బాధ్యత లేని పార్టీలకు నిధులా?
విశ్లేషణ
రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చిన కంపెనీకి పూర్తి మినహాయింపు ఉంటుంది. అంటే విరాళాలు ఇచ్చిన కంపెనీకి తీసుకున్న రాజకీయ పార్టీకి ఆదాయపు పన్ను బాధ ఉండదు. ఇంత అద్భుతమైన సౌకర్యం మరే వ్యవస్థకూ లేదు.
పేరుకుపోతున్న డబ్బు ఎంతో లెక్కలు చెప్పకుండా, అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా రాజ కీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వం నిధులిస్తే ఏ ప్రయోజనమూ లేకపోగా ప్రజాధనం వృ«థా అయ్యే ప్రమాదం తప్పదు. ఇప్పటికే అనేక పన్ను రాయితీలతో ప్రజాధనాన్ని పరోక్షంగా పొందుతున్న పార్టీలకు మళ్లీ ప్రత్యేకంగా నిధులు ఇవ్వడం సమంజసమా?
రాజకీయ పార్టీలను జవాబుదారీగా చేసే వ్యవస్థే మనదేశంలో లేదు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వైయక్తిక సామ్రాజ్యం, వారికి కుటుంబసభ్యులే నాయకులు, వారసులు. విభేదించిన వారు మరొక పార్టీ పెట్టుకోవలసిందే తప్ప మరో మార్గం లేదు. మనదేశంలో పుట్టి నమోదు చేసుకున్న పార్టీల సంఖ్య 1900 దాటిందని లెక్కలు వివరిస్తున్నాయి. ఒక్కసారి రిజిస్టర్ అయితే చాలు, పార్టీకి నూరు శాతం ఆదాయపు పన్ను రాయితీ లభిస్తుంది. 20 వేలరూపాయలు మించిన విరాళాలు మాత్రమే ప్రకటించాలి. 20 వేల రూపాయల లోపు విరాళాల వివరాలు చెప్పనవసరం లేదని ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 29 సి వీలు కల్పించింది. కొన్నిసంవత్సరాలపాటు ఎన్నికల్లో ఒక్క అభ్యర్థినీ నిలబెట్టకపోయినా అధ్యక్షుల వారు కూడా పోటీ చేయకపోయినా పార్టీకి ఈ సౌకర్యాలన్ని సమకూరుతాయి. రిజిస్టర్ చేసిన పార్టీని డీరిజిస్టర్ చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు. లోకంలోకి వచ్చిన ప్రతి పదార్థమూ నశిస్తుందనీ, ప్రతి ప్రాణి మరణిస్తుందని మన భగవద్గీత ప్రబోధిస్తుంది. కాని రాజకీయ పార్టీకి మాత్రం మన రాజ్యాం గంలో మరణం లేదు. అది చిరంజీవి.
రాజకీయ పార్టీ అనేది ఒక కంపెనీ కాదు. సొసైటీ కాదు. సంస్థకాదు. సంఘమూ కాదు. ఇవేవీ కాని సొంత వ్యవస్థ అది. రాజకీయ పార్టీలు తమ నివేదికలలో అవాస్తవాలు చెబితే పరిణామాలు ఏమిటో తెలియదు. ఉండవు కూడా. కనీసం పన్ను రాయితీలలో కోత విధిస్తామనే హెచ్చరిక కూడా ఉండదు. పోనీ పార్టీ నాయకత్వానికి ఎన్నికలు జరుగుతాయా అంటే అదీ లేదు. ప్రతినిధి పదవికి పోటీ చేసే అభ్యర్థిని ఏ విధంగా ఎంపిక చేస్తారో ఎవరికీ తెలియదు. ఎవరూ చెప్పరు. ఏ లెక్కా పత్రం లేకుండా రహస్యంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. డబ్బు ప్రధాన పాత్ర వహిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. గెలిచిన ఆ అభ్యర్థిని పార్టీకి కట్టి పడేసేది అధికారమే. లేదా ఎవరైనా డబ్బు, అధికారం చూపితే ఫిరాయించే అవకాశాలు సుస్పష్టం. వారిని ఏమీ చేయలేమని ఇటీవల పరిణామాలు రుజువు చేస్తున్నాయి.
ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి 70 లక్షల రూపాయలు మించి ఖర్చుచేయరాదు. ఎమ్మెల్యే అభ్యర్థి పరిమితి 28 లక్షలు. కాని వారి పేరుమీద మిత్రులు ఎంతైనా ఖర్చు చేయవచ్చని చట్టమే వివరిస్తున్నది. పార్టీ వారికోసం వారి నియోజకవర్గంలో చేసే ఖర్చుపై పరిమితుల్లేవు.
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 జిజిబి ప్రకారం రాజకీయ పార్టీకి విరాళం ఇచ్చిన కంపెనీకి పూర్తి మినహాయింపు ఉంటుంది. ఇచ్చిన విరాళం సొమ్మును ఆదాయంలోంచి పూర్తిగా మినహాయించవచ్చు. అంటే విరాళాలు ఇచ్చిన కంపెనీకి తీసుకున్న రాజకీయ పార్టీకి ఆదాయపు పన్ను బాధ ఉండదు. ఇంత అద్భుతమైన సౌకర్యం మరే వ్యవస్థకూ లేదు, ఏ సంఘానికీ ఇవ్వలేదు. అంటే ఆదాయం వచ్చే మార్గం సుగమం చేశారు. పన్ను కట్టే అవసరం లేదు. కనీసం చెప్పే పని లేదు. ఎంతైనా వసూలు చేసుకోవచ్చు. ఎంతైనా ఖర్చు చేసుకోవచ్చు.
ఒక పార్టీకి వంద కోట్ల రూపాయల ఆదాయం ఉందనుకుందాం. వేరే కంపెనీయో వ్యక్తో అయితే ముప్పై మూడు కోట్ల రూపాయల పన్ను చెల్లించాల్సిందే. రాజకీయ పార్టీ అయితే చెల్లించనవసరం లేదు. అంటే ప్రభుత్వం తనకు రావలసిన 33 కోట్ల ఆదాయాన్ని పార్టీకోసం వదులుకుందన్నమాట. ఇది ప్రజ లకు రావలసిన డబ్బు. అంటే అంత డబ్బు ఆ పార్టీకి జనం ఇచ్చినట్టే కదా. రాజకీయ పార్టీల ఆదాయం వందకోట్లు కాదు వందలు వేలు లక్షల కోట్లలో ఉంటుంది. లక్ష కోట్ల పార్టీకి జనం 33 వేల కోట్లు ఏటేటా ఇస్తూనే ఉన్నారు. ఇంకా వారి అభ్యర్థుల ప్రచారానికి ప్రజల డబ్బు ఇవ్వడం అవసరమా? ఎందుకివ్వాలి? వారు రాజ్యాంగ మౌలిక స్వరూపమైన ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నందుకా? తమ పార్టీ నిర్వహణలో అభ్యర్థుల ఎంపికలో ఆదాయ వ్యయాల నివేదికల్లో సత్యప్రమాణాలు పాటిస్తున్నందుకా లేక పారదర్శకంగా ఉన్నందుకా? నేరగాళ్లను పక్కన బెట్టినందుకా? (కొత్త ఢిల్లీలో డిసెంబర్ 8న ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ వారు నిర్వహించిన అవినీతిపై సమష్టి పోరాటం అనే అంశంపై జాతీయ సదస్సులో రచయిత ప్రసంగ సారాంశం)
(వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com )