సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలులో హైదరాబాద్ ప్రగతి సాధించింది. గతేడాది కంటే ఈసారి మెరుగుదల కనబరిచింది. స్వచ్ఛ భారత్ అంశంపై నిరుడు నిర్వహించిన సర్వేలో నగరానికి 274వ స్థానం దక్కగా, ఈసారి 19వ ర్యాంక్‌కు ఎగబాకింది. సర్వేలో భాగంగా మొత్తం 2వేల మార్కులకుగాను హైదరాబాద్‌కు 1355 మార్కులు లభించాయి. ఈ సర్వేకు 75 నగరాలను ఎంపి క చేశారు. గత సంవత్సరం 475 నగరాల్లో సర్వే నిర్వహించగా, అప్పుడు 274వ ర్యాంక్ వచ్చింది.
ఈసారి సర్వే పకడ్బందీగా నిర్వహించడం, శాస్త్రీయ విధానాలను పాటించడం వల్ల హైదరాబాద్‌కు ఈ ర్యాంకు వచ్చిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేలో మైసూర్ తొలిస్థానంలో నిలిచింది. చండీగఢ్, తిరుచిరాపల్లి వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. మైసూరు వరుసగా రెండేళ్లు ప్రథమస్థానంలో నిలవడం విశేషం. ఈసారి మూడు అంశాలకు 2 వేల మార్కులు కేటాయించారు.
వీటిల్లో గ్రేటర్‌లో చేపట్టిన పారిశుధ్య కార్మికుల ‘పరిచయం’, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు, ఇంటింటికీ రెండు చెత్తడబ్బాలు, రెండు వేల ఆటో టిప్పర్ల పంపిణీ, ఘన వ్యర్థాల నిర్వహణ, లక్ష మంది విద్యార్థులచే చేతులు శుభ్రం చేసుకునే కార్యక్రమ నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణకు అధిక మార్కులు లభించినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. డెబ్రిస్ తొలగింపు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ సంతృప్తికరంగా లేకపోవడం, చెత్త తరలించే జీహెచ్‌ఎంసీ వాహనాలకు జీపీఎస్ లేకపోవడం, స్వచ్ఛభారత్ ప్రచారకర్తల భాగస్వామ్యం సంతృప్తికరంగా లేకపోవడం, స్వచ్ఛ సర్వేక్షన్‌కు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్‌కు నగరవాసుల నుంచి తగిన స్పందన లేకపోవడం వంటి అంశాలకు తక్కువ మార్కులు వచ్చాయని పేర్కొంది.
నగరంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల 150 మార్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ఎన్నికల కారణంగా చెత్త ప్లాంట్ ఏర్పాటు పనులు అర్ధాంతంగా ఆగిపోవడం వల్ల ఎన్నో మార్కులు కోల్పోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
టాప్-10 నిలుస్తాం :
ఘనవ్యర్థాల నిర్వహణ, పౌరసేవలు, మౌలికసదుపాయాల కల్పన , తదితర అంశాల్లో వినూ త్న కార్యక్రమాలు చేపట్టినందువల్లే ఈసారి స్వచ్ఛ భారత్ ర్యాకింగ్‌ల్లో మన నగరం 19వ స్థానంలో నిలిచిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. వచ్చే సంవత్సరం తొలి పది స్థానాల్లోనే నిలవగలమని ధీమా వ్యక్తం చేశారు.
‘స్వచ్ఛ భారత్’లో హైదరాబాద్‌కు 19వ ర్యాంక్
Published Tue, Feb 16 2016 1:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement