
హాజరైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
తొక్కిసలాటలో ఒకరి మృతి
భువనేశ్వర్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5.20 గంటలకు రథాలు కదిలాయి. అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు చేశారు.
ఆమె, ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్, సీఎం మోహన్ చరణ్ మాఝి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ముందున్న బలభద్రుని ప్రతిష్టించిన 45 అడుగుల ఎత్తైన రథాన్ని దేవీ సుభద్ర, జగన్నాథుని రథాలు అనుసరించాయి. రథయాత్రకు ముందు భక్తుల బృందాలు జగన్నాథుని కీర్తనలను ఆలపిస్తూ ముందుకు సాగారు. రెండు రోజులపాటు సాగే యాత్ర కోసం భారీగా బందోబస్తు చేపట్టారు.
సాయంత్రం వేళ బలభద్రుని రథం లాగుతున్న చోట ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరాడక తొమ్మిది మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ఒడిశాలోని బాలాంగిర్ జిల్లాకు చెందిన లలిత్ బాగార్తి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. భక్తుని మృతి పట్ల సీఎం చరన్ మాఝీ సంతాపం వ్యక్తంచేశారు. అయితే 300 మందిదాకా గాయపడినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.