నేటి నుంచి బాలస్వచ్ఛ వారోత్సవాలు | Swachh varostavalu in anganwadi | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బాలస్వచ్ఛ వారోత్సవాలు

Published Sat, Nov 15 2014 3:56 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Swachh varostavalu in anganwadi

ఆదిలాబాద్ రూరల్ : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలస్వచ్ఛ వారోత్సవాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 19 వరకు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఐసీడీఎస్ అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు జారీ చేశాయి. ముఖ్యంగా ఆరు అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాలని, రోజు వారీగా ఫొటోలను వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేయాలని ఐసీడీఎస్ అధికారులను ప్రభుత్వాలు ఆదేశించాయి.

 స్వచ్ఛ కార్యక్రమంపై అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, వారి తల్లులకు అవగాహన కల్పించాలని, గ్రామాల్లో బ్యానర్లు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.

 ఆరు కార్యక్రమాలు ఇలా..
 అంగన్‌వాడీ పరిశుభ్రత

 అంగన్‌వాడీ కేంద్రాల్లోని గదులు, పిల్లలు కూర్చుండే స్థలాన్ని శుభ్రం చేయాలి. గదులకు పట్టిన దుమ్ము, ధూళిని తొలగించాలి. పిల్లలు అడుకునే వస్తువులను తుడవాలి. ఆహార ధాన్యాలు నిలువ ఉంచే గదిని శుభ్రం చేయాలి.

 పరిసరాలు
 అంగన్‌వాడీ కేంద్రం ఆరుబయట ప్రాంతం, ఆటలాడుకునే స్థలంలో పిచ్చి మొక్కలు చె త్తాచెదారం లాంటివి లేకుండా చూసుకోవాలి. పిల్లలు కేంద్రానికి వచ్చేందుకు, ఆడుకునేందుకు వీలుగా నేలను చదును చేయాలి. కీటకాలు, విష పురుగులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

 వ్యక్తిగత శుభ్రత
 అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వ్యక్తి పరిశుభ్రతపై అవగాహన కల్పిం చాలి. ముఖ్యంగా పిల్లలను కార్యకర్తలు, ఆయాలు దగ్గరుండి వ్యక్తిగతంగా శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. భోజనానికి ముందు, తర్వాత చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కొవాలి. ఆటలాడిన తర్వాత కూడా చేతులు, కాళ్లు, ముఖం కడుక్కునేలా చూడాలి.

 ఆహార పదార్థాలు
 పిల్లలు, బాలింతలు, గర్భిణులకు రోజూ వండిపెట్టే భోజనం పరిశుభ్రంగా ఉంచాలి. పప్పులు, బియ్యం, నూనె, ఇతర వస్తువులను పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలి. అప్పటికప్పుడు వండిన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. అధిక రోజులు నిల్వ ఉన్న గుడ్లను లబ్ధిదారులకు ఇవ్వరాదు.

 తాగునీరు
 తాగునీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే వారికి క్లోరినేషన్ చేసిన, వడపోసిన స్వచ్ఛమైన తాగునీటిని మాత్రమే అందించాలి. తాగునీటి పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఏ రోజు పట్టిన నీటిని ఆ రోజు మాత్రమే వాడాలి.

 మరుగుదొడ్లు
 అంగన్‌వాడీ కేంద్రాల్లో తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండేలా చూడాలి. నీటి సదుపాయం కల్పించాలి. దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు ఆసిడ్‌తో శుభ్రంగా కడగాలి.

 పక్కాగా నిర్వహించాలి
 స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల స్వచ్ఛ వారోత్సవాలను పక్కాగా నిర్వహించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.  ఈ నెల 15వ నుంచి 19 వరకు వారోత్సవాలు నిర్వహిస్తాం. అంగన్‌వాడీ కార్యకర్తలతో కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేలా సూపర్‌వైజర్లు చర్యలు తీసుకోవాలి.  -ప్రభావతి,ఐసీడీఎస్ సీడీపీవో, ఆదిలాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement