♦ ఎట్టకేలకు కార్పొరేషన్ కమిషనర్ బదిలీ
♦ నూతన పాలక వర్గంతో వైరమే కారణమా?
♦ పంతం నెగ్గించుకున్న ప్రజాప్రతినిధులు
ఖమ్మం : కార్పొరేషన్ కమిషనర్ బదిలీ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆరేళ్లుగా పాలక మండలి లేకపోవడంతో వ్యవహరించిన మాదిరిగానే.. పాలక మండలి ఏర్పడిన తర్వాత కమిషనర్ వ్యవహరించడం.. కౌన్సిల్‌కు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటూ.. మేయర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారనే తదితర ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో ఆయన బదిలీ కావడం చర్చనీయాంశమైంది. కొత్త పాలక మండలి ఏర్పడిన నాటి నుంచే కమిషనర్ బదిలీ అవుతారనే గుప్పుమన్నాయి. అయితే సీఎం పర్యటకు ముందుగానే కమిషనర్ బదిలీపై పలు రకాల చర్చలు జరిగాయి. అయితే సాధారణంగానే బదిలీ అయ్యారా? లేదా కావాలని ప్రజాప్రతినిధులు పట్టుపట్టి బదిలీ చేయించారా? అనే చర్చ సాగుతోంది.
పాలక మండలి ఏర్పడిన నాటి నుంచి..
ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగడం.. కొత్త పాలక మండలి ఏర్పడినప్పటి నుంచి కమిషనర్‌కు, పలువురు కార్పొరేటర్ల మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. రాజకీయ అనుభవం లేని మేయర్ పాపాలాల్‌ను కమిషనర్ తన గుప్పిట్లో పెట్టుకుని అంతా తానై నడిపిస్తున్నాడని, దశాబ్దాలపాటు కార్పొరేషన్‌లో వివిధ హోదాల్లో పనిచేసిన సీనియర్ నాయకులను కావాలనే పక్కన పెట్టారనే విమర్శలొచ్చాయి. ఇటీవల జిల్లాలో జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు 46 మంది ఉన్నా.. కమిషనర్ మాత్రం ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా మేయర్, ఒకరిద్దరు కార్పొరేటర్లను వెంట పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే కొనసాగితే తమ పరువుతోపాటు పార్టీ పరువు కూడా పోతుందని పలువురు కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు.
దీనిని పరిగణనలోకి తీసుకున్న నాయకులు గతంలోనే కమిషనర్‌ను బదిలీ చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు ఇతర మంత్రులకు వివరించి.. ఆయనను బదిలీ చేయాలని పట్టుపట్టినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే వేణుగోపాల్‌రెడ్డి బదిలీ అయి.. నూతనంగా ఉపేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరిస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తర్వాత ఏమైందో కాని.. కమిషనర్ బదిలీ కాకుండానే ఉండిపోయారు. అనంతరం ఈనెల 14న నిర్వహించే కౌన్సిల్ సమావేశంపై కార్పొరేటర్లతో చర్చించలేదని, స్థానిక ఎమ్మెల్యేకు సైతం సమాచారం లేకుండా కౌన్సిల్ తేదీని ఖరారు చేశారనే విమర్శలొచ్చాయి.
దీనిపై నాలుగు రోజుల క్రితం మెజార్టీ కార్పొరేటర్లు సమావేశమై కమిషనర్ తీసుకున్న నిర్ణయాలు, చేసే తీర్మానాల వల్ల తాము అభాసుపాలు అవుతామని, తమకు తెలియకుండానే తమ డివిజన్లలో పనులు కేటాయించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కమిషనర్‌ను బదిలీ చేస్తే తప్ప పార్టీ పరువు నిలవదని ఎమ్మెల్యేకు, ఇతర నాయకులకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. అవసరమైతే 14న జరిగే కౌన్సిల్ సమావేశానికి కూడా హాజరయ్యే ప్రసక్తి లేదని కార్పొరేటర్లు ముక్తకంఠంతో తీర్మానం చేసినట్లు సమాచారం. ఇది జరిగి నాలుగు రోజులు గడవకముందే కౌన్సిల్ సమావేశానికి ఒక్కరోజు ముందు కమిషనర్ బదిలీ కావడం.. గతంలో పనిచేసిన బోనగిరి శ్రీనివాస్‌ను నూతన కమిషనర్‌గా జిల్లాకు తీసుకురావడం వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది.