బాలికా ఎంత పనిచేశావ్
► సమాచారం కోసం కార్పొరేషన్
► అధికారులకు 14 ఏళ్ల బాలిక అర్జీ
► నిర్ణీత సమయంలో స్పందించని అధికారులు
► సమాచార కోర్టుకు హాజరుకావాలని కమిషనర్‌కు నోటీసులు
ఏం జరిగినా పెద్దగా పట్టించుకోరని నగర పాలక సంస్థ అధికారులకు పేరుంది. అక్కడ ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే చుక్కలు కనిపిస్తాయి. అలాంటి అధికారులకు 9వ తరగతి చదువుతున్న బాలిక షాక్ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగింది. అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పుడు నోటీసులు వచ్చాయి. దీంతో వారు బాలికా ఎంత పనిచేశావ్ అని నిట్టూరుస్తున్నారు.
నెల్లూరు, సిటీ : ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలిక పేరు రావూరి హ్రుల్లేకా. ఈ అమ్మాయి తల్లిదండ్రులు రమేష్‌బాబు, హరిత నగరంలోని పొగతోటలో నివసిస్తున్నా రు. ఆక్స్‌ఫోర్డ్ పాఠశాలలో హ్రుల్లేకా 9వ తరగతి చదువుతుంది. డెంగీ వ్యాధి కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గమనించిన హ్రుల్లేకా చలించిపోయింది. నగర పరిధిలో చెత్తాచెదారం శుభ్రం చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్‌దని, వారు సక్రమంగా పనిచేయలేదని భావించి ఏదో ఒకటి చేయాలని ఆలోచించింది. అసలు కార్పొరేషన్‌కు స్వచ్ఛభారత్ కింద ఎంత నిధులు విడుదలయ్యాయి? వాటిలో ఎంత, ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారు? వివరాలు ఇవ్వాలని నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలోని అధికారులను సమాచార హక్కు చట్టం ద్వారా కోరింది.
గతేడాది అక్టోబర్‌లో అర్జీ ఇవ్వగా నగర పాలక సంస్థ అధికారులు ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదు. సమయానికి సమాచారం ఇవ్వకపోవడంతో సమాచార హక్కు చట్టం కింద కేసు నమోదైంది. (నంబరు-4623-2016). ఈ నెల 15వ తేదీన సమాచార హక్కు కోర్టులో హాజరుకావాలని కమిషనర్ వెంకటేశ్వర్లుకు నోటీసులు వచ్చాయి. ఈ క్రమంలో ఇంజీనిరింగ్ విభాగం నుంచి ఓ అధికారి హైదరాబాద్‌లోని సమాచార కోర్టులో హాజరుకానున్నారు.