కార్పొరేషన్‌లో కమిషనర్ విధులంటేనే అధికారులు జంకుతున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన అధికారులు పలువురు వివాదాలకు కేంద్ర బిందువు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది గ్రూపుల వారీగా విడిపోవడంతో అభివృద్ధి పనులన్నీ నత్తనడకన కొనసాగుతున్నాయి. పర్యవేక్షణ చేసే అధికారులే లేకపోవడంతో కార్పొరేషన్ పాలన గాడితప్పి ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది.
అయితే ఓ సంస్థలో పని చేస్తున్న అధికారికి కార్పొరేషన్ కమిషర్ బాధ్యతలు అప్పగించినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపణలు వినవడుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం కార్పొరేషన్‌లో రెండు, మూడు రోజులు మినహా సవ్యంగా జరగలేదు.
అధికారులకు ప్రణాళిక లేకపోవడంతో నగరపాలక సంస్థ ఇటు అభివృద్ధి పనులు, అటు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో రాష్ర్టంలో ఇతర కార్పొరేషన్ల కన్నా వెనకంజలో ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఎవరికి వారు యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పాలన అస్తవ్యస్తంగా మారితే ప్రస్తుతం ఓ సంస్థకు చెందిన ఉద్యోగి పెత్తనంపై అధికారులు, సిబ్బంది గుర్రుగా ఉన్నారు.
అక్కడ బాధ్యతలు మరిచి.. ఇక్కడ పెత్తనం
తనకు బాధ్యతలు అప్పగించిన సంస్థలో విధులను విస్మరించి ఏకంగా కమిషనర్ చాంబర్‌లోనే సదరు ఉద్యోగి తిష్టవేషి కార్పొరేషన్ కార్యక్రమాలు చక్కబెడుతున్నట్లు ఉద్యోగులు, సిబ్బంది గుసగుసలాడుతున్నారు. డీఈలు, ఇతర అధికారులు కమిషనర్ చాంబర్‌లోకి వచ్చినా పట్టించుకోకుండా అక్కడే ఆ ఉద్యోగి ఉంటుండడంతో తమ విధులకు ఆటంకం కలుగుతుందని అధికారులు నొచ్చుకుంటున్నట్లు సమాచారం.
కార్పొరేషన్ పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు, విధి విధానాలు కమిషనర్‌తో చర్చిద్దామని ఆయన చాంబర్‌లోకి పోతే ఆ ఉద్యోగి అక్కడ ఉండడం చూసి అధికారులు వెనుదిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంట్రాక్టు పనులు, ఇతర వ్యవహారాల్లో ఆ ఉద్యోగి జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. సదరు ఉద్యోగి ఏ డిపార్ట్‌మెంట్ ఉద్యోగో తెలవక కార్పొరేషన్ సిబ్బంది మర్యాదలు చేసి.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్పొరేషన్‌లో ఔట్‌సోర్సింగ్ కోసం..
ఓ సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న ఈ వ్యక్తి కార్పొరేషన్‌లోనే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం వస్తే తాను అనుకున్నంతా సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో ఏకంగా తమ బాస్‌తోనే ఇక్కడ తిష్టవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
టెండర్లు, ఇతర అభివృద్ధి పనుల్లో అందినకాడికి దండుకోవాలంటే ఎలాగైనా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగంతో కార్పొరేషన్‌లో రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఉద్యోగుల మధ్య గ్రూప్ వార్‌తో కార్పొరేషన్ పాలన గాడితప్పడంతో ఈ ఉద్యోగి చేష్టలతో ఇంకో కొత్త సమస్య వచ్చినట్లు కార్పొరేషన్‌లో ఇప్పుడు చర్చగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు కార్పొరేషన్ పాలనపై దృష్టి పెడితేనే సదరు ఉద్యోగి పెత్తనానికి చెక్ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కార్పొరేషన్‌లో షాడో కమిషనర్
Published Fri, Nov 14 2014 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement