అడిగిన పత్రాల ధ్వంసం నేరమే | Madabhushi Sridhar Guest Columns On RTI Rules | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 1:50 AM | Last Updated on Fri, Aug 10 2018 1:50 AM

Madabhushi Sridhar Guest Columns On RTI Rules - Sakshi

తనకు పోస్ట్‌ చేసిన 37 ఉత్తరాలు ఎక్కడినుంచి వచ్చాయి, ఎవరు బట్వాడా చేశారు, అవి ఏరోజు గమ్యస్థానం చేరాయి, చేరిన రుజు వులు ఏవి అని ఒక పౌరుడు పోస్టాఫీసు అధికారులను అడిగాడు. ఒకటి నుంచి 21 వరకు రికార్డు లేదని, గడువు తీరిందని తొలగించామని చెప్పారు, మిగిలిన చీటీలు ఇచ్చారు. ఆర్టీఐ దరఖాస్తు చేసినప్పుడు మొదటి అప్పీలు నాటికి ఉన్నా వాటిని తొలగించడం కోసం వేరు చేసి కుప్పలో పడేశారని వివరించారు. కాగితాలు ఉన్నప్పటికీ వాటిని ధ్వంసం చేసి పౌరుడికి ఇవ్వకపోవడం ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 20 కింద జరి మానా విధించదగిన నేరమే అవుతుందని కమిషన్‌ నోటీసు జారీ చేసింది.

ఆర్టీఐ దరఖాస్తు దాఖలయ్యేనాటికి దస్తావేజులు ఉండి ఉంటే, ఆనాటికే నిలిపే గడువు దాటిపోయినా వాటిని తొలగించకుండా అడిగిన పౌరుడికి ఇవ్వాలనే విధానం ప్రవేశపెట్టాలి. ఊరికే ధ్వంసం చేసే బదులు, అడిగిన వారికి లేదా వాటి సొంతదారులకు ఎందుకు ఇవ్వరో అర్థం కాదు. ఆ సమాచారం కోసం ఒకవైపు చట్టం ప్రకారం అడుగుతూ ఉంటే, మరోవైపు వాటిని ధ్వంసం చేసి రికార్డులు లేవు పొమ్మనడం సమంజసం కాదు. దీన్ని తీవ్రమైన విషయంగా పరిగణించి కమిషన్‌ తమిళనాడు ఈరోడ్‌ డివిజన్‌ తపాలాశాఖ ప్రజాసమాచార అధికారికి గరిష్ఠ జరిమానా ఎందుకు విధించకూడదో కారణాలు తెలపాలనే లేఖ జారీచేసింది. 

దానికి అధికారి జవాబిస్తూ 37 తపాలా లేఖల డెలివరీ చిట్టీలు ఇవ్వాలన్న ఆర్టీఐ దరఖాస్తు తమకు 22.8.2017న చేరిందని, 22నుంచి 37 వరకు చిట్టీలు ఇవ్వడానికి 54 రూపాయలు పంపాలని 11.9. 2017న అడిగామని, అతను ఆ సొమ్ము చెల్లించగానే ప్రతులు 3.10.2017న ఇచ్చామని తెలిపారు. 1 నుంచి 21కి సంబంధించిన చిట్టీలు తొలగించామని చెప్పారు. మరొక ఆర్టీఐ దరఖాస్తు ద్వారా పాత దస్తావేజుల తొలగింపునకు సంబంధించిన రుజువు ఇవ్వాలని కోరారు. వాటిని వేరు చేసి ఆ తరువాత విధి విధానాల ప్రకారం తొలగించామని మాత్రం అధికారి జవాబు చెప్పారు. మీరు ఎక్కడ ఆ దస్తావేజు లను కుప్పపోశారో చూపితే తానే తన కాగితాలను వెతుక్కుంటానని కూడా ఆయన మరొక దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ అందుకు అంగీకరించలేదు. 

తపాలాశాఖ నియమాల ప్రకారం దేశీయ ఉత్తరాల పంపిణీ పత్రాలను 18 నెలలు, స్పీడ్‌ పోస్టు ఉత్తరాల పత్రాలు ఆరు నెలలు దాస్తామని 11.9.2017న ఆర్టీఐ దరఖాస్తు వేసే నాటికే ఆ రికార్డులను పాత కాగితాలలో కుమ్మరించామన్నారు. అప్పీలు నాటికి పాత కాగితాలు నిజంగా నిర్మూలించకపోయినా కట్టలుకట్టి కుమ్మరించామని, బయటకుతీసే అవకాశం లేదని చెప్పారు. 

ఆర్టీఐ చట్టంలో కుమ్మరించిన కాగితాల కుప్పనుంచి వెలికి తీయాలనే నియమం లేదని, కనుక తాము ఇవ్వలేదని, తన నిర్ణయాన్ని మొదటి అప్పీలు అధికారి కూడా అంగీకరించారని, తాము కేవలం డిపార్ట్‌మెంట్‌ నియమాలను అనుసరించి మాత్రమే వ్యవహరించామని, కనుక తమపై జరిమానా విధిం చకూడదని  పీఐఓ వాదించారు. మొదటి అప్పీలు అధికారి పారేసిన కుప్పనుంచి దరఖాస్తుదారు కోరిన కాగితాలు వెతకాలని ఆదేశించలేదని, కనుక తాము ఆ ప్రయత్నం చేయలేదని కూడా వివరించారు.

ఆ కుప్పను మార్చి 2018 నాటికి పూర్తిగా తొలగించామని చెప్పారు. ఆర్టీఐ చట్టం రికార్డు దాచే నియమాలను నిర్ధారించలేదని అన్నారు. ఈ దరఖాస్తుదారు ఏడు సార్లు కాగితాల ప్రతులు కోరితే తాము ఇచ్చామని 6.6.2018న జరిగిన అప్పీలు విచారణలో అతను హాజరు కాలేదని అంటే ఆయన దీనికి తగిన ప్రాధాన్యం ఇవ్వనట్టేనని వాదించారు. ఈ కారణాల వల్ల సీఐసీ ఆదేశాన్ని పాటించలేక పోయామని, అడిగిన ప్రతులు ఇవ్వలేకపోయామని వివరించారు.

2017 ఆగస్టు నుంచి దరఖాస్తుదారు తన పత్రాల గురించి పోరాడుతూ ఉంటే తపాలా కార్యాలయం వారు 2018 మార్చిలో రికార్డులను తొలగించారని  తేలింది. సెక్షన్‌  2(ఎఫ్‌) 2(జె)లో నిర్వచనాల ప్రకారం సమాచారం అంటే తమ వద్ద ఉన్న కాగితాలు అని స్పష్టంగా ఉంది. ఆర్టీఐ దరఖాస్తు చేసిన నాటికి ఉన్న పత్రాలను అప్పీలు విచారణ దశలో ధ్వంసంచేయడం, సెక్షన్‌ 20లో చెప్పినట్టు తెలిసి తొలగించడం కిందికి వస్తుందని, దురుద్దేశం లేకపోయినా తెలిసి తొలగించడం నిరాకరణే అవుతుంది. అయినా పీఐఓ వివరణను పరిగణించి గరిష్ఠ జరిమానా 25 వేలు కాకుండా 25 వందల రూపాయల జరిమానా విధించాలని కమిషన్‌ నిర్ణయిం   చింది. ఊరికే ధ్వంసం చేసే బదులు ఆ పత్రాలు మిన హాయింపుల కిందికి రాకపోతే సంబంధిత వ్యక్తులకు ఇవ్వడం గురించి తపాలా శాఖ ఆలోచించాలని కమిషన్‌ సూచించింది. (CIC/POSTS/ A/2018/1194 69 టీఎస్‌ శివకుమార్‌ వర్సెస్‌ పీఐఓ తపాలాశాఖ కేసులో 6.8.2018న సీఐíసీ తీర్పు ఆధారంగా).

వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్‌, కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement