ఊరే లేకుండా చేస్తా..
► తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హెచ్చరికలు
► తిరగబడ్డ ఎనిమిది గ్రామాల ప్రజలు
► గ్రామస్తులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్/రామచంద్రాపురం: తిరుపతి చెత్తను రూరల్ పరిధిలోని గ్రామాల్లో డంపింగ్ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘మాయదారి చెత్త ఎనిమిది గ్రామాలను కలుషితం చేస్తోంది. ప్రతి గ్రామంలోనూ నరాల బలహీనత, కాళ్లు, కీళ్లు నొప్పులతో పాటు ఎందరో మహిళలను తల్లి తనానికి దూరం చేస్తుంది. విద్యా కేంద్రంగా ఉన్న గ్రామంలో 70వేల మంది విద్యార్థుల జీవితాలతో ఆటాలాడుతోంది. ఈ చెత్త సమస్య నుంచి మమ్మల్ని కాపాడండి’’...అంటూ రామచంద్రాపురం, తిరుపతి రూరల్ మండలాల్లోని ఎనిమిది గ్రామాల ప్రజలు తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్‌ను అడ్డుకున్నారు.
‘ఏమనుకుంటున్నారు ఐఏఎస్ అధికారిని...చెత్తను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తలచుకుంటే అసలు రామాపురం ఊరే లేకుండా చేస్తా.. పోలీసులు, తహసీల్దార్‌కు చెప్పి రక్షణ ఏర్పాటు చేసి చెత్తను తరలిస్తాం....ఇది కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్ బెదిరింపులు.
తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ తీరుతో బుధవారం రామచంద్రాపురం మండలం సీ.రామాపురం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తిరుపతి నుంచి తీసుకువస్తున్న ఆస్పత్రి వ్యర్థాలు, జంతు కళేబరాలతో కూడిన చెత్తను సీ.రామాపురం వద్ద డంప్ చేస్తున్నారు. డంపింగ్ యార్డు వల్ల తిరుపతి రూరల్ మండలంలోని దుర్గసముద్రం, అడపారెడ్డిపల్లి, రామచంద్రాపురం మండలంలో ని రామాపురం, రామచంద్రాపురం, కమ్మకండ్రిగ, మిట్టూరు, లోకమాతాపు రం, ఎస్టీ కాలనీ గ్రామాల్లో తాగునీరు కలుషితం అవుతోంది. దీనిపై ఎనిమిది గ్రామాల ప్రజలు నాలుగు రోజులుగా పోరాడుతున్నారు.
బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, తిరుపతి కార్పొరేషన్, మండల అధికారులతో సమావేశం నిర్వహించా రు. కమిషనర్ హరికిరణ్ తీరుపై ఎనిమిది గ్రామాల ప్రజలు మండిపడ్డారు. సమస్యను పరిష్కరించకుండా అరెస్ట్ చేయిస్తా, లోపల వేయిస్తా, ఊరే లేకుండా చేస్తానని హెచ్చరించడంపై వ్యతిరేకించారు. ఆయన ప్రసంగాన్ని బహిష్కరించారు. కమిషనర్ డౌన్..డౌన్ అంటూ నినాదాలు చేశారు. చెత్త లారీలను అడ్డుకున్నారు. చెత్తను రోడ్డుపైనే పారబోశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి జోక్యం చేసుకుని గ్రామస్తుల ఆందోళనకు మద్దతు ప్రకటించడంతో కార్పొరేషన్ అధికారులు వెనుదిరిగారు.
పంతాలకు పోవద్దు
డంపింగ్‌యార్డు వల్ల ఎనిమిది గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడతారు. ఆ ప్రాంతాల్లో చదువుతున్న 70వేల మంది విద్యార్థులు కలుషిత నీరు తాగాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామమే ఎడారవుతుంది. అధికారులు పంతాలకు పోకుండా గ్రామస్తుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో ఇదే సమస్యపై అధికారులను మంత్రిగా గల్లా అరుణకుమారి కలిసినప్పుడు కూడా మూడు నెలల్లో తరలిస్తామని ఆమెకు మాట ఇచ్చారు. ఆమెకిచ్చిన మాటను అధికారులు నిలబెట్టుకోవాలి. డంపింగ్ యార్డు విషయంలో గ్రామస్తుల ఆందోళనకు అండగా ఉంటాను.
– చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. ఎమ్మెల్యే, చంద్రగిరి