అంతర్యుద్ధం
ఒంగోలు, న్యూస్‌లైన్ : కార్పొరేషన్ కమిషనర్, ఉద్యోగుల మధ్య అంతర్యుద్ధం తార స్థాయికి చేరింది. కమిషనర్ విజయలక్ష్మి వేధింపులు తాళలేకపోతున్నామని ప్రణాళికా విభాగం సిబ్బంది ఇప్పటికే మూకుమ్మడి సెలవులు పెట్టిన విషయం తెలిసిందే. మూకుమ్మడి సెలవులు పెట్టిన ఎనిమిది మంది ప్రణాళికా విభాగం సిబ్బందికి కమిషనర్ ఎండార్స్‌మెంట్ నోటీసులు జారీ చేయడంతో సమస్య మరింత ముదిరింది.
= గురువారం ఉదయం ఉద్యోగులతో చర్చలు జరిపేందుకు వచ్చిన మున్సిపల్ మాజీ చైర్మన్ యక్కల తులసీరావు తొలుత ఏసీపీ చంద్రబోస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
= ఉద్యోగులూ అదే స్థాయిలో ఆగ్రహించడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాల మేరకే తాను సర్దిచెప్పేందుకు వచ్చానని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
= ఈ నెల 12వ తేదీ వరకు వేచి చూడాలని, అప్పటికీ కమిషనర్ తన పద్ధతి మార్చుకోకుంటే తాము కూడా మీకు మద్దతు పలుకుతామంటూ యక్కల నచ్చజెప్పేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి.
మా బాధనూ అర్థం చేసుకోండి
= యక్కల ప్రతిపాదనకు ప్రణాళికా విభాగం సిబ్బంది ససేమిరా అన్నారు.
= తాము పడుతున్న మానసిక వేదన ఎవరికీ అర్థం కావడం లేదని, ఇలా మూకుమ్మడి సెలవులు పెట్టడం ఇది రెండోసారని చెప్పారు.
= కమిషనర్ తీరు మారకపోగా తమను మరింత చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
= ఇప్పటికే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ హృద్రోగానికి గురై ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారని, మరో ఇద్దరు మానసికంగా కుంగిపోయి తీవ్ర అనారోగ్యం పాలయ్యారని ఉద్యోగులు వివరించారు.
= కమిషనర్ సెలవు పెట్టుకొని వెళ్లిపోయేలా ఆమెపై ఒత్తిడి తీసుకురావాలని యక్కలకు సూచించారు. చేసేది లేక ఆయన అక్కడి నుంచి కమిషనర్ చాంబర్‌కు వెళ్లిపోయారు.
నీళ్లివ్వకుండా పన్నులు ఎలా వసూలు చేస్తాం?
= నగరపాలక సంస్థ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు అబ్బూరి రమేష్, రెవెన్యూ ఆఫీసర్ మంజులాకుమారిలు కమిషనర్ చర్యలను ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు.
= {పణాళికా సిబ్బందినే మాత్రమే కాదని, నగరపాలక సంస్థలో ఉన్న ఉద్యోగుల మొత్తాన్ని మానసికంగా కమిషనర్ వేధిస్తున్నారని ఆరోపించారు.
= నగరంలో వారానికోసారి కూడా నీరు సక్రమంగా సరఫరా చేయకుండా నీటి పన్ను ఎలా వసూలు చేస్తామని ప్రశ్నించారు.
= పన్ను వసూలు చేయలేదంటూ ఉద్యోగులకు మెమోలు జారీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
= {పణాళికా విభాగం సిబ్బందికి మద్దతుగా తాము కూడా శుక్రవారం నుంచి సామూహిక సెలవుల్లోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు.
ఉన్నతాధికారులూ మీరెక్కడ?
= నగరపాలక సంస్థలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ఉన్నతాధికారులు ఇటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆశ్చర్యంగా ఉంది.
= ఇటువంటి సమస్యలను ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ అధికారులు మాత్రమే పరిష్కరించగలరు.
= ఒంగోలు ఎమ్మెల్యే పేరుతో మున్సిపల్ మాజీ చైర్మన్ మధ్యవర్తిత్వం వహించడం ఏమిటంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు.