Swachh Bharat program
-
అంతా‘చెత్త’మయం
బరంపురం: ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం అటకెక్కుతోంది. బరంపురం నగరంలో అడుగడుగునా పేరుకుపోతున్న చెత్త చూస్తుంటే ప్రధాని మోడీ ఆశించిన లక్ష్యం నీరుగారినట్లు కనిపిస్తోంది. బీఎంసీ నిర్లక్ష్యం, స్థానిక నాయకుల చొరవ కొరవడడంతో నగరంలో ఎక్కడ చూసినా చెత్త నిలువలతో దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. బరంపురం మున్సిపాలిటీ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలో సుమారు 5 లక్షల జనాభా నివసిస్తున్నారు. ఈ జనాభా వినియోగించిన తరువాత విసిరివేసే చెత్త నగరంలో ప్రతిరోజూ సుమారు 200 టన్నుల మేర పేరుకుపోతోంది. నగరంలో గల కొమ్మపల్లి, గేట్ బజార్, పెద్ద బజార్, లంజిపల్లి ఓవర్ బ్రిడ్జి కింద, కొత్త బస్‌స్టాండ్, స్టేడియం రోడ్లలో చెత్త బాగా పేరుపోతోంది. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. దీని ఫలితంగా చెత్త కుళ్లిపోయి దోమలు విపరీతంగా పెరిగి రోగాలు విజృంభిస్తున్నాయి. దోమల వల్ల వ్యాధుల బారిన పడి ఆనారోగ్యం పాలవుతున్నామని నగర ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కలగా మిగిలిన చెత్తశుద్ధి కర్మాగారం క్లీన్ అండ్ గ్రీన్‌తో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నగర శివారు మౌడా పర్వతాల్లో బీఎంసీ ఆధ్వర్యంలో రూ.70 కోట్లతో చేపట్టిన చెత్తశుద్ధి కర్మాగారం నిర్మాణం కలగానే మిగిలిపోయింది. నగరంలో ప్రతి రోజు వెలువడుతున్న 200 టన్నుల చెత్తను సేకరించి మౌడాకు తరలించేందుకు బీఎంసీ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇందుకు ముఖ్యకారణం చెత్తశుద్ధి కర్మాగారం చేపట్టేందుకు టెండర్ కోసం ఏ ఒక్క ప్రైవేట్ సంస్థ కూడా ముందుకు రాకపోవడమే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం అటకెక్కుతోందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక పలు స్వచ్ఛంద సంస్థలు తప్పిస్తే స్థానిక నాయకులకు స్వచ్ఛభారత్‌పై చొరవ కరువైంది. పత్రికలు, టీవీల్లో స్వచ్ఛభారత్ పరిశుభ్రతపై ప్రసారం హోరెత్తించినా పరిసరాల మరిశుభ్రత విషయంలో పరిస్థితుల్లో మార్పురావడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. స్వచ్ఛభారత్ అంటే పత్రికల్లో ఫోజులు ఇవ్వడం కాదని నగర పరిశుభ్రతపై దృష్టిసారించి స్థానిక రాజకీయ నాయలు చొరవ చూపాలని సీనియర్ సిటిజన్స్, మేధావులు, పరిశీలకులు కోరుతున్నారు. -
జీ(వి)తమింతేనా..?
రాజాం/రేగిడి : స్వచ్ఛదూత్.. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడానికి నియమితులైన దూతలు. పాఠశాలల్లో పరిశుభ్రత మాటెలా ఉన్నా వీరి బతుకులను మాత్రం బాగు చేసుకోలేకపోతున్నా రు. అరకొరగానే స్వచ్ఛదూత్‌లను నియమించిన సర్కా రు ఆ కొద్ది మందికి కూడా 11 నెలలుగా వేతనాలు ఇ వ్వక వెతలు పెడుతోంది. ఈ చిరు ఆదాయంపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకువచ్చే స్వచ్ఛదూత్‌లు ఏడాది కాలంగా జీతం ఎప్పుడు వస్తుందోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు ఉన్నాయో లేవో కూడా వారికి స్పష్టత ఇవ్వడం లేదు. ఈ ఆపత్కాలంలో తమను ఆదుకునే వారి కోసం వారునిరీక్షిస్తున్నారు. 11 నెలలుగా..2016లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం కోసం స్వచ్ఛ దూత్‌లను నియమించారు. రాజకీయ వివాదాల కారణంగా కొన్ని పాఠశాలల్లో వీరి నియామకం చేపట్ట లేదు. మరికొన్ని పాఠశాలల్లో ఇలా మరుగుదొడ్లు క్లీన్ చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా 4 వేల మందికి పైగా స్వచ్ఛదూత్‌లు అవసరం ఉండగా 2944 మంది మాత్రమే నియమితులయ్యారు. వీరిలో ఉన్నత పాఠశాలల్లో 357 మంది, యూపీ పాఠశాలల్లో 341 మంది, ప్రాథమిక పాఠశాలలో 2251 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. గత 11 నెలలుగా వీరికి రావాల్సిన వేతనాలు ఇవ్వడం లేదు. రూ.7కోట్లకు పైగా బకాయిలు.. స్వచ్ఛ దూత్‌లకు సర్కారు 2017 ఏప్రిల్ నెల నుంచి చెల్లింపులు నిలుపుదల చేసింది. జి ల్లా రాజీవ్ విద్యామిషన్ అధికారులు వీటిని చెల్లించాల్సి ఉంది. జిల్లాలో మొత్తం 357 మంది ఉన్నత పాఠశాలల స్వచ్ఛదూత్‌లకు సంబంధించి రూ.1,57,08,000లు ప్రభు త్వ ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబం ధించి 341 మంది స్వచ్ఛదూత్‌లు విధులు నిర్వహిస్తుండగా వీరికి రూ. 93,77,500లు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 2251 మంది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల స్వచ్ఛదూత్‌లు విధులు నిర్వహిస్తుండగా వీరికి రూ.4,95,22,000లు చెల్లించాలి. జిల్లావ్యాప్తంగా మొత్తం స్వచ్ఛదూత్‌లకు రూ.7,46,07,500లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇంతవరకూ వీటి ఊసెత్తిన వారు కనిపించడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసినా అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగాలపై కూడా అనుమానాలు అధికమవుతున్నాయి. ఎన్నో అవమానాలు పడుతూ.. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వారి ఆరో గ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛదూత్‌లను నియమించింది. వీరు ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రపరచాల్సి ఉంది. వీరికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రూ.60 శాతం నిధులు గౌరవ వేతనం చెల్లిం చేందుకు వస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను సైతం అలానే ఉంచేసి ఇంతవరకూ వీరికి చెల్లింపులు జరపలేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు క్లీన్ చేయడం అంటే పెద్ద అవమానకరంగా భావిస్తారు. అయినప్పటికీ వేతనాలకు ఆశపడి ఈ విధుల్లో చేరిన మహిళలకు చివరకు నిరాశే మిగిలింది. ఉన్న కూలి పనులు మా నుకుని ఇటు వైపు వచ్చిన వారికి కూలి లేక, వేతనాలు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇబ్బందులు పడుతున్నాం గత 11 నెలలుగా నా గౌరవ వేతనం రాలేదు. నేను స్వచ్ఛదూత్గా చేరి రెండేళ్లు కావస్తుంది. ప్రారంభంలో నెలకు రూ. 2 వేలు అంటూ కొన్నాళ్లు ఇచ్చారు. ఇప్పుడు అవి ఇవ్వడం లేదు. మాకు ఆ డబ్బులు వస్తాయో రావో అని అనుమానంగా ఉంది. – కొండంగి పెంటమ్మ, స్వచ్ఛదూత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, వన్నలి, రేగిడి మండలం. సేవే మిగిలింది.. నేను మా పాఠశాలల్లో మరుగుదొడ్లు క్లీన్ చేయాలంటే ఎంతో కష్టపడాలి. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. సెలవు సమయంలో కూడా శుభ్రంగా ఉంచాలి. ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలు వస్తుంటారు. కాబట్టి రాత్రి సమయాల్లో మా కుటుంబ సభ్యులు మరుగుదొడ్లకు కాపలా కూడా కాస్తుంటారు. నాకు గత 11 నెలలుగా రావాల్సిన వేతనం అందించలేదు. ఈ సేవలు అరువు సేవలుగా కనిపిస్తున్నాయి. – బి.సూరీడమ్మ, స్వచ్ఛదూత్ జెడ్పీ హైస్కూల్, డోలపేట, రాజాం నిధులు విడుదలవుతాయి.. స్వచ్ఛదూత్ల గౌరవ వేతనాలకు సంబంధించిన నిధులు విడుదలవుతాయి. ఈ మేరకు పరిశీలిస్తున్నాం. ఇటీవల బడ్జెట్ వచ్చిందని అధికారులు చెప్పారు. అన్ని పాఠశాలల్లో స్వచ్ఛదూత్‌లు మంచి సేవలు అందించారు. వారికి సకాలంలో గౌరవ వేతనాలు అందకపోవడం శోచనీయం.– ఆర్వీఆర్జే రాజు, ఎంఈఓ, రాజాం. -
బాత్రూమ్స్ కట్టిన త్రిష
కాంచీపురం (తమిళనాడు) : నటి త్రిష బాత్రూమ్స్ కట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం జిల్లాలోని నెమలి గ్రామంలో నాలుగు మరుగుదొడ్లను నిర్మించేందుకు తన వంతు సాయం చేశారు త్రిష. సిమెంట్‌ను తన చేతులతో కలిపిన త్రిష.. ఇటుకలను వరుసలో పెట్టి నిర్మాణ పనులను ప్రారంభించడం విశేషం. త్రిష యునెస్కోకు భారత్ తరఫున అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరుగుదొడ్ల నిర్మాణంపై మాట్లాడిన త్రిష.. స్వచ్ఛ భారత్‌కు తన వంతు సాయం అందించడం ఆనందంగా ఉందని అన్నారు. -
బాలికా ఎంత పనిచేశావ్
► సమాచారం కోసం కార్పొరేషన్ ► అధికారులకు 14 ఏళ్ల బాలిక అర్జీ ► నిర్ణీత సమయంలో స్పందించని అధికారులు ► సమాచార కోర్టుకు హాజరుకావాలని కమిషనర్‌కు నోటీసులు ఏం జరిగినా పెద్దగా పట్టించుకోరని నగర పాలక సంస్థ అధికారులకు పేరుంది. అక్కడ ఏదైనా సమాచారం తెలుసుకోవాలంటే చుక్కలు కనిపిస్తాయి. అలాంటి అధికారులకు 9వ తరగతి చదువుతున్న బాలిక షాక్ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగింది. అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో ఇప్పుడు నోటీసులు వచ్చాయి. దీంతో వారు బాలికా ఎంత పనిచేశావ్ అని నిట్టూరుస్తున్నారు. నెల్లూరు, సిటీ : ఈ చిత్రంలో కనిపిస్తున్న బాలిక పేరు రావూరి హ్రుల్లేకా. ఈ అమ్మాయి తల్లిదండ్రులు రమేష్‌బాబు, హరిత నగరంలోని పొగతోటలో నివసిస్తున్నా రు. ఆక్స్‌ఫోర్డ్ పాఠశాలలో హ్రుల్లేకా 9వ తరగతి చదువుతుంది. డెంగీ వ్యాధి కారణంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గమనించిన హ్రుల్లేకా చలించిపోయింది. నగర పరిధిలో చెత్తాచెదారం శుభ్రం చేయాల్సిన బాధ్యత కార్పొరేషన్‌దని, వారు సక్రమంగా పనిచేయలేదని భావించి ఏదో ఒకటి చేయాలని ఆలోచించింది. అసలు కార్పొరేషన్‌కు స్వచ్ఛభారత్ కింద ఎంత నిధులు విడుదలయ్యాయి? వాటిలో ఎంత, ఎక్కడెక్కడ ఖర్చుపెట్టారు? వివరాలు ఇవ్వాలని నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఇంజనీరింగ్ విభాగంలోని అధికారులను సమాచార హక్కు చట్టం ద్వారా కోరింది. గతేడాది అక్టోబర్‌లో అర్జీ ఇవ్వగా నగర పాలక సంస్థ అధికారులు ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదు. సమయానికి సమాచారం ఇవ్వకపోవడంతో సమాచార హక్కు చట్టం కింద కేసు నమోదైంది. (నంబరు-4623-2016). ఈ నెల 15వ తేదీన సమాచార హక్కు కోర్టులో హాజరుకావాలని కమిషనర్ వెంకటేశ్వర్లుకు నోటీసులు వచ్చాయి. ఈ క్రమంలో ఇంజీనిరింగ్ విభాగం నుంచి ఓ అధికారి హైదరాబాద్‌లోని సమాచార కోర్టులో హాజరుకానున్నారు. -
‘స్వచ్ఛ భారత్’లో హైదరాబాద్‌కు 19వ ర్యాంక్
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలులో హైదరాబాద్ ప్రగతి సాధించింది. గతేడాది కంటే ఈసారి మెరుగుదల కనబరిచింది. స్వచ్ఛ భారత్ అంశంపై నిరుడు నిర్వహించిన సర్వేలో నగరానికి 274వ స్థానం దక్కగా, ఈసారి 19వ ర్యాంక్‌కు ఎగబాకింది. సర్వేలో భాగంగా మొత్తం 2వేల మార్కులకుగాను హైదరాబాద్‌కు 1355 మార్కులు లభించాయి. ఈ సర్వేకు 75 నగరాలను ఎంపి క చేశారు. గత సంవత్సరం 475 నగరాల్లో సర్వే నిర్వహించగా, అప్పుడు 274వ ర్యాంక్ వచ్చింది. ఈసారి సర్వే పకడ్బందీగా నిర్వహించడం, శాస్త్రీయ విధానాలను పాటించడం వల్ల హైదరాబాద్‌కు ఈ ర్యాంకు వచ్చిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేలో మైసూర్ తొలిస్థానంలో నిలిచింది. చండీగఢ్, తిరుచిరాపల్లి వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. మైసూరు వరుసగా రెండేళ్లు ప్రథమస్థానంలో నిలవడం విశేషం. ఈసారి మూడు అంశాలకు 2 వేల మార్కులు కేటాయించారు. వీటిల్లో గ్రేటర్లో చేపట్టిన పారిశుధ్య కార్మికుల ‘పరిచయం’, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు, ఇంటింటికీ రెండు చెత్తడబ్బాలు, రెండు వేల ఆటో టిప్పర్ల పంపిణీ, ఘన వ్యర్థాల నిర్వహణ, లక్ష మంది విద్యార్థులచే చేతులు శుభ్రం చేసుకునే కార్యక్రమ నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణకు అధిక మార్కులు లభించినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. డెబ్రిస్ తొలగింపు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ సంతృప్తికరంగా లేకపోవడం, చెత్త తరలించే జీహెచ్ఎంసీ వాహనాలకు జీపీఎస్ లేకపోవడం, స్వచ్ఛభారత్ ప్రచారకర్తల భాగస్వామ్యం సంతృప్తికరంగా లేకపోవడం, స్వచ్ఛ సర్వేక్షన్‌కు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు నగరవాసుల నుంచి తగిన స్పందన లేకపోవడం వంటి అంశాలకు తక్కువ మార్కులు వచ్చాయని పేర్కొంది. నగరంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల 150 మార్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ఎన్నికల కారణంగా చెత్త ప్లాంట్ ఏర్పాటు పనులు అర్ధాంతంగా ఆగిపోవడం వల్ల ఎన్నో మార్కులు కోల్పోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. టాప్-10 నిలుస్తాం : ఘనవ్యర్థాల నిర్వహణ, పౌరసేవలు, మౌలికసదుపాయాల కల్పన , తదితర అంశాల్లో వినూ త్న కార్యక్రమాలు చేపట్టినందువల్లే ఈసారి స్వచ్ఛ భారత్ ర్యాకింగ్ల్లో మన నగరం 19వ స్థానంలో నిలిచిందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. వచ్చే సంవత్సరం తొలి పది స్థానాల్లోనే నిలవగలమని ధీమా వ్యక్తం చేశారు. -
అవ్వా.. ఇంకా ఆరుబయటకే!!
లక్ష్యం ఘనం.. ఆచరణ నామమాత్రం - మొక్కుబడిగా మరుగుదొడ్ల నిర్మాణం - మంజూరైనవి 3,333... పూర్తయ్యింది 869.. చెల్లించింది...76 - ప్రతిబంధకంగా ఆన్లైన్ నిబంధన - శ్రద్ధచూపని అధికారులు.. బిల్లులు రాక తిప్పలు పడుతున్న లబ్ధిదారులు అరవైతొమ్మిదేళ్ల స్వతంత్ర భారతావనిలో ఆ..అవసరాలు తీర్చుకోవడానికి పల్లె, పట్నం అనే తేడా లేకుండా ఇంకా ఆరుబయటకే వెళ్లాల్సి వస్తోంది. ఇంటికో మరుగుదొడ్డి ఉండాలనే ప్రభుత్వ లక్ష్యం మంచిదే అయినా.. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. తాజాగా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. నిర్మాణాలు పూర్తిచేసిన వారికి బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతోంది. దీంతో లబ్ధిదారులు మరుగుదొడ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. - సంగారెడ్డి మున్సిపాలిటీ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలతో పాటు రెండు నగర పంచాయతీలలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరించారు. ఆయా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 10వేల మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నా కేవలం 3333 మందికి మాత్రమే మంజూరు చేశారు. నిర్మాణం పూర్తిచేసిన ప్రతి లబ్ధిదారుడికి రూ.12వేలు అందజేస్తామని ప్రకటించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.8 వేలు కాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేలు చెల్లిస్తుంది. గుంతలు తీసి రింగులు వేశాక మొదటి విడత బిల్లులు చెల్లించాల్సి ఉంది. గోడ నిర్మాణం, డోర్లు బిగించాక ఇంజినీరింగ్ అధికారి పరిశీలించి ఆ ఫొటోను ఆన్లైన్లో పొందుపరుస్తేనే రెండో విడత బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కానీ అధికారుల్లో కొరవడిన సమన్వయంతో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియనే పూర్తికాలేదు. మరో వైపు నిర్మాణాలు పూర్తి చేసిన వారికి వివిధ కారణాలతో బిల్లుల చెల్లింపు ఆలస్యం కావడంతో మిగతా వారు ముందుకు రావడం లేదు. అయితే ప్రతిదీ ఆన్లైన్లో పొందుపర్చాకే బిల్లులు చెల్లింపులు చేయాలనే నిబంధన విధించడంతో పనుల్లో ఆలస్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. బిల్లుల కోసం ఎదురు చూపులు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డిలో 252 దరఖాస్తులు ఆన్లైన్ చేయగా 235 మంజూరు చేసి కేవలం 14మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. సదాశివపేటలో 140 దరఖాస్తులు రాగా కేవలం ఎనిమిది మాత్రమే పూర్తయ్యాయి. సిద్దిపేటలో 1026 దరఖాస్తులు ఆన్లైన్ చేయగా 236 పూర్తి కాగా 42 మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. జహీరాబాద్‌లో 522, మెదక్‌లో 405, గజ్వేల్‌లో 838, జోగిపేటలో 156 దరఖాస్తులను అధికారులు ఆన్లైన్లో పొందుపర్చారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 3,333 దరఖాస్తులు ఆన్లైన్ చేయగా 869 నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 76 మరుగుదొడ్లకు మాత్రమే చెల్లింపులు చేశారు. దీంతో మిగతా లబ్ధిదారులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. -
బడికెళ్లని స్వచ్ఛభారత్ !
చిలకలూరిపేట : స్వచ్ఛభారత్ పేరుతో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పాఠశాలలు కనిపించినట్టులేదు. మరుగుదొడ్లులేని పాఠశాలలు, ఉన్నా నిరుపయోగంగా మారినవి కొన్నయితే, మరమ్మతులకు నోచనవి ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛ భారత్ అంటే కేవలం ఇంటికే పరిమితమైతే రేపటి పౌరులను తీర్చిదిద్దే పాఠశాలల పరిస్థితేంటని తల్లిదండ్రులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెబుతున్న సర్కారు మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతోంది. ఉదాహరణకు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని పరిశీలిస్తే....పలు ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్ల కిందట మరుగుదొడ్లు నిర్మించారు. దీంతో 90 శాతం విద్యార్థులకు మరుగు దొడ్ల సౌకర్యం లభించింది. అయితే వీటిని నిర్మించి చేతులు దులుపుకున్న అధికారులు నిర్వహణ బాధ్యతను విస్మరించారు. నీటి వసతి ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో కథ మొదటికి వచ్చింది. నీటి సౌకర్యంలేక అలంకారప్రాయంగా మిగిలాయి. నియోజకవర్గ పరిధిలో మొత్తం 197 ప్రాథమిక పాఠశాలు, 16 ప్రాథమికోన్నత పాఠశాలలు, 25 ఉన్నత పాఠశాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 8 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్డికి వెళ్లాల్సివస్తే స్కూల్ వెలుపల ఉన్న ఖాళీ ప్రదేశాలే దిక్కుగా మారాయి. పాఠశాల ఆవరణలో నిర్మించిన మరుగుదొడ్లు వినియోగానికి నోచుకోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇక విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పాఠశాలలకు నీటి వసతి కల్పించకపోవడంతో మధ్యాహ్న భోజన సమయంలోనూ, మరుగుదొడ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నవాటిని పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణం... గ్రామీణ ప్రాంతాల మాట అటుంచితే పట్టణంలోని పండరీపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాసంవత్సరం ఆరంభం నుంచి మరుగుదొడ్లు మూతపడే ఉన్నాయి. ఉన్న బోరింగ్ పంపు మరమ్మతులకు గురికావడం, మంచినీటి కుళాయికి మోటార్సౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గోవిందపురం, పోతవరం, కోమటినేనివారిపాలెం తదితర పాఠశాలల్లోనూ, నాదెండ్ల మండలం గణపవరం హెచ్డబ్ల్యూయు ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టకుండా కొద్దినెలల కిందట మళ్లీ నిర్మించారు. గతంలో నిర్మించిన మరుగుదొడ్లుకు తలుపులు లేకపోవడం వీటి పక్కనే కంపచెట్లు పెరిగి చిట్టడవిగా మారింది. ఈ మండలంలో 30 పాఠశాలల్లోని మరుగుదొడ్లు నీటి సౌకర్యం, నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. నాదెండ్ల, సాతులూరు, తూబాడు పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. యడ్లపాడు మండలంలోని లింగారావుపాలెం ఆర్సీఎం పాఠశాలలో ఓవర్‌హెడ్ ట్యాంకర్ లేక మరుగుదొడ్లు మూతపడ్డాయి. నిధులు పెంచితేనే.... నిర్వహణ లోపంతోనే మరుగుదొడ్లు మూతపడుతున్నాయి. వీటిని నిర్మించే క్రమంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం వస్తువులు వినియోగించడంతో ప్రారంభమైన కొన్నిరోజులకే నిరుపయోగంగా మారుతున్నాయి. వీటిని శుభ్రం చేయడానికి ప్రభుత్వం కేవలం 200 రూపాయలు మాత్రమే వెచ్చించాలని చెప్పడం శోచనీయం. నిధులు పెంచి, వీటిని నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. -
స్వచ్ఛభారత్ అంబాసిడర్లు
నిజామాబాద్ కల్చరల్ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యురాలు కవిత, ప్రముఖ సినీ నటుడు నితిన్ అంబాసిడర్లుగా నియమితులయ్యారు. కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకుగాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లోని 18 మందిని అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. సోమవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వచ్ఛభారత్ అంబాసిడర్ల జాబితాను ప్రకటించారు. అందులో కవిత, నితిన్‌లు కూడా ఉన్నారు. -
గద్దెనెక్కి వందరోజులైనా నల్లధనాన్ని తీసుకురాలేదేం?
బీజేపీపై రాహుల్ గాంధీ ధ్వజం పాంకీ (జార్ఖండ్): అధికారంలోకి వచ్చి వందరోజులైనా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని రప్పించడంలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. పాలమావ్ జిల్లా పాంకీలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... నల్లధనాన్ని తెప్పించడంలో విఫలమైందని కాంగ్రెస్‌ను ఎగతాళి చేసిన బీజేపీ ఇప్పుడు తానేం చేస్తోందని ఎద్దేవా చేశారు. విదేశీ బ్యాంకులనుంచి నల్లధనాన్ని తెప్పించడంలో బీజేపీ ఎందుకు విఫలమైందని ప్రశ్నించారు. నల్లధనం విషయంలో అనేక దౌత్య కారణాలు ఆలస్యానికి కారణమయ్యాయనీ, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అవే కారణాలు చెబుతోందని తెలిపారు. పరిపాలన చేయాలంటే చాలా ఓపిక కావాలనీ, బీజేపీకి ఆ గుణం లేదనీ విమర్శించారు. మనసుకు నచ్చింది చేసుకుంటూ పోవడం పరిపాలన కాదన్నారు. పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలనే ఆలోచన, స్పృహ ప్రజల్లో కలిగించాలే తప్ప వారి చేతుల్లో చీపుర్లు పెడితే ప్రయోజనం ఉండదని ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంపై వ్యాఖ్యానించారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 ఏళ్లలో తొమ్మిదేళ్లు బీజేపీయే అధికారంలో ఉందనీ, అవినీతిని పెంచి పోషించిందనీ విమర్శించారు. జార్ఖండ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. -
స్వచ్ఛ గాజువాకలో హీరో సుమన్
గాజువాకలో సోమవారం నిర్వహిం చిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్ పాల్గొన్నారు. జింక్ గేటు నుంచి కొత్త గాజువాక జంక్షన్ వరకు రహదారిని శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించవచ్చని ఆయన అన్నా రు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మహ్మద్ రఫీ, కరాటే అసోసియేషన్ ప్రతినిధులు హైదర్ ఆలీ, తాజు ద్దీన్బాబు, ఎస్టీబీఎల్ ప్రాజెక్టు ప్రతినిధి శంకర్రావు, స్థానిక నాయకులు లక్ష్మణ్, నాయుడు, ఖాజీ తదితరులు పాల్గొన్నారు. - గాజువాక -
నేటి నుంచి బాలస్వచ్ఛ వారోత్సవాలు
ఆదిలాబాద్ రూరల్ : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో బాలస్వచ్ఛ వారోత్సవాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 19 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఐసీడీఎస్ అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. ముఖ్యంగా ఆరు అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాలని, రోజు వారీగా ఫొటోలను వెబ్సైట్లో ఆప్‌లోడ్ చేయాలని ఐసీడీఎస్ అధికారులను ప్రభుత్వాలు ఆదేశించాయి. స్వచ్ఛ కార్యక్రమంపై అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, వారి తల్లులకు అవగాహన కల్పించాలని, గ్రామాల్లో బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఆరు కార్యక్రమాలు ఇలా.. అంగన్వాడీ పరిశుభ్రత అంగన్వాడీ కేంద్రాల్లోని గదులు, పిల్లలు కూర్చుండే స్థలాన్ని శుభ్రం చేయాలి. గదులకు పట్టిన దుమ్ము, ధూళిని తొలగించాలి. పిల్లలు అడుకునే వస్తువులను తుడవాలి. ఆహార ధాన్యాలు నిలువ ఉంచే గదిని శుభ్రం చేయాలి. పరిసరాలు అంగన్వాడీ కేంద్రం ఆరుబయట ప్రాంతం, ఆటలాడుకునే స్థలంలో పిచ్చి మొక్కలు చె త్తాచెదారం లాంటివి లేకుండా చూసుకోవాలి. పిల్లలు కేంద్రానికి వచ్చేందుకు, ఆడుకునేందుకు వీలుగా నేలను చదును చేయాలి. కీటకాలు, విష పురుగులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వ్యక్తి పరిశుభ్రతపై అవగాహన కల్పిం చాలి. ముఖ్యంగా పిల్లలను కార్యకర్తలు, ఆయాలు దగ్గరుండి వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. భోజనానికి ముందు, తర్వాత చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కొవాలి. ఆటలాడిన తర్వాత కూడా చేతులు, కాళ్లు, ముఖం కడుక్కునేలా చూడాలి. ఆహార పదార్థాలు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు రోజూ వండిపెట్టే భోజనం పరిశుభ్రంగా ఉంచాలి. పప్పులు, బియ్యం, నూనె, ఇతర వస్తువులను పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలి. అప్పటికప్పుడు వండిన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. అధిక రోజులు నిల్వ ఉన్న గుడ్లను లబ్ధిదారులకు ఇవ్వరాదు. తాగునీరు తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వారికి క్లోరినేషన్ చేసిన, వడపోసిన స్వచ్ఛమైన తాగునీటిని మాత్రమే అందించాలి. తాగునీటి పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఏ రోజు పట్టిన నీటిని ఆ రోజు మాత్రమే వాడాలి. మరుగుదొడ్లు అంగన్వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండేలా చూడాలి. నీటి సదుపాయం కల్పించాలి. దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు ఆసిడ్‌తో శుభ్రంగా కడగాలి. పక్కాగా నిర్వహించాలి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో బాల స్వచ్ఛ వారోత్సవాలను పక్కాగా నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఈ నెల 15వ నుంచి 19 వరకు వారోత్సవాలు నిర్వహిస్తాం. అంగన్వాడీ కార్యకర్తలతో కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేలా సూపర్వైజర్లు చర్యలు తీసుకోవాలి. -ప్రభావతి,ఐసీడీఎస్ సీడీపీవో, ఆదిలాబాద్ -
అంగన్వాడీల్లో ‘బాల స్వచ్ఛభారత్’
నేటినుంచి 19 వరకు కార్యక్రమాలు * నిధులు కేటాయించని ప్రభుత్వం * నిర్వహణపై మల్లగుల్లాలు పడుతున్న కేంద్రాల నిర్వాహకులు భువనగిరి: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో బాల స్వచ్ఛభారత్ వారోత్సవాలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఐసీడీఎస్ అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ముఖ్యంగా ఆరు ప్రధాన అంశాలపై రోజువారీగా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పదార్థాలు, మంచినీరు, మరుగుదొడ్లపై పిల్లలు, వారి తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం గ్రామాల్లో బ్యానర్లు, ప్లోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు జిల్లాలోని 18 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలోని సీడీపీఓలకు అదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 3901 అంగన్వాడీ కేంద్రాలు, 401 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా వారోత్సవాల సందర్భంగా ఆయా గ్రామాల్లో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలి. నిధులేవీ.. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ రాకపోవడం వల్ల ఆంగన్వాడీల కేంద్రాల నిర్వాహకులు అనాసక్తత చూపుతున్నారు. ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలపై ఫొటోలు తీసి పై అధికారులకు మెయిల్ చేయాలని ఆదేశించారు. ఎలాంటి నిధులూ లేకుండా ఎలా చేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. భువనగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టులో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కార్యక్రమం అంతంత మాత్రంగానే అధికారులు చేపట్టారు. ఇంతవరకు కనీసం వాల్‌పోస్టర్లు కూడా రాకపోవడంతో కార్యక్రమం మొక్కుబడిగా నిర్వహించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అంగన్వాడీల్లో పరిశుభ్రత అంగన్వాడీ కేంద్రాల్లోని గదులను, పిల్లలు కూర్చుండే స్థలాన్ని పరిశుభ్రం చేయాలి. గదులకు పట్టిన దుమ్ముధూళిని తొలగించాలి. పిల్లలు ఆడుకునే వస్తువులు తుడవాలి. అహార ధాన్యాలు నిలువ ఉంచే గదిని శుభ్రం చేయాలి. చెత్తాచెదారం, అనవసర వస్తువులూ నిల్వలేకుండా చూడాలి. కేంద్రం పరిసరాలు అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లోని ఆటలాడుకునే స్థలంలో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం, మురుగునీరు లేకుండా చూసుకోవాలి. ఆడకునేందుకు వీలుగా నేలను చదును చేయాలి. కీటకాలు, విష పురుగులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. భోజనం చేసే ముందు, చేసిన తర్వాత, మల మూత్రాలకు వెళ్లొచ్చిన తర్వాత చేతులు, కాళ్లను శుభ్రం చేసుకోవాలని సూచించాలి. ఆటలాడిన తర్వాత కూడా చేతులు, కాళ్లు ముఖం కడుక్కునేలా వారిని సిద్ధం చేయాలి. వండి పెట్టే ఆహార పదార్థాలు పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు రోజూ వండిపెట్టే భోజనం పరిశుభ్రంగా ఉంచాలి. అంగన్ వాడీ కేంద్రాల్లో ఆహారం కోసం ఉంచే పప్పులు, బియ్యం, పామోలిన్ ఇతర వస్తువులను పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలి. అప్పటికప్పుడు వండిన వేడి ఆహార పదార్థాల్ని పిల్లలకు అందించాలి. ఎక్కువరోజులు నిల్వ ఉన్న గుడ్లును లబ్ధిదారులకు అందించకూడదు. మంచినీరు మంచినీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు క్లోరినేషన్ చేసి, కాచి వడపోసిన తాగునీటిని మాత్రమే అందించాలి. తాగునీటి పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఏ రోజు పట్టిన నీటిని ఆ రోజు మాత్రమే వాడాలి. మరుగుదొడ్లు అంగన్వాడీ కేంద్రాల్లో కచ్చితంగా మరుగుదొడ్లు ఉండేవిధంగా చూడాలి. మరుగుదొడ్లలో నీటి సదుపాయం కల్పించాలి, మల విసర్జన తర్వాత నీటిని పోయాలి. దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు ఆసిడ్, ఫినాయిల్‌తో శుభ్రంగా కడగాలి. ఇందుకోసం ప్రత్యేక చొరవచూపాలి. లేకపోతే వ్యాధులొచ్చే అవకాశం ఉంది. -
కార్పొరేషన్లో షాడో కమిషనర్
కార్పొరేషన్లో కమిషనర్ విధులంటేనే అధికారులు జంకుతున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన అధికారులు పలువురు వివాదాలకు కేంద్ర బిందువు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది గ్రూపుల వారీగా విడిపోవడంతో అభివృద్ధి పనులన్నీ నత్తనడకన కొనసాగుతున్నాయి. పర్యవేక్షణ చేసే అధికారులే లేకపోవడంతో కార్పొరేషన్ పాలన గాడితప్పి ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. అయితే ఓ సంస్థలో పని చేస్తున్న అధికారికి కార్పొరేషన్ కమిషర్ బాధ్యతలు అప్పగించినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపణలు వినవడుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం కార్పొరేషన్లో రెండు, మూడు రోజులు మినహా సవ్యంగా జరగలేదు. అధికారులకు ప్రణాళిక లేకపోవడంతో నగరపాలక సంస్థ ఇటు అభివృద్ధి పనులు, అటు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో రాష్ర్టంలో ఇతర కార్పొరేషన్ల కన్నా వెనకంజలో ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఎవరికి వారు యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పాలన అస్తవ్యస్తంగా మారితే ప్రస్తుతం ఓ సంస్థకు చెందిన ఉద్యోగి పెత్తనంపై అధికారులు, సిబ్బంది గుర్రుగా ఉన్నారు. అక్కడ బాధ్యతలు మరిచి.. ఇక్కడ పెత్తనం తనకు బాధ్యతలు అప్పగించిన సంస్థలో విధులను విస్మరించి ఏకంగా కమిషనర్ చాంబర్లోనే సదరు ఉద్యోగి తిష్టవేషి కార్పొరేషన్ కార్యక్రమాలు చక్కబెడుతున్నట్లు ఉద్యోగులు, సిబ్బంది గుసగుసలాడుతున్నారు. డీఈలు, ఇతర అధికారులు కమిషనర్ చాంబర్లోకి వచ్చినా పట్టించుకోకుండా అక్కడే ఆ ఉద్యోగి ఉంటుండడంతో తమ విధులకు ఆటంకం కలుగుతుందని అధికారులు నొచ్చుకుంటున్నట్లు సమాచారం. కార్పొరేషన్ పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు, విధి విధానాలు కమిషనర్‌తో చర్చిద్దామని ఆయన చాంబర్లోకి పోతే ఆ ఉద్యోగి అక్కడ ఉండడం చూసి అధికారులు వెనుదిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంట్రాక్టు పనులు, ఇతర వ్యవహారాల్లో ఆ ఉద్యోగి జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. సదరు ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగో తెలవక కార్పొరేషన్ సిబ్బంది మర్యాదలు చేసి.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ కోసం.. ఓ సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న ఈ వ్యక్తి కార్పొరేషన్లోనే ఔట్సోర్సింగ్ ఉద్యోగం వస్తే తాను అనుకున్నంతా సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో ఏకంగా తమ బాస్‌తోనే ఇక్కడ తిష్టవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టెండర్లు, ఇతర అభివృద్ధి పనుల్లో అందినకాడికి దండుకోవాలంటే ఎలాగైనా ఔట్సోర్సింగ్ ఉద్యోగంతో కార్పొరేషన్లో రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఉద్యోగుల మధ్య గ్రూప్ వార్తో కార్పొరేషన్ పాలన గాడితప్పడంతో ఈ ఉద్యోగి చేష్టలతో ఇంకో కొత్త సమస్య వచ్చినట్లు కార్పొరేషన్లో ఇప్పుడు చర్చగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు కార్పొరేషన్ పాలనపై దృష్టి పెడితేనే సదరు ఉద్యోగి పెత్తనానికి చెక్ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ
* లొకేషన్ మార్చి అరకులోయలో షూటింగ్ చేస్తున్నా * సినీనటుడు బాలకృష్ణ అరకులోయ : హూదూద్ తుఫాన్ ప్రభావంతో ధ్వంసమైన ఆంధ్ర ఊటి అరకులోయలోని అభిమానులను కలవాలనే ఎస్ఎల్వి బ్యానర్‌పై తాను హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్ లొకేషన్ మార్పు చేసి అరకులోయలోయకు వచ్చినట్టు ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృ ష్ణ అన్నారు. మండలంలో కొండచరియలు విరిగిపడి తల్లిదుండ్రులు, పిల్లలను పోగొట్టుకొని నందివలస పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులను బుధవారం పరామర్శించారు. ప్రభుత్వం సేవలపై ఆరాతీశారు. ఉచితంగా ఇస్తున్న నిత్యావసర వస్తువులు అందుతున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుఫాన్‌తో జీవనోపాధి కోల్పొయిన వారిలో మనోధైర్యాన్ని నింపేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఏజెన్సీలో పోడుసాగుతో పాటు కాఫీ, మిరియాలు నీడనిచ్చే సిల్వర్ ఓక్ చెట్లు నేలమట్టమయ్యాయన్నారు. నందివలస పాఠశాలలో పిల్లలతో ముచ్చటించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన కాఫీ తోటలు పరిశీలించారు. బాలకృ ష్ణతో ఫొటోలు తీయించుకునేందుకు గిరిజన మహిళలు ఆసక్తి చూపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు, వైస్‌ఎంపీపీ పొద్దు అమ్మన్న, సర్పంచ్ కొర్రా సన్యాసి, ఎంపీటీసీ అభిమాన్ పాల్గొన్నారు. యండపల్లివలసలో స్వచ్ఛభారత్ తెలుగుదేశం హయాంలో జన్మభూమి, క్లీన్,గ్రీన్ వంటి కార్యక్రమాలు చేపట్టామని, ప్రస్తుతం ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అరకులోయ మండలం పద్మాపురం పంచాయతీ యండపల్లివలసలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో బుధవారం పాల్గొన్నారు. అక్కడే పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్ల కాంగ్రేస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నారన్నారు. పద్మాపురం పంచాయతీ పరిధిలోని వృద్ధులకు పింఛన్లు పంపీణి చేశారు. బాలకృష్ణకు మహిళలు హారతిచ్చి ఘనస్వాగతం పలికారు. సర్పంచ్, ఉపసర్పంచ్లు గజమాలతో ఆయనను సన్మానించారు. -
ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛ భారత్
ఖమ్మంసిటీ: జిల్లాలో మొదటి విడతగా సోమవారం మున్సిపాలిటీల్లో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతమైంది. ఉద్యమస్ఫూర్తితో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు భాగస్వాములయ్యూరు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె ఇలంబరితి, ఎస్పీ ఏవీ రంగనాథ్, జడ్పీ చైర్ పర్సన్ గడపల్లి కవిత పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీ కార్పొరేషన్ సహ కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు మున్సిపాలిటీల్లో పర్యటించి సందర్శించి స్ఫూర్తి నింపారు. ఖమ్మం నగరంలోని సారధి నగర్లో, కలెక్టర్ నివాసం వెనుక ఉన్న గోళ్లపాడు చానల్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ, జడ్పీ చైర్ పర్సన్, స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు. గోళ్లపాడు చానల్లో సమారు కిలోమీటర్ మేర సిల్ట్ తొలగించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలంబరితి మాట్లాడుతూ మొదటి విడతగా మున్సిపాలిటీల్లో, రెండో విడతగా పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం కార్పొరేషన్లో పారిశుధ్య పనలకు 15 ట్రాక్లర్లను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. మురుగు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గోళ్లపాడు చానల్ ఆక్రమణపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ మనసు స్వచ్ఛంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లా మొదటి అదనపు జడ్జి చిరంజీవి రావు మాట్లాడుతూ మన బాధ్యతలను గుర్తెగాలని సూచించారు. జడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడుతూ ఇదో బృహత్తర కార్యక్రమమని, ఇందుకు కేంద్రం రూ. 20 వేల కోట్లు కేటారుుంచిందని చెప్పారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మాన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసి రూ. వెరుు్య కోట్లు కేటారుుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్పొరేషన్లో సిబ్బంది కొరత తీర్చాలన్నారు. కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ వేణు మనోహర్ మాట్లాడుతూ సుమారు 23 జేసీబీ, 191 ట్రాక్టర్లతో పూడిక తీత పనులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో ఒక్కరోజే 1928 టన్నుల చెత్త తరలించామని, 88 కిలో మీటర్ల మేర డ్రెరుున్లలో సిల్ట్ తొలగించామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, తోట రామారావు, కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, డీఎస్పీ బాలకిషన్‌రావు, మత్స్యశాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సానియా ‘స్వచ్ఛ్ భారత్’
హైదరాబాద్‌లో రోడ్డును శుభ్రం చేసిన టెన్నిస్ స్టార్ సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ రాకెట్‌తో బంతిని కొట్టడమే కాదు... చీపురుతో రోడ్లను కూడా శుభ్రం చేస్తానంటూ ముందుకొచ్చింది భారత స్టార్ సానియా మీర్జా. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ‘స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమంలో ఈ హైదరాబాద్ అమ్మాయి కూడా భాగం పంచుకుంది. నల్లని దుస్తులు ధరించి... చేతిలో పొడవైన చీపుర్లతో గురువారం ప్రశాసన్ నగర్లో ఓ రోడ్డును సానియా శుభ్రం చేసింది. ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా, సోదరి ఆనం మీర్జాతో పాటు కొందరు స్నేహితులు కూడా పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ చేసిన ప్రతిపాదన మేరకు సానియా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సోమ్‌దేవ్, పి.వి.సింధు, దీపికా పల్లికల్, అభినవ్ బింద్రా, బాలీవుడ్ స్టార్లు షారూఖ్ ఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్, డెరైక్టర్ సాజిద్‌ఖాన్, తెలుగు హీరో రామ్‌చరణ్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావులను సానియా ‘స్వచ్ఛ్ భారత్’లో పాల్గొనాలని కోరింది. ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నం దుకు సానియాను ప్రధాని మోదీ అభినందించారు. డబ్ల్యూటీఏ ఫైనల్స్ ఆడేందుకు శుక్రవారం సానియా సింగపూర్‌కు బయలుదేరనుంది. -
ప్రజల సహకారంతో ‘స్వచ్ఛ భారత్’
అనంతపురం టవర్‌క్లాక్ :కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజా సహకారంతో నిరంతరం కొనసాగిస్తామని రైల్వే శాఖ డివిజినల్ ఆపరేటింగ్ సీనియర్ మేనేజర్ ఆల్విన్ అన్నారు. స్థానిక రైల్వే స్టేషన్లో గురువారం ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. చీపురు పట్టి చెత్తను తొలగించారు. ముందుగా రైల్వేస్టేషన్ ఆవరణంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు క్రిష్ణయ్య, స్టేషన్ మేనేజర్ అశ్వర్థనాయక్, పారిశుద్ధ్య సి బ్బంది, రైల్వే పోలీసులు , ఉద్యోగులు, కార్మికులతో ఆయన ప్రతిజ్ఙ చేయించారు. స్టేషన్ ఆవరణంలో చెత్తను తొలగించి, మొక్కలను నాటారు. రైల్వే స్టేషన్లో, క్వాటర్స్‌లో ఇళ్ల వద్ద ఉన్న చెత్త చెదారాన్ని తొలగించారు. రైల్వే అధికారులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి వీధులను శుభ్రం చేశారు. ఆల్విన్ మాట్లాడుతూ ప్రయాణికులు, ప్రజలు పరిశుభ్రతను పాటించాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా కుండీలలో వేయాలని సూచించారు. ఆర్పీఎఫ్ సీఐ మధుసూదన, స్టేషన్ మాస్టర్ జయచంద్రనాయుడు, చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ దామోదరమూర్తి, సిగ్నల్ ఇంజనీరు సత్యం, రవిబాబు, సీటీఐ ప్రసాద్, ఇంజనీర్లు గోవిందరాజులు, ఎఎస్ఐ లింగమయ్య, కార్పొరేటర్ మళ్లికార్జున, కార్మికులు, ఉద్యోగులు, పోలీసులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ పోలీస్టేషన్లో సీఐ మధుసూదన ఆధ్వర్యంలో ఆయుధ పూజను చేశారు