స.హ. చ ట్టం అమలులో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి చూపుతుందనుకోవడం పొరపాటు. అలా చేయదు కనుకే స్వతంత్ర ప్రతిపత్తిగల కమిషన్లు, న్యాయస్థానాలున్నాయి. సమాచార నిరాకరణ, జాప్యాల గురించి కమిషన్‌కు వచ్చే ఫిర్యాదులు నూటికి నూరింటిలోనూ ప్రభుత్వమే ముద్దాయి. తనను బోనెక్కించే సమాచార కమిషన్‌ను ఏ ప్రభుత్వమైనా బలహీనపరచాలని చూస్తుందే తప్ప, బలోపేతం చేయాలని ఎందుకనుకుంటుంది? సమాచార హక్కుకు రాజ్యాంగమే సర్వరక్ష. పౌరుల చేతిలో కమిషన్ ప్రభుత్వ మదగజాన్ని నియంత్రించే అంకుశంగా పనిచేయాలి.
సమకాలీనం
అది 2006 ఆగస్టు నెల. సమాచారహక్కు చట్టంపై హైదరాబాద్‌లో ఒక సదస్సుకు హాజరైన పౌర హక్కుల పోరాట యోధుడు కన్నబీరన్ ఓ మాటన్నారు. ‘‘ఈ చట్టం లేకముందు మేం న్యాయస్థానాల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేసైనా సమాచారం తెచ్చుకునే వాళ్లం. మీరంతా వచ్చారు. మధ్యలో ఇంకొన్ని పొరలుపెంచి సంక్లిష్టం చేశారు. మేలు జరగాల్సింది కీడు జరుగు తోంది’’ అని నాతో నిష్టూరమాడారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ మాటలే నిజమౌతున్నాయా? అనే అనుమానాన్ని బలపర్చే ఆనవాళ్లు కళ్లముందు కదులుతున్నాయి. 2005, అక్టోబర్ 12 నుండి దేశంలో స.హ చట్టం అమల్లోకి వచ్చింది. అంటే, తొమ్మిదేళ్లవుతోంది. ఇది తక్కువ సమయమేం కాదు. కానీ, ఇప్పటివరకు ఈ చట్టం ద్వారా ఆశించింది కొండంతయితే లాభించింది గోరంతే! చట్టం అమలుకు భాగస్వాముల నుంచి అందుతున్న సహకారం క్రమంగా తగ్గుతున్న తీరు బాధాకరం. దీన్ని ఉపేక్షిస్తే, అన్ని మంచి చట్టాలకు పట్టిన దుర్గతే ఈ చట్టానికీ తప్పదేమోనన్న ఆందోళన కలుగుతోంది. ఈ చట్టం అమలు ఇష్టం లేని వాళ్లు, సమాచార గోప్యతతో అనుచిత లబ్ధిని పొందేవాళ్లు, పాలనలో పారదర్శకత చేతగాని వాళ్లు... దుర్వినియోగమౌతుందనే సాకుతో దీన్ని యథాశక్తి నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలయిన పలు వ్యవస్థలు ఒక్కొక్కటి ఒక్కో పంథాలో ఈ చట్టం అమలును అభాసుపాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలు అలవిమాలిన అలసత్వం వహిస్తున్నాయి. రాజకీయపక్షాలు చట్టం స్ఫూర్తినే నీరుగారుస్తున్నాయి. అధికారగణం అడుగడుగునా చట్టం ఆచరణకు గండికొడుతోంది. అనుచిత అన్వయాలతో, స్ఫూర్తి విరుద్ధమైన తీర్పులతో న్యాయవ్యవస్థ కీలక సమయాల్లో తప్పుడు సంకేతాలిస్తోంది. ప్రసారమాధ్యమాలు నెమ్మదిగా ప్రాధాన్యత తగ్గిస్తున్నాయి. చివరకు సమాచార కమిషన్లు కూడా ‘ప్రభుత్వాలు సహకరించడం లేదు, మేం నిస్సహాయులం’ అని చేతులెత్తేయడం ఆందోళనకరం. గత శనివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో స్థూలంగా జరిగిందిదే!
ఎవరికి చేతనైనంత వారు...!
ఒకటిన్నర దశాబ్దాల పోరు ఫలితంగా అన్ని వర్గాలలో కోటి ఆశలు కల్పిస్తూ స.హ. చట్టం అమల్లోకొచ్చింది. చట్టం వేళ్లూనుకుంటున్న క్రమంలోనే రకరకాల అరిష్టాలు మొదలయ్యాయి. ఎనిమిదేళ్ల కిందటే, అంటే ఏడాదిలోనే చట్టం స్ఫూర్తిని దెబ్బతీసే యత్నం మొదలయింది. మూడుసార్లు ఈ చట్టాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీఓపీటీ) విఫల యత్నం చేశాయి. మబ్బు వెనుక మారీచుడిలా కేంద్ర ప్రభుత్వమూ దీని వెనుక ఉంది. నోట్ ఫైల్స్‌ను ఈ చట్టం పరిధి నుంచి తప్పించాలని, నిరర్థకమైనవనే సాకుతో దరఖాస్తుల్ని కుదించాలని, దరఖాస్తుదారుల్ని కట్టడి చేయాలని, కమిషన్ అధికారాల్ని కత్తిరించాలని పలు కుతంత్రాలు జరిగాయి. ఓసారి అన్నా హజారే, మరోమారు సమాచార కమిషనర్ల జాతీయ సదస్సు, ఇంకోమారు కార్యకర్తలు, పౌరసంఘాలు ఈ యత్నాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. దీంతో గుడ్డిలో మెల్లలా ఇప్పటికీ చట్ట సవరణ జరగలేదు. చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకమేం గొప్పగా లేదు. కమిషన్లకు సిబ్బందిని, వసతులను కల్పించకపోవడం, ఉత్తర్వుల అమలులో సహాయనిరాకరణ, తరచుగా జీవోలు, మెమోలతో చట్టం స్ఫూర్తిని దెబ్బతీయడం వంటివి రాష్ట్రాల్లో జరుగుతూనే ఉన్నాయి. కమిషన్ విచారణకు పిలిచినా ప్రథమ అప్పీలుకు అధికారి రానవసరం లేదనే వెసులుబాటును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అది సెక్షన్ 18 కింద సమాచార కమిషన్‌కు ఉన్న సివిల్ కోర్టు అధికారాలకు విరుద్ధమని ఎవరు చెప్పినా లెక్కచేయలేదు.
ఇక రాజకీయ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పారదర్శకత మేలని ఉపన్యాసాలు దంచే రాజకీయపక్షాలు ‘తమదాకా వస్తే గానీ...’ అన్న తరహాలో అడ్డం తిరిగాయి. పారదర్శకతను పాటించాల్సి రాగానే ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఒక్కటై ముఖం చాటేశాయి. ప్రజాక్షేత్రంలో ఉంటూ, తమ ప్రతి చర్యా ప్రజల కోసమేనని చెబుతూ, ప్రజాధనం నుంచి లబ్ధి పొందుతూ.... అదే ప్రజలకు సమాచారం ఇచ్చేది లేదంటే ఎలా? అని కేంద్ర సమాచార కమిషన్ ప్రశ్నించింది. సమాచారం ఇచ్చి తీరాల్సిందేనని ఆదేశించింది. ‘మావి పౌర కార్యాలయాలే కావు, మేమసలు ఈ చట్టం పరిధిలోకే రామ’ని అవి తప్పించుకోజూశాయి. కానీ, కర్రు కాల్చి వాతపెట్టినట్టు సర్వోన్నత న్యాయస్థానం పార్టీల వాదనను ఖండించింది. ‘మీది కచ్చితంగా పౌర కార్యాలయమే, సమాచారం ఇచ్చి తీరాల్సిందే, ఫలానా సమయంలోగా చట్టాన్ని పాటించండి’అని ఇచ్చిన సుప్రీం తీర్పునకు నేటికీ అతీగతీ లేదు. సమాచార హక్కు పౌరుల చేతిలో గొప్ప ఉపకరణం, వ్యవస్థల్ని చక్కదిద్దుకోవ డంలో ఉపయోగకరం అని భావించే వారిని దిగ్భ్రాంతిపరుస్తూ ఇటీవల మద్రాసు హైకోర్టు ఓ తీర్పిచ్చింది. సమాచారం పొందగోరే వారు, అదెందు కోసమో తెలపాలంటూ చిత్రమైన ఆదేశాలిచ్చింది. సమాచారం ఎందుకో దరఖాస్తుదారు తెలపాల్సిన అవసరం లేదనే చట్టంలోని సెక్షన్-6కు పూర్తి విరుద్ధమైన తీర్పిది. పైకోర్టులో సవాలు చేస్తే నిలవదు, అది వేరే విషయం. ఇది చట్టస్ఫూర్తికి భంగకరమైనది. కమిషన్ కూర్పు, కమిషనర్ల నియామకాలపై లోగడ సుప్రీంకోర్టు ఓ అసంబద్ధమైన తీర్పిచ్చింది. పౌర సంఘాలు సవాలు చేయగా ఏడాది తర్వాత, ఇది ‘న్యాయతప్పిదం’ అని తీర్పు చెప్పి సుప్రీమే దాన్ని రద్దుపరచి విజ్ఞత ప్రదర్శించింది. రాజ్యాంగ సంస్థగా నా కార్యాలయం సమాచార చట్టపరిధిలోకే రాదని లోగడ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఒకరు బెట్టుచేశారు. ఇది సరైన అన్వయం కాదని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం చట్టం పరిధిలోకే వస్తుందని, కింది స్థాయిలోని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తితో పాఠాలు చెప్పించుకున్న తర్వాత గాని ఆయన దారికి రాలేదు. దిద్దుబాటు జరిగే వరకు ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చట్టం అమలుకు భంగం కలిగించే తప్పుడు సంకేతాలే!
అప్రమత్తతే సమాచార హక్కుకు రక్ష
ప్రజాస్వామ్యంలో, సదా అప్రమత్తంగా ఉండటం పౌరులు చెల్లించాల్సిన మూ ల్యం అంటారు విజ్ఞులు. స.హ. చట్టాన్ని పౌరులు, పౌర సంఘాలే కాపాడుకో వాలి. సమాచార కమిషన్ వంటి స్వతంత్ర సంస్థలు అందుకు సహకరించాలి. అంతే తప్ప, ‘ప్రభుత్వం మాకు సహకరించడం లేదు, మా ఆదేశాలు పాటించే చిత్తశుద్ధి లేనందున మేం అశక్తులం, రేపు మమ్మల్నేమనొద్దు’అంటూ కూనిరా గాలు తీయకూడదు. పాలనలో పారదర్శకతను చూపడంలో, స.హ. చ ట్టాన్ని సమర్థవంతంగా అమలుచేయడంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధి చూపుతుందను కోవడం పొరపాటు. అలా పనిచేయదు కనుకే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమి షన్లు, న్యాయస్థానాలున్నాయి. అధికారులు సమాచారం నిరాకరిస్తున్నారని, జాప్యం చేస్తున్నారని పౌరులు కమిషన్‌కు చేసే ఫిర్యాదులు నూటికి నూరింటి లోనూ ప్రభుత్వమే ముద్దాయి. తనను బోనెక్కించే సమాచార కమిషన్‌ను ఏ ప్రభుత్వ మైనా ఏదో రకంగా బలహీనపర్చే యత్నం చేస్తుందే తప్ప, బలోపేతం చేయాలని ఎందుకనుకుంటుంది? శివసాగర్ అన్నట్టు, ‘‘ఏ పులి మేకను సంరక్షి స్తుంది? ఇది చరిత్ర చెప్పిన సత్యం.’’ అందుకని కమిషన్ స్వతంత్రంగానే, కాస్త కటువుగానే వ్యవహరించాలి. రాజ్యమెప్పుడూ బలిష్టమైనదే. తన బహు ముఖ మైన, బహుళ పార్శ్వాలు కలిగిన బలంతో అది తన అధికారానికి అడ్డనుకునే ప్రజా హక్కుల్ని నలిపేస్తుంది. పౌరుల చేతిలో కమిషన్ ప్రభుత్వ మదగజాన్ని నియంత్రించే అంకుశమవ్వాలి. దానికి మన రాజ్యాంగమే సర్వరక్ష. ఆ నీడలో, పార్లమెంటు రూపొందిన స.హ. చట్ట నిబంధనల ఆధారంగానే ప్రభుత్వాల్ని కమిషన్లు దారిలోకి తెచ్చుకోవాలి. అవసరమైతే అవి సమాచారం కోసం ప్రజా సంఘాలు నడిపే పోరాటాల్లో, న్యాయపోరాటాల్లో సైతం తలదూర్చి సమాచార హక్కును పరిరక్షించాలి. కన్నబీరన్ ప్రస్తావించిన ‘పొరలు’ అవరోధం కాకుండా చట్ట స్ఫూర్తికి కమిషన్ జీవం పోయాలి. కడకు దానినిరాజ్యాంగమే దేవుడై కాపాడాలి. ఈ సందర్భంగా తిలక్ ‘ప్రార్థన’ గుర్తొస్తోంది.
‘‘దేవుడా! రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి పతివ్రతల నుండి పెద్ద మనుషుల నుండి పెద్ద పులుల నుండి లక్షలాది దేవతల నుండి వారి పూజారుల నుండి వారి వారి ప్రతినిధుల నుండి’’
(వ్యాసకర్త సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్)
దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్టు