యూపీలో బాహాబాహీ | opinion on uttar pradesh assembly elections by K Ramachandra murthy | Sakshi
Sakshi News home page

యూపీలో బాహాబాహీ

Published Sun, Nov 6 2016 1:45 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

యూపీలో బాహాబాహీ - Sakshi

యూపీలో బాహాబాహీ

త్రికాలమ్‌
ఉత్తరప్రదేశ్‌(యూపీ)లో చారిత్రక పోరాటానికి తెరలేచింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి, మార్చి మాసాలలో ఏడు విడతలుగా జరిగే పోలింగ్‌ తర్వాత వెలువడే ఫలితం 2019 ఎన్నికలను విశేషంగా ప్రభావితం చేస్తుంది. 2014 సార్వత్రిక ఎన్నికలలో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గత రెండున్నర సంవత్సరాలలో చెప్పుకోదగిన ఎన్నికల విజయం ఏదీ నమోదు చేయలేకపోయింది. ఢిల్లీ, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఎదురైన పరాభవం పూర్వ పక్షం కావాలంటే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో అసాధారణ స్థాయిలో సీట్లు గెలుచు కోవాలి. కాంగ్రెస్‌ అథమస్థానంలో ఉంది. ఆ పార్టీకి ఊపిరిపోసే ప్రయత్నంలో రాహుల్‌గాంధీ నెలరోజుల పాటు కిసాన్‌ యాత్ర సాగించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇది జీవన్మరణ సమరం. ఈ ఎన్నికలలో రెండంకెల స్థానాలు సాధించకపోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని అధిష్ఠానవర్గానికి తెలుసు. అందుకే విశ్వ ప్రయత్నం. ప్రతిపక్ష నాయకురాలు మాయావతి అయిదేళ్ళుగా వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొత్తం 403 స్థానాలకూ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసు కొని అన్ని పార్టీల కంటే ముందుగానే పోరాటానికి సిద్ధమైపోయారు. అధికా రంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీలో అబ్బాయ్‌–బాబాయ్‌ పోరు సాగుతున్నప్పటికీ ఈ వెర్రిలో ఏదో మతలబు ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతోంది. ఎస్‌పీకి సైతం ఇది ప్రతిష్ఠాత్మకమైన పోరాటం. ఈ ఎన్నికలలో నాలుగు పక్షాలూ చావోరేవో తేల్చుకోవలసిన పరిస్థితి.

పోటాపోటీగా యాత్రలు
శనివారంనాడు రెండు ప్రధాన పార్టీలూ సమరశంఖం పూరించాయి. లక్నోలో ఎస్‌పీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత ములాయంసింగ్, ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌తో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ, రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ)అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పాల్గొన్నారు. వేదికపైన ఉన్న నాయ కులంతా కత్తులు దూశారు. ఈ సభను ఐకమత్యసాధన సభగా అభివర్ణించి నప్పటికీ అఖిలేశ్, బాబాయి శివపాల్‌యాదవ్‌ల మధ్య మాటల తూటాలు నడిచాయి. బిహార్‌ మాదిరిగా యూపీలో సైతం మహాకూటమిని ఏర్పాటు చేయాలన్నది ములాయం సంకల్పం. అందుకు బిహార్‌ ముఖ్యమంత్రి, జనతా దళ్‌ (యూ) నాయకుడు నితీశ్‌ కుమార్‌ అంతగా ఆసక్తి చూపడం లేదని వినికిడి. నాలుగు స్థానాలు మాత్రమే కేటాయించారంటూ అలిగి బిహార్‌ మహా కూటమి నుంచి ఎస్‌పీ వైదొలిగిన విషయం నితీశ్‌ విస్మరించలేదు. జనతా పరివారం అంతా ఒక్కతాటిపై నిలిచి బీజేపీని మట్టి కరిపించాలంటూ దేవెగౌడ ఆకాం క్షించారు.

లక్నోలో ఎస్‌పీ రజతోత్సవ సంబరాలు జరిగిన రోజే సహారన్‌పుర్‌లో పరివర్తన్‌యాత్రను బీజేపీ అధినేత అమిత్‌షా ప్రారంభించారు. 15,000 మంది పరివర్తన సారథులను తయారు చేశారు. వీరు 50,000 గ్రామాలను సంద ర్శిస్తారు. పరివర్తన యాత్ర 1,700 కిలోమీటర్లు సాగుతుంది.  ఇది గురువారం మొదలైన అఖిలేశ్‌ రథయాత్రకు పోటీ. పాతికేళ్ళ కిందట నాటి బీజేపీ వరిష్ఠనేత లాల్‌కృష్ణ అద్వానీ రథయాత్ర చేశారు. సంఘ్‌ పరివారాన్ని అధికారపీఠం వైపు నడిపించారు. ఇప్పుడు అఖిలేశ్‌ రథయాత్ర జనతాపరివారాన్ని సమైక్యబాటలో నడిపించి అధికారాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో సాగుతోంది. బీజేపీ పరివర్తన యాత్రకు పశ్చిమ యూపీలోని సహారన్‌పుర్‌ని ఎన్నుకోవడం వెనుక చరిత్ర ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం సహారన్‌పుర్‌ జిల్లా జనాభాలో 51శాతం మంది హిందువులైతే 46 శాతం మంది ముస్లింలు. ఇక్కడ హిందూ ఓట్లను సంఘటితపరచుకోవడం బీజేపీకి చాలా అవసరం. అందుకే మొన్న మేలో సైతం ప్రధాని మోదీ సహారన్‌పుర్‌ బహిరంగసభలో ప్రసంగించారు. తాను యూపీ వాడినేననీ, యూపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైనవాడిననీ గుర్తు చేశారు.

సహారన్‌ పుర్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. యూపీ కాంగ్రెస్‌ ఉపాద్యక్షుడు ఇమ్రాన్‌ మసూద్‌ సొంత జిల్లా ఇది. 2014 నాటి ఎన్నికల ప్రచారంలో మసూద్‌ వీడియో క్లిప్‌ ఒకటి హల్‌చల్‌ చేసింది. నరేంద్ర మోదీని ముక్కలు ముక్కలుగా నరికే స్తానని మసూద్‌ అన్నట్టు ఈ వీడియోలో ఉంది. దానివల్ల బీజేపీ ప్రాబల్యం విశేషంగా పెరిగింది. మసూద్‌ పోస్టర్లు విరివిగా అతికించి బీజేపీ ప్రచారం పతాక స్థాయిలో చేసింది. ఇప్పుడు రాహుల్‌ వ్యూహంలో మసూద్‌ ముఖ్యుడు. ఇక్కడ బీజేపీ ప్రాబల్యాన్ని పెంచుకొని కాంగ్రెస్‌ను తుంచవలసిన అవసరం ఉంది. పరివర్తన యాత్రలో భాగంగా ప్రధాని మోదీ ఆరు సభలలో పాల్గొంటారు. లక్నోలో ఈ యేడాది ఇప్పటికే రెండు సభలలో మాట్లాడారు. డిసెంబర్‌లో మూడోసారి అక్కడ  ప్రసంగించబోతున్నారు. బీజేపీ ఏ అవకాశాన్నీ విడిచి పెట్టకుండా సర్వశక్తులూ వినియోగించి పోరాటం చేస్తున్నది. ముఖ్యమంత్రిగా ఒక నాయకుడిని ముందు పెట్టుకోకపోవడం ఒక్కటే లోపం. మెజారిటీ వచ్చే అవకాశాలు ఏమాత్రం లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ సైతం ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల అభ్యంతరంతోనే రీటా బహుగుణ బీజేపీలో చేరిపోయారు. ఎస్‌పీ ముఖ్యమంత్రి అభ్యర్థి అఖిలేశ్‌ అని ములాయం స్పష్టం చేశారు. బిఎస్‌పీ గెలిస్తే మాయావతే ముఖ్యమంత్రి. ఇటువంటి స్పష్టత బీజేపీకి లేదు.

మాయావతి ముందంజ
మాయావతి ఈసారి బాగా ముందుగానే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. ముస్లింలకూ, అగ్రవర్ణ హిందువులకూ ప్రాధాన్యం ఇవ్వడంతో కినిసి పార్టీ నుంచి కొందరు దళిత ప్రముఖులు వైదొలిగి బీజేపీ పంచన చేరారు. దళితుల అభ్యున్నతి కోసం కాన్షీరామ్‌ స్థాపించిన పార్టీలో దళితులను పక్కన పెట్టి ఇతర వర్గాలకు ప్రాముఖ్యం ఇవ్వడం ఏమిటన్నది వారి ప్రశ్న. ఎస్‌పీలో లుకలుకలు కారణంగా, అధికారంలో ఉన్న అయిదు సంవత్సరాలూ ఆ పార్టీ ముస్లింలకు రక్షణ  కల్పించడంలో విఫలమైనదనే విమర్శ సర్వత్రా వినిపిస్తున్న కారణంగా ఈసారి ముస్లింలు బీఎస్‌పీవైపు మొగ్గుతారని మాయావతి ఆశ. అందుకే అభ్య ర్థులను ఖరారు చేసే క్రమంలో ముస్లింలకు పెద్దపీట వేయడం.

యూపీలో ఉన్న చిన్నాచితకా ముస్లిం పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ‘ఇత్తె హాద్‌ ఫ్రంట్‌’ను నెలకొల్పడం భారత రాజకీయాలలో ఒక చారిత్రక పరిణామం. మతం ఆధారంగా ఓట్లు అడగడం అవినీతి కిందికే వస్తుందంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఫ్రంట్‌ ఏర్పడటం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో మరి. ఈ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి పీస్‌ పార్టీ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌. వైద్య వృత్తి నుంచి రాజకీయాలలో ప్రవేశించి 2008లో పీస్‌ పార్టీని నెలకొల్పిన అయూబ్‌ ఖాన్‌ మతవాది. ముస్లిమేతరుల నాయకత్వంలో ఉన్న పార్టీలను బలపరచడం కంటే ముస్లింల నాయకత్వంలోనే కూటమి ఏర్పడి నట్లయితే ముస్లింలలో ఐకమత్యం సాధించవచ్చుననీ, ముస్లిం నేతలంతా కలసి సమష్టిగా ప్రచారం చేస్తే ముస్లిం ఓటర్లలో మనస్థయిర్యం పెరుగుతుందనీ ఇండి యన్‌ ముస్లిం లీగ్‌ అధ్యక్షుడు మతీన్‌ విశ్లేషణ.

ముజఫర్‌నగర్‌ అల్లర్లు జరిగినప్పటి నుంచి గత రెండేళ్ళలో ముస్లింలపైన దాడులు వరుసగా జరుగుతు న్నాయనీ, హింసాకాండలో ముస్లింలే అధికంగా బలి అవుతున్నారనీ మతీన్‌ వాదన. ‘ఇత్తెహాద్‌ ఫ్రంట్‌’ యూపీలోని ముస్లిం ఓటర్లందరికీ ప్రాతినిధ్యం వహించకపోయినప్పటికీ భవిష్యత్తులో ఈ ఫ్రంట్‌ ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది. ఇది జాతీయ సమైక్యతకు ముప్పుగా పరి ణమించే అవకాశమూ లేక పోలేదు. యూపీ ఎన్నికలలో ఈ ఫ్రంట్‌ ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. అఖిలేశ్‌ హయాంలో తమకు రక్షణ లభించలేదనే భావన ముస్లిం జనాభాలో బలంగా ఉన్నది కనుక వారు బీఎస్‌పీ వైపు చూసే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి దళిత పక్షపాతి అయినప్పుడు సీట్లు తగ్గాయని దళిత నాయకులు అలగడంలో అర్థం లేదన్నది మాయావతి వాదన. దళిత ఓట్లు సరిపోవు కనుక ఇతర వర్గాల నుంచి మద్దతు కూడకట్టుకోవలసిన అవసరాన్ని మాయావతి చాలాకాలం కిందటే గ్రహించారు. అందుకే బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కానీ పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పటి నుంచి బ్రాహ్మణ నాయ కులలో ఎక్కువమంది తిరిగి బీజేపీ శిబిరంలోకి వెళ్ళారనే అభిప్రాయం ఉంది. ఇండియా టుడే–యాక్సిస్‌ అభిప్రాయ సేకరణ ఫలితాల ప్రకారం ఏ ఒక్క పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ (403 స్థానా లున్న అసెంబ్లీలో 202 స్థానాలు) రాకపోవచ్చుననీ, అతి పెద్ద పార్టీగా 170 నుంచి 183 స్థానాలతో బీజేపీ (2012 ఎన్నికలలో 47స్థానాలు), రెండో స్థానంలో 115 నుంచి 124 స్థానాలతో బీఎస్‌పీ (2012లో 80 స్థానాలు), మూడో స్థానంలో 94 నుంచి 103 స్థానాలతో ఎస్‌పీ (2012లో 224 స్థానాలు) నిలుస్తాయి. గత శాసనసభ ఎన్నికలలో 28 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ పార్టీకి ఈ సారి 8 నుంచి 12 స్థానాలు మాత్రమే దక్కుతాయని ఇండియా టుడే–యాక్సిస్‌ సర్వే లెక్కకట్టింది.

అఖిలేశ్‌ తిరుగుబాటు చేస్తాడా?
పాతతరం నాయకులను పూర్వపక్షం చే సి యువజన మనోరథుడుగా అఖిలేశ్‌ బలమైన ముద్ర వేయగలిగితే, మహాకూటమి స్వప్నం సాకారమైతే ఎస్‌పీకి విజయావకాశాలు మెరుగు కావచ్చు. నిజలింగప్ప, ఎస్‌కె పాటిల్, అతుల్యఘోష్‌ వంటి సిండికేట్‌ నాయకులను తోసిరాజని 1969లో ఇందిరాగాంధీ కాంగ్రెస్‌ పార్టీని చీల్చినట్టు ఇప్పుడు అఖిలేశ్‌ తనదంటూ ప్రత్యేక పంథాను నిర్ణయించు కోగలిగితే యువ ముఖ్యమంత్రిగా మరో అవకాశం అతనికి లభించవచ్చు. అఖి లేశ్‌పైన అవినీతి ఆరోపణలు లేవు. ఆధునిక భావాలు కలిగిన యువ నాయ కుడిగా పేరున్నది. నేర చరిత్ర ఉన్నవారు పార్టీలో చేరకుండా అడ్డుతగిలిన నాయ కుడిగా పేరు తెచ్చుకున్నారు. అభివృద్ధికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు కల్పించే క్రమంలో మంచి రోడ్లు వేయించాలనీ, విమానాశ్రయాలు కట్టించాలనీ, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి పెంచాలనీ తాపత్రయ పడుతున్న ముఖ్యమంత్రిగా ప్రజలలో ఒక అవగాహన ఉంది.

అయితే, చిన్నాన్నలూ, మామలూ, ఇతర బంధువులూ, ములాయంసింగ్‌ సహచరులూ పెత్తనం చేస్తున్నారనీ, అఖిలేశ్‌కు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లేదనీ ప్రచారం బాగా జరిగింది. తిరుగుబాటు బావుటా ఎగర వేసిన నాయ కుడుగా పేరు తెచ్చుకుంటే అఖిలేశ్‌కి అవకాశం ఉంటుంది. అఖిలేశ్‌ నాయకత్వం కొనసాగించి స్వేచ్ఛ ఇస్తేనే తాము మహాకూటమిలో చేరే విషయం ఆలోచి స్తామని అజిత్‌సింగ్‌ (ఆర్‌ఎల్‌డి నాయకుడు), శరద్‌యాదవ్‌ సూచించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ మంగళవారం ఢిల్లీలో ములాయంసింగ్‌తోనూ, అమర్‌సింగ్‌తోనూ రెండుగంటల పాటు సమా లోచనలు జరిపినట్టు భోగట్టా. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అభి లాషను మాయావతి ఇంతవరకూ వెలిబుచ్చలేదు. కాంగ్రెస్‌తో పొత్తు కార ణంగా ఎస్‌పీకి కానీ బీఎస్‌పీకి కానీ  ముస్లిం ఓట్లలో అధిక భాగం వచ్చే అవకా శాలున్నాయి. ఎస్‌పీ నాయకత్వంలోని మహాకూటమిలో కాంగ్రెస్‌ చేరితే ఆ మేరకు బీఎస్‌పీకి నష్టం. అదేవిధంగా బీఎస్‌పీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటే ఎస్‌పీకి నష్టం. కాంగ్రెస్‌ పార్టీకి స్వయంగా పెద్ద ఓటు బ్యాంక్‌ లేకపోయినప్పటికీ ముస్లిం ఓటును ప్రభావితం చేసే శక్తి  ఉంది.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపైన భారత సైన్యం ఇటీవల జరిపిన మెరుపు దాడుల (సర్జికల్‌ స్ట్రయిక్స్‌) గురించి బీజేపీ విధిగా ప్రచారం చేస్తుంది. మోదీ, షా, రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ దాడులను ఎన్నికల ప్రచారంలో నిస్సందేహంగా వినియోగించుకుంటారు. హిందూ ఓట్లను కూడగట్టడానికి అవసరమైన అన్ని విద్యలనూ బీజేపీ ప్రదర్శిస్తుంది. ప్రజలు ఈ విద్యల ప్రభావానికి ఎంతవరకూ లోను అవుతారనే అంశం పైనా, కాంగ్రెస్‌ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంపైనా యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్‌ సరళి ఆధారపడి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తే 2019లో ఆ పార్టీని పట్టుకోవడం కష్టం. బీజేపీకి యూపీలో బిహార్‌ ఎదురైతే ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకం. అందుకే యూపీ ఎన్నికలు ప్రభావ రీత్యా సార్వత్రిక ఎన్నికలతో సమానం.
 


 (వ్యాసకర్త : కె.రామచంద్రమూర్తి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement