అంగన్‌వాడీల్లో ‘బాల స్వచ్ఛభారత్’ | child swachh bharat in Anganwadi center | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో ‘బాల స్వచ్ఛభారత్’

Published Fri, Nov 14 2014 4:34 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

అంగన్‌వాడీల్లో ‘బాల స్వచ్ఛభారత్’ - Sakshi

అంగన్‌వాడీల్లో ‘బాల స్వచ్ఛభారత్’

నేటినుంచి 19 వరకు కార్యక్రమాలు
* నిధులు కేటాయించని ప్రభుత్వం
* నిర్వహణపై మల్లగుల్లాలు పడుతున్న కేంద్రాల నిర్వాహకులు

భువనగిరి: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల స్వచ్ఛభారత్ వారోత్సవాలు నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఐసీడీఎస్ అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.  

ముఖ్యంగా ఆరు ప్రధాన అంశాలపై రోజువారీగా  కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పదార్థాలు, మంచినీరు, మరుగుదొడ్లపై  పిల్లలు, వారి తల్లులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం గ్రామాల్లో బ్యానర్లు, ప్లోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా అధికారులు జిల్లాలోని 18 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలోని సీడీపీఓలకు అదేశాలు జారీ చేశారు.  జిల్లాలోని 3901 అంగన్‌వాడీ కేంద్రాలు, 401 మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా వారోత్సవాల సందర్భంగా ఆయా గ్రామాల్లో విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించాలి.
 
నిధులేవీ..

ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులూ రాకపోవడం వల్ల ఆంగన్‌వాడీల కేంద్రాల నిర్వాహకులు అనాసక్తత చూపుతున్నారు. ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలపై ఫొటోలు తీసి పై అధికారులకు మెయిల్ చేయాలని ఆదేశించారు. ఎలాంటి నిధులూ లేకుండా ఎలా చేయగలమని వారు ప్రశ్నిస్తున్నారు. భువనగిరి ఐసీడీఎస్ ప్రాజెక్టులో స్వచ్ఛభారత్ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార కార్యక్రమం అంతంత మాత్రంగానే అధికారులు చేపట్టారు. ఇంతవరకు కనీసం వాల్‌పోస్టర్‌లు కూడా రాకపోవడంతో కార్యక్రమం మొక్కుబడిగా నిర్వహించే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.
 
అంగన్‌వాడీల్లో పరిశుభ్రత

అంగన్‌వాడీ కేంద్రాల్లోని గదులను, పిల్లలు కూర్చుండే స్థలాన్ని పరిశుభ్రం చేయాలి. గదులకు పట్టిన దుమ్ముధూళిని తొలగించాలి. పిల్లలు ఆడుకునే వస్తువులు తుడవాలి. అహార ధాన్యాలు నిలువ ఉంచే గదిని శుభ్రం చేయాలి. చెత్తాచెదారం, అనవసర వస్తువులూ నిల్వలేకుండా చూడాలి.
 
కేంద్రం పరిసరాలు
అంగన్‌వాడీ కేంద్రాల పరిసరాల్లోని ఆటలాడుకునే స్థలంలో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం, మురుగునీరు లేకుండా చూసుకోవాలి. ఆడకునేందుకు వీలుగా నేలను చదును చేయాలి. కీటకాలు, విష పురుగులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
 
వ్యక్తిగత శుభ్రత
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. భోజనం చేసే ముందు, చేసిన తర్వాత, మల మూత్రాలకు వెళ్లొచ్చిన తర్వాత చేతులు, కాళ్లను శుభ్రం చేసుకోవాలని సూచించాలి. ఆటలాడిన తర్వాత కూడా చేతులు, కాళ్లు ముఖం కడుక్కునేలా వారిని సిద్ధం చేయాలి.
 
వండి పెట్టే ఆహార పదార్థాలు
పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు రోజూ వండిపెట్టే భోజనం పరిశుభ్రంగా ఉంచాలి. అంగన్ వాడీ కేంద్రాల్లో ఆహారం కోసం ఉంచే  పప్పులు, బియ్యం, పామోలిన్ ఇతర వస్తువులను పరిశుభ్ర వాతావరణంలో ఉంచాలి. అప్పటికప్పుడు వండిన వేడి ఆహార పదార్థాల్ని పిల్లలకు అందించాలి. ఎక్కువరోజులు నిల్వ ఉన్న గుడ్లును లబ్ధిదారులకు అందించకూడదు.
 
మంచినీరు
మంచినీటిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు క్లోరినేషన్ చేసి, కాచి వడపోసిన తాగునీటిని మాత్రమే అందించాలి. తాగునీటి పాత్రలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఏ రోజు పట్టిన నీటిని ఆ రోజు మాత్రమే వాడాలి.
 
మరుగుదొడ్లు
అంగన్‌వాడీ కేంద్రాల్లో కచ్చితంగా మరుగుదొడ్లు ఉండేవిధంగా చూడాలి. మరుగుదొడ్లలో నీటి సదుపాయం కల్పించాలి, మల విసర్జన తర్వాత నీటిని పోయాలి. దుర్వాసన రాకుండా ఎప్పటికప్పుడు ఆసిడ్, ఫినాయిల్‌తో శుభ్రంగా కడగాలి. ఇందుకోసం ప్రత్యేక చొరవచూపాలి. లేకపోతే వ్యాధులొచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement