చిలకలూరిపేట : స్వచ్ఛభారత్ పేరుతో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పాఠశాలలు కనిపించినట్టులేదు. మరుగుదొడ్లులేని పాఠశాలలు, ఉన్నా నిరుపయోగంగా మారినవి కొన్నయితే, మరమ్మతులకు నోచనవి ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛ భారత్ అంటే కేవలం ఇంటికే పరిమితమైతే రేపటి పౌరులను తీర్చిదిద్దే పాఠశాలల పరిస్థితేంటని తల్లిదండ్రులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెబుతున్న సర్కారు మౌలిక వసతుల కల్పనలో విఫలమవుతోంది.
ఉదాహరణకు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని పరిశీలిస్తే....పలు ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్ల కిందట మరుగుదొడ్లు నిర్మించారు. దీంతో 90 శాతం విద్యార్థులకు మరుగు దొడ్ల సౌకర్యం లభించింది. అయితే వీటిని నిర్మించి చేతులు దులుపుకున్న అధికారులు నిర్వహణ బాధ్యతను విస్మరించారు. నీటి వసతి ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో కథ మొదటికి వచ్చింది. నీటి సౌకర్యంలేక అలంకారప్రాయంగా మిగిలాయి.
నియోజకవర్గ పరిధిలో మొత్తం 197 ప్రాథమిక పాఠశాలు, 16 ప్రాథమికోన్నత పాఠశాలలు, 25 ఉన్నత పాఠశాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 8 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మరుగుదొడ్డికి వెళ్లాల్సివస్తే స్కూల్ వెలుపల ఉన్న ఖాళీ ప్రదేశాలే దిక్కుగా మారాయి.
పాఠశాల ఆవరణలో నిర్మించిన మరుగుదొడ్లు వినియోగానికి నోచుకోకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఇక విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. పాఠశాలలకు నీటి వసతి కల్పించకపోవడంతో మధ్యాహ్న భోజన సమయంలోనూ, మరుగుదొడ్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు.
ఉన్నవాటిని పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణం...
గ్రామీణ ప్రాంతాల మాట అటుంచితే పట్టణంలోని పండరీపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాసంవత్సరం ఆరంభం నుంచి మరుగుదొడ్లు మూతపడే ఉన్నాయి. ఉన్న బోరింగ్ పంపు మరమ్మతులకు గురికావడం, మంచినీటి కుళాయికి మోటార్‌సౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. గోవిందపురం, పోతవరం, కోమటినేనివారిపాలెం తదితర పాఠశాలల్లోనూ, నాదెండ్ల మండలం గణపవరం హెచ్‌డబ్ల్యూయు ప్రాథమిక పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టకుండా కొద్దినెలల కిందట మళ్లీ నిర్మించారు.
గతంలో నిర్మించిన మరుగుదొడ్లుకు తలుపులు లేకపోవడం వీటి పక్కనే కంపచెట్లు పెరిగి చిట్టడవిగా మారింది. ఈ మండలంలో 30 పాఠశాలల్లోని మరుగుదొడ్లు నీటి సౌకర్యం, నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. నాదెండ్ల, సాతులూరు, తూబాడు పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. యడ్లపాడు మండలంలోని లింగారావుపాలెం ఆర్‌సీఎం పాఠశాలలో ఓవర్‌హెడ్ ట్యాంకర్ లేక మరుగుదొడ్లు మూతపడ్డాయి.
నిధులు పెంచితేనే....
నిర్వహణ లోపంతోనే మరుగుదొడ్లు మూతపడుతున్నాయి. వీటిని నిర్మించే క్రమంలో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, నాసిరకం వస్తువులు వినియోగించడంతో ప్రారంభమైన కొన్నిరోజులకే నిరుపయోగంగా మారుతున్నాయి. వీటిని శుభ్రం చేయడానికి ప్రభుత్వం కేవలం 200 రూపాయలు మాత్రమే వెచ్చించాలని చెప్పడం శోచనీయం. నిధులు పెంచి, వీటిని నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
బడికెళ్లని స్వచ్ఛభారత్ !
Published Wed, May 6 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement