తెలుగు తేజం తీర్పే నెగ్గింది
విశ్లేషణ
నిరంతర నిఘాల వల్ల మాట్లాడలేని, తిరగలేని, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేని ఒత్తిడి, ఒక రకమైన నిర్బంధం ఏర్పడతాయని, ఇవి కచ్చితంగా వ్యక్తి స్వేచ్ఛలకు భంగకరమని జస్టిస్ సుబ్బారావు 1963లోనే మైనారిటీ తీర్పు చెప్పారు. అదే నేడు వ్యక్తి గోప్యత హక్కు శాసనమైంది.
గోప్యత హక్కు, మన సంవిధానం మూడో భాగంలోని అధికరణాలలో అంతర్గతంగా ఉన్న ప్రాథమిక హక్కు అని 1963లో తెలుగుతేజం చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు తీర్పు ఇస్తే చెల్లలేదు. ఎందుకంటే మిగతా ఐదుగురు జడ్జీలు విభేదించారు. అప్పుడు అది ఆయన అసమ్మతి స్వరం. కానీ ఇప్పుడది శాసనం. ఎందుకంటే 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సుబ్బారావు సూత్రాన్ని ఆగస్టు 24, 2017న అంగీకరించారు.
నా బతుకు నా ఇష్టం, నా తీరు నా సొంతం, ఇంటి గుట్టు, వివాహ, కుటుంబ విషయాలు, పిల్లలను కనడం, పెంచడం, సొంత ఉత్తర ప్రత్యుత్తరాలు, వంటి అంశాలు గోప్యత పరిధిలో ఉంటాయన్నది అవగాహన. ఖరక్ సింగ్ అనే వ్యక్తి ఒక రిట్ పిటిషన్‌లో ‘‘నా ఇంటికి అర్ధరాత్రి చౌకీదారు వస్తుంటాడు. చాలా సార్లు పోలీసు కానిస్టేబుళ్లు వచ్చి తలుపు తట్టి నిద్రలేపుతారు. తలుపు దగ్గర నిలబడి అరుస్తారు. ఒక్కోసారి ఇంట్లోకి దూసుకొస్తారు. నిద్రలేపి పోలీసుస్టేషన్‌కు రమ్మం టారు. ఊరొదిలి వెళ్లే ముందు చౌకీదార్‌కు ఎప్పుడొస్తావో చెప్పి వెళ్లాలంటారు. వెళ్లినచోట పోలీసు స్టేషన్‌కు సమాచారం పంపిస్తారు. అక్కడ కూడా నాపైన ఇదే విధమైన నిఘా ఉంటుంది. చౌకీదార్ క్రైం రికార్డ్‌లో నేను సంతకాలు చేస్తుండాలి. ఆ రికార్డులో నాకు తెలి యకుండా ఏమేమో రాసుకుంటారు. ఏం రాస్తున్నారో చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా రికార్డు చూపడం లేదు. ఇదేం వేధింపు? ఇంత అన్యాయమా?’’ అని సవాలు చేశారు. అతను హిస్టరీ షీటర్ అనీ, అతనిపైన నిఘా వేశామే గాని అధికార దుర్వినియోగం చేయలేదని పోలీసులు వాదించారు. యూపీ పోలీసు రెగ్యులేషన్ 236 కింద తమకు ఈ అధికారం ఉందన్నారు. రహస్యంగా అనుమానితుడి ఇంటి ముందు నిఘా వేయవచ్చు, రాత్రి కూడా ఇంటికి వెళ్లవచ్చు. అతని వృత్తి అలవాట్లు, ఎవరితో తిరుగుతాడు, ఆదాయం ఎంత, ఖర్చుల వివరాలు అడుగవచ్చు. ఇంటి నుంచి వెళ్లడం, రాకపోవడం, రావడం పరిశీలించవచ్చు. 237 ప్రకారం హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తులు.. క్లాస్ ఎ, స్టార్డ్, అన్ స్టార్డ్ అని రకరకాలుగా ఉంటారు. వారు చేసిన నేరాలను బట్టి నిఘా స్థాయి ఉంటుందని వివరించారు.
ఈ నిఘాల వల్ల నాకు సొంత బతుకు లేకుండా పోయింది. స్వేచ్ఛగా నేనేమీ చేయలేను, మాట్లాడలేను, తిరగలేను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద ఎ (మాట్లాడే హక్కు), డి (దేశమంతా స్వేచ్ఛగా తిరిగే హక్కు) ఉంది. ఆర్టికల్ 21 కింద జీవిత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్నాయంటారు, నిజంగా ఉన్నాయా? అని ఖరక్ సింగ్ అడిగాడు. సామాజిక బాధ్యతలు కొన్ని ఉంటాయి. సంఘంలో శాంతి ముఖ్యం. నేరాలు చేసే అలవాటున్న వారిపై నిఘా వేసి పరిశీలించకపోతే నేరాలు ఎలా ఆగుతాయి? పోలీసు అధికారాలు లేకపోతే నేరాలను నిరోధించడం సాధ్యమా? (చట్టం నిర్ణయించిన పద్ధతి ప్రకారం ఉందా లేదా అని పరిశీలించాలి... ఏకే గోపాలన్, ఏఐఆర్ 1950, సుప్రీంకోర్టు 27) జీవిత హక్కు (21)లో స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా ఉంది. 19లో కూడా దానిని మరింత స్పష్టంగా వివరించారు. ఈ నిఘాల వల్ల మాట్లాడలేని, తిరగలేని, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేని ఒత్తిడి, ఒకరకమైన నిర్బంధం ఉన్నాయి. వోల్ఫ్ వర్సెస్ కొలరాడో (338 అమెరికా 1949, 25) కేసులో జస్టిస్ ఫ్రాంక్ ఫర్టర్ పోలీసులకు తమ ఇష్టం వచ్చినపుడు పౌరుడి ఇంట్లో చొరబడే అధికారం ఉంటే ఇక స్వేచ్ఛ ఏమిటి? అని అడిగారు.
ఆ పౌరుడు ఇంట్లో ఆనందంగా ప్రశాంతంగా ఉండగలడా? ఖచ్చితంగా 236 రెగ్యులేషన్ పోలీసు అధికారాల ద్వారా ఆర్టికల్ 21లో ఉన్న వ్యక్తిగత జీవన స్వేచ్ఛా హక్కు, ఆర్టికల్ 19(1)(డి)లోని తిరిగే స్వేచ్ఛ, (ఎ)లో మాట్లాడే స్వేచ్ఛా హక్కులను పూర్తిగా భంగపరుస్తున్నాయని జస్టిస్ సుబ్బారావు తీర్పు చెప్పారు. పోలీసులు నిఘా వేస్తే మాత్రమేమిటి? ఎక్కడైనా తిరగడానికి అడ్డంకి లేదు కాబట్టి 19(1)(డి) భంగపడినట్టు భావించలేమనీ, ఆయన స్వేచ్ఛకు 21 కింద హాని ఉన్నట్టు కూడా భావించలేమని మిగతా ఐదుగురు న్యాయమూర్తులు.. ఎన్ రాజగోపాల అయ్యంగార్, పీ భువనేశ్వర్ సిన్హా, సయ్యద్ జాఫర్ ఇమాం, జేసీ షా, జేఆర్ ముధోల్కర్ భావించారు. ప్రతి కదలికను అధికారికంగా పోలీసులు పరి శీలిస్తున్నప్పుడు, నీడలా ఎవరో వెంటాడుతూ ఉంటే ఎవరయినా ఏ విధంగా స్వేచ్ఛగా తిరగడానికి వీలవుతుంది? నిఘా ఉన్నపుడు దేశం మొత్తం జైలే అవుతుందని జస్టిస్ సుబ్బారావు ఒక్కరే ఆలోచించారు. ధర్మాసనం మీద ఉన్న మిగతా న్యాయమూర్తులు విభేదించారు. మూడో అధ్యాయంలో విడివిడిగా ఒక్కో ఆర్టికల్ కింద ఫలానా ప్రా«థమిక హక్కు వస్తుందా, రాదా అని చూడటం సరి కాదని, మొత్తం ప్రాథమిక హక్కుల అధ్యాయం కింద, విభిన్న ఆర్టికల్స్ మధ్య అంతర్గతంగా ఉన్న మూలార్థంకింద ప్రాథమిక హక్కు ఉందా లేదా అని పరిశీలిస్తే ఆ హక్కు భంగపడిందని అర్థమవుతుందని సుబ్బారావు వివరించారు. తిరిగే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, పోలీసుల నిఘాలో మానసిక ఒత్తిడులకు లోనవుతాయన్నారు.
ఉదాహరణకు జైల్లో ఖైదీని భార్య పిల్లలు మిత్రులు కలవడానికి వస్తే వారు పోలీసు పర్యవేక్షణలోనే మాట్లాడాలంటారు. ఖైదీ గొంతు విప్పి మాట్లాడగలుగుతాడు. కాని ఏం మాట్లాడితే ఏం సమస్యో అని మనస్ఫూర్తిగా మాట్లాడలేడు. అతనికి మాట్లాడే స్వేచ్ఛ ఉన్నట్టేనా అని జస్టిస్ సుబ్బారావు అడిగారు. ఆర్టికల్ 19ని ఆర్టికల్ 21తో అనుసంధానించాలన్నారు. ఐదుగురి తీర్పే ఖరక్ సింగ్ కేసులో శాసనమైంది (ఖరక్ సింగ్ వర్సెస్ యూపీ ఏఐఆర్ 1963 సుప్రీంకోర్టు 1295). కానీ సుబ్బారావుగారి నాటి అసమ్మతి ఈనాటికి శాసనమైంది. రాజమండ్రిలో పుట్టిన జస్టిస్ కోకా సుబ్బారావు, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు కార్యాలయంలో జూనియర్‌గా ప్రాక్టీసు చేశారు. బాపట్ల జిల్లా మున్సిఫ్‌గా కొన్నాళ్లు పనిచేశారు. 1948లో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి పదవి స్వీకరించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు 1954లో గుంటూరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఆ తరువాత 1966లో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైనారు. గోలక్‌నాథ్ కేసులో ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని చరిత్రాత్మక తీర్పు చెప్పారు. ఖరక్ సింగ్ కేసులో ఆయన చెప్పిన అసమ్మతి తీర్పులో పేర్కొన్న సూత్రాలను తొమ్మిది మంది పక్షాన ఆరుగురు ఇచ్చిన తీర్పుల్లో ఆమోదించడం విశేషం.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
ఈ-మెయిల్: professorsridhar@gmail.com