Corporation Commissioner
-
ఊరే లేకుండా చేస్తా..
► తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హెచ్చరికలు ► తిరగబడ్డ ఎనిమిది గ్రామాల ప్రజలు ► గ్రామస్తులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే చెవిరెడ్డి తిరుపతి రూరల్/రామచంద్రాపురం: తిరుపతి చెత్తను రూరల్ పరిధిలోని గ్రామాల్లో డంపింగ్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘మాయదారి చెత్త ఎనిమిది గ్రామాలను కలుషితం చేస్తోంది. ప్రతి గ్రామంలోనూ నరాల బలహీనత, కాళ్లు, కీళ్లు నొప్పులతో పాటు ఎందరో మహిళలను తల్లి తనానికి దూరం చేస్తుంది. విద్యా కేంద్రంగా ఉన్న గ్రామంలో 70వేల మంది విద్యార్థుల జీవితాలతో ఆటాలాడుతోంది. ఈ చెత్త సమస్య నుంచి మమ్మల్ని కాపాడండి’’...అంటూ రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాల్లోని ఎనిమిది గ్రామాల ప్రజలు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్‌ను అడ్డుకున్నారు. ‘ఏమనుకుంటున్నారు ఐఏఎస్ అధికారిని...చెత్తను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తలచుకుంటే అసలు రామాపురం ఊరే లేకుండా చేస్తా.. పోలీసులు, తహసీల్దార్‌కు చెప్పి రక్షణ ఏర్పాటు చేసి చెత్తను తరలిస్తాం....ఇది కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్ బెదిరింపులు. తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ తీరుతో బుధవారం రామచంద్రాపురం మండలం సీ.రామాపురం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి నుంచి తీసుకువస్తున్న ఆస్పత్రి వ్యర్థాలు, జంతు కళేబరాలతో కూడిన చెత్తను సీ.రామాపురం వద్ద డంప్ చేస్తున్నారు. డంపింగ్ యార్డు వల్ల తిరుపతి రూరల్ మండలంలోని దుర్గసముద్రం, అడపారెడ్డిపల్లి, రామచంద్రాపురం మండలంలో ని రామాపురం, రామచంద్రాపురం, కమ్మకండ్రిగ, మిట్టూరు, లోకమాతాపు రం, ఎస్టీ కాలనీ గ్రామాల్లో తాగునీరు కలుషితం అవుతోంది. దీనిపై ఎనిమిది గ్రామాల ప్రజలు నాలుగు రోజులుగా పోరాడుతున్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, తిరుపతి కార్పొరేషన్, మండల అధికారులతో సమావేశం నిర్వహించా రు. కమిషనర్ హరికిరణ్ తీరుపై ఎనిమిది గ్రామాల ప్రజలు మండిపడ్డారు. సమస్యను పరిష్కరించకుండా అరెస్ట్ చేయిస్తా, లోపల వేయిస్తా, ఊరే లేకుండా చేస్తానని హెచ్చరించడంపై వ్యతిరేకించారు. ఆయన ప్రసంగాన్ని బహిష్కరించారు. కమిషనర్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. చెత్త లారీలను అడ్డుకున్నారు. చెత్తను రోడ్డుపైనే పారబోశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి జోక్యం చేసుకుని గ్రామస్తుల ఆందోళనకు మద్దతు ప్రకటించడంతో కార్పొరేషన్ అధికారులు వెనుదిరిగారు. పంతాలకు పోవద్దు డంపింగ్‌యార్డు వల్ల ఎనిమిది గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడతారు. ఆ ప్రాంతాల్లో చదువుతున్న 70వేల మంది విద్యార్థులు కలుషిత నీరు తాగాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామమే ఎడారవుతుంది. అధికారులు పంతాలకు పోకుండా గ్రామస్తుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఇదే సమస్యపై అధికారులను మంత్రిగా గల్లా అరుణకుమారి కలిసినప్పుడు కూడా మూడు నెలల్లో తరలిస్తామని ఆమెకు మాట ఇచ్చారు. ఆమెకిచ్చిన మాటను అధికారులు నిలబెట్టుకోవాలి. డంపింగ్ యార్డు విషయంలో గ్రామస్తుల ఆందోళనకు అండగా ఉంటాను. – చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. ఎమ్మెల్యే, చంద్రగిరి -
పట్టుబట్టి.. బదిలీ చేసి..!
♦ ఎట్టకేలకు కార్పొరేషన్ కమిషనర్ బదిలీ ♦ నూతన పాలక వర్గంతో వైరమే కారణమా? ♦ పంతం నెగ్గించుకున్న ప్రజాప్రతినిధులు ఖమ్మం : కార్పొరేషన్ కమిషనర్ బదిలీ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆరేళ్లుగా పాలక మండలి లేకపోవడంతో వ్యవహరించిన మాదిరిగానే.. పాలక మండలి ఏర్పడిన తర్వాత కమిషనర్ వ్యవహరించడం.. కౌన్సిల్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ.. మేయర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారనే తదితర ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ఆయన బదిలీ కావడం చర్చనీయాంశమైంది. కొత్త పాలక మండలి ఏర్పడిన నాటి నుంచే కమిషనర్ బదిలీ అవుతారనే గుప్పుమన్నాయి. అయితే సీఎం పర్యటకు ముందుగానే కమిషనర్ బదిలీపై పలు రకాల చర్చలు జరిగాయి. అయితే సాధారణంగానే బదిలీ అయ్యారా? లేదా కావాలని ప్రజాప్రతినిధులు పట్టుపట్టి బదిలీ చేయించారా? అనే చర్చ సాగుతోంది. పాలక మండలి ఏర్పడిన నాటి నుంచి.. ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగడం.. కొత్త పాలక మండలి ఏర్పడినప్పటి నుంచి కమిషనర్‌కు, పలువురు కార్పొరేటర్ల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. రాజకీయ అనుభవం లేని మేయర్ పాపాలాల్‌ను కమిషనర్ తన గుప్పిట్లో పెట్టుకుని అంతా తానై నడిపిస్తున్నాడని, దశాబ్దాలపాటు కార్పొరేషన్లో వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్ నాయకులను కావాలనే పక్కన పెట్టారనే విమర్శలొచ్చాయి. ఇటీవల జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్ఎస్లో చేరారు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు 46 మంది ఉన్నా.. కమిషనర్ మాత్రం ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా మేయర్, ఒకరిద్దరు కార్పొరేటర్లను వెంట పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే కొనసాగితే తమ పరువుతోపాటు పార్టీ పరువు కూడా పోతుందని పలువురు కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న నాయకులు గతంలోనే కమిషనర్‌ను బదిలీ చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర మంత్రులకు వివరించి.. ఆయనను బదిలీ చేయాలని పట్టుపట్టినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే వేణుగోపాల్‌రెడ్డి బదిలీ అయి.. నూతనంగా ఉపేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఏమైందో కాని.. కమిషనర్ బదిలీ కాకుండానే ఉండిపోయారు. అనంతరం ఈనెల 14న నిర్వహించే కౌన్సిల్ సమావేశంపై కార్పొరేటర్లతో చర్చించలేదని, స్థానిక ఎమ్మెల్యేకు సైతం సమాచారం లేకుండా కౌన్సిల్ తేదీని ఖరారు చేశారనే విమర్శలొచ్చాయి. దీనిపై నాలుగు రోజుల క్రితం మెజార్టీ కార్పొరేటర్లు సమావేశమై కమిషనర్ తీసుకున్న నిర్ణయాలు, చేసే తీర్మానాల వల్ల తాము అభాసుపాలు అవుతామని, తమకు తెలియకుండానే తమ డివిజన్లలో పనులు కేటాయించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కమిషనర్‌ను బదిలీ చేస్తే తప్ప పార్టీ పరువు నిలవదని ఎమ్మెల్యేకు, ఇతర నాయకులకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. అవసరమైతే 14న జరిగే కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరయ్యే ప్రసక్తి లేదని కార్పొరేటర్లు ముక్తకంఠంతో తీర్మానం చేసినట్లు సమాచారం. ఇది జరిగి నాలుగు రోజులు గడవకముందే కౌన్సిల్ సమావేశానికి ఒక్కరోజు ముందు కమిషనర్ బదిలీ కావడం.. గతంలో పనిచేసిన బోనగిరి శ్రీనివాస్‌ను నూతన కమిషనర్‌గా జిల్లాకు తీసుకురావడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
పెద్దల పండగకు ఏర్పాట్లు చేయాలి
సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ నెల్లూరు (సెంట్రల్): నగరంలో సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న పెద్దల పండగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్ కార్పొరేషన్ అధికారులకు సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ చక్రధర్‌బాబుతో కలసి శనివారం ఆయన బోడిగాడితోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెల్లూరు నగరంలో అనేక మంది ప్రజలు పెద్ద పండగ రోజున దివంగతులైన వారి బంధువులు, ఆత్మీయులకు పూజలు నిర్వహించేందుకు బోడిగాడితోటలోకి వస్తారన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పారిశుధ్య ఏర్పాట్లను కార్పొరేషన్ సిబ్బంది చేయాలన్నారు. నాయకులు ఎవరైనా పత్రికల్లో ఫొటోల కోసం చీపుర్లు పట్టినా నగరాన్ని శుభ్రంగా ఉంచేది మాత్రం పారిశుధ్య కార్మికులేనన్నారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత కార్పొరేషన్ అధికారులదేనని తెలిపారు. అనంతరం ఐదో డివిజన్లోని అరవపాళెం, బర్మాశాలగుంట ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో పేదలకు నగరానికి సమీపంలో నివాస యోగ్యమైన స్థలంలో ఇళ్లు కట్టించి కనీసం సౌకర్యాలు కల్పించాలని కమిషనర్‌కు సూచించారు. కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, దేవరకొండ అశోక్, నాయకులు కుంచాల శ్రీనివాసులు, సంక్రాంతి కల్యాణ్, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, శోభన్‌బాబు, సుకుమార్, సునీల్, మల్లికార్జున, నాగేంద్ర, మహేంద్రరెడ్డి, సుబ్బారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, బాబూరావు, రఫీ, రాజా, పి.రఘురామిరెడ్డి, మున్నా, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి వంగాల శ్రీనివాసులురెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునీర్‌సిద్ధిక్, ట్రేడ్ యూనియన్ నగర అధ్యక్షుడు వి.శ్రీహరిరాయలు, బి.హరిప్రసాద్‌నాయుడు పాల్గొన్నారు. -
నగర కమిషనర్ నాగవేణి బదిలీ?
నేడో, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ పి.నాగవేణి బదిలీ కానున్నారు. రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనున్నట్లు సమాచారం. ఆమెను అనంతపురం కమిషనర్‌గా బదిలీ చేయడంతో పాటు గుంటూరు నగరపాలకసంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీధర్‌ను నియమించనున్నారు. ఈ ఏడాది మార్చి 14న నాగవేణిని తాత్కాలిక కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. రెండు నెలల క్రితం విశాఖపట్నం జేసీ ప్రవీణ్‌కుమార్‌ను నగరపాలకసంస్థ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అక్కడ హుదూద్తుఫాన్ రావడం, తర్వాత జిల్లా కలెక్టర్ యువరాజ్ ఆయన్ను రిలీవ్ చేయకపోవడం వంటి కారణాలతో ఆయన ఇక్కడ జాయిన్‌కాలేదు. దీంతో నగర కమిషనర్ పి.నాగవేణిని అనంతపురం కమిషనర్‌గా బదిలీచేసి, ఆమె స్థానంలో జేసీ శ్రీధర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. -
కార్పొరేషన్లో షాడో కమిషనర్
కార్పొరేషన్లో కమిషనర్ విధులంటేనే అధికారులు జంకుతున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించిన అధికారులు పలువురు వివాదాలకు కేంద్ర బిందువు కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది గ్రూపుల వారీగా విడిపోవడంతో అభివృద్ధి పనులన్నీ నత్తనడకన కొనసాగుతున్నాయి. పర్యవేక్షణ చేసే అధికారులే లేకపోవడంతో కార్పొరేషన్ పాలన గాడితప్పి ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. అయితే ఓ సంస్థలో పని చేస్తున్న అధికారికి కార్పొరేషన్ కమిషర్ బాధ్యతలు అప్పగించినా ఫలితం లేకుండా పోయిందని ఆరోపణలు వినవడుతున్నాయి. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమం కార్పొరేషన్లో రెండు, మూడు రోజులు మినహా సవ్యంగా జరగలేదు. అధికారులకు ప్రణాళిక లేకపోవడంతో నగరపాలక సంస్థ ఇటు అభివృద్ధి పనులు, అటు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో రాష్ర్టంలో ఇతర కార్పొరేషన్ల కన్నా వెనకంజలో ఉంది. అంతేకాకుండా పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది ఎవరికి వారు యమునా తీరే చందంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కార్పొరేషన్ పాలన అస్తవ్యస్తంగా మారితే ప్రస్తుతం ఓ సంస్థకు చెందిన ఉద్యోగి పెత్తనంపై అధికారులు, సిబ్బంది గుర్రుగా ఉన్నారు. అక్కడ బాధ్యతలు మరిచి.. ఇక్కడ పెత్తనం తనకు బాధ్యతలు అప్పగించిన సంస్థలో విధులను విస్మరించి ఏకంగా కమిషనర్ చాంబర్లోనే సదరు ఉద్యోగి తిష్టవేషి కార్పొరేషన్ కార్యక్రమాలు చక్కబెడుతున్నట్లు ఉద్యోగులు, సిబ్బంది గుసగుసలాడుతున్నారు. డీఈలు, ఇతర అధికారులు కమిషనర్ చాంబర్లోకి వచ్చినా పట్టించుకోకుండా అక్కడే ఆ ఉద్యోగి ఉంటుండడంతో తమ విధులకు ఆటంకం కలుగుతుందని అధికారులు నొచ్చుకుంటున్నట్లు సమాచారం. కార్పొరేషన్ పాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు, విధి విధానాలు కమిషనర్‌తో చర్చిద్దామని ఆయన చాంబర్లోకి పోతే ఆ ఉద్యోగి అక్కడ ఉండడం చూసి అధికారులు వెనుదిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కాంట్రాక్టు పనులు, ఇతర వ్యవహారాల్లో ఆ ఉద్యోగి జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. సదరు ఉద్యోగి ఏ డిపార్ట్మెంట్ ఉద్యోగో తెలవక కార్పొరేషన్ సిబ్బంది మర్యాదలు చేసి.. ఆ తర్వాత అసలు విషయం తెలిసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్లో ఔట్సోర్సింగ్ కోసం.. ఓ సంస్థలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా ఉన్న ఈ వ్యక్తి కార్పొరేషన్లోనే ఔట్సోర్సింగ్ ఉద్యోగం వస్తే తాను అనుకున్నంతా సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో ఏకంగా తమ బాస్‌తోనే ఇక్కడ తిష్టవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టెండర్లు, ఇతర అభివృద్ధి పనుల్లో అందినకాడికి దండుకోవాలంటే ఎలాగైనా ఔట్సోర్సింగ్ ఉద్యోగంతో కార్పొరేషన్లో రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఉద్యోగుల మధ్య గ్రూప్ వార్తో కార్పొరేషన్ పాలన గాడితప్పడంతో ఈ ఉద్యోగి చేష్టలతో ఇంకో కొత్త సమస్య వచ్చినట్లు కార్పొరేషన్లో ఇప్పుడు చర్చగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు కార్పొరేషన్ పాలనపై దృష్టి పెడితేనే సదరు ఉద్యోగి పెత్తనానికి చెక్ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
కార్యరూపం దాల్చని సోలార్ ప్రాజెక్ట్
ఏర్పాటుపై నగర పాలకవర్గం నిర్లిప్తత అనంతపురం కార్పొరేషన్ : నగర పాలక సంస్థకు దీర్ఘకాలం ప్రయోజనం చేకూరేలా చేపట్టిన సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి దాల్చలేకపోతోంది. బహుళ ప్రయోజన కారిగా ఉన్న ఈ బృహత్త ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంతో నగర పాలక వర్గం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర ప్రజలకు నీటి సరఫరాకు, వీధి దీపాలకు ప్రతి ఏటా రూ. 7 కోట్ల చార్జీలను ట్రాన్సకోకు కార్పొరేషన్ చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని ఆదా చేయడంపై నగర కార్పొరేషన్ కమిషనర్‌గా నీలకంఠారెడ్డి ఉన్న సమయంలో సొంతంగా సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పండమేరు వాటర్ వర్క వద్ద నగర పాలక సంస్థకు చెందిన స్థలంలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి డీపీఆర్(డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట)ను కూడా రూపొందించారు. ప్రస్తుతం ఇది ఏ దశలో ఉందనే విషయం అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రయోజనాలు మెండు నీటి సరఫరా, వీధి దీపాలకు, పార్కులకు వినియోగిస్తున్న విద్యుత్‌కు నెలసరి రూ.60 లక్షల చొప్పున ఏటా రూ.7 కోట్లకు పైగానే విద్యుత్ చార్జీలను సంస్థ చెల్లిస్తోంది. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఈ డబ్బులు మిగులుతాయి. అంతే కాకుండా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో కొంత ట్రాన్స్‌కోకు విక్రయించవచ్చు. ఈ ఆలోచనతో అధికారులు అద్యయనం చేశారు. ఏడాదిలో జిల్లాలో కురిసే వర్షపాతం చాలా తక్కువ. ఏడాదిలో దాదాపు 330 రోజులు ఎండలు ఉంటాయి. అంటే సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలం. నాబార్డ్ నామ్స్ ప్రకారం సోలార్ ప్లాంట్ ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్లు ఖర్చు అవుతుంది. సంస్థ ఏటా 3.5 మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఇక సోలార్ శక్తి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ నిలువ చేసుకునేలా ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి అధిక మొత్తంలో వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించి ఇచ్చిపుచ్చుకునే పద్ధతి పాటించాలని అధికారులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించి అక్కడి నుంచి అవసరం మేరకు తెచ్చుకోవడం. ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను విక్రయించడం ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతుంది. నిధులు ఎలా సమకూరుస్తారు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు నాబార్డ్ నిధులు ఇస్తుంది. నాబార్డ్ ద్వారానైనా ఈ ప్రాజెక్టు చేపట్టవచ్చు. లేదా పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలోనైనా చేపట్టవచ్చు అని అధికారులు చెప్పారు. అంతే కాకుండా నగర, పురపాలక సంఘాలకు సొంతంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చే అవకాశం ఉంది. ప్రయోజనం ఏమిటంటే సొంతంగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఉత్పత్తి చేసుకున్న విద్యుత్‌ను అవసరం మేరకు వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏటా చెల్లిస్తున్న విద్యుత్ చార్జీ రూ.7కోట్లు మిగులుతుంది. వినిగించుకోగా మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. తద్వారా సంస్థకు ఆదాయం వస్తుంది. ఇక ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాన్ని నెలసరి వాయిదాలుగా (నెల వారీగా మిగిలే విద్యుత్ బిల్లు రూ.60 లక్షలను) చెల్లిస్తే ఐదారు సంవత్సరాల్లో తీరుతుంది. అటు తరువాత సంస్థకు ప్లాంట్ మిగిలిపోతుంది. అక్కడి నుంచి విద్యుత్ వినియోగానికి భారం సంస్థపై ఒక్కరూపాయి కూడా ఉండదు. దీంతో సంస్థ నిధులు ఏటా రూ.7 కోట్లకు పైగా ఆదా అవుతాయి. ఈ నిధులను నగరాభివృద్ధికి ఉపయోగించి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించవచ్చు. -
అంతర్యుద్ధం
ఒంగోలు, న్యూస్‌లైన్ : కార్పొరేషన్ కమిషనర్, ఉద్యోగుల మధ్య అంతర్యుద్ధం తార స్థాయికి చేరింది. కమిషనర్ విజయలక్ష్మి వేధింపులు తాళలేకపోతున్నామని ప్రణాళికా విభాగం సిబ్బంది ఇప్పటికే మూకుమ్మడి సెలవులు పెట్టిన విషయం తెలిసిందే. మూకుమ్మడి సెలవులు పెట్టిన ఎనిమిది మంది ప్రణాళికా విభాగం సిబ్బందికి కమిషనర్ ఎండార్స్మెంట్ నోటీసులు జారీ చేయడంతో సమస్య మరింత ముదిరింది. = గురువారం ఉదయం ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు వచ్చిన మున్సిపల్ మాజీ చైర్మన్ యక్కల తులసీరావు తొలుత ఏసీపీ చంద్రబోస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. = ఉద్యోగులూ అదే స్థాయిలో ఆగ్రహించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకే తాను సర్దిచెప్పేందుకు వచ్చానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. = ఈ నెల 12వ తేదీ వరకు వేచి చూడాలని, అప్పటికీ కమిషనర్ తన పద్ధతి మార్చుకోకుంటే తాము కూడా మీకు మద్దతు పలుకుతామంటూ యక్కల నచ్చజెప్పేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. మా బాధనూ అర్థం చేసుకోండి = యక్కల ప్రతిపాదనకు ప్రణాళికా విభాగం సిబ్బంది ససేమిరా అన్నారు. = తాము పడుతున్న మానసిక వేదన ఎవరికీ అర్థం కావడం లేదని, ఇలా మూకుమ్మడి సెలవులు పెట్టడం ఇది రెండోసారని చెప్పారు. = కమిషనర్ తీరు మారకపోగా తమను మరింత చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. = ఇప్పటికే రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ హృద్రోగానికి గురై ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారని, మరో ఇద్దరు మానసికంగా కుంగిపోయి తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ఉద్యోగులు వివరించారు. = కమిషనర్ సెలవు పెట్టుకొని వెళ్లిపోయేలా ఆమెపై ఒత్తిడి తీసుకురావాలని యక్కలకు సూచించారు. చేసేది లేక ఆయన అక్కడి నుంచి కమిషనర్ చాంబర్‌కు వెళ్లిపోయారు. నీళ్లివ్వకుండా పన్నులు ఎలా వసూలు చేస్తాం? = నగరపాలక సంస్థ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు అబ్బూరి రమేష్, రెవెన్యూ ఆఫీసర్ మంజులాకుమారిలు కమిషనర్ చర్యలను ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు. = {పణాళికా సిబ్బందినే మాత్రమే కాదని, నగరపాలక సంస్థలో ఉన్న ఉద్యోగుల మొత్తాన్ని మానసికంగా కమిషనర్ వేధిస్తున్నారని ఆరోపించారు. = నగరంలో వారానికోసారి కూడా నీరు సక్రమంగా సరఫరా చేయకుండా నీటి పన్ను ఎలా వసూలు చేస్తామని ప్రశ్నించారు. = పన్ను వసూలు చేయలేదంటూ ఉద్యోగులకు మెమోలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. = {పణాళికా విభాగం సిబ్బందికి మద్దతుగా తాము కూడా శుక్రవారం నుంచి సామూహిక సెలవుల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులూ మీరెక్కడ? = నగరపాలక సంస్థలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ఉన్నతాధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. = ఇటువంటి సమస్యలను ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ అధికారులు మాత్రమే పరిష్కరించగలరు. = ఒంగోలు ఎమ్మెల్యే పేరుతో మున్సిపల్ మాజీ చైర్మన్ మధ్యవర్తిత్వం వహించడం ఏమిటంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు.