కార్యరూపం దాల్చని సోలార్ ప్రాజెక్ట్
ఏర్పాటుపై నగర పాలకవర్గం నిర్లిప్తత
అనంతపురం కార్పొరేషన్ : నగర పాలక సంస్థకు దీర్ఘకాలం ప్రయోజనం చేకూరేలా చేపట్టిన సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్ కార్యరూపంలోకి దాల్చలేకపోతోంది. బహుళ ప్రయోజన కారిగా ఉన్న ఈ బృహత్త ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంతో నగర పాలక వర్గం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర ప్రజలకు నీటి సరఫరాకు, వీధి దీపాలకు ప్రతి ఏటా రూ. 7 కోట్ల చార్జీలను ట్రాన్‌సకోకు కార్పొరేషన్ చెల్లిస్తోంది.
ఈ మొత్తాన్ని ఆదా చేయడంపై నగర కార్పొరేషన్ కమిషనర్‌గా నీలకంఠారెడ్డి ఉన్న సమయంలో సొంతంగా సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పండమేరు వాటర్ వర్‌క వద్ద నగర పాలక సంస్థకు చెందిన స్థలంలో ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి డీపీఆర్(డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్‌ట)ను కూడా రూపొందించారు. ప్రస్తుతం ఇది ఏ దశలో ఉందనే విషయం అధికారులు చెప్పలేకపోతున్నారు.
ప్రయోజనాలు మెండు
నీటి సరఫరా, వీధి దీపాలకు, పార్కులకు వినియోగిస్తున్న విద్యుత్‌కు నెలసరి రూ.60 లక్షల చొప్పున ఏటా రూ.7 కోట్లకు పైగానే విద్యుత్ చార్జీలను సంస్థ చెల్లిస్తోంది. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఈ డబ్బులు మిగులుతాయి. అంతే కాకుండా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో కొంత ట్రాన్స్‌కోకు విక్రయించవచ్చు. ఈ ఆలోచనతో అధికారులు అద్యయనం చేశారు. ఏడాదిలో జిల్లాలో కురిసే వర్షపాతం చాలా తక్కువ. ఏడాదిలో దాదాపు 330 రోజులు ఎండలు ఉంటాయి.
అంటే సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుకూలం. నాబార్డ్ నామ్స్ ప్రకారం సోలార్ ప్లాంట్ ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్లు ఖర్చు అవుతుంది. సంస్థ ఏటా 3.5 మెగా వాట్ల విద్యుత్‌ను వినియోగిస్తుంది. ఇక సోలార్ శక్తి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ నిలువ చేసుకునేలా ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి అధిక మొత్తంలో వ్యయం చేయాల్సి ఉంటుంది.
ఈ కారణంగా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించి ఇచ్చిపుచ్చుకునే పద్ధతి పాటించాలని అధికారులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించి అక్కడి నుంచి అవసరం మేరకు తెచ్చుకోవడం. ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో వాడుకోగా మిగిలిన విద్యుత్‌ను విక్రయించడం ద్వారా సంస్థకు ఆదాయం సమకూరుతుంది.
నిధులు ఎలా సమకూరుస్తారు
సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు నాబార్డ్ నిధులు ఇస్తుంది. నాబార్డ్ ద్వారానైనా ఈ ప్రాజెక్టు చేపట్టవచ్చు. లేదా పబ్లిక్ ప్రైవేటు పార్ట్‌నర్ షిప్ (పీపీపీ) పద్ధతిలోనైనా చేపట్టవచ్చు అని అధికారులు చెప్పారు. అంతే కాకుండా నగర, పురపాలక సంఘాలకు సొంతంగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సమకూర్చే అవకాశం ఉంది.
ప్రయోజనం ఏమిటంటే
సొంతంగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే ఉత్పత్తి చేసుకున్న విద్యుత్‌ను అవసరం మేరకు వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏటా చెల్లిస్తున్న విద్యుత్ చార్జీ రూ.7కోట్లు మిగులుతుంది. వినిగించుకోగా మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. తద్వారా సంస్థకు ఆదాయం వస్తుంది. ఇక ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాన్ని నెలసరి వాయిదాలుగా (నెల వారీగా మిగిలే విద్యుత్ బిల్లు రూ.60 లక్షలను) చెల్లిస్తే ఐదారు సంవత్సరాల్లో తీరుతుంది. అటు తరువాత సంస్థకు ప్లాంట్ మిగిలిపోతుంది. అక్కడి నుంచి విద్యుత్ వినియోగానికి భారం సంస్థపై ఒక్కరూపాయి కూడా ఉండదు. దీంతో సంస్థ నిధులు ఏటా రూ.7 కోట్లకు పైగా ఆదా అవుతాయి. ఈ నిధులను నగరాభివృద్ధికి ఉపయోగించి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించవచ్చు.