తీవ్రమైన ఆరోపణల మధ్య ప్రధాన న్యాయమూర్తి కూరుకుపోవడంతో న్యాయపాలనలో సమన్యాయం ప్రమాదంలో పడింది. 64 ఏళ్ల వయసు దాటి ఏడు నెలల్లో పదవీ విరమణ చేస్తున్న న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆయన నివాసంలో పనిచేసిన కోర్టు ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు రావడం, రాబోయే వారంలో కీలకమైన అంశాలపై విచారణ చేపట్టనున్న తనను ఈ ఆరోపణల ద్వారా నిశ్చేష్టుడిని చేయాలని పెద్ద కుట్ర నడుస్తోందని గొగోయ్ తీవ్రంగా ఆరోపించడంతో గందరగోళం ఏర్పడింది. మహోన్నత రాజ్యాంగ స్థానంలో ఉన్న వ్యక్తి మీద ఇది వ్యక్తిగతమైన ఆరోపణ. ఇది న్యాయవ్యవస్థమీద ఆరోపణ ఎలా అవుతుంది? ఆమె ఫిర్యా దులో కొన్ని అంశాలు: ఆ వనిత ఆయన నివాసంలో రాత్రి దాకా పనిచేయడానికి నియమించబడిన కోర్టు ఉద్యోగిని. ఈ సంఘటనలు జరగడానికి ముందు ఆమె ప్రతిభావంతురాలు సమర్థురాలు. ప్రధాన న్యాయమూర్తికి కేసులు, పుస్తకాలు వెతికి ఇవ్వతగినంత తెలివితేటలున్నాయని ప్రశంసలు పొందిన మహిళ. ఈ సంఘటనల తరువాత ఆమె అంకిత భావంతో పనిచేయడం లేదని తొలగించి వేశారు. అంతకు ముందు ఆమె మరిదికి న్యాయవ్యవస్థలో ఉద్యోగం అడ్డదారిలో కల్పించారు. ఆ తరువాత ఆమె భర్త ఉద్యోగం పీకేశారు. కుటుంబమే కష్టాల్లో పడింది. ఉన్నతాధికారాన్ని దుర్వినియోగం చేసి వేధించడం వల్ల తన ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడిందనీ కనుక ఈ ఫిర్యాదు చేయక తప్పడంలేదని ఆమె పేర్కొన్నారు.
ఒకవైపు చిరుద్యోగం కోల్పోయిన నిరుద్యోగ బాధితురాలు. మరోవైపు దేశపాలనా వ్యవస్థ న్యాయాన్యాయాలను శాసించే అత్యున్నతమైన రాజ్యాంగశక్తి. భారత ప్రధాన న్యాయమూర్తే ఆరోపణకు గురైనపుడు బలహీనురాలైన బాధితురాలికి బలమెవ్వరిస్తారు? ఇదీ ప్రశ్న. ప్రసిద్ధ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఈ ప్రశ్నవేస్తూ సుప్రీంకోర్టులో రోజూ పోరాడుతున్నారు. పంజాబ్ డీజీపీ కేపీఎస్ గిల్ మీద ఇటువంటి ఆరోపణ చేసిన మహిళ ఉన్నత పదవిలోఉన్న ఐఏఎస్ అధికారిణి. కింది కోర్టులో నేరం రుజువైంది. హైకోర్టులో ధృవీకరించారు. సుప్రీంకోర్టులోనూ కొన్ని సంవత్సరాల తరువాతైనా ఆమె నిలిచింది. గెలిచింది. కానీ ఇక్కడ సమస్య ఏమంటే ప్రధానన్యాయమూర్తి మీద ఆరోపణ. ఎఫ్‌ఐఆర్ కూడా వేయడానికి వీల్లేదు. పోలీసులు కాదు సీబీఐ కాదు సీఐడీ కాదు, కనీసం ఓ ముగ్గురు సభ్యుల కమిటీ అయినా విచారణ జరపడానికి వీల్లేదు. వీల్లేదంటే రాజ్యాంగం ఒప్పుకోదు.
ప్రధాన న్యాయమూర్తి మీద దుష్ప్రవర్తన ఆరోపణను విచారించాలంటే వంద మంది లోక్‌సభ సభ్యులు లేదా యాభైమంది రాజ్యసభ సభ్యులు ఆయనను తొలగించాలంటూ పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతూ నోటీసు ఇవ్వాలి. నోటీసును పార్లమెంటులో మెజా రిటీ సభ్యులు అనుమతిస్తేనే లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్‌పర్సన్ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించడానికి∙వీలవుతుంది. ఆ కమిటీ మాత్రమే విచారణ జరపాలి. ఎన్నికల్లో తలమునకలుగా ఉన్న పార్టీలకు ఈ విషయం పట్టించుకునే తీరికెక్కడిది? అందాకా ఏం చేయాలి? రాజ్యాంగంలో ఈ విషయంలో ఏ నియమమూ లేదు. న్యాయవ్యవస్థ స్వతంత్రత కోసం ఈ తొలగింపు నియమాలను చేర్చలేదు. లేకపోతే నియంతలైన ప్రధానులు న్యాయమూర్తులను నిమిషాల్లో తొలగించి తమ అనుయాయులను నియమించుకుని యథేచ్ఛగా నేరాలు చేసే వీలుంటుంది.
ఈ ఆరోపణలను నాలుగు డిజిటల్ మాధ్యమాలు మాత్రమే ప్రచురించాయి. ఆర్థికమంత్రిగారు వారిని తిట్టిపోస్తున్నారు. రంజన్ గొగోయ్‌కి బాసటగా తామున్నామని ప్రకటించారు. భారత న్యాయవాదుల మండలి కూడా ఆమె ఆరోపణలను అబద్ధాలని తీర్మానించి గొగోయ్ పక్కనున్నామని ప్రకటించింది. ఇదా న్యాయవ్యవస్థ స్వతంత్రత అంటే. ఇటువంటి మాటలు రాజకీయ నాయకులు చెప్పి బలీయుడైన నిందితుడిని తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వ్యూహాన్ని సీనియర్ న్యాయ వాది అయిన ఆర్థిక మంత్రి ప్రయోగించడం, మొత్తం న్యాయవాదుల మండలి సమన్యాయాన్ని గాలికి వదిలేసి ఆరోపణలు చెల్లవని తీర్పు చెప్పడం న్యాయవిచారణలో జోక్యం చేసుకోవడం కాదా?. ఒకవైపు ముగ్గురు న్యాయమూర్తులతో లైంగిక వేధింపుల విచారణ చేయిస్తూ మరో ముగ్గురు సభ్యుల ధర్మాసనంతో కుట్ర ఆరోపణల విచారణ జరిపిస్తూ ఉంటే ఆర్థిక మంత్రి, న్యాయమండలి చైర్మన్ ఈ రెండు విచారణలను పక్కన బెట్టి వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కార నేరం కాదూ?
వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్
madabhushi.sridhar@gmail.com
విశ్లేషణమాడభూషి శ్రీధర్
నలిగిపోతున్న న్యాయదేవత
Published Fri, Apr 26 2019 1:03 AM | Last Updated on Fri, Apr 26 2019 1:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment