అంతా‘చెత్త’మయం   | No swachh bharat In Orissa | Sakshi
Sakshi News home page

అంతా‘చెత్త’మయం  

Published Sat, Aug 18 2018 1:51 PM | Last Updated on Sat, Aug 18 2018 1:51 PM

No swachh bharat In Orissa - Sakshi

కార్పొరేషన్‌ మెయిన్‌ రోడ్‌లో పేరుకుపోయిన చెత్తకుప్పలు

బరంపురం: ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమం అటకెక్కుతోంది. బరంపురం నగరంలో అడుగడుగునా పేరుకుపోతున్న చెత్త చూస్తుంటే ప్రధాని మోడీ ఆశించిన లక్ష్యం నీరుగారినట్లు కనిపిస్తోంది. బీఎంసీ నిర్లక్ష్యం, స్థానిక నాయకుల చొరవ కొరవడడంతో నగరంలో ఎక్కడ చూసినా చెత్త నిలువలతో దుర్గంధం వెదజల్లుతోందని  స్థానికులు వాపోతున్నారు. బరంపురం మున్సిపాలిటీ కార్పొరేషన్‌ (బీఎంసీ) పరిధిలో సుమారు 5 లక్షల జనాభా నివసిస్తున్నారు.

ఈ జనాభా వినియోగించిన తరువాత విసిరివేసే చెత్త నగరంలో ప్రతిరోజూ సుమారు 200 టన్నుల మేర  పేరుకుపోతోంది.  నగరంలో గల కొమ్మపల్లి, గేట్‌ బజార్, పెద్ద బజార్, లంజిపల్లి ఓవర్‌ బ్రిడ్జి కింద, కొత్త బస్‌స్టాండ్, స్టేడియం రోడ్‌లలో చెత్త బాగా పేరుపోతోంది. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. దీని ఫలితంగా చెత్త కుళ్లిపోయి దోమలు విపరీతంగా పెరిగి రోగాలు విజృంభిస్తున్నాయి. దోమల వల్ల వ్యాధుల  బారిన పడి ఆనారోగ్యం పాలవుతున్నామని నగర ప్రజలు  అవేదన వ్యక్తం చేస్తున్నారు.  

కలగా మిగిలిన చెత్తశుద్ధి కర్మాగారం

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌తో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నగర శివారు మౌడా పర్వతాల్లో బీఎంసీ ఆధ్వర్యంలో రూ.70 కోట్లతో చేపట్టిన చెత్తశుద్ధి  కర్మాగారం నిర్మాణం కలగానే మిగిలిపోయింది. నగరంలో ప్రతి రోజు వెలువడుతున్న 200 టన్నుల చెత్తను సేకరించి మౌడాకు తరలించేందుకు బీఎంసీ చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇందుకు ముఖ్యకారణం చెత్తశుద్ధి కర్మాగారం చేపట్టేందుకు  టెండర్‌ కోసం ఏ  ఒక్క ప్రైవేట్‌ సంస్థ కూడా ముందుకు రాకపోవడమే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమం అటకెక్కుతోందని స్థానిక ప్రజలు   ఆరోపిస్తున్నారు.

స్థానిక పలు స్వచ్ఛంద సంస్థలు తప్పిస్తే స్థానిక నాయకులకు స్వచ్ఛభారత్‌పై చొరవ కరువైంది.  పత్రికలు, టీవీల్లో స్వచ్ఛభారత్‌ పరిశుభ్రతపై ప్రసారం హోరెత్తించినా పరిసరాల మరిశుభ్రత విషయంలో పరిస్థితుల్లో మార్పురావడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.  స్వచ్ఛభారత్‌ అంటే పత్రికల్లో ఫోజులు ఇవ్వడం కాదని నగర పరిశుభ్రతపై దృష్టిసారించి స్థానిక రాజకీయ నాయలు చొరవ చూపాలని సీనియర్‌ సిటిజన్స్, మేధావులు, పరిశీలకులు కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement